అరణ్యంలో వారు ఆయన మీద అనేకసార్లు తిరుగుబాటు చేశారు,
ఎడారిలో ఆయన హృదయాన్ని దుఃఖపెట్టారు.
పదే పదే వారు దేవున్ని పరీక్షించారు;
వారు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని బాధపెట్టారు.
వారు ఆయన శక్తిని గాని,
శత్రువుల నుండి వారిని విడిపించిన దినాన్ని కాని,
ఆయన ఈజిప్టులో చేసిన సూచకక్రియలను,
సోయను ప్రాంతంలో అద్భుతక్రియలు చూపించిన దినాన్ని వారు జ్ఞాపకం ఉంచుకోలేదు.
ఆయన వారి నైలు నది కాలువలను రక్తంగా మార్చారు;
వారు తమ ప్రవాహాల నుండి త్రాగలేకపోయారు.
ఆయన జోరీగల గుంపులను పంపగా అవి వారిని మ్రింగివేశాయి,
కప్పలు వారిని నాశనం చేశాయి.
ఆయన వారి చేలను పురుగులకు,
వారి పంటలను మిడతలకు అప్పగించారు.
వడగండ్లతో వారి ద్రాక్షతీగెలను,
మంచుతో వారి మేడిచెట్లను ఆయన నాశనం చేశారు.
ఆయన వారి పశువులను వడగండ్లకు,
వారి మందలను పిడుగులకు అప్పగించారు.
నాశనం కలుగచేసే దూతల సేనను పంపినట్లు
ఆయన వారి మీదికి తన కోపాన్ని
తన ఉగ్రతను, ఆగ్రహాన్ని క్రోధాన్ని పంపారు.
ఆయన తన కోపానికి మార్గాన్ని సిద్ధపరచారు;
ఆయన వారిని మరణం నుండి తప్పించకుండ,
వారి ప్రాణాలను తెగుళ్ళకు అప్పగించారు.
ఆయన ఈజిప్టులో జ్యేష్ఠులందరిని,
హాము గుడారాల్లో వారి పురుషత్వానికి గుర్తుగా ఉన్న మొదటి సంతానాన్ని చంపారు.
అయితే ఆయన తన ప్రజలను గొర్రెల మందలా బయటకు తెచ్చారు;
గొర్రెలను నడిపించినట్లు అరణ్యం గుండా ఆయన వారిని నడిపించారు.
ఆయన వారిని క్షేమంగా నడిపించారు,
కాబట్టి వారు భయం లేకుండ ఉన్నారు;
సముద్రంలో వారి శత్రువులను ముంచివేశారు.
ఆయన వారిని తన పవిత్ర దేశ సరిహద్దుకు,
ఆయన కుడి హస్తం సంపాదించిన కొండ ప్రదేశానికి తీసుకువచ్చారు.
వారి ఎదుట నుండి ఇతర దేశాలను తరిమివేసి,
ఆయన వారి భూములను వారికి వారసత్వంగా కేటాయించారు;
ఆయన ఇశ్రాయేలు గోత్రాలను వారి నివాసాల్లో స్థిరపరిచారు.
కాని వారు దేవున్ని పరీక్షించారు
మహోన్నతుని మీద తిరగబడ్డారు;
వారు ఆయన శాసనాలను పాటించలేదు.
వారి పూర్వికుల్లా వారు ద్రోహులు అపనమ్మకస్తులు,
పనికిరాని విల్లులా నిష్ప్రయోజకులు.
వారి క్షేత్రాలతో దేవునికి కోపం తెప్పించారు;
వారు విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం పుట్టించారు.
దేవుడు వారి కేకలు విన్నప్పుడు, ఆయన ఆగ్రహించారు;
ఆయన ఇశ్రాయేలును పూర్తిగా త్రోసివేశారు.
షిలోహు ప్రత్యక్ష గుడారాన్ని,
మనుష్యుల మధ్య ఆయన వేసుకున్న గుడారాన్ని విడిచిపెట్టారు.
ఆయన తన బలానికి సూచనగా ఉన్న మందసాన్ని బందీఖానాకు,
తన వైభవాన్ని శత్రువుల చేతికి అప్పగించారు.
ఆయన తన ప్రజలను ఖడ్గానికి అప్పగించారు;
ఆయన తన వారసత్వం మీద ఆగ్రహించారు.
అగ్ని వారి యువకులను దహించివేసింది,
వారి యువతులకు పెళ్ళి పాటలు లేవు;
వారి యాజకులు ఖడ్గానికి అప్పగించబడ్డారు
వారి విధవరాండ్రు ఏడవలేకపోయారు.
అప్పుడు నిద్ర నుండి లేచినవానిలా,
ద్రాక్షారస మత్తు నుండి మేల్కొన్న యోధునిలా దేవుడు మేల్కొన్నారు.
ఆయన తన శత్రువుల మీద ప్రతి దాడి చేశారు;
వారికి నిత్య అవమానాన్ని కలిగించారు.
అప్పుడు ఆయన యోసేపు గుడారాలను నిరాకరించారు,
ఆయన ఎఫ్రాయిం గోత్రాన్ని ఏర్పరచుకోలేదు;
కాని ఆయన యూదా గోత్రాన్ని,
తాను ప్రేమించిన సీయోను కొండనే ఎన్నుకున్నారు.
ఆయన పరిశుద్ధాలయాన్ని ఆకాశమంత ఎత్తుగా,
భూమిలా దృఢంగా శాశ్వతంగా నిర్మించుకున్నారు.
ఆయన తన సేవకుడైన దావీదును ఎన్నుకుని,
గొర్రెల దొడ్డి నుండి అతన్ని పిలిపించారు;
గొర్రెలను మేపుతుండగా అతన్ని తీసుకువచ్చి
తన ప్రజలైన యాకోబు మీద,
తన వారసత్వమైన ఇశ్రాయేలు మీద కాపరిగా నియమించారు.
దావీదు యథార్థ హృదయంతో వారిని పాలించాడు;
జ్ఞానం కలవాడై వారిని నడిపించాడు.