కీర్తనలు 119:129-144

కీర్తనలు 119:129-144 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నీ శాసనాలు ఆశ్చర్యకరమైనవి. అందుకే నేను వాటిని పాటిస్తున్నాను. నీ వాక్కులు వెల్లడి కావడంతోనే వెలుగు ఉదయిస్తుంది. అవి తెలివిలేని వారికి తెలివినిస్తాయి. నీ ఆజ్ఞలపట్ల తీవ్ర వాంఛ చేత నేను నోరు తెరచి వగరుస్తూ ఉన్నాను. నీ నామాన్ని ప్రేమించేవారికి నీవు చేసే విధంగా నావైపు తిరిగి నన్ను కరుణించు. నీ వాక్కునుబట్టి నా అడుగులు స్థిరపరచు. ఏ పాపం నన్ను ఏలనియ్యకు. నీ ఉపదేశాలను నేను అనుసరించేలా మనుష్యుల బలాత్కారం నుండి నన్ను విడిపించు. నీ సేవకుడి పై నీ ముఖకాంతి ప్రకాశింపనియ్యి. నీ కట్టడలను నాకు బోధించు. ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించక పోవడం చూసి నేను కన్నీరుమున్నీరైపోతున్నాను. యెహోవా, నీవు నీతిమంతుడివి. నీ న్యాయవిధులు యథార్థం. నీతినిబట్టి, పూర్ణ విశ్వాస్యతనుబట్టి, నీ శాసనాలను నీవు నియమించావు. నా విరోధులు నీ వాక్కులు మరచిపోతారు. అందువలన నా ఆసక్తి నన్ను తినేస్తున్నది. నీ మాట ఎంతో స్వచ్ఛమైనది. అది నీ సేవకుడికి ప్రియమైనది. నేను అల్పుణ్ణి. నిరాకరణకు గురి అయిన వాణ్ణి. అయినా నీ ఉపదేశాలను నేను మరువను. నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం. బాధ, వేదన నన్ను పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నీ శాసనాలు శాశ్వత నీతిగలవి. నేను బ్రతికేలా నాకు తెలివి దయచెయ్యి.

షేర్ చేయి
Read కీర్తనలు 119

కీర్తనలు 119:129-144 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా, నీ ఒడంబడిక అద్భుతం, అందుకే నేను దానిని అనుసరిస్తాను. ప్రజలు నీ మాట గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది వారికి సరైన జీవన విధానాన్ని చూపెట్టి దీపంలా ఉంటుంది. నీ మాట తెలివితక్కువ జనులను కూడా తెలివిగల వారినిగా చేస్తుంది. యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానించాలని కోరుతున్నాను. నేను కష్టంగా ఊపిరి పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా ఉన్నాను. దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ చూపించుము. నీ నామమును ప్రేమించే వారికి సరియైనవి ఏవో వాటిని చేయుము. యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించుము. నాపై ఏ దుష్టత్వమూ అధికారం చేయనీయవద్దు. యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము. నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను. యెహోవా, నీ సేవకుని అంగీకరించి నీ న్యాయచట్టాలు నేర్పించుము. ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల నదిలా నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను. యెహోవా, నీవు మంచివాడవు. నీ చట్టాలు న్యాయమైనవి. ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి. యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము. నా ఉత్సాహం నాలో కృంగిపోయినది. ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు. యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది. అదంటే నాకు ప్రేమ. నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు. కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను. యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది. నీ ఉపదేశాలు నమ్మదగినవి. నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి. కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము. నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది. నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.

షేర్ చేయి
Read కీర్తనలు 119

కీర్తనలు 119:129-144 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము. నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలాత్కారమునుండి నన్ను విమోచిం పుము. నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పెట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.

షేర్ చేయి
Read కీర్తనలు 119

కీర్తనలు 119:129-144 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

మీ శాసనాలు అద్భుతం; కాబట్టి నేను వాటికి లోబడతాను. మీ వాక్కులు వెల్లడి అవడంతోనే వెలుగు ప్రకాశిస్తుంది. అది సామాన్యులకు గ్రహింపునిస్తుంది. మీ ఆజ్ఞల కోసం ఆరాటపడుతూ, నేను నా నోరు తెరిచి రొప్పుతున్నాను. మీ పేరును ఇష్టపడేవారికి మీరు ఎప్పుడూ చేసినట్టు, నా వైపు తిరిగి నాపై దయచూపండి. మీ వాక్కు ప్రకారం నా అడుగుజాడలను నిర్దేశించండి; ఏ దుష్టత్వం నన్ను ఏలకుండును గాక. నేను మీ కట్టడలకు లోబడేలా, మనుష్యుల దౌర్జన్యం నుండి విడిపించండి. మీ సేవకుడి మీద మీ ముఖకాంతిని ప్రకాశింపనివ్వండి మీ శాసనాలను నాకు బోధించండి. ప్రజలు మీ ధర్మశాస్త్రానికి లోబడకపోవడం చూసి, నా కళ్ల నుండి కన్నీరు ప్రవహిస్తుంది. యెహోవా, మీరు నీతిమంతులు, మీ న్యాయవిధులు యథార్థమైనవి. మీరు విధించిన శాసనాలు నీతియుక్తమైనవి; అవి పూర్తిగా నమ్మదగినవి. నా శత్రువులు మీ మాటలను విస్మరిస్తారు కాబట్టి, నా ఆసక్తి నన్ను తినేస్తుంది. మీ వాగ్దానాలు పూర్తిగా పరీక్షించబడ్డాయి, మీ సేవకుడు వాటిని ప్రేమిస్తాడు. నేను అల్పుడనైనా, తృణీకరించబడినా, నేను మీ కట్టడలు మరచిపోను. మీ నీతి శాశ్వతమైనది మీ ధర్మశాస్త్రం సత్యమైనది. ఇబ్బంది, బాధ నా మీదికి వచ్చాయి, కాని మీ ఆజ్ఞలు నాకు ఆనందాన్ని ఇస్తాయి. మీ శాసనాలు ఎల్లప్పుడు నీతియుక్తమైనవి; నేను బ్రతికేలా నాకు గ్రహింపు ఇవ్వండి.

షేర్ చేయి
Read కీర్తనలు 119