రోమా 10:17-21
రోమా 10:17-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను. మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా? జనము కానివారివలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనమువలన మీకు ఆగ్రహము కలుగ జేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి –నన్ను వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచా రింపనివారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే– అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు.
రోమా 10:17-21 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కాబట్టి, సువార్తను వినడం వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తును గురించిన వాక్యం ద్వారా సువార్తను వినగలరు. కాని నేనడిగేదేంటంటే: వారు సువార్తను వినలేదా? వారు ఖచ్చితంగా విన్నారు: “వారి స్వరం భూలోకమంతా వినబడింది, వారి మాటలు భూదిగంతాల వరకు వ్యాపించాయి.” నేను మళ్ళీ అడుగుతున్నా: ఇశ్రాయేలు ప్రజలు దానిని గ్రహించలేదా? మొదట, మోషే అన్నాడు, “జనులు కాని వారిచేత నేను మిమ్మల్ని అసూయపడేలా చేస్తాను, అవగాహన లేని జనుల వలన మీకు కోపం వచ్చేలా చేస్తాను.” యెషయా ఇలా ధైర్యంగా చెప్పాడు, “నన్ను వెదకనివారికి నేను దొరికాను, నన్ను అడగని వారికి నన్ను నేను బయలుపరచుకొన్నాను” అయితే ఇశ్రాయేలు ప్రజల గురించి అతడు ఇలా చెప్పాడు, “అవిధేయులు మూర్ఖులైన ప్రజలకు నేను దినమంతా నా చేతులను చాపాను.”
రోమా 10:17-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తు గురించిన మాట ద్వారా కలుగుతుంది. అయినా, నేను చెప్పేదేమంటే, “వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరం భూలోకమంతటిలోకీ, వారి మాటలు భూదిగంతాలకు చేరాయి.” నేనింకా చెప్పేదేమంటే, “ఇశ్రాయేలు ప్రజలకు ఇది తెలియలేదా? మోషే ముందుగా మాట్లాడుతూ, “అసలు జాతి అని పిలవడానికి వీలు లేని వారి వలన మీలో రోషం పుట్టిస్తాను. తెలివి లేని ప్రజల వలన మీకు కోపం కలిగేలా చేస్తాను” అని అన్నాడు. తరువాత యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు, “నన్ను వెదకనివారు నన్ను కనుగొన్నారు. నా గురించి అడగని వారికి నేను ప్రత్యక్షమయ్యాను.” ఇశ్రాయేలు విషయమైతే అతడు, “అవిధేయులై ఎదురు తిరిగి మాట్లాడుతున్న ప్రజలవైపు నేను రోజంతా నా చేతులు చాస్తూనే ఉన్నాను” అని చెబుతున్నాడు.
రోమా 10:17-21 పవిత్ర బైబిల్ (TERV)
తద్వారా, సువార్తను వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు సందేశం ద్వారా సువార్త వినటం సంభవిస్తుంది. “వాళ్ళు వినలేదా?” అని నేనడుగుతున్నాను. వాళ్ళు విన్నారు. ఆ విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “వాళ్ళ స్వరం ప్రపంచమంతా వినిపించింది. వాళ్ళు పలికిన మాటలు ప్రపంచం నలుమూలలా వినిపించాయి.” “ఇశ్రాయేలుకు ఈ విషయం తెలియదా?” అని నేను మళ్ళీ అడుగుచున్నాను. అవును వారికి తెలిసింది. మోషే మొదట ఈ విధంగా అన్నాడు: “జనాంగము కానివారి ద్వారా మీరు అసూయ పడేటట్లు చేస్తాను అర్థం చేసుకోలేని జనము ద్వారా మీరు కోపం చెందేటట్లు చేస్తాను.” యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు: “నా కోసం వెదకనివాళ్ళు నన్ను కనుగొంటారు. నా కోసం అడగని వాళ్ళకు నేను స్వయంగా ప్రత్యక్షమయ్యాను.” కాని ఇశ్రాయేలు ప్రజల్ని గురించి అతడు ఈ విధంగా అన్నాడు
రోమా 10:17-21 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి, సువార్తను వినడం వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తును గురించిన వాక్యం ద్వారా సువార్తను వినగలరు. కాని నేనడిగేదేంటంటే: వారు సువార్తను వినలేదా? వారు ఖచ్చితంగా విన్నారు: “వారి స్వరం భూలోకమంతా వినబడింది, వారి మాటలు భూదిగంతాల వరకు వ్యాపించాయి.” నేను మళ్ళీ అడుగుతున్నా: ఇశ్రాయేలు ప్రజలు దానిని గ్రహించలేదా? మొదట మోషే ఇలా అన్నాడు, “జనులు కాని వారిచేత నేను మిమ్మల్ని అసూయపడేలా చేస్తాను, అవగాహన లేని జనుల వలన మీకు కోపం వచ్చేలా చేస్తాను.” యెషయా ఇలా ధైర్యంగా చెప్పాడు, “నన్ను వెదకనివారికి నేను దొరికాను, నన్ను అడగని వారికి నన్ను నేను బయలుపరచుకున్నాను.” అయితే ఇశ్రాయేలు ప్రజల గురించి అతడు ఇలా చెప్పాడు, “అవిధేయులు మూర్ఖులైన ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాపాను.”