సామెతలు 3

3
జ్ఞానపు దీవెన
1నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోకు. నీవు చేయాలని నేను చెప్పిన సంగతులు జ్ఞాపకం ఉంచుకో. 2నీకు నేను నేర్పిస్తున్న ఈ సంగతులు నీకు సుదీర్గమైన సంతోష జీవితాన్ని ఇస్తాయి.
3ప్రేమించటం ఎన్నటికీ చాలించకు. ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండు. ఈ విషయాలను నీ జీవితంలో ఒక భాగంగా ఎంచుకో. వాటిని నీ మెడ చుట్టూ కట్టుకో. వాటిని నీ హృదయం మీద వ్రాసుకో. 4అప్పుడు దేవుని దృష్టియందును, మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవనిపించుకొందువు.
5పూర్తిగా యెహోవాను నమ్ముకో! నీ స్వంత తెలివి మీద ఆధారపడవద్దు. 6నీవు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచు. అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. 7నీ స్వంత జ్ఞానం మీద ఆధార పడవద్దు. కాని యెహోవాను గౌరవించి, దుర్మార్గానికి దూరంగా ఉండు. 8నీవు ఇలా చేస్తే, అప్పుడు నీ శరీరానికి మంచి ఆరోగ్యమునూ నీ ఎముకలకు సత్తువా కలుగుతుంది.
9నీ ఆరోగ్యంతో యెహోవాను ఘనపరచు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఆయనకు ఇమ్ము. 10అప్పుడు నీకు కావలసినవి అన్నీ నీకు ఉంటాయి. నీ కొట్టాలు ధాన్యంతో నిండి ఉంటాయి, నీ పీపాల్లో ద్రాక్షారసం పొర్లుతూ ఉంటుంది.
11నా కుమారుడా, నీవు తప్పు చేస్తున్నావని కొన్ని సార్లు యెహోవా నీకు చూపిస్తాడు. కాని ఈ శిక్షను గూర్చి కోపించకు. దాని నుండి నేర్చు కొనేందుకు ప్రయత్నించు. 12ఎందుకంటే, యెహోవా తాను ప్రేమించే మనుష్యులను ఆయన సరిచేస్తాడు. అవును, తాను ప్రేమించే కుమారుని శిక్షించే ఒక తండ్రిలాంటివాడు దేవుడు.
13జ్ఞానమును సంపాదించి చాలా సంతోషంగా ఉంటాడు. ఆ మనిషి అర్థం చేసుకోవటం మొదలు పెట్టినప్పుడు అతడు ధన్యుడు. 14జ్ఞానము మూలంగా వచ్చే లాభం వెండి కంటే మంచిది. జ్ఞానము మూలంగా వచ్చే లాభం మంచి బంగారం కంటే మేలు. 15జ్ఞానము నగల కంటే ఎంతో ఎక్కువ విలువ గలది. నీవు కోరుకో దగినది ఏదీ జ్ఞానము అంతటి విలువ గలది కాదు!
16జ్ఞానము సుదీర్గ జీవితాన్ని, ఐశ్వర్యాల్ని, ఘనతలను నీకు ఇస్తుంది. 17జ్ఞానముగల మనుష్యులు శాంతి, సంతోషం, కలిగి జీవిస్తారు. 18జ్ఞానము జీవవృక్షంలా ఉంటుంది. దానిని స్వీకరించే వారికి అది నిండు జీవితాన్ని ఇస్తుంది. జ్ఞానమును కలిగినవారు నిజంగా సంతోషంగా ఉంటారు.
19భూమిని చేయుటకు యెహోవా తన తెలివిని ఉపయోగించాడు. ఆకాశాలను చేయుటకు యెహోవా తెలివి ఉపయోగించాడు. 20నీళ్లను చేయుటకు యెహోవా తెలివి ప్రయోగించాడు. ఆయన జ్ఞానము ద్యారా ఆకాశాలు వర్షాన్ని కురిపిస్తాయి.
21నా కుమారుడా, నీ జ్ఞానము, వివేకాన్ని భద్రంగా ఉంచుకో. వీటిని పోగొట్టుకోవద్దు. 22జ్ఞానము, వివేకము నీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. 23అప్పుడు నీవు క్షేమంగా జీవిస్తావు, నీవు పడిపోకుండా ఉంటావు. 24నీవు పండుకొనునప్పుడు నీవు భయపడవు. నీవు విశ్రాంతి తీసుకొనునప్పుడు నీ నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. 25-26నీకు ఆకస్మికంగా సంభవించబోయేవాటిని గూర్చి భయపడకు. ఎందుకంటే యెహోవా నీతో ఉన్నాడు. ఆయన నిన్ను క్షేమంగా ఉంచుతాడు. మరియు ఆ చెడ్డ విషయాలు చెడ్డ మనుష్యులకే సంభవిస్తాయి.
27మేలు చేయుట నీచేతనైనప్పుడు దాన్ని పొందదగినవారికి చేయకుండా వెనుదీయకుము. 28నీ పొరుగు వాడు అతని స్వంత వస్తువులను తిరిగి ఇచ్చి వేయుమని నిన్ను అడిగితే వాటిని అప్పుడే అతనికి ఇచ్చివేయుము. “తిరిగి రేపు రమ్మని” అతనితో చెప్పవద్దు.
29నీ పొరుగువాడు నీతో శాంతియుతంగా జీవిస్తున్నాడు, గనుక అతనికి విరోధంగా కీడు తల పెట్టవద్దు.
30మరో వ్యక్తి నీ యెడల ఎలాంటి తప్పూ చేయకపోతే అతనిని న్యాయస్థానానికి తీసుకొని పోవద్దు.
31కొంతమంది మనుష్యులు తేలికగా కోపం తెచ్చుకొని వెంటనే కీడు చేస్తారు. వారు జీవించే విధంగా జీవించకు. 32ఎందుకంటే దుర్మార్గులను యెహోవా ద్వేషిస్తాడు. కాని సక్రమంగా జీవించే ప్రజలను యెహోవా బలపరుస్తాడు.
33దుర్మార్గుల కుటుంబాలకు యెహోవా విరోధంగా ఉంటాడు. కాని సక్రమంగా జీవించే వారి కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు.
34ఒక వేళ ఒక వ్యక్తి గర్వించి, ఇతరులకంటే అతడే మంచివాడని తలచి, హేళన చేస్తే యెహోవా అతనిని శిక్షించి, అతని గూర్చి హేళన చేస్తాడు. కాని దీనులకు యెహోవా సహాయం చేస్తాడు.
35జ్ఞానముగల మనుష్యులు దేవుణ్ణి వెంబడిస్తారు. జ్ఞానముగల మనుష్యులను యెహోవా ఘనపరుస్తాడు. బుద్దిహీనులు దేవుణ్ణి వెంబడించరు. బుద్దిహీనులు అవమానించబడతారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సామెతలు 3: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి