కీర్తనలు 33:6-9
కీర్తనలు 33:6-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా మాటతో ఆకాశాలు చేయబడ్డాయి, ఆయన నోటి శ్వాసతో నక్షత్ర కూటమి కలిగింది. ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూర్చుతారు; అగాధాలను ఆయన గోదాములలో ఉంచుతారు. భూమంతా యెహోవాకు భయపడును గాక; లోక ప్రజలందరు ఆయనను గౌరవించుదురు గాక. ఆయన మాట్లాడారు అది జరిగింది; ఆయన ఆజ్ఞాపించారు అది దృఢంగా నిలబడింది.
కీర్తనలు 33:6-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా తన నోటి మాట వల్ల ఆకాశాలను చేశాడు. తన నోటి శ్వాస చేత నక్షత్రాలను చేశాడు. ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూరుస్తాడు. మహా సముద్ర జలాలను గిడ్డంగిలో నిలవ చేస్తాడు. భూలోకం అంతా యెహోవాకు భయపడాలి. లోకంలో నివసించే వాళ్ళంతా యెహోవా పట్ల భయభీతులు కలిగి విస్మయం చెందాలి. ఆయన మాట పలికాడు. ఆ మాట ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించాడు. అది స్థిరంగా నిలిచింది.
కీర్తనలు 33:6-9 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది. భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది. సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు. మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు. భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి. ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి. ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది. ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
కీర్తనలు 33:6-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.