ప్రకటన 22
22
ఏదెను వనం పునరుద్ధరించబడుట
1అప్పుడు ఆ దేవదూత గొర్రెపిల్ల దేవుని సింహాసనం నుండి ప్రవహిస్తున్న స్వచ్ఛమైన స్ఫటికం లాంటి జీవజలనది నాకు చూపించాడు. 2ఆ నది ఆ పట్టణపు ప్రధాన వీధి మధ్యన ప్రవహిస్తుంది. ఆ నదికి ఇరువైపుల జీవవృక్షం ఉంది. అది ప్రతి నెల ఫలాన్ని ఇస్తూ పన్నెండు పంటలను ఇస్తుంది. ఇంకా ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉన్నాయి. 3అక్కడ ఏ శాపం ఉండదు. దేవుని గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఆ పట్టణంలో ఉంటాయి. ఆయన సేవకులు ఆయనను సేవిస్తుంటారు. 4వారు ఆయన ముఖాన్ని చూస్తారు, వారి నుదుటి మీద ఆయన పేరు ఉంటుంది. 5అక్కడ రాత్రి ఉండదు. ప్రభువైన దేవుడే వారికి కాంతిని ఇస్తారు కాబట్టి వారికి దీపకాంతి గాని సూర్యకాంతి గాని అవసరం లేదు. వారు ఎల్లకాలం పరిపాలిస్తూ ఉంటారు.
యోహాను దేవదూత
6అప్పుడు ఆ దేవదూత నాతో, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలను ప్రేరేపించే ప్రభువైన దేవుడు తన సేవకులకు త్వరలో జరుగబోయే సంగతులను చూపించడానికి తన దూతను పంపారు” అని చెప్పాడు.
7“ఇదిగో, నేను త్వరగా వస్తున్నాను! ఈ గ్రంథపుచుట్టలో ప్రవచించిన మాటలను పాటించేవారు ధన్యులు!”
8యోహాను అనే నేను ఈ సంగతులను విని చూశాను. నేను వాటిని విని చూసినప్పుడు, నాకు వాటిని చూపిస్తున్న దేవదూతను ఆరాధించడానికి అతని పాదాల ముందు సాష్టాంగపడ్డాను. 9కాని అతడు నాతో, “నీవు అలా చేయవద్దు! ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన మాటలను పాటించేవారిలా, నీ తోటి ప్రవక్తల్లా నేను కూడా నీ తోటి సేవకుడనే. కాబట్టి దేవున్నే ఆరాధించు!” అని చెప్పాడు.
10తర్వాత అతడు నాతో, “ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన ప్రవచనాలను ముద్ర వేయకు ఎందుకంటే సమయం సమీపంగా ఉంది. 11అన్యాయం చేసేవారిని అన్యాయం చేయనివ్వు, దుష్టుడిని దుష్టునిలా కొనసాగనివ్వు, నీతి క్రియలు చేసేవారిని నీతి క్రియలను చేస్తూ ఉండనివ్వు, పరిశుద్ధులను పరిశుద్ధులుగా కొనసాగనివ్వు” అని చెప్పాడు.
చివరి మాటలు: ఆహ్వానం, హెచ్చరిక
12“ఇదిగో! నేను త్వరగా వస్తున్నాను! ప్రతివారికి వారు చేసిన పనుల చొప్పున వారికి ఇవ్వడానికి నా ప్రతిఫలం నా దగ్గర ఉంది. 13అల్ఫా ఒమేగాను నేనే, మొదటివాడను చివరివాడను నేనే, ఆది అంతం నేనే!
14“జీవ వృక్షానికి హక్కు పొంది, ద్వారాల గుండా పట్టణంలోనికి ప్రవేశించేలా తమ వస్త్రాలను ఉతుక్కున్నవారు ధన్యులు. 15అయితే మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు.
16“యేసు అనే నేను సంఘాల కోసమైన ఈ సాక్ష్యం మీకు ఇవ్వమని నా దూతను పంపాను. నేను దావీదు వేరును సంతానాన్ని, ప్రకాశవంతమైన వేకువ చుక్కను.”
17“రండి!” అని ఆత్మ, పెండ్లికుమార్తె అంటున్నారు. ఈ మాటలు వింటున్నవారు, “రండి!” అని చెప్పాలి. దప్పికగల వారందరు రండి; ఆశపడినవారు జీవజలాన్ని ఉచితంగా పొందుకోండి.
18ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన ప్రవచనాలను వినే ప్రతిఒక్కరికి నేను ఖచ్చితంగా హెచ్చరించేది ఏమంటే: ఎవరైనా ఈ ప్రవచనాలకు దేనినైనా కలిపితే ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన తెగుళ్ళను దేవుడు వానిపైకి రప్పిస్తారు. 19అలాగే ఈ గ్రంథపుచుట్టలో ప్రవచనం నుండి ఏ మాటలనైనా తీసివేస్తే దేవుడు వానికి ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన పరిశుద్ధ పట్టణంలోని జీవవృక్ష ఫలంలో ఏ భాగం లేకుండా చేస్తారు.
20ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు, “నిజమే, నేను త్వరగా వస్తున్నాను!” అంటున్నాడు.
ఆమేన్! రండి, ప్రభువైన యేసు!
21ప్రభువైన యేసు కృప దేవుని ప్రజలతో ఉండును గాక ఆమేన్.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ప్రకటన 22: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.