రోమా 10:1-13

రోమా 10:1-13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

సహోదరీ సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలనేది నా హృదయవాంఛ, దాని గురించి నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు వారు దేవుని పట్ల అత్యాసక్తి కలిగివున్నారని అయితే వారి అత్యాసక్తి జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదని నేను సాక్ష్యమివ్వగలను. దేవుని నీతి వారికి తెలియకపోయినా తమ స్వనీతిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తూ వారు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించే ప్రతి ఒక్కరికి నీతిగా ఉండడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపుగా ఉన్నాడు. ధర్మశాస్త్రం వలన నీతిని జరిగించే వాని గురించి మోషే ఇలా వ్రాసాడు: “వీటిని చేసేవాడు వాటి వల్లనే జీవిస్తాడు.” అయితే విశ్వాసం ద్వారా వచ్చే నీతి ఇలా చెప్తుంది: క్రీస్తును క్రిందకు తేవడానికే, “పరలోకంలోకి ఎవరు ఆరోహణమై వెళ్తారు?” క్రీస్తును మృతులలో నుండి పైకి తేవడానికే “అగాధం లోనికి ఎవరు దిగి వెళ్తారు?” అని మీ హృదయాల్లో అనుకోవద్దు. అయితే ఇది ఏమి చెప్తుంది? “వాక్యం మీకు దగ్గరగా ఉంది, అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.” అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యము. మీరు మీ నోటితో, “యేసు ప్రభువు” అని ఒప్పుకొని ప్రకటించి మీ హృదయాల్లో “దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు” అని నమ్మితే మీరు రక్షించబడతారు. అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు, మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకొన్నప్పుడు రక్షించబడతారు. “ఆయనలో నమ్మకముంచినవారు ఎన్నడు సిగ్గుపరచబడరు” అని లేఖనం చెప్తుంది. యూదులకు, యూదేతరులకు మధ్య తేడా ఏమి లేదు, ప్రభువు అందరికి ప్రభువే, ఆయనకు మొరపెట్టిన వారందరిని ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. ఎందుకంటే, “ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.”

షేర్ చేయి
Read రోమా 10

రోమా 10:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలనేదే నా హృదయవాంఛ, వారి గురించిన నా ప్రార్థన. దేవుని విషయంలో వారు బహు ఆసక్తి గలవారని వారి గురించి సాక్షమిస్తున్నాను. అయితే వారి ఆసక్తి జ్ఞానయుక్తమైంది కాదు. అయితే వారికి దేవుని నీతి విషయంలో అవగాహన లేదు. కాబట్టి తమ స్వనీతిని స్థాపించాలని చూస్తూ దేవుని నీతికి విధేయత చూపలేదు. విశ్వసించే ప్రతివాడికీ నీతి కలగడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపు పలికాడు. ధర్మశాస్త్ర మూలమైన నీతిని నెరవేర్చేవాడు దాని వల్లనే జీవిస్తాడని మోషే రాస్తున్నాడు. అయితే విశ్వాసమూలమైన నీతి ఇలా చెబుతున్నది, “పరలోకానికి ఎవడు ఎక్కిపోతాడు? (అంటే క్రీస్తును కిందకి తేవడానికి). లేక అగాధంలోకి ఎవడు దిగిపోతాడు? (అంటే క్రీస్తును చనిపోయిన వారిలో నుండి పైకి తేవడానికి) అని నీ హృదయంలో అనుకోవద్దు.” కానీ ఆ నీతి ఏమి చెబుతున్నదో చూడండి, “దేవుని వాక్కు మీకు దగ్గరగా, మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.” మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్కు కూడా ఇదే. అదేమంటే యేసును ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని, దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడని నీ హృదయంలో నమ్మితే, నీకు రక్షణ కలుగుతుంది. ఎలాగంటే మనిషి నీతి కోసం హృదయంలో నమ్ముతాడు, పాప విమోచన కోసం నోటితో ఒప్పుకుంటాడు. “ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు” అని దేవుని వాక్కు చెబుతున్నది. ఇందులో యూదులూ, గ్రీకులూ అనే వ్యత్యాసం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఆయన తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపగల సంపన్నుడు. ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది.

