కీర్తనలు 33:12-22
కీర్తనలు 33:12-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవాను దేవునిగా కలిగిన దేశం ధన్యమైనది. తన వారసత్వంగా ఆయన తన కోసం ఎంచుకున్న ప్రజలు ధన్యులు. ఆకాశం నుండి యెహోవా క్రిందకు చూస్తున్నారు ఆయన మనుష్యులందరిని కనిపెడుతున్నారు. ఆయన తన నివాసస్థలం నుండి భూమిపై నివసించే వారందరినీ పరిశీలిస్తున్నారు. అందరి హృదయాలను రూపించింది ఆయనే, వారు చేసే ప్రతిదీ ఆయన గమనిస్తారు. ఏ రాజు తన సైనిక బలంతో రక్షించబడడు; ఏ యోధుడు తన గొప్ప శక్తితో తప్పించుకోడు. విడుదల పొందడానికి గుర్రం ఉపయోగపడదు; దానికి గొప్ప బలం ఉన్నా అది ఎవరిని రక్షించలేదు. కానీ యెహోవా కళ్లు ఆయనకు భయపడే వారిపైన, తన మారని ప్రేమలో ఆశ పెట్టుకున్న వారిపైన ఉన్నాయి. ఆయన మరణం నుండి వారి ప్రాణాన్ని తప్పిస్తారు, కరువు సమయంలో వారిని సజీవులుగా ఉంచుతారు. మనం నిరీక్షణ కలిగి యెహోవా కోసం వేచి ఉందాం; మనకు సహాయం మనకు డాలు ఆయనే. మన హృదయాలు ఆయనలో ఆనందిస్తాయి, ఎందుకంటే మనం ఆయన పరిశుద్ధ నామాన్ని నమ్ముకున్నాము. యెహోవా, మేము మా నిరీక్షణ మీలో ఉంచాం కాబట్టి, యెహోవా, మీ మారని ప్రేమ మాతో ఉండును గాక.
కీర్తనలు 33:12-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా ఏ ప్రజలకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజలు ధన్యజీవులు. తనకు సొత్తుగా ఆయన ఎంచుకున్న జనం ధన్యజీవులు. ఆకాశం నుండి యెహోవా చూస్తున్నాడు. ఆయన మనుషులందర్నీ పరికించి చూస్తున్నాడు. తాను నివాసమున్న చోటు నుండి ఆయన భూమిపై నివసిస్తున్న వాళ్ళందర్నీ చూస్తున్నాడు. అందరి హృదయాలనూ మలచిన వాడు వాళ్ళు చేసే పనులన్నిటినీ గమనిస్తున్నాడు. ఏ రాజూ తనకున్న అపారమైన సైన్యం వల్ల రక్షణ పొందలేడు. యోధుడు తనకున్న గొప్ప శక్తి వల్ల తనను తాను రక్షించుకోలేడు. గుర్రం విజయానికి పూచీ కాదు. దానికి గొప్ప శక్తి ఉన్నప్పటికీ అది ఎవర్నీ రక్షించలేదు. చూడండి, వాళ్ళ ప్రాణాలను మరణం నుండి తప్పించడానికీ, కరువులో వాళ్ళను సజీవులుగా నిలబెట్టడానికీ, యెహోవా పట్ల భయభక్తులుగల వాళ్ళ పైనా నిబంధన పట్ల ఆయనకున్న నిబద్ధతపై ఆధారపడే వాళ్ల పైనా ఆయన కనుచూపు నిలిచి ఉంది. మనం యెహోవా కోసం వేచి చూస్తున్నాం. మన సహాయమూ భద్రతా ఆయనే. మన హృదయాలు ఆయనలో ఆనందిస్తున్నాయి. ఆయన పవిత్ర నామంపై మన నమ్మకం ఉంది. యెహోవా, ఆశగా నీవైపు చూస్తున్నాం. నీ నిబంధన నిబద్ధత మాపై ఉండనియ్యి.
కీర్తనలు 33:12-22 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు. దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు. యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు. మనుష్యులందరిని ఆయన చూశాడు. భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు. ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు. ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు. ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు. ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు. యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు. తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు. యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు, ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది. ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే. ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు. అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము. ఆయన మనకు సహాయం, మన డాలు. దేవుడు నన్ను సంతోషపరుస్తాడు, నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను. యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము. కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.
కీర్తనలు 33:12-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు. తానున్న నివాసస్థలములోనుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు. రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు. వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారిమీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధనామమందు నమ్మిక యుంచియున్నాము. ఆయననుబట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు. యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీదనుండును గాక.