కీర్తనలు 33:1-11

కీర్తనలు 33:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నీతిపరులారా, యెహోవాలో ఆనందించండి. న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు స్తుతించడం యుక్తమైనది. వీణలు మోగించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. పది తీగెలున్న వాయిద్యంతో ఆయనకు స్తుతులు పాడండి. ఆయనను గూర్చి ఒక కొత్త పాట పాడండి. నైపుణ్యంతో కమ్మగా వాయిస్తూ సంతోషాతిరేకంతో పాడండి. ఎందుకంటే యెహోవా వాక్కు న్యాయబద్ధమైనది. ఆయన చేసే ప్రతిదీ న్యాయమే. ఆయన నీతినీ న్యాయాన్నీ ప్రేమిస్తాడు. నిబంధన పట్ల యెహోవాకు ఉన్న విశ్వసనీయతతో లోకం నిండి ఉంది. యెహోవా తన నోటి మాట వల్ల ఆకాశాలను చేశాడు. తన నోటి శ్వాస చేత నక్షత్రాలను చేశాడు. ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూరుస్తాడు. మహా సముద్ర జలాలను గిడ్డంగిలో నిలవ చేస్తాడు. భూలోకం అంతా యెహోవాకు భయపడాలి. లోకంలో నివసించే వాళ్ళంతా యెహోవా పట్ల భయభీతులు కలిగి విస్మయం చెందాలి. ఆయన మాట పలికాడు. ఆ మాట ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించాడు. అది స్థిరంగా నిలిచింది. దేశాల మధ్య మైత్రిని యెహోవా నిష్ఫలం చేస్తాడు. జనాల ప్రణాళికలను ఆయన రద్దు చేస్తాడు. యెహోవా ప్రణాళికలు నిత్యమూ అమలవుతాయి. ఆయన తన హృదయంలో అన్ని తరాల కోసం ఆలోచనలు చేస్తాడు.

షేర్ చేయి
Read కీర్తనలు 33

కీర్తనలు 33:1-11 పవిత్ర బైబిల్ (TERV)

మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి. నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి. సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి. యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి. ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి. ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి. దేవుని మాట సత్యం! ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును. నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు. యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు. యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది. భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది. సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు. మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు. భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి. ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి. ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది. ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది. జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు. వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు. అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది. ఆయన తలంపులు తర తరాలకు మంచివి.

షేర్ చేయి
Read కీర్తనలు 33

కీర్తనలు 33:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీతిమంతులారా, యెహోవానుబట్టి ఆనంద గానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయననుగూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును.

షేర్ చేయి
Read కీర్తనలు 33

కీర్తనలు 33:1-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

నీతిమంతులారా, యెహోవాకు ఆనందంతో పాడండి; ఆయనను స్తుతించడం యథార్థవంతులకు తగినది. సితారాతో యెహోవాను స్తుతించండి; పది తంతుల వీణతో ఆయనను కీర్తించండి. ఆయనకు క్రొత్త పాట పాడండి; నైపుణ్యతతో వాయించండి, ఆనందంతో కేకలు వేయండి. యెహోవా వాక్కు న్యాయమైనది; ఆయన చేసే ప్రతిదీ నమ్మకమైనది. యెహోవా నీతిన్యాయాలను ప్రేమిస్తారు; భూమంతా ఆయన మారని ప్రేమతో నిండిపోయింది. యెహోవా మాటతో ఆకాశాలు చేయబడ్డాయి, ఆయన నోటి శ్వాసతో నక్షత్ర కూటమి కలిగింది. ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూర్చుతారు; అగాధాలను ఆయన గోదాములలో ఉంచుతారు. భూమంతా యెహోవాకు భయపడును గాక; లోక ప్రజలందరు ఆయనను గౌరవించుదురు గాక. ఆయన మాట్లాడారు అది జరిగింది; ఆయన ఆజ్ఞాపించారు అది దృఢంగా నిలబడింది. యెహోవా దేశాల ప్రణాళికలను విఫలం చేస్తారు; ప్రజల ఉద్దేశాలను ఆయన అడ్డుకుంటారు. కానీ యెహోవా ప్రణాళికలు శాశ్వతంగా నిలుస్తాయి, ఆయన హృదయ ఉద్దేశాలు అన్ని తరాల వరకు ఉంటాయి.

షేర్ చేయి
Read కీర్తనలు 33