షేర్ చేయి
Read రోమా 10

రోమా 10:1-13 పవిత్ర బైబిల్ (TERV)

సోదరులారా! దేవుడు ఇశ్రాయేలు వంశీయుల్ని రక్షించాలని హృదయ పూర్వకంగా ప్రార్థిస్తున్నాను. వాళ్ళు శ్రద్ధతో దేవుని సేవ చేస్తున్నారని నేను సాక్ష్యం చెప్పగలను. కాని వాళ్ళ శ్రద్ధ జ్ఞానం మీద ఆధారపడలేదు. దేవుడు నీతిమంతులుగా చేసే విధానాన్ని గురించి తెలియక వాళ్ళు తమ విధానాన్ని స్థాపించాలనుకొన్నారు. కనుక వాళ్ళు దేవుడు చెప్పిన విధానాన్ని అంగీకరించలేదు. నమ్మిన ప్రతి ఒక్కడూ నీతిమంతుడు కావాలని క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రం అంతమైపోయింది. ధర్మశాస్త్రం ద్వారా లభించే నీతిని గురించి మోషే ఈ విధంగా వ్రాస్తున్నాడు: “ధర్మశాస్త్ర క్రియలు చేసే మానవుడు వీటి ద్వారా జీవిస్తాడు” కాని విశ్వాసం వల్ల కలిగే నీతిని గురించి ఈ విధంగా వ్రాశారు: “పరలోకానికి ఎవరు ఎక్కుతారు?” అని అనకండి. అంటే ఎవరు పరలోకానికి ఎక్కి క్రీస్తును క్రిందికి పిలుచుకు రాగలరు? “అగాధంలోకి ఎవరు దిగుతారు?” అని అనకండి. అంటే ఎవరు అగాధంలోకి దిగి క్రీస్తును చావునుండి పిలుచుకు రాగలరు? మరి వాక్యమేమంటున్నది! “దైవసందేశం మీకు దగ్గరగా ఉంది. అది మీ నోటిలో ఉంది, మీ హృదయాల్లో ఉంది.” ఇది విశ్వాసానికి సంబంధించిన సందేశము. దీన్ని మేము ప్రకటిస్తున్నాము. యేసు, ప్రభువని మీ నోటితో బహిరంగంగా ఒప్పుకొని చనిపోయినవారిలో నుండి దేవుడాయన్ని బ్రతికించాడని మీ హృదయాల్లో విశ్వసిస్తే మీరు రక్షింపబడుతారు. ఎందుకంటే మనము, మన హృదయాలతో విశ్వసిస్తాము కనుక నీతిమంతులుగా పరిగణింపబడుతాము. నోటితో ఒప్పుకొంటాము కనుక రక్షణను పొందుతాము. లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఆయన్ని నమ్మినవానికి ఆశాభంగం కలుగదు.” యూదులకు, యూదులు కానివాళ్ళకు వ్యత్యాసం లేదు. ప్రభువు ఒక్కడే. ఆయనే అందరికి ప్రభువు. ఆయన, తనను ప్రార్థించిన వాళ్ళందరికీ అడిగినంత ఇస్తాడు. దీన్ని గురించి, “ప్రభువును ప్రార్థించిన ప్రతి ఒక్కడూ రక్షింపబడతాడు” అని వ్రాయబడి ఉంది.

షేర్ చేయి
Read రోమా 10

రోమా 10:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొంద వలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికిచేయు ప్రార్థనయునై యున్నవి. వారు దేవునియందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడ లేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది–ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు; లేక –ఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? – వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అదేమనగా–యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు. ఎందుకనగా– ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును.

షేర్ చేయి
Read రోమా 10

రోమా 10:1-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

సహోదరీ సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలనేది నా హృదయవాంఛ, దాని గురించి నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు వారు దేవుని పట్ల అత్యాసక్తి కలిగి ఉన్నారని అయితే వారి అత్యాసక్తి జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదని నేను సాక్ష్యమివ్వగలను. దేవుని నీతి వారికి తెలియకపోయినా తమ స్వనీతిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తూ వారు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించే వారందరికి నీతిగా ఉండడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపుగా ఉన్నారు. ధర్మశాస్త్రం వలన నీతిని జరిగించే వారి గురించి మోషే, “వీటిని చేసేవారు వాటి వల్లనే జీవిస్తారు” అని వ్రాశాడు. అయితే విశ్వాసం ద్వారా వచ్చే నీతి ఇలా చెప్తుంది: “క్రీస్తును క్రిందకు తేవడానికే ‘పరలోకంలోకి ఎవరు ఎక్కి వెళ్తారు?’ అని మీ హృదయంలో అనుకోవద్దు.” “లేదా ‘క్రీస్తును మృతులలో నుండి పైకి తేవడానికే అగాధం లోనికి ఎవరు దిగి వెళ్తారు?’ ” అని మీ హృదయాల్లో అనుకోవద్దు. అయితే ఇది ఏమి చెప్తుంది? “వాక్యం మీకు దగ్గరగా ఉంది, అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.” అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే. మీరు మీ నోటితో “యేసు ప్రభువు” అని ఒప్పుకుని, మీ హృదయాల్లో “దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు” అని నమ్మితే మీరు రక్షించబడతారు. అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకున్నప్పుడు రక్షించబడతారు. “ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు” అని లేఖనం చెప్తుంది. యూదులకు, యూదేతరులకు భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఆయనకు మొరపెట్టిన వారందరిని ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. ఎందుకంటే, “ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.”

షేర్ చేయి
Read రోమా 10