సామెతలు 21:15-31
సామెతలు 21:15-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము. వివేకమార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు. నీతిమంతునికొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞానియైన యొకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకార మెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును. సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును. దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు. కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము.
సామెతలు 21:15-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
న్యాయ క్రియలు చేయడం నీతిపరుడికి సంతోషం. పాపాత్ముడికి అది భయంకరం. వివేకమార్గం తప్పి తిరిగేవాడు ప్రేతాత్మల గుంపులో కాపురముంటాడు. సుఖభోగాల్లో వాంఛ గలవాడు దరిద్రుడౌతాడు. ద్రాక్షారసం, నూనెల కోసం వెంపర్లాడే వాడికి ఐశ్వర్యం కలగదు. నీతిపరుని కోసం దుర్మార్గులు విడుదల వెలగా ఉంటారు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాస ఘాతకులు పరిహారంగా ఉంటారు. ప్రాణం విసికించే జగడగొండి దానితో కాపురం చెయ్యడం కంటే ఎడారిలో నివసించడం మేలు. విలువైన నిధులు, నూనె జ్ఞానుల ఇళ్ళలో ఉంటాయి. బుద్ధిహీనుడు వాటిని నిర్లక్షంగా ఖర్చు చేస్తాడు. నీతిగా దయగా ఉండే వాడు జీవాన్ని, నీతిని ఘనతను పొందుతాడు. అతడు సరైన నిర్ణయాలు చేస్తాడు. జ్ఞానవంతుడు పరాక్రమశాలుల నగరం పై దాడి చేస్తాడు. అతడు దాని భద్రమైన కోటను కూలదోస్తాడు. నోటిని నాలుకను కాపాడుకునేవాడు ఇబ్బందుల నుండి తనను కాపాడుకుంటాడు. అహంకారి, గర్విష్టి-అతనికి అపహాసకుడు అని పేరు. అలాంటివాడు గర్వంతో మిడిసి పడతాడు. సోమరిపోతు చేతులు పనిచేయవు. వాడి కోరికలే వాడికి చావు తెచ్చిపెడతాయి. రోజంతా అతనిలో ఆశలు ఊరుతూనే ఉంటాయి. యథార్థంగా ప్రవర్తించేవాడు వెనుదీయకుండా ఇస్తూనే ఉంటాడు. దుష్టులర్పించే బలులు అసహ్యం. ఆ బలులు వారు దురాలోచనతో అర్పిస్తే అవి మరింకెంత అసహ్యమో గదా. అబద్ధసాక్షి నాశనమై పోతాడు. శ్రద్ధగా వినేవాడు పలికే మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. దుర్మార్గుడు ముఖం మాడ్చుకుంటాడు. యథార్థవంతుడు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటాడు. యెహోవాకు విరోధమైన జ్ఞానంగానీ వివేచనగానీ ఆలోచనగానీ నిలవదు. యుద్ధదినానికి గుర్రాన్ని సిద్ధపరుస్తారు. అయితే విజయం యెహోవాదే.
సామెతలు 21:15-31 పవిత్ర బైబిల్ (TERV)
న్యాయమైన తీర్పు మంచి మనుష్యులను సంతోషింపజేస్తుంది. కాని దుర్మార్గులను అది భయపెడుతుంది. ఒక మనిషి జ్ఞానమార్గాన్ని విసర్జిస్తే అతడు నాశనానికే పోతున్నాడు. ఒక మనిషికి సరదా మాత్రమే అతి ముఖ్యం అయితే ఆ మనిషి దరిద్రుడు అవుతాడు. ఒకవేళ అతడు ద్రాక్షారస, భోజన ప్రియుడు అయితే అతడు ఎన్నటికీ ధనికుడు కాలేడు. మంచి మనుష్యులకు దుర్మార్గులు చేసే దుర్మార్గపు పనులన్నిటికీ తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నిజాయితీ లేని మనుష్యులు నిజాయితీగల వాళ్లకు చేసే వాటన్నింటికీ శిక్ష చెల్లించాల్సి ఉంటుంది. వివాదం అంటే మక్కువ పడే కోపిష్టి భార్యతో ఉండటంకంటే ఎడారిలో నివసించటం మేలు. జ్ఞానము గలవాడు తనకు అవసరమైన వాటిని భద్రం చేసికొంటాడు. కాని తెలివి తక్కువవాడు దొరికిన దాన్ని దొరికినంత త్వరగానే వాడేస్తాడు. ఎల్లప్పుడూ ప్రేమ, దయ చూపించాలని ప్రయత్నించే మనిషి మంచి జీవితం, ఐశ్వర్యం, ఘనత కలిగి ఉంటాడు. జ్ఞానముగలవాడు దాదాపు ఏదైనా చేయగలడు. బలంగల మనుష్యులు కాపలా కాస్తున్న పట్టణంపై అతడు దాడి చేయగలడు. వారిని కాపాడుతాయని నమ్ముకొన్న గోడలను అతడు నాశనం చేయగలడు. ఒక మనిషి అతడు చేప్పే విషయాలలో జాగ్రత్తగా ఉంటే అతడు కష్టం నుండి తనను తాను తప్పించుకోగలడు. ఇతరులకంటే తానే మంచివాడిని అనుకొనే వాడు గర్విష్ఠి. తాను చేసే పనుల ద్వారా అతడు తను దుర్మార్గుడని చూపిస్తాడు. సోమరి తను ఇంకా ఇంకా కావాలని కోరినప్పుడు తనను తానే నాశనం చేసికొంటాడు. అతడు వాటికోసం పనిచేసేందుకు నిరాకరిస్తాడు గనుక, తనను తానే నాశనం చేసికొంటాడు. కాని మంచి మనిషికి పుష్కలంగా ఉంటుంది గనుక అతడు యివ్వగలడు. దుర్మార్గులు బలులు అర్పించినప్పుడు, ముఖ్యంగా ఆ దుర్మార్గులు యెహోవా దగ్గర నుండి ఏదైనా సంపాదించాలని ప్రయత్నించినప్పుడు ఆయన సంతోషించడు. అబద్ధాలు చేప్పేవాడు నాశనం చేయబడతాడు. ఆయితే ఆ అబద్ధాలు వినే వ్యక్తి అతనితో పాటు నాశనం చేయబడతాడు. మంచివాడు తాను చేస్తున్నది సరైనది అని ఎల్లప్పుడూ తెలిసే ఉంటాడు. కాని దుర్మార్గుడు నటించాల్సి ఉంటుంది. ఒక పథకానికి యెహోవా విరోధంగా ఉంటే దానిని విజయవంతం చేయగలిగినంత జ్ఞానముగలవాడు ఎవడూ లేడు. మనుష్యులు గుర్రాలను, సమస్తాన్ని యుద్ధం కోసం సిద్ధం చేయవచ్చు, కాని యెహోవా వారికి విజయం ఇస్తేనే తప్ప వారు జయించలేరు.
సామెతలు 21:15-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
న్యాయమైన పనులు చేయడం నీతిమంతులకు సంