సామెతలు 3:21-26
సామెతలు 3:21-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు. పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.
సామెతలు 3:21-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కుమారా, లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని పదిలం చేసుకో. వాటిని నీ మనసులో నుండి తొలగి పోనివ్వకు. జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి. అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు. పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు. అకస్మాత్తుగా భయం వేస్తే కలవరపడకు. దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు అది చూసి నువ్వు భయపడవద్దు. యెహోవాయే నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఊబిలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు.
సామెతలు 3:21-26 పవిత్ర బైబిల్ (TERV)
నా కుమారుడా, నీ జ్ఞానము, వివేకాన్ని భద్రంగా ఉంచుకో. వీటిని పోగొట్టుకోవద్దు. జ్ఞానము, వివేకము నీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. అప్పుడు నీవు క్షేమంగా జీవిస్తావు, నీవు పడిపోకుండా ఉంటావు. నీవు పండుకొనునప్పుడు నీవు భయపడవు. నీవు విశ్రాంతి తీసుకొనునప్పుడు నీ నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. నీకు ఆకస్మికంగా సంభవించబోయేవాటిని గూర్చి భయపడకు. ఎందుకంటే యెహోవా నీతో ఉన్నాడు. ఆయన నిన్ను క్షేమంగా ఉంచుతాడు. మరియు ఆ చెడ్డ విషయాలు చెడ్డ మనుష్యులకే సంభవిస్తాయి.
సామెతలు 3:21-26 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నా కుమారుడా, జ్ఞానాన్ని వివేకాన్ని నీ దగ్గర భద్రంగా చూచుకో, వాటిని నీ కళ్ళెదుట నుండి తొలగిపోనివ్వకు; అవి నీకు జీవంగా, నీ మెడకు అలంకార ఆభరణంగా ఉంటాయి. అప్పుడు నీ మార్గంలో నీవు క్షేమంగా నడుస్తావు, నీ పాదం తడబడదు. నీవు పడుకున్నప్పుడు, భయపడవు; నీవు పడుకున్నప్పుడు, నీ నిద్ర మధురంగా ఉంటుంది. హఠాత్తుగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవు. యెహోవా నీ ప్రక్కన ఉంటారు, నీ పాదాలు వలలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతారు.