ప్రకటన 18:1-20

ప్రకటన 18:1-20 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

తరువాత మరొక దేవదూత పరలోకం నుండి క్రింది దిగి రావడం నేను చూసాను; అతనికి గొప్ప అధికారం ఉంది, అతని వెలుగుతో భూమి ప్రకాశించింది. అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు, “బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది! ఆమె దయ్యాలకు నిలయంగా, ప్రతి దుష్ట ఆత్మ తిరిగే చోటుగా, ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా, ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలకు నివాస స్థలంగా మారింది. ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి దేశాలన్ని మత్తులయ్యాయి. భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు. భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు.” అప్పుడు పరలోకంలో నుండి మరొక స్వరం వినిపించింది: “ ‘నా ప్రజలారా! ఆమెలో నుండి బయటకు రండి,’ అప్పుడు మీరు ఆమె పాపాలలో భాగం పంచుకోరు, ఆమెకు సంభవించే ఏ కీడు మీ మీదికి రాదు; ఆమె చేసిన పాపాలు ఆకాశమంత ఎత్తు కుప్పగా ఉన్నాయి కనుక, దేవుడు ఆమె అతిక్రమాలను జ్ఞాపకం చేసుకొన్నాడు. ఆమె ఎలా ఇచ్చిందో ఆమెకు అలాగే ఇవ్వండి; ఆమె చేసిన దానికి రెండింతలు ఆమెకు తిరిగి చెల్లించండి. ఆమె పాత్ర నుండే ఆమెకు రెండింతలు పోసి ఇవ్వండి! ఆమె తనకు తాను ఎంతగా హెచ్చించుకొంటూ ఎన్ని సుఖభోగాలు అనుభవించిందో, అంత వేదన దుఃఖాన్ని ఆమెకు కలుగజేయండి. ఎందుకంటే, ఆమె తన హృదయంలో ఇలా అనుకొంది, ‘నేను రాణిగా నా సింహాసనం మీద కూర్చున్నాను. నేను విధవరాలిని కాను, ఇక ఎన్నడు సంతాపం అనుభవించనని.’ కనుక ఒక్క రోజులోనే ఆమె తెగుళ్ళన్ని ఆమెను పట్టుకొంటాయి, ఆమె మీదికి మరణం, దుఃఖం, కరువు వస్తాయి. ఆమెకు తీర్పుతీర్చే ప్రభువైన దేవుడు శక్తిగలవాడు, కనుక ఆమె అగ్నితో కాల్చివేయబడుతుంది.” ఆమెతో వ్యభిచరించి ఆమె సుఖభోగాలను అనుభవించిన భూ రాజులు ఆమె కాలుతున్నప్పుడు వచ్చే పొగను చూసి ఆమె కొరకు కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు. ఆమె పడే వేదన చూసి భయపడి, వారు దూరంగా నిలబడి రోదిస్తూ, “మహా పట్టణమా! నీకు విపత్తు! విపత్తు! బబులోను మహా పట్టణమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చింది” అని అంటారు. భూలోక వ్యాపారులు ఇకపై తమ సరకులు కొనేవారు ఎవరు లేరు అని ఆమె కొరకు కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు. వారి సరకులు ఏవంటే బంగారం, వెండి, విలువైన రాళ్ళు, ముత్యాలు; సున్నితమైన నారబట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు; సువాసన ఇచ్చే అన్ని రకాల చెక్కలు, దంతాలతో చాలా విలువైన చెక్కతో, కంచు, ఇనుము, నునుపురాళ్ళతో తయారు చేసిన అన్ని రకాల వస్తువులు; దాల్చిన చెక్క సుగంధద్రవ్యాలు, ధూపద్రవ్యాలు, బోళం సాంబ్రాణి, ద్రాక్షరసం ఒలీవ నూనె, శ్రేష్ఠమైన పిండి గోధుమలు; పశువులు గొర్రెలు, గుర్రాలు రథాలు; దాసులుగా అమ్మివేయబడిన మనుష్యులు. అప్పుడు వర్తకులు ఆ పట్టణంతో, “నీవు ఆశించిన ఫలం నిన్ను విడిచిపోయింది, నీకున్న సుఖవిలాసం, వైభవాలు ఇంకెన్నడు నీకు కనిపించకుండా మాయమైపోయాయి” అని అన్నారు. ఈ సరుకులను అమ్ముతూ ఆమె ద్వారా ధనవంతులైన వ్యాపారులు ఆమె అనుభవించే వేదన చూసి భయంతో దూరంగా నిలబడ్డారు. వారు ఏడుస్తూ రోదిస్తూ, బిగ్గరగా ఇలా రోదించారు, “ ‘ఓ మహా పట్టణమా, నీకు విపత్తు, విపత్తు. సున్నితమైన నారబట్టలు, ఊదారంగు బట్టలు, ఎరుపు రంగు బట్టలు ధరించుకొని, బంగారంతో, విలువైన రాళ్ళతో, ముత్యాలతో అలంకరించుకొని మెరుస్తున్నదానా, ఒక్క గంటలోనే ఈ నీ గొప్ప ధనసంపద అంతా వ్యర్థమైపోయిందా?’ “ప్రతి ఓడ అధిపతి, ఓడ ప్రయాణికులందరు, నావికులు, సముద్ర వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు దూరంగా నిలబడ్డారు. కాలిపోతున్న ఆమె నుండి వస్తున్న పొగను చూసి, ఈ మహా పట్టణం వంటి గొప్ప పట్టణం ఎప్పుడైనా ఉన్నదా? అని బిగ్గరగా కేకలు వేస్తారు. వారు తమ తలలపై దుమ్మును పోసుకుంటూ కన్నీరు కార్చుతూ దుఃఖిస్తూ బిగ్గరగా రోదిస్తూ, “ ‘మహా పట్టణమా, నీకు విపత్తు, విపత్తు! సముద్రంలో ఓడలున్న వారందరు ఆమె ధన సమృద్ధితో ధనికులయ్యారు. గాని ఒక్క గంటలోనే ఆమె నశించిపోయిందే అని చెప్పుకుంటారు.’ “పరలోకమా ఆమెను బట్టి ఆనందించండి. దేవుని ప్రజలారా, ఆనందించండి. అపొస్తలులారా, ప్రవక్తలారా ఆనందించండి. ఎందుకంటే, ఆమె మీకు విధించిన తీర్పును బట్టి దేవుడు ఆమెకు తీర్పు తీర్చాడు.”

షేర్ చేయి
Read ప్రకటన 18

ప్రకటన 18:1-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ తరవాత పరలోకం నుండి మరో దూత దిగి రావడం చూశాను. అతనికి గొప్ప అధికారం ఉంది. అతనికున్న యశస్సు చేత భూమి అంతా ప్రకాశించింది. అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు. “బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది. ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది. ఎందుకంటే దేవుని కోపాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలతా మద్యాన్ని జనమంతా తాగి మత్తెక్కి పడిపోయారు. భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల ప్రభావం వల్ల సంపన్నులయ్యారు.” తరువాత మరో స్వరం పరలోకం నుండి వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది. “నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా, ఆమెకు సంభవించబోయే కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చెయ్యండి. ఆమె పాపాలు ఆకాశాన్నంటుతున్నాయి. దేవుడు ఆమె నేరాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె చెల్లించిన ప్రకారం ఆమెకు చెల్లించండి. ఆమె చేసిన దానికి ఆమెకు రెట్టింపు చేయండి. ఆమె కలిపిన పాత్రలోనే ఆమె కోసం రెండొంతులు కలపండి. ఆమె తనను తాను హెచ్చించుకుంది. విలాస భోగాల్లో జీవించింది. అంతే మొత్తంలో ఆమెకు హింసనూ, వేదననూ కలగజేయండి. ఎందుకంటే ఆమె తన మనసులో, “నేను రాణిగా కూర్చుండేదాన్ని, విధవను కాను. సంతాపం చూడనే చూడను” అనుకుంది. కాబట్టి ఆమెకి కీడులన్నీ ఒక్క రోజే కలుగుతాయి. మరణమూ, దుఖమూ, కరువూ వస్తాయి. దేవుడైన ప్రభువు మహా శక్తిశాలి. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే. ఆమె అగ్నికి ఆహుతైపోతుంది.” ఆమెతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖభోగాలు అనుభవించిన భూరాజులు అందరూ ఆమెకు కలుగుతున్న వేదన చూసి భయంతో దూరంగా నిలబడతారు. ఆమె తగలబడి పోతుంటే వచ్చే పొగను చూస్తూ రోదిస్తారు. “అయ్యో, అయ్యో, బబులోను మహానగరమా, శక్తివంతమైన నగరమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చి పడిందా” అంటూ ఏడుస్తారు. లోకంలోని వ్యాపారులు కూడా ఆ నగరాన్ని చూసి విలపిస్తారు. ఎందుకంటే, ఇక మీదట తమ వస్తువులు కొనేవారు ఎవ్వరూ ఉండరు. వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నని నేత బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు, ఇంకా పరిమళాన్నిచ్చే విలువగల ప్రతి రకమైన కలప, దంతం, ఎంతో విలువైన చెక్క, ఇత్తడి, ఇనుము, పాల రాళ్ళూ మొదలైన వాటితో చేసిన ఎన్నో రకాల వస్తువులూ దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలు, ధూపం కోసం వాడే వస్తువులూ, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, నూనె, మెత్తని పిండి, గోదుమలు, పశువులు, గొర్రెలు మొదలైనవి. ఇంకా గుర్రాలూ, రథాలూ, బానిసలూ, మనుషుల ప్రాణాలు. “నీ మనస్సు ఆశించిన ఫలం నిన్ను విడిచి పోయింది. నీ విలాసం, వైభోగం మాయమై పోయాయి. అవి ఇక కనపడవు” అని చెబుతూ ఏడుస్తారు. ఆ నగరంలో ఈ వస్తువులతో వ్యాపారం చేసి సంపన్నులైన వ్యాపారులు ఆమె వేదన చూసి భయంతో దూరంగా నిలిచి ఏడుస్తూ గట్టిగా రోదిస్తారు. “సన్నని నేత బట్టలు, ఊదారంగు, ఎర్రని బట్టలు కట్టుకుని బంగారంతో, రత్నాలతో, వెల గల నగలతో, ముత్యాలతో అలంకరించుకున్న మహా నగరమా, అయ్యో, అయ్యో, ఇంత ఐశ్వర్యమూ ఒక్క గంటలోనే మాయమైపోయిందే!” అంటారు. ప్రతి నౌకాధిపతి, సముద్ర యాత్రికులు, ఓడ నావికులు, ఇలా సముద్రం మీద ఆధారపడి బతికే వారంతా దూరంగా నిలబడి నగరం తగలబడి పోతుంటే రాజుకున్న పొగను చూసి, “ఈ మహా నగరానికి సమానమైనదేది?” అంటూ కేకలు పెడతారు. తమ తలల మీద దుమ్ము చల్లుకుని ఏడుస్తూ రోదిస్తూ, “అయ్యో, అయ్యో, ఆ మహా నగరం. సొంత నౌకలు ఉన్న వారంతా ఈ నగరంలోని సంపద వల్ల ధనవంతులయ్యారు. అలాటిది ఒక్క గంటలోనే ఇలా నాశనమయిందే” అంటారు. “పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెను గురించి సంతోషించండి. ఎందుకంటే అది మిమ్మల్ని శిక్షించిన దానికి ప్రతిగా దేవుడు ఆమెను శిక్షించాడు.”

షేర్ చేయి
Read ప్రకటన 18

ప్రకటన 18:1-20 పవిత్ర బైబిల్ (TERV)

ఇది జరిగిన తర్వాత పరలోకం నుండి మరొక దూత దిగి రావటం చూసాను. అతని తేజస్సు భూమిని ప్రకాశింప చేసింది. అతడు బిగ్గరగా యిలా అన్నాడు: “బాబిలోను మహానగరం కూలిపోయింది, కూలిపోయింది. అది అక్కడ దయ్యాలకు నివాసమైంది. ప్రతి దురాత్మకు అది తిరుగులాడు స్థలమైంది. ప్రతి ఏవగింపు కలిగించే అపవిత్రమైన పక్షికి అది సంచరించు స్థలమైంది. దేశాలన్నీ దాని వ్యభిచారమనే మద్యాన్ని త్రాగాయి. దేవుని ఆగ్రహమనే మద్యాన్ని త్రాగి మత్తెక్కి పోయాయి. భూరాజులు దాంతో వ్యభిచరించారు. ప్రపంచంలోని వర్తకులు, దాని మితి మీరిన విలాసాలతో ధనవంతులయ్యారు.” ఆ తదుపరి ఇంకొక స్వరం పరలోకంలో నుండి ఈ విధంగా అనటం విన్నాను: “నా ప్రజలారా! దానిలో నుండి బయటకు రండి. ఎందుకంటే దాని పాపాల్లో మీరు పాలుపంచుకోరు. అప్పుడు దానికున్న తెగుళ్ళు మీకు రావు. దాని పాపాలు ఆకాశం అంత ఎత్తుగా పేరుకుపోయాయి. దేవునికి దాని నేరాలు జ్ఞాపకం ఉన్నాయి. అది యిచ్చింది తిరిగి దానికే యివ్వండి. అది చేసిన దానికి రెండింతలు దానికి చెల్లించండి. దాని పాత్రలో రెండింతలు ఘాటుగా ఉన్న మద్యాన్ని పొయ్యండి. ఆ పట్టణం అనుభవించిన పేరు ప్రతిష్ఠలకు సమానంగా అది అనుభవించిన సుఖాలకు సమానంగా దానికి దుఃఖాలు కలిగించి హింసించండి. అది తన మనస్సులో, ‘నేను రాణిలా సింహాసనంపై కూర్చుంటాను. నేను ఎన్నటికీ వితంతువును కాను. నేను ఎన్నటికీ దుఃఖించను’ అని తనలో గర్విస్తుంది. అందువల్ల చావు, దుఃఖము, కరువు, తెగులు ఒకేరోజు వచ్చి దాన్ని బాధిస్తాయి. దానిపై తీర్పు చెప్పే మన ప్రభువైన దేవుడు శక్తివంతుడు కనుక దాన్ని మంటల్లో కాల్చి వేస్తాడు. “దానితో వ్యభిచరించి సుఖాలనుభవించిన భూరాజులు అది మండుతున్నప్పుడు వచ్చిన పొగలు చూసి దానికోసం గుండెలు బాదుకొని దుఃఖిస్తారు. దానికి జరుగుతున్న హింసను చూసి భయపడి దూరంగా నిలబడి, ‘అయ్యో! అయ్యో! మహానగరమా! శక్తివంతమైన బాబిలోను నగరమా! ఒకే ఒక గంటలో నీకు నాశనం వచ్చింది’ అని విలపిస్తారు. “ప్రపంచంలోని వర్తకులు తమ వస్తువులు యిక మీదట కొనేవారు ఎవ్వరూ ఉండరు కనుక తమ నష్టానికి దానిమీద విలపిస్తారు. వీళ్ళు బంగారు, వెండి వస్తువులు, రత్నాలు, ముత్యాలు, సున్నితమైన నార బట్టలు, ఊదారంగు వస్త్రాలు, పట్టు వస్త్రలు, ఎర్రటి రంగుగల వస్త్రాలు, దబ్బచెట్ల పలకలు, దంతంతో, మంచి చెక్కతో, కంచుతో, ఇనుముతో, చలువరాతితో చేసిన అన్ని రకాల వస్తువులు, దాల్చిన చెక్క, ఓమము, అగరుబత్తులు, మంచి అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, ఒలీవ నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు, గుర్రాలు, బండ్లు, బానిసలు, మనుష్యుల శరీరాలు, ప్రాణాలు అమ్మేవాళ్ళు. వాళ్ళు, ‘నీవు కోరిన ఫలము దొరకలేదు. నీ ఐశ్వర్యము, నీ భోగము నశించిపొయ్యాయి. అవి మళ్ళీ రావు’ అని అన్నారు. “వస్తువులు అమ్మి ధనం గడించిన వర్తకులు ఆమె అనుభవిస్తున్న హింసను చూసి భయపడి దూరంగా నిలుచుంటారు. వాళ్ళు దుఃఖంతో విలపిస్తారు. వాళ్ళు, ‘అయ్యో! అయ్యో! సున్నితమైన వస్త్రాల్ని, ఊదారంగు వస్త్రాల్ని, ఎర్రటి రంగు వస్త్రాల్ని ధరించిన మహానగరమా! బంగారుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన నగలు ధరించిన మహానగరమా! ఒకే ఒక గంటలో నీ ఐశ్వర్యమంతా నశించిపోయిందే!’ అని విలపిస్తారు. “ప్రతి నావికాధికారి, ఓడలో ప్రయాణం చేసే ప్రతి యాత్రికుడు, నావికులు, సముద్రం ద్వారా తమ జీతం గడించి జీవించే వాళ్ళు అందరూ దూరంగా నిలబడి ఉన్నారు. ఆ పట్టణం కాలుతున్నప్పుడు వచ్చే పొగలను చూసి వాళ్ళు ఆశ్చర్యంతో, ‘ఈ మహానగరమంత గొప్పగా ఏ పట్టణమైనా ఉందా?’ అని అంటారు. వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ, దుమ్మును నెత్తిన వేసుకొంటూ, ‘అయ్యో! అయ్యో! మహానగరమా! సముద్రంలో ఓడ ఉన్న ప్రతి ఒక్కడూ దాని ధనంవల్ల ధనికులయ్యారే! ఒకే ఒక గంటలో ఆమె నాశనమయ్యిందే! అని ఏడుస్తారు. పరలోకమా! దాని పతనానికి ఆనందించు! విశ్వాసులారా! అపొస్తలులారా! ప్రవక్తలారా! ఆనందించండి. అది మీతో ప్రవర్తించిన విధానానికి దేవుడు దానికి తగిన శిక్ష విధించాడు’”

షేర్ చేయి
Read ప్రకటన 18

ప్రకటన 18:1-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి యిట్లనెను–మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యము నైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతోకూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములవలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని–నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు. అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి. అది–నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖ భోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారముచేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయా క్రాంతులై దూరమున నిలువబడి దాని దహనధూమమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు–అయ్యో, అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందురు. లోకములోని వర్తకులును, ఆ పట్టణమును చూచి యేడ్చుచు, తమ సరకులను, అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదా రంగుబట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపుబట్టలు మొదలైన సరకులను, ప్రతివిధమైన దబ్బమ్రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కఱ్ఱ యిత్తడి యినుము చలువరాళ్లు మొదలైనవాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను, దాల్చినిచెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తనిపిండి గోధుమలు పశువులు గొఱ్ఱెలు మొదలగు వాటిని, గుఱ్ఱములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు; నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవన్నియు దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించి పోయినవి, అవి యికమీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణముచేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు–అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచు, దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనముచేయు వారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి –ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలువేసి తమ తలలమీద దుమ్ముపోసి కొని యేడ్చుచు దుఃఖించుచు–అయ్యో, అయ్యో, ఆ మహాపట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పు కొనుచు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనందించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు.

షేర్ చేయి
Read ప్రకటన 18

ప్రకటన 18:1-20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

తర్వాత మరొక దేవదూత పరలోకం నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను; అతనికి గొప్ప అధికారం ఉంది, అతని వెలుగుతో భూమి ప్రకాశించింది. అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు, “బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది! అది దయ్యాలు సంచరించే స్థలంగా, ప్రతి దుష్ట ఆత్మలు సంచరించే స్థలంగా, ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా, ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలు సంచరించే స్థలంగా మారింది. ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి దేశాలన్నీ మత్తులయ్యాయి. భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు. భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు.” అప్పుడు పరలోకంలో నుండి మరొక స్వరం వినిపించింది: “ ‘నా ప్రజలారా! మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా’ ఆమెకు సంభవించే ఏ కీడు మీ మీదికి రాకుండా, ఆమెలో నుండి బయటకు రండి; ఆమె చేసిన పాపాలు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి కాబట్టి, దేవుడు ఆమె అతిక్రమాలను జ్ఞాపకం చేసుకున్నారు. ఆమె ఎలా ఇచ్చిందో ఆమెకు అలాగే ఇవ్వండి; ఆమె చేసిన దానికి రెండింతలు ఆమెకు తిరిగి చెల్లించండి. ఆమె పాత్ర నుండే ఆమెకు రెండింతలు పోసి ఇవ్వండి! ఆమె తనను తాను హెచ్చించుకొంటూ ఎన్ని సుఖభోగాలు అనుభవించిందో, అంత వేదన దుఃఖాన్ని ఆమెకు కలుగజేయండి. ఎందుకంటే, ఆమె తన హృదయంలో, ‘నేను రాణిగా నా సింహాసనం మీద కూర్చున్నాను. నేను విధవరాలిని కాను, ఇక ఎన్నడు సంతాపం అనుభవించను’ అని అనుకుంది. కాబట్టి ఒక్క రోజులోనే ఆమె తెగుళ్ళన్ని ఆమెను పట్టుకుంటాయి, ఆమె మీదికి మరణం, దుఃఖం, కరువు వస్తాయి. ఆమెకు తీర్పు తీర్చే ప్రభువైన దేవుడు శక్తిగలవాడు, కాబట్టి ఆమె అగ్నితో కాల్చివేయబడుతుంది.” ఆమెతో వ్యభిచరించి ఆమె సుఖభోగాలను అనుభవించిన భూ రాజులు ఆమె కాలుతున్నప్పుడు వచ్చే పొగను చూసి ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు. ఆమె పడే వేదన చూసి భయపడి, వారు దూరంగా నిలబడి ఇలా రోదిస్తారు: “మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ! బబులోను మహా పట్టణమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చింది.” భూలోక వ్యాపారులు ఇకపై తమ సరుకులు కొనేవారెవరు లేరని ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు. వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, విలువైన రాళ్లు, ముత్యాలు; సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు; సువాసన ఇచ్చే అన్ని రకాల చెక్కలు, దంతాలతో చాలా విలువైన చెక్కతో ఇత్తడి ఇనుము నునుపురాళ్లతో తయారుచేసిన అన్ని రకాల వస్తువులు; దాల్చిన చెక్క, సుగంధద్రవ్యాలు, ధూపద్రవ్యాలు, బోళం సాంబ్రాణి, ద్రాక్షరసం ఒలీవనూనె, శ్రేష్ఠమైన పిండి గోధుమలు; పశువులు గొర్రెలు, గుర్రాలు రథాలు; మానవులు కేవలం భౌతిక శరీరాలు మాత్రమే కాదు, మనుష్యుల ప్రాణాలు, బానిసలు. అప్పుడు వర్తకులు ఆ పట్టణంతో, “నీ ప్రాణం కోరుకున్న ఫలం నిన్ను విడిచిపోయింది, నీకున్న సుఖవిలాసం, వైభవాలు ఇంకెన్నడు నీకు కనిపించకుండా మాయమైపోయాయి” అని అన్నారు. ఈ సరుకులను అమ్ముతూ ఆమె వలన ధనవంతులైన వ్యాపారులు ఆమె అనుభవించే వేదన చూసి భయంతో దూరంగా నిలబడ్డారు. వారు ఏడుస్తూ రోదిస్తూ, బిగ్గరగా ఇలా రోదించారు, “ ‘మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ! సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, ఎరుపురంగు బట్టలు ధరించుకొని, బంగారంతో, విలువైన రాళ్లతో, ముత్యాలతో అలంకరించుకుని మెరుస్తున్నదానా, ఒక్క గంటలోనే ఈ నీ గొప్ప ధనసంపద అంతా వ్యర్థమైపోయిందా?’ “ప్రతి ఓడ అధిపతి, ఓడ ప్రయాణికులందరు, నావికులు, సముద్ర వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు దూరంగా నిలబడ్డారు. కాలిపోతున్న ఆమె నుండి వస్తున్న పొగను చూసి, ‘ఈ మహా పట్టణం వంటి గొప్ప పట్టణం ఎప్పుడైనా ఉన్నదా?’ అని బిగ్గరగా కేకలు వేస్తారు. వారు తమ తలలపై దుమ్మును పోసుకుంటూ కన్నీరు కార్చుతూ దుఃఖిస్తూ బిగ్గరగా రోదిస్తూ, “ ‘మహా పట్టణమా, నీకు శ్రమ! శ్రమ! సముద్రంలో ఓడలున్న వారందరు ఆమె ధన సమృద్ధితో ధనికులయ్యారు. గాని ఒక్క గంటలోనే ఆమె నశించిపోయిందే అని చెప్పుకుంటారు.’ “పరలోకమా ఆమెను బట్టి ఆనందించండి. దేవుని ప్రజలారా, ఆనందించండి. అపొస్తలులారా, ప్రవక్తలారా ఆనందించండి. ఎందుకంటే, ఆమె మీకు విధించిన తీర్పును బట్టి దేవుడు ఆమెకు తీర్పు తీర్చారు.”

షేర్ చేయి
Read ప్రకటన 18