సామెతలు 3:1-35
సామెతలు 3:1-35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు. అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి. అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో. అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు. నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో. ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు. నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు. అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి. యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు. అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పారుతుంది. కుమారా, యెహోవా బోధను తిరస్కరించకు. ఆయన గద్దించినప్పుడు విసుగు తెచ్చుకోకు. ఒక తండ్రి తన ప్రియమైన కొడుకును ఎలా గద్దిస్తాడో అలాగే యెహోవా తాను ప్రేమించే వాళ్ళను గద్దిస్తాడు. జ్ఞానం సంపాదించుకుని, వివేకం కలిగి ఉన్న మనిషి ధన్యుడు. వెండి వలన పొందే లాభం కన్నా జ్ఞానం సంపాదించుకోవడం మంచిది. మేలిమి బంగారం సంపాదించుకోవడం కన్నా జ్ఞానం వలన లాభం పొందడం ఉత్తమం. రత్నాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. అది నీకు ఇష్టమైన అన్ని వస్తువుల కంటే విలువైనది. జ్ఞానం కుడి చేతిలో సుదీర్ఘమైన ఆయుష్షు, ఎడమ చేతిలో సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అది నడిపించే దారులు రమ్యమైనవి. దాని విధానాలు క్షేమం కలిగించేవి. దాన్ని అనుసరించే వాళ్ళకు అది జీవఫలాలిచ్చే వృక్షం. దాన్ని అలవరచుకునే వాళ్ళు ధన్యజీవులు. తన జ్ఞానంతో యెహోవా భూమిని సృష్టించాడు. వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరచాడు. ఆయన తెలివివల్ల జలరాసులు అగాథం నుండి ప్రవహిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు మంచు బిందువులు కురిపిస్తున్నాయి. కుమారా, లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని పదిలం చేసుకో. వాటిని నీ మనసులో నుండి తొలగి పోనివ్వకు. జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి. అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు. పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు. అకస్మాత్తుగా భయం వేస్తే కలవరపడకు. దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు అది చూసి నువ్వు భయపడవద్దు. యెహోవాయే నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఊబిలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేయడానికి వెనకడుగు వెయ్యవద్దు. నీ పొరుగువాడు కోరినది నీ దగ్గర ఉంటే “రేపు ఇస్తాను పోయి రా” అనవద్దు. నీ పొరుగువాడు నీ దగ్గర భయం ఏమీ లేకుండా జీవిస్తున్నప్పుడు అతనికి కీడు తలపెట్టవద్దు. నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా పోట్లాడవద్దు. దౌర్జన్యం చేసేవాణ్ణి చూసి అసూయ పడవద్దు. వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలని ఏమాత్రం కోరుకోవద్దు. కుటిల బుద్ధి గలవాణ్ణి యెహోవా అసహ్యించుకుంటాడు. నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు. దుర్మార్గుల ఇళ్ళ మీదికి యెహోవా శాపాలు పంపిస్తాడు. నీతిమంతులు నివసించే స్థలాలను ఆయన దీవిస్తాడు. ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు. జ్ఞానం గలవారు పేరుప్రతిష్టలు సంపాదించుకుంటారు. జ్ఞానం లేనివాళ్ళు అవమానాలకు గురౌతారు.
సామెతలు 3:1-35 పవిత్ర బైబిల్ (TERV)
నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోకు. నీవు చేయాలని నేను చెప్పిన సంగతులు జ్ఞాపకం ఉంచుకో. నీకు నేను నేర్పిస్తున్న ఈ సంగతులు నీకు సుదీర్గమైన సంతోష జీవితాన్ని ఇస్తాయి. ప్రేమించటం ఎన్నటికీ చాలించకు. ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండు. ఈ విషయాలను నీ జీవితంలో ఒక భాగంగా ఎంచుకో. వాటిని నీ మెడ చుట్టూ కట్టుకో. వాటిని నీ హృదయం మీద వ్రాసుకో. అప్పుడు దేవుని దృష్టియందును, మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవనిపించుకొందువు. పూర్తిగా యెహోవాను నమ్ముకో! నీ స్వంత తెలివి మీద ఆధారపడవద్దు. నీవు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచు. అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ స్వంత జ్ఞానం మీద ఆధార పడవద్దు. కాని యెహోవాను గౌరవించి, దుర్మార్గానికి దూరంగా ఉండు. నీవు ఇలా చేస్తే, అప్పుడు నీ శరీరానికి మంచి ఆరోగ్యమునూ నీ ఎముకలకు సత్తువా కలుగుతుంది. నీ ఆరోగ్యంతో యెహోవాను ఘనపరచు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఆయనకు ఇమ్ము. అప్పుడు నీకు కావలసినవి అన్నీ నీకు ఉంటాయి. నీ కొట్టాలు ధాన్యంతో నిండి ఉంటాయి, నీ పీపాల్లో ద్రాక్షారసం పొర్లుతూ ఉంటుంది. నా కుమారుడా, నీవు తప్పు చేస్తున్నావని కొన్ని సార్లు యెహోవా నీకు చూపిస్తాడు. కాని ఈ శిక్షను గూర్చి కోపించకు. దాని నుండి నేర్చు కొనేందుకు ప్రయత్నించు. ఎందుకంటే, యెహోవా తాను ప్రేమించే మనుష్యులను ఆయన సరిచేస్తాడు. అవును, తాను ప్రేమించే కుమారుని శిక్షించే ఒక తండ్రిలాంటివాడు దేవుడు. జ్ఞానమును సంపాదించి చాలా సంతోషంగా ఉంటాడు. ఆ మనిషి అర్థం చేసుకోవటం మొదలు పెట్టినప్పుడు అతడు ధన్యుడు. జ్ఞానము మూలంగా వచ్చే లాభం వెండి కంటే మంచిది. జ్ఞానము మూలంగా వచ్చే లాభం మంచి బంగారం కంటే మేలు. జ్ఞానము నగల కంటే ఎంతో ఎక్కువ విలువ గలది. నీవు కోరుకో దగినది ఏదీ జ్ఞానము అంతటి విలువ గలది కాదు! జ్ఞానము సుదీర్గ జీవితాన్ని, ఐశ్వర్యాల్ని, ఘనతలను నీకు ఇస్తుంది. జ్ఞానముగల మనుష్యులు శాంతి, సంతోషం, కలిగి జీవిస్తారు. జ్ఞానము జీవవృక్షంలా ఉంటుంది. దానిని స్వీకరించే వారికి అది నిండు జీవితాన్ని ఇస్తుంది. జ్ఞానమును కలిగినవారు నిజంగా సంతోషంగా ఉంటారు. భూమిని చేయుటకు యెహోవా తన తెలివిని ఉపయోగించాడు. ఆకాశాలను చేయుటకు యెహోవా తెలివి ఉపయోగించాడు. నీళ్లను చేయుటకు యెహోవా తెలివి ప్రయోగించాడు. ఆయన జ్ఞానము ద్యారా ఆకాశాలు వర్షాన్ని కురిపిస్తాయి. నా కుమారుడా, నీ జ్ఞానము, వివేకాన్ని భద్రంగా ఉంచుకో. వీటిని పోగొట్టుకోవద్దు. జ్ఞానము, వివేకము నీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. అప్పుడు నీవు క్షేమంగా జీవిస్తావు, నీవు పడిపోకుండా ఉంటావు. నీవు పండుకొనునప్పుడు నీవు భయపడవు. నీవు విశ్రాంతి తీసుకొనునప్పుడు నీ నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. నీకు ఆకస్మికంగా సంభవించబోయేవాటిని గూర్చి భయపడకు. ఎందుకంటే యెహోవా నీతో ఉన్నాడు. ఆయన నిన్ను క్షేమంగా ఉంచుతాడు. మరియు ఆ చెడ్డ విషయాలు చెడ్డ మనుష్యులకే సంభవిస్తాయి. మేలు చేయుట నీచేతనైనప్పుడు దాన్ని పొందదగినవారికి చేయకుండా వెనుదీయకుము. నీ పొరుగు వాడు అతని స్వంత వస్తువులను తిరిగి ఇచ్చి వేయుమని నిన్ను అడిగితే వాటిని అప్పుడే అతనికి ఇచ్చివేయుము. “తిరిగి రేపు రమ్మని” అతనితో చెప్పవద్దు. నీ పొరుగువాడు నీతో శాంతియుతంగా జీవిస్తున్నాడు, గనుక అతనికి విరోధంగా కీడు తల పెట్టవద్దు. మరో వ్యక్తి నీ యెడల ఎలాంటి తప్పూ చేయకపోతే అతనిని న్యాయస్థానానికి తీసుకొని పోవద్దు. కొంతమంది మనుష్యులు తేలికగా కోపం తెచ్చుకొని వెంటనే కీడు చేస్తారు. వారు జీవించే విధంగా జీవించకు. ఎందుకంటే దుర్మార్గులను యెహోవా ద్వేషిస్తాడు. కాని సక్రమంగా జీవించే ప్రజలను యెహోవా బలపరుస్తాడు. దుర్మార్గుల కుటుంబాలకు యెహోవా విరోధంగా ఉంటాడు. కాని సక్రమంగా జీవించే వారి కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు. ఒక వేళ ఒక వ్యక్తి గర్వించి, ఇతరులకంటే అతడే మంచివాడని తలచి, హేళన చేస్తే యెహోవా అతనిని శిక్షించి, అతని గూర్చి హేళన చేస్తాడు. కాని దీనులకు యెహోవా సహాయం చేస్తాడు. జ్ఞానముగల మనుష్యులు దేవుణ్ణి వెంబడిస్తారు. జ్ఞానముగల మనుష్యులను యెహోవా ఘనపరుస్తాడు. బుద్దిహీనులు దేవుణ్ణి వెంబడించరు. బుద్దిహీనులు అవమానించబడతారు.
