సామెతలు 3:1-6
సామెతలు 3:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు. అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి. అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో. అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు. నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో. ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.
సామెతలు 3:1-6 పవిత్ర బైబిల్ (TERV)
నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోకు. నీవు చేయాలని నేను చెప్పిన సంగతులు జ్ఞాపకం ఉంచుకో. నీకు నేను నేర్పిస్తున్న ఈ సంగతులు నీకు సుదీర్గమైన సంతోష జీవితాన్ని ఇస్తాయి. ప్రేమించటం ఎన్నటికీ చాలించకు. ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండు. ఈ విషయాలను నీ జీవితంలో ఒక భాగంగా ఎంచుకో. వాటిని నీ మెడ చుట్టూ కట్టుకో. వాటిని నీ హృదయం మీద వ్రాసుకో. అప్పుడు దేవుని దృష్టియందును, మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవనిపించుకొందువు. పూర్తిగా యెహోవాను నమ్ముకో! నీ స్వంత తెలివి మీద ఆధారపడవద్దు. నీవు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచు. అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు.
సామెతలు 3:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవునిదృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
సామెతలు 3:1-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోవద్దు, నా ఆజ్ఞలను నీ హృదయంలో భద్రపరచుకో, అవి నీ జీవితకాలాన్ని అనేక సంవత్సరాలు పొడిగిస్తాయి, నీకు సమాధానాన్ని వృద్ధిని కలిగిస్తాయి. ప్రేమ, నమ్మకత్వం ఎన్నడు నిన్ను విడచిపోనివ్వకు; నీ మెడలో వాటిని ధరించుకో, నీ హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకో. అప్పుడు నీవు దేవుని దృష్టిలోను మనుష్యుల దృష్టిలోను దయపొంది మంచివాడవని అనిపించుకుంటావు. నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు; నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు, అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్నగా చేస్తారు.