కీర్తనలు 119:129-144

కీర్తనలు 119:129-144 TSA

మీ శాసనాలు అద్భుతం; కాబట్టి నేను వాటికి లోబడతాను. మీ వాక్కులు వెల్లడి అవడంతోనే వెలుగు ప్రకాశిస్తుంది. అది సామాన్యులకు గ్రహింపునిస్తుంది. మీ ఆజ్ఞల కోసం ఆరాటపడుతూ, నేను నా నోరు తెరిచి రొప్పుతున్నాను. మీ పేరును ఇష్టపడేవారికి మీరు ఎప్పుడూ చేసినట్టు, నా వైపు తిరిగి నాపై దయచూపండి. మీ వాక్కు ప్రకారం నా అడుగుజాడలను నిర్దేశించండి; ఏ దుష్టత్వం నన్ను ఏలకుండును గాక. నేను మీ కట్టడలకు లోబడేలా, మనుష్యుల దౌర్జన్యం నుండి విడిపించండి. మీ సేవకుడి మీద మీ ముఖకాంతిని ప్రకాశింపనివ్వండి మీ శాసనాలను నాకు బోధించండి. ప్రజలు మీ ధర్మశాస్త్రానికి లోబడకపోవడం చూసి, నా కళ్ల నుండి కన్నీరు ప్రవహిస్తుంది. యెహోవా, మీరు నీతిమంతులు, మీ న్యాయవిధులు యథార్థమైనవి. మీరు విధించిన శాసనాలు నీతియుక్తమైనవి; అవి పూర్తిగా నమ్మదగినవి. నా శత్రువులు మీ మాటలను విస్మరిస్తారు కాబట్టి, నా ఆసక్తి నన్ను తినేస్తుంది. మీ వాగ్దానాలు పూర్తిగా పరీక్షించబడ్డాయి, మీ సేవకుడు వాటిని ప్రేమిస్తాడు. నేను అల్పుడనైనా, తృణీకరించబడినా, నేను మీ కట్టడలు మరచిపోను. మీ నీతి శాశ్వతమైనది మీ ధర్మశాస్త్రం సత్యమైనది. ఇబ్బంది, బాధ నా మీదికి వచ్చాయి, కాని మీ ఆజ్ఞలు నాకు ఆనందాన్ని ఇస్తాయి. మీ శాసనాలు ఎల్లప్పుడు నీతియుక్తమైనవి; నేను బ్రతికేలా నాకు గ్రహింపు ఇవ్వండి.