సామెతలు 3:1-35 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవునిదృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగానుండును నీ గానుగలలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును. జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు. పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు. దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి. దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు. దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు. జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను. ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించుచున్నవి మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు. పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము. ద్రవ్యము నీయొద్ద నుండగా –రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడుచేయు క్రియలను ఏమాత్రమును చేయ గోరవద్దు కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు.
సామెతలు 3:1-35 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోవద్దు, నా ఆజ్ఞలను నీ హృదయంలో భద్రపరచుకో, అవి నీ జీవితకాలాన్ని అనేక సంవత్సరాలు పొడిగిస్తాయి, నీకు సమాధానాన్ని వృద్ధిని కలిగిస్తాయి. ప్రేమ, నమ్మకత్వం ఎన్నడు నిన్ను విడచిపోనివ్వకు; నీ మెడలో వాటిని ధరించుకో, నీ హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకో. అప్పుడు నీవు దేవుని దృష్టిలోను మనుష్యుల దృష్టిలోను దయపొంది మంచివాడవని అనిపించుకుంటావు. నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు; నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు, అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్నగా చేస్తారు. నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు; యెహోవా పట్ల భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టు. అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు బలం కలుగుతుంది. నీ ధనముతో, నీ పంటలో ప్రథమ ఫలముతో యెహోవాను ఘనపరచు; అప్పుడు నీ ధాన్యాగారాలు నిండి సమృద్ధిగా ఉంటాయి, నీ గానుగ తొట్టెలు క్రొత్త ద్రాక్షరసంతో పొంగిపొర్లుతాయి. నా కుమారుడా, యెహోవా క్రమశిక్షణను తృణీకరించవద్దు ఆయన గద్దింపును అసహ్యించుకోవద్దు. ఎందుకంటే తండ్రి తన కుమారునిలో ఆనందించునట్లు, యెహోవా తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు. జ్ఞానాన్ని కనుగొన్న మనుష్యులు, వివేచన కలిగినవారు ధన్యులు. ఎందుకంటే ఆమె వెండి కంటే ఎక్కువ ప్రయోజనకరం, ఆమె బంగారం కంటే ఎక్కువ లాభం తెస్తుంది. ఆమె పగడాలకంటే శ్రేష్ఠమైనది; నీకు ఇష్టమైనవేవి ఆమెతో సమానం కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువు; ఎడమ చేతిలో ఐశ్వర్యం ఘనతలు ఉన్నాయి. దాని మార్గాలు ఎంతో అనుకూలమైనవి దాని త్రోవలన్ని సమాధానకరమైనవి. ఆమెను కలిగి ఉన్నవారికి అది జీవవృక్షం వంటిది; దానిని స్థిరంగా పట్టుకుని ఉన్నవారు ధన్యులు. యెహోవా జ్ఞానం వలన భూమికి పునాదులు వేశారు, ఆయన తెలివి వలన ఆకాశ విశాలాన్ని ఏర్పరిచారు; ఆయన తెలివి వలన అగాధజలాలు విభజించబడ్డాయి. మేఘాల నుండి మంచు బిందువులు కురుస్తున్నాయి. నా కుమారుడా, జ్ఞానాన్ని వివేకాన్ని నీ దగ్గర భద్రంగా చూచుకో, వాటిని నీ కళ్ళెదుట నుండి తొలగిపోనివ్వకు; అవి నీకు జీవంగా, నీ మెడకు అలంకార ఆభరణంగా ఉంటాయి. అప్పుడు నీ మార్గంలో నీవు క్షేమంగా నడుస్తావు, నీ పాదం తడబడదు. నీవు పడుకున్నప్పుడు, భయపడవు; నీవు పడుకున్నప్పుడు, నీ నిద్ర మధురంగా ఉంటుంది. హఠాత్తుగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవు. యెహోవా నీ ప్రక్కన ఉంటారు, నీ పాదాలు వలలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతారు. నీవు క్రియ చేయగల అధికారం నీవు కలిగి ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకుండా ఉండవద్దు. నీవు నీ పొరుగువానికి ఇప్పుడు సహాయం చేయ కలిగి ఉండి, “రేపు రా నేను ప్రయత్నిస్తాను” అని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువారు నమ్మకంగా నీ దగ్గర జీవిస్తున్నప్పుడు వారికి హాని తలపెట్టవద్దు. నీకు హాని చేయని మనుష్యులతో, కారణం లేకుండా వాదించవద్దు. హింసాత్మకమైనవారిని అసూయ పడకు, వారి మార్గాల్లో వేటిని నీవు ఎంచుకోవద్దు. మూర్ఖులు యెహోవాకు అసహ్యులు కాని యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటారు. దుర్మార్గుల ఇంటి మీదికి యెహోవా శాపం వస్తుంది, కాని నీతిమంతుల ఇంటిని ఆయన ఆశీర్వదిస్తారు. ఎగతాళి చేసేవారిని ఆయన ఎగతాళి చేస్తారు కాని దీనులకు అణగారిన వారికి దయ చూపిస్తారు. జ్ఞానులు ఘనతను పొందుతారు, మూర్ఖులు అవమానాన్ని పొందుతారు.