రోమా 10

10
1సహోదరీ సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలనేది నా హృదయవాంఛ, దాని గురించి నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. 2అప్పుడు వారు దేవుని పట్ల అత్యాసక్తి కలిగివున్నారని అయితే వారి అత్యాసక్తి జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదని నేను సాక్ష్యమివ్వగలను. 3దేవుని నీతి వారికి తెలియకపోయినా తమ స్వనీతిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తూ వారు దేవుని నీతికి లోబడలేదు. 4విశ్వసించే ప్రతి ఒక్కరికి నీతిగా ఉండడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపుగా ఉన్నాడు.
5ధర్మశాస్త్రం వలన నీతిని జరిగించే వాని గురించి మోషే ఇలా వ్రాసాడు: “వీటిని చేసేవాడు వాటి వల్లనే జీవిస్తాడు.”#10:5 లేవీ 18:5 6అయితే విశ్వాసం ద్వారా వచ్చే నీతి ఇలా చెప్తుంది: క్రీస్తును క్రిందకు తేవడానికే, “పరలోకంలోకి ఎవరు ఆరోహణమై వెళ్తారు?”#10:6 ద్వితీ 30:12 7క్రీస్తును మృతులలో నుండి పైకి తేవడానికే “అగాధం లోనికి ఎవరు దిగి వెళ్తారు?” అని మీ హృదయాల్లో అనుకోవద్దు. 8అయితే ఇది ఏమి చెప్తుంది? “వాక్యం మీకు దగ్గరగా ఉంది, అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.”#10:8 ద్వితీ 30:14 అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యము. 9మీరు మీ నోటితో, “యేసు ప్రభువు” అని ఒప్పుకొని ప్రకటించి మీ హృదయాల్లో “దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు” అని నమ్మితే మీరు రక్షించబడతారు. 10అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు, మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకొన్నప్పుడు రక్షించబడతారు. 11“ఆయనలో నమ్మకముంచినవారు ఎన్నడు సిగ్గుపరచబడరు” అని లేఖనం చెప్తుంది.#10:11 యెషయా 28:16 12యూదులకు, యూదేతరులకు మధ్య తేడా ఏమి లేదు, ప్రభువు అందరికి ప్రభువే, ఆయనకు మొరపెట్టిన వారందరిని ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. 13ఎందుకంటే, “ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.”#10:13 యోవేలు 2:32
14అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిపై ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు? 15ప్రకటించేవారు పంపబడక పోతే ఎలా ప్రకటించగలరు? దీని కొరకు ఇలా వ్రాయబడినది: “సువార్తను తెచ్చేవారి పాదాలు ఎంతో అందమైనవి!”#10:15 యెషయా 52:7
16అయితే, “ప్రభువా, మా సందేశాన్ని ఎవరు నమ్ముతారు?” అని యెషయా చెప్పిన ప్రకారం, సువార్తను ఇశ్రాయేలు ప్రజలందరూ అంగీకరించలేదు.#10:16 యెషయా 53:1 17కాబట్టి, సువార్తను వినడం వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తును గురించిన వాక్యం ద్వారా సువార్తను వినగలరు. 18కాని నేనడిగేదేంటంటే: వారు సువార్తను వినలేదా? వారు ఖచ్చితంగా విన్నారు:
“వారి స్వరం భూలోకమంతా వినబడింది,
వారి మాటలు భూదిగంతాల వరకు వ్యాపించాయి.”#10:18 కీర్తన 19:4
19నేను మళ్ళీ అడుగుతున్నా: ఇశ్రాయేలు ప్రజలు దానిని గ్రహించలేదా? మొదట, మోషే అన్నాడు,
“జనులు కాని వారిచేత నేను మిమ్మల్ని అసూయపడేలా చేస్తాను,
అవగాహన లేని జనుల వలన మీకు కోపం వచ్చేలా చేస్తాను.”#10:19 ద్వితీ 32:21
20యెషయా ఇలా ధైర్యంగా చెప్పాడు,
“నన్ను వెదకనివారికి నేను దొరికాను,
నన్ను అడగని వారికి నన్ను నేను బయలుపరచుకొన్నాను”#10:20 యెషయా 65:1
21అయితే ఇశ్రాయేలు ప్రజల గురించి అతడు ఇలా చెప్పాడు,
“అవిధేయులు మూర్ఖులైన ప్రజలకు
నేను దినమంతా నా చేతులను చాపాను.”#10:21 యెషయా 65:2

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

రోమా 10: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

రోమా 10 కోసం వీడియో