కీర్తనలు 69:1-4
కీర్తనలు 69:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, నన్ను కాపాడు. నా ప్రాణం మీద నీళ్ళు పొర్లి పారుతున్నాయి. లోతైన అగాధంలాంటి ఊబిలో నేను దిగబడిపోతున్నాను. నిలబడలేకుండా ఉన్నాను. లోతైన నీళ్ళలో నేను మునిగిపోయాను. వరదలు నన్ను ముంచెత్తుతున్నాయి. నేను కేకలు వేసి అలసిపోయాను, నా గొంతు ఎండిపోయింది. నా దేవుని కోసం కనిపెడుతూ ఉండగా నా కళ్ళు క్షీణించాయి. ఏ కారణం లేకుండా నా మీద పగబట్టిన వారు నా తలవెంట్రుకలకంటే ఎక్కువమంది ఉన్నారు. అకారణంగా నాకు శత్రువులై నన్ను చంపాలని చూసేవారు అనేకమంది. నేను దోచుకోని దాన్ని నేను తిరిగి ఇవ్వాల్సి వచ్చింది.
కీర్తనలు 69:1-4 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము. నా నోటి వరకు నీళ్లు లేచాయి. నిలబడి ఉండుటకు ఏదీ లేదు. నేను మునిగిపోతున్నాను. క్రింద బురదలోకి దిగజారిపోతున్నాను. లోతైనజలాల్లో నేనున్నాను. అలలు నా చుట్టూ కొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను. సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను. నా గొంతు నొప్పిగా ఉంది. నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు నేను నీ సహాయం కోసం కనిపెట్టి చూశాను. నా తలపైగల వెంట్రుకల కంటె ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు. ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు. వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు. వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు. ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు.
కీర్తనలు 69:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము. నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొఱ్ఱపెట్టుటచేత అలసియున్నాను నా గొంతుక యెండిపోయెను నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు క్షీణించిపోయెను. నిర్నిమిత్తముగా నామీద పగపట్టువారు నా తలవెండ్రుకలకంటె విస్తారముగా ఉన్నారు అబద్ధమునుబట్టి నాకుశత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు నేను దోచుకొననిదానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను.
కీర్తనలు 69:1-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
దేవా, నన్ను రక్షించండి, నీళ్లు నా మెడ వరకు పొంగి వచ్చాయి. లోతైన ఊబిలో నేను దిగబడిపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను. నేను అగాధ జలాల్లో ఉన్నాను; వరదలు నన్ను ముంచేస్తున్నాయి. సాయం కోసం అరిచి అలసిపోయాను; నా గొంతు ఆరిపోయింది. నా దేవుని కోసం చూస్తూ, నా కళ్లు క్షీణిస్తున్నాయి. నిష్కారణంగా నన్ను ద్వేషించేవారు నా తలవెంట్రుకల కన్నా ఎక్కువగా ఉన్నారు. నాకు చాలామంది శత్రువులు ఉన్నారు, వారు నిష్కారణంగా నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. నేను దొంగతనం చేయని దానిని నేను బలవంతంగా తిరిగి ఇవ్వవలసి వచ్చింది.