కీర్తనలు 78:40-72

కీర్తనలు 78:40-72 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అరణ్యమునవారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైననువారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమునువారు జ్ఞిప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండ నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెనువారి కష్టఫలములను మిడతలకప్పగించెను. వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలుచేసెను.వారి మందలను పిడుగుల పాలుచేసెను. ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను మరణమునుండి వారి ప్రాణమును తప్పింపకవారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను. అయితే గొఱ్ఱెలవలె ఆయన తన ప్రజలను తోడు కొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయనవారిని నడిపించెను వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను.వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణహస్తము సంపాదించిన యీ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను. వారియెదుటనుండి అన్యజనులను వెళ్లగొట్టెను. కొలనూలుచేత వారి స్వాస్థ్యమును వారికి పంచి యిచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివ సింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనముల ననుసరింపకపోయిరి. తమపితరులవలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లువారు తొలగి పోయిరి. వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగ జేసిరి. దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను. షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థా పన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యముమీద ఆగ్రహించెను అగ్ని వారి యౌవనస్థులను భక్షించెనువారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలుకాగావారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించు కొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధమందిరమును కట్టించెను తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱెల దొడ్లలోనుండి అతని పిలిపించెను. పాడిగొఱ్ఱెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రా యేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.

షేర్ చేయి
Read కీర్తనలు 78

కీర్తనలు 78:40-72 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఎడారిలో ఆయనను ఎన్నోసార్లు దుఃఖపెట్టారు. మాటిమాటికీ దేవుణ్ణి శోధించారు. మాటిమాటికీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి దుఃఖం పుట్టించారు. ఆయన బాహుబలాన్నీ, ఏ విధంగా ఆయన తమ శత్రువుల చేతిలో నుండి తమను విమోచించాడో దానినీ, ఈజిప్టులో ఆయన చూపిన సూచక క్రియలనూ సోయను ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతాలనూ వారు జ్ఞాపకం చేసుకోలేదు. నైలునది కాలవలను, వారి ప్రవాహాలను ఆయన రక్తంగా మార్చినప్పుడు ఐగుప్తీయులు తాగలేక పోయారు. ఆయన వారి మీదికి ఈగల గుంపులను పంపించాడు. అవి వారిని ముంచివేశాయి, కప్పలను పంపాడు. అవి వారి నేలంతటినీ కప్పివేశాయి. ఆయన వారి పంటలను చీడపురుగులకిచ్చాడు. వారి కష్టఫలాన్ని మిడతలకు అప్పగించాడు. వడగండ్ల చేత వారి ద్రాక్షతీగెలను, మంచు చేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేశాడు. వారి పశువులపై వడగళ్ళు కురిపించాడు. వారి మందలపై పిడుగులు రాలాయి. ఆయన విపత్తును కలిగించే దూతలుగా తన ఉగ్రతను, మహోగ్రతను, బాధను వారి మీదికి పంపించాడు. తన కోపానికి దారి చదునుగా చేశాడు. వారిని మరణం నుండి తప్పించకుండా వారి ప్రాణాన్ని తెగులుకు అప్పగించాడు. ఈజిప్టులోని పెద్ద కొడుకులందరినీ హాము గుడారాల్లో వారి బలానికి గుర్తుగా ఉన్న ప్రథమ సంతానాన్ని ఆయన చంపాడు. ఆ తరవాత ఆయన తన ప్రజలను గొర్రెలను తోలినట్టుగా నడిపించాడు. ఒకడు తన మందను ఎలా నడిపిస్తాడో అరణ్యంలో ఆయన వారిని అలా నడిపించాడు. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాడు. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాడు. తన పరిశుద్ధ భూమి సరిహద్దు దగ్గరికి, తన కుడిచెయ్యి సంపాదించిన ఈ పర్వతం దగ్గరికి ఆయన వారిని రప్పించాడు. వారి ఎదుట నుండి అన్య జాతులను వెళ్లగొట్టాడు. ఆ ప్రజల వారసత్వాన్ని వారికి పంచి ఇచ్చాడు. ఇశ్రాయేలు గోత్రాలను వారి గుడారాల్లో స్థిరపరిచాడు. అయినప్పటికీ వారు మహోన్నతుడైన దేవుణ్ణి పరీక్షించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనాలను పాటించలేదు. తమ పూర్వికుల్లాగా వారు అపనమ్మకస్తులై ద్రోహం చేశారు. పనికిరాని విల్లులాగా నిష్ప్రయోజకులయ్యారు. వారు ఉన్నత స్థలాల్లో దేవస్థానాలు నిలిపి ఆయనకు కోపం పుట్టించారు. విగ్రహాలు నిలబెట్టి ఆయనకు రోషం కలిగించారు. దాన్ని చూసిన దేవుడు ఆగ్రహించి ఇశ్రాయేలును పూర్తిగా తోసిపుచ్చాడు. షిలోహు పట్టణంలో మందిరాన్ని, తాను మనుషులతో కలిసి నివసించిన గుడారాన్ని విడిచిపెట్టాడు. ఆయన తన బలాన్ని చెరలోకీ తన మహిమను విరోధుల చేతిలోకీ వెళ్ళడానికి అనుమతించాడు. తన ప్రజలను ఖడ్గానికి అప్పగించాడు. ఆయన తన వారసత్వం మీద కోపించాడు. అగ్ని వారి యువకులను దహించివేసింది. వారి కన్యలకు పెండ్లిపాటలు లేకుండా పోయాయి. వారి యాజకులు కత్తిపాలై కూలిపోయారు. విధవలైన వారి భార్యలు రోదనం చేయలేక పోయారు. అప్పుడు నిద్ర నుండి మేల్కొన్న వ్యక్తిలాగా, ద్రాక్షరసం తాగి కేకపెట్టే యోధుడిలాగా ప్రభువు లేచాడు. ఆయన తన విరోధులను వెనక్కి తరిమికొట్టాడు. వారిని నిత్యమైన అవమానానికి గురి చేశాడు. తరవాత ఆయన యోసేపు గుడారాన్ని అసహ్యించుకున్నాడు. ఎఫ్రాయిము గోత్రాన్ని కోరుకోలేదు. యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సీయోను పర్వతాన్ని ఆయన ఎన్నుకున్నాడు. అంతరిక్షంలాగా, తాను శాశ్వతంగా స్థిరపరచిన భూమిలాగా ఆయన తన మందిరాన్ని కట్టించాడు. తన సేవకుడు దావీదును ఎన్నుకుని గొర్రెల మందల మధ్య నుండి అతణ్ణి పిలిపించాడు. పాలిచ్చే గొర్రెల వెంట నడవడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన వారసత్వమైన ఇశ్రాయేలును మేపడానికి ఆయన అతణ్ణి రప్పించాడు. అతడు యథార్థ హృదయంతో వారిని పాలించాడు. నైపుణ్యంతో వారిని నడిపించాడు.

షేర్ చేయి
Read కీర్తనలు 78

కీర్తనలు 78:40-72 పవిత్ర బైబిల్ (TERV)

అయ్యో, ఎడారిలో ఆ ప్రజలు దేవునికి అనేక తొందరలు కలిగించారు. ఆ ఎడారి దేశంలో వారు ఆయన్ని ఎంతో దుఃఖ పెట్టారు. ఆ ప్రజలు దేవుని సహనాన్ని మరలా మరలా పరీక్షించారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధునికి నిజంగా వారు ఎంతో బాధ కలిగించారు. ఆ ప్రజలు దేవుని శక్తిని గూర్చి మరచిపోయారు. శత్రువు బారినుండి దేవుడు తమని అనేకసార్లు రక్షించిన విషయం వారు మరచిపోయారు. ఈజిప్టులో ఆయన చేసిన అద్భుతాలను వారు మరచిపోయారు. సోయను పొలాలలో జరిగిన అద్భుతాలను వారు మరచిపోయారు. నదులను దేవుడు రక్తంగా మార్చాడు! ఈజిప్టువారు నీళ్లు త్రాగలేకపోయారు. ఈజిప్టు ప్రజలను కుట్టిన జోరీగల దండులను దేవుడు పంపించాడు. ఈజిప్టువారి బ్రతుకులను పాడు చేయగలిగిన కప్పలను దేవుడు పంపించాడు. దేవుడు వారి పంటలను చీడ పురుగులకు అప్పగించాడు. వారి ఇతర మొక్కలను మిడతలకు అప్పగించాడు. ఈజిప్టువారి ద్రాక్షాతీగెలను నాశనం చేయటానికి దేవుడు వడగండ్లను వాడుకొన్నాడు. వారి చెట్లను నాశనం చేయుటకు ఆయన హిమమును వాడుకొన్నాడు. దేవుడు వారి జంతువులను వడగండ్ల చేతను వారి పశువులను పిడుగుల చేతను చంపేశాడు. దేవుడు తన భయంకరమైన కోపాన్ని ఈజిప్టువారికి చూపించాడు. నాశనం చేసే తన దేవదూతలను వారికి విరోధంగా ఉండుటకు ఆయన పంపించాడు. దేవుడు తన కోపాన్ని చూపించుటకు ఒక మార్గం కనుగొన్నాడు. ఆ ప్రజలలో ఎవరినీ ఆయన బతకనివ్వలేదు. వారినందరినీ ఓ భయంకర రోగంతో ఆయన చావనిచ్చాడు. ఈజిప్టులో ప్రథమ సంతానాన్ని దేవుడు చంపివేసాడు. హాము సంతానంలో ప్రతి మొదటి బిడ్డనీ ఆయన చంపివేసాడు. తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను గొర్రెల కాపరిలా నడిపించాడు. ఆయన తన ప్రజలను అరణ్యం లోనికి గొర్రెలను నడిపించినట్లుగా నడిపించాడు. ఆయన తన ప్రజలను క్షేమంగా నడిపించాడు. దేవుని ప్రజలు భయపడాల్సింది. ఏమీ లేదు. వారి శత్రువులను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేసాడు. దేవుడు తన ప్రజలను తన పవిత్ర దేశానికి నడిపించాడు. తన స్వంత శక్తితో సీయోను పర్వతానికి ఆయన నడిపించాడు. ఇతర రాజ్యాలు ఆ దేశాన్ని విడిచిపెట్టేటట్టు దేవుడు వారిని బలవంతం చేసాడు. దేవుడు తన ప్రజలకు వారి వంతు దేశాన్ని ఇచ్చాడు. అందుచేత ఇశ్రాయేలీయులు వారి స్వంత గృహాలలో నివసించారు. కాని ఇశ్రాయేలు ప్రజలు సర్వోన్నతుడైన దేవున్ని ఇంకను పరీక్షించి ఆయన్ని దుఃఖ పెట్టారు. ఆ ప్రజలు దేవుని ఆదేశాలకు విధేయులు కాలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి మళ్లుకొన్నారు. వారు వారి తండ్రుల్లాగే ద్రోహులుగాను, అపనమ్మకస్తులుగాను ఉన్నారు. వారు మోసకరమైన విల్లులా వంకర తిరిగారు. ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి దేవునికి కోపం పుట్టించారు. దేవతల విగ్రహాలను వారు తయారు చేసి దేవునికి రోషం పుట్టించారు. దేవుడు ఇది విని చాలా కోపగించాడు. మరియు ఇశ్రాయేలీయులను దేవుడు పూర్తిగా తిరస్కరించాడు. షిలోహులో పవిత్ర గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. ఇది ప్రజల మధ్య నివసించిన దేవుని గుడారం. అప్పుడు దేవుడు ఇతర రాజ్యాలు తన ప్రజలను బంధీలుగా చేయనిచ్చాడు. దేవుని “అందమైన ఆభరణాన్ని” శత్రువులు తీసుకొన్నారు. తన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన కోపం చూపించాడు. ఆయన వారిని యుద్ధంలో చంపబడనిచ్చాడు. యువకులు చనిపోయేవరకు కాల్చబడ్డారు. పెళ్లి కావాల్సిన యువతులు పెళ్లిపాటలు ఏమి పాడలేదు. యాజకులు చంపివేయబడ్డారు. కాని విధవలు వారి కోసం ఏడ్వలేదు. త్రాగి కేకలువేసే బలాఢ్యుడైన మనిషివలె, నిద్రనుండి మేల్కొన్న మనిషివలె ప్రభువు లేచాడు. దేవుడు తన శత్రువును వెనుకకు తరిమి వారిని ఓడించాడు. దేవుడు తన శత్రువులను ఓడించి, శాశ్వతంగా వారిని అవమానించాడు. కాని యోసేపు కుటుంబాన్ని దేవుడు నిరాకరించాడు. ఎఫ్రాయిము కుటుంబాన్ని దేవుడు కోరుకోలేదు. దేవుడు యూదావారిని ఎంచుకొన్నాడు. మరియు దేవుడు తనకు ప్రియమైన సీయోను పర్వతాన్ని కోరుకొన్నాడు. ఆ పర్వతం మీద ఎత్తుగా దేవుడు తన పవిత్ర ఆలయాన్ని నిర్మించాడు. భూమిలాగే, తన పవిత్ర ఆలయం శాశ్వతంగా ఉండేటట్టు దేవుడు నిర్మించాడు. తర్వాత తన ప్రత్యేక సేవకునిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొన్నాడు. దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కాని దేవుడు అతన్ని ఆ పని నుండి తీసివేసాడు. గొర్రెలను కాపాడే పని నుండి దేవుడు దావీదును తొలగించి, తన ప్రజలను, యాకోబు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సొత్తును కాపాడే పని దావీదుకు యిచ్చాడు. మరియు దావీదు పవిత్ర హృదయంతో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. అతడు చాలా జ్ఞానంతో వారిని నడిపించాడు.

షేర్ చేయి
Read కీర్తనలు 78

కీర్తనలు 78:40-72 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అరణ్యంలో వారు ఆయన మీద అనేకసార్లు తిరుగుబాటు చేశారు, ఎడారిలో ఆయన హృదయాన్ని దుఃఖపెట్టారు. పదే పదే వారు దేవున్ని పరీక్షించారు; వారు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని బాధపెట్టారు. వారు ఆయన శక్తిని గాని, శత్రువుల నుండి వారిని విడిపించిన దినాన్ని కాని, ఆయన ఈజిప్టులో చేసిన సూచకక్రియలను, సోయను ప్రాంతంలో అద్భుతక్రియలు చూపించిన దినాన్ని వారు జ్ఞాపకం ఉంచుకోలేదు. ఆయన వారి నైలు నది కాలువలను రక్తంగా మార్చారు; వారు తమ ప్రవాహాల నుండి త్రాగలేకపోయారు. ఆయన జోరీగల గుంపులను పంపగా అవి వారిని మ్రింగివేశాయి, కప్పలు వారిని నాశనం చేశాయి. ఆయన వారి చేలను పురుగులకు, వారి పంటలను మిడతలకు అప్పగించారు. వడగండ్లతో వారి ద్రాక్షతీగెలను, మంచుతో వారి మేడిచెట్లను ఆయన నాశనం చేశారు. ఆయన వారి పశువులను వడగండ్లకు, వారి మందలను పిడుగులకు అప్పగించారు. నాశనం కలుగచేసే దూతల సేనను పంపినట్లు ఆయన వారి మీదికి తన కోపాన్ని తన ఉగ్రతను, ఆగ్రహాన్ని క్రోధాన్ని పంపారు. ఆయన తన కోపానికి మార్గాన్ని సిద్ధపరచారు; ఆయన వారిని మరణం నుండి తప్పించకుండ, వారి ప్రాణాలను తెగుళ్ళకు అప్పగించారు. ఆయన ఈజిప్టులో జ్యేష్ఠులందరిని, హాము గుడారాల్లో వారి పురుషత్వానికి గుర్తుగా ఉన్న మొదటి సంతానాన్ని చంపారు. అయితే ఆయన తన ప్రజలను గొర్రెల మందలా బయటకు తెచ్చారు; గొర్రెలను నడిపించినట్లు అరణ్యం గుండా ఆయన వారిని నడిపించారు. ఆయన వారిని క్షేమంగా నడిపించారు, కాబట్టి వారు భయం లేకుండ ఉన్నారు; సముద్రంలో వారి శత్రువులను ముంచివేశారు. ఆయన వారిని తన పవిత్ర దేశ సరిహద్దుకు, ఆయన కుడి హస్తం సంపాదించిన కొండ ప్రదేశానికి తీసుకువచ్చారు. వారి ఎదుట నుండి ఇతర దేశాలను తరిమివేసి, ఆయన వారి భూములను వారికి వారసత్వంగా కేటాయించారు; ఆయన ఇశ్రాయేలు గోత్రాలను వారి నివాసాల్లో స్థిరపరిచారు. కాని వారు దేవున్ని పరీక్షించారు మహోన్నతుని మీద తిరగబడ్డారు; వారు ఆయన శాసనాలను పాటించలేదు. వారి పూర్వికుల్లా వారు ద్రోహులు అపనమ్మకస్తులు, పనికిరాని విల్లులా నిష్ప్రయోజకులు. వారి క్షేత్రాలతో దేవునికి కోపం తెప్పించారు; వారు విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం పుట్టించారు. దేవుడు వారి కేకలు విన్నప్పుడు, ఆయన ఆగ్రహించారు; ఆయన ఇశ్రాయేలును పూర్తిగా త్రోసివేశారు. షిలోహు ప్రత్యక్ష గుడారాన్ని, మనుష్యుల మధ్య ఆయన వేసుకున్న గుడారాన్ని విడిచిపెట్టారు. ఆయన తన బలానికి సూచనగా ఉన్న మందసాన్ని బందీఖానాకు, తన వైభవాన్ని శత్రువుల చేతికి అప్పగించారు. ఆయన తన ప్రజలను ఖడ్గానికి అప్పగించారు; ఆయన తన వారసత్వం మీద ఆగ్రహించారు. అగ్ని వారి యువకులను దహించివేసింది, వారి యువతులకు పెళ్ళి పాటలు లేవు; వారి యాజకులు ఖడ్గానికి అప్పగించబడ్డారు వారి విధవరాండ్రు ఏడవలేకపోయారు. అప్పుడు నిద్ర నుండి లేచినవానిలా, ద్రాక్షారస మత్తు నుండి మేల్కొన్న యోధునిలా దేవుడు మేల్కొన్నారు. ఆయన తన శత్రువుల మీద ప్రతి దాడి చేశారు; వారికి నిత్య అవమానాన్ని కలిగించారు. అప్పుడు ఆయన యోసేపు గుడారాలను నిరాకరించారు, ఆయన ఎఫ్రాయిం గోత్రాన్ని ఏర్పరచుకోలేదు; కాని ఆయన యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సీయోను కొండనే ఎన్నుకున్నారు. ఆయన పరిశుద్ధాలయాన్ని ఆకాశమంత ఎత్తుగా, భూమిలా దృఢంగా శాశ్వతంగా నిర్మించుకున్నారు. ఆయన తన సేవకుడైన దావీదును ఎన్నుకుని, గొర్రెల దొడ్డి నుండి అతన్ని పిలిపించారు; గొర్రెలను మేపుతుండగా అతన్ని తీసుకువచ్చి తన ప్రజలైన యాకోబు మీద, తన వారసత్వమైన ఇశ్రాయేలు మీద కాపరిగా నియమించారు. దావీదు యథార్థ హృదయంతో వారిని పాలించాడు; జ్ఞానం కలవాడై వారిని నడిపించాడు.

షేర్ చేయి
Read కీర్తనలు 78