ప్రకటన 22:11-21

ప్రకటన 22:11-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అన్యాయం చేసేవారిని అన్యాయం చేయనివ్వు, దుష్టుడిని దుష్టునిలా కొనసాగనివ్వు, నీతి క్రియలు చేసేవారిని నీతి క్రియలను చేస్తూ ఉండనివ్వు, పరిశుద్ధులను పరిశుద్ధులుగా కొనసాగనివ్వు” అని చెప్పాడు. “ఇదిగో! నేను త్వరగా వస్తున్నాను! ప్రతివారికి వారు చేసిన పనుల చొప్పున వారికి ఇవ్వడానికి నా ప్రతిఫలం నా దగ్గర ఉంది. అల్ఫా ఒమేగాను నేనే, మొదటివాడను చివరివాడను నేనే, ఆది అంతం నేనే! “జీవ వృక్షానికి హక్కు పొంది, ద్వారాల గుండా పట్టణంలోనికి ప్రవేశించేలా తమ వస్త్రాలను ఉతుక్కున్నవారు ధన్యులు. అయితే మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు. “యేసు అనే నేను సంఘాల కోసమైన ఈ సాక్ష్యం మీకు ఇవ్వమని నా దూతను పంపాను. నేను దావీదు వేరును సంతానాన్ని, ప్రకాశవంతమైన వేకువ చుక్కను.” “రండి!” అని ఆత్మ, పెండ్లికుమార్తె అంటున్నారు. ఈ మాటలు వింటున్నవారు, “రండి!” అని చెప్పాలి. దప్పికగల వారందరు రండి; ఆశపడినవారు జీవజలాన్ని ఉచితంగా పొందుకోండి. ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన ప్రవచనాలను వినే ప్రతిఒక్కరికి నేను ఖచ్చితంగా హెచ్చరించేది ఏమంటే: ఎవరైనా ఈ ప్రవచనాలకు దేనినైనా కలిపితే ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన తెగుళ్ళను దేవుడు వానిపైకి రప్పిస్తారు. అలాగే ఈ గ్రంథపుచుట్టలో ప్రవచనం నుండి ఏ మాటలనైనా తీసివేస్తే దేవుడు వానికి ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన పరిశుద్ధ పట్టణంలోని జీవవృక్ష ఫలంలో ఏ భాగం లేకుండా చేస్తారు. ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు, “నిజమే, నేను త్వరగా వస్తున్నాను!” అంటున్నాడు. ఆమేన్! రండి, ప్రభువైన యేసు! ప్రభువైన యేసు కృప దేవుని ప్రజలతో ఉండును గాక ఆమేన్.

ప్రకటన 22:11-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అన్యాయం చేసేవాణ్ణి అన్యాయం చేస్తూనే ఉండనియ్యి. అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగానే ఉండనియ్యి. నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతుడిగానే ఉండనియ్యి. పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధుడిగా ఉండనియ్యి. “చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసిన పనుల ప్రకారం నేనివ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది. ఆల్ఫా, ఓమెగా నేనే. మొదటి వాణ్ణి, చివరి వాణ్ణి నేనే. ప్రారంభాన్నీ ముగింపునీ నేనే. జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యులు అయ్యేందుకై తమ వస్త్రాలను ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు. పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు. యేసు అనే నేను సంఘాలకు చెప్పడం కోసం ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నా దూతను పంపించాను. నేనే దావీదు వేరునూ సంతానాన్నీ ప్రకాశవంతమైన వేకువ నక్షత్రాన్నీ. “రా” అంటూ ఆత్మా, పెళ్ళికూతురూ చెబుతున్నారు. వింటున్నవాడూ, “రా” అని చెప్పాలి. దాహం వేసిన వాడు రావాలి. ఇష్టమున్న వ్యక్తి జీవ జలాన్ని ఉచితంగా తీసుకోవచ్చు.” ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులను వినే ప్రతి వ్యక్తినీ నేను హెచ్చరించేది ఏమిటంటే ఎవడైనా వీటిలో ఏదైనా కలిపితే దేవుడు ఈ పుస్తకంలో రాసి ఉన్న కీడులన్నీ వాడికి కలగజేస్తాడు. ఎవడైనా దేనినైనా తీసి వేస్తే దేవుడు ఈ పుస్తకంలో వివరించిన జీవ వృక్షంలోనూ, పరిశుద్ధ పట్టణంలోనూ వాడికి భాగం లేకుండా చేస్తాడు. ఈ సంగతులను గురించి సాక్షమిస్తున్న వాడు, “అవును, త్వరగా వస్తున్నాను” అని అంటున్నాడు. ఆమేన్‌! ప్రభు యేసూ, త్వరగా రా. ప్రభు యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండుగాక. ఆమేన్‌.

ప్రకటన 22:11-21 పవిత్ర బైబిల్ (TERV)

తప్పు చేసేవాణ్ణి తప్పు చేయనీ! నీచంగా ప్రవర్తించేవాణ్ణి నీచంగా ప్రవర్తించనీ! నీతిగా ఉండేవాణ్ణి నీతిగా ఉండనీ! పవిత్రంగా ఉండేవాణ్ణి పవిత్రంగా ఉండనీ.” “జాగ్రత్త, నేను త్వరలో రాబోతున్నాను. ప్రతి ఒక్కనికి అతడు చేసేవాటిని బట్టి నా దగ్గరున్నదాన్ని బహుమతిగా ఇస్తాను. ఆదియు, అంతమును నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే, ఆరంభాన్ని, సమాప్తాన్ని నేనే. “జీవవృక్షం మీది ఫలాన్ని తినటానికి అర్హత పొందేందుకు, గుమ్మాల ద్వారా పట్టణంలోకి వెళ్ళే అర్హత పొందేందుకు తమ తమ దుస్తుల్ని శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉన్నవాళ్ళు ధన్యులు. పట్టణానికి వెలుపట కుక్కలు, మంత్రగాళ్ళు, అవినీతిపరులు, హంతకులు, విగ్రహారాధికులు, అసత్యాన్ని ప్రేమించి జీవించేవాళ్ళు రకరకాల మనుష్యులు ఉంటారు. “నేను యేసును. ఈ విషయాన్ని సంఘాలకు చెప్పటానికి నా దూతను నీ దగ్గరకు పంపాను. నేను వేరును, దావీదు వంశాంకురాన్ని, ప్రకాశించే వేకువచుక్కను.” ఆత్మ మరియు పెళ్ళికుమార్తె “రండి” అని అంటున్నారు. ఇది విన్నవాడు “రండి!” అనాలి. దాహంతో ఉన్నవాళ్ళు రావచ్చును. ఇష్టమున్నవాడు ఉచితంగా లభించే జీవజలాన్ని త్రాగవచ్చు. ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్కును వినే ప్రతి ఒక్కణ్ణి నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా దీనికి ఏదైనా చేర్చితే, ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వాని మీదకు వస్తాయి. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథంనుండి ఏవైనా మాటలు తీసి వేస్తే, ఈ గ్రంథంలో వర్ణింపబడిన జీవవృక్షంలో, పవిత్ర పట్టణంలో అతనికున్న హక్కును దేవుడు తీసివేస్తాడు. యేసు ఇవన్నీ నిజమని చెపుతున్నాడు. ఇప్పుడు ఆయన, “ఔను, నేను త్వరలోనే వస్తాను” అని అంటున్నాడు. ఆమేన్! రండి యేసు ప్రభూ! యేసు ప్రభువు అనుగ్రహం దేవుని జనులపై ఉండుగాక. ఆమేన్.

ప్రకటన 22:11-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అన్యాయముచేయు వాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనుపరిశుద్ధుడుగానే యుండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియలచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. సంఘములకోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను. ఆత్మ యు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా–ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును; ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును. ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు–అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్; ప్రభువైన యేసూ, రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుం డును గాక. ఆమేన్.