తర్వాత మరొక దేవదూత పరలోకం నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను; అతనికి గొప్ప అధికారం ఉంది, అతని వెలుగుతో భూమి ప్రకాశించింది. అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు,
“బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది!
అది దయ్యాలు సంచరించే స్థలంగా,
ప్రతి దుష్ట ఆత్మలు సంచరించే స్థలంగా,
ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా,
ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలు సంచరించే స్థలంగా మారింది.
ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి
దేశాలన్నీ మత్తులయ్యాయి.
భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు.
భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు.”
అప్పుడు పరలోకంలో నుండి మరొక స్వరం వినిపించింది:
“ ‘నా ప్రజలారా! మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా’
ఆమెకు సంభవించే ఏ కీడు మీ మీదికి రాకుండా,
ఆమెలో నుండి బయటకు రండి;
ఆమె చేసిన పాపాలు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి కాబట్టి,
దేవుడు ఆమె అతిక్రమాలను జ్ఞాపకం చేసుకున్నారు.
ఆమె ఎలా ఇచ్చిందో ఆమెకు అలాగే ఇవ్వండి;
ఆమె చేసిన దానికి రెండింతలు ఆమెకు తిరిగి చెల్లించండి.
ఆమె పాత్ర నుండే ఆమెకు రెండింతలు పోసి ఇవ్వండి!
ఆమె తనను తాను హెచ్చించుకొంటూ ఎన్ని సుఖభోగాలు అనుభవించిందో,
అంత వేదన దుఃఖాన్ని ఆమెకు కలుగజేయండి.
ఎందుకంటే, ఆమె తన హృదయంలో,
‘నేను రాణిగా నా సింహాసనం మీద కూర్చున్నాను.
నేను విధవరాలిని కాను,
ఇక ఎన్నడు సంతాపం అనుభవించను’ అని అనుకుంది.
కాబట్టి ఒక్క రోజులోనే ఆమె తెగుళ్ళన్ని ఆమెను పట్టుకుంటాయి,
ఆమె మీదికి మరణం, దుఃఖం, కరువు వస్తాయి.
ఆమెకు తీర్పు తీర్చే ప్రభువైన దేవుడు శక్తిగలవాడు,
కాబట్టి ఆమె అగ్నితో కాల్చివేయబడుతుంది.”
ఆమెతో వ్యభిచరించి ఆమె సుఖభోగాలను అనుభవించిన భూ రాజులు ఆమె కాలుతున్నప్పుడు వచ్చే పొగను చూసి ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు. ఆమె పడే వేదన చూసి భయపడి, వారు దూరంగా నిలబడి ఇలా రోదిస్తారు:
“మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ!
బబులోను మహా పట్టణమా,
ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చింది.”
భూలోక వ్యాపారులు ఇకపై తమ సరుకులు కొనేవారెవరు లేరని ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు. వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, విలువైన రాళ్లు, ముత్యాలు; సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు; సువాసన ఇచ్చే అన్ని రకాల చెక్కలు, దంతాలతో చాలా విలువైన చెక్కతో ఇత్తడి ఇనుము నునుపురాళ్లతో తయారుచేసిన అన్ని రకాల వస్తువులు; దాల్చిన చెక్క, సుగంధద్రవ్యాలు, ధూపద్రవ్యాలు, బోళం సాంబ్రాణి, ద్రాక్షరసం ఒలీవనూనె, శ్రేష్ఠమైన పిండి గోధుమలు; పశువులు గొర్రెలు, గుర్రాలు రథాలు; మానవులు కేవలం భౌతిక శరీరాలు మాత్రమే కాదు, మనుష్యుల ప్రాణాలు, బానిసలు.
అప్పుడు వర్తకులు ఆ పట్టణంతో, “నీ ప్రాణం కోరుకున్న ఫలం నిన్ను విడిచిపోయింది, నీకున్న సుఖవిలాసం, వైభవాలు ఇంకెన్నడు నీకు కనిపించకుండా మాయమైపోయాయి” అని అన్నారు. ఈ సరుకులను అమ్ముతూ ఆమె వలన ధనవంతులైన వ్యాపారులు ఆమె అనుభవించే వేదన చూసి భయంతో దూరంగా నిలబడ్డారు. వారు ఏడుస్తూ రోదిస్తూ, బిగ్గరగా ఇలా రోదించారు,
“ ‘మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ!
సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, ఎరుపురంగు బట్టలు ధరించుకొని,
బంగారంతో, విలువైన రాళ్లతో, ముత్యాలతో అలంకరించుకుని మెరుస్తున్నదానా,
ఒక్క గంటలోనే ఈ నీ గొప్ప ధనసంపద అంతా వ్యర్థమైపోయిందా?’
“ప్రతి ఓడ అధిపతి, ఓడ ప్రయాణికులందరు, నావికులు, సముద్ర వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు దూరంగా నిలబడ్డారు. కాలిపోతున్న ఆమె నుండి వస్తున్న పొగను చూసి, ‘ఈ మహా పట్టణం వంటి గొప్ప పట్టణం ఎప్పుడైనా ఉన్నదా?’ అని బిగ్గరగా కేకలు వేస్తారు. వారు తమ తలలపై దుమ్మును పోసుకుంటూ కన్నీరు కార్చుతూ దుఃఖిస్తూ బిగ్గరగా రోదిస్తూ,
“ ‘మహా పట్టణమా, నీకు శ్రమ! శ్రమ!
సముద్రంలో ఓడలున్న వారందరు
ఆమె ధన సమృద్ధితో ధనికులయ్యారు.
గాని ఒక్క గంటలోనే ఆమె నశించిపోయిందే అని చెప్పుకుంటారు.’
“పరలోకమా ఆమెను బట్టి ఆనందించండి.
దేవుని ప్రజలారా, ఆనందించండి.
అపొస్తలులారా, ప్రవక్తలారా ఆనందించండి.
ఎందుకంటే, ఆమె మీకు విధించిన తీర్పును బట్టి
దేవుడు ఆమెకు తీర్పు తీర్చారు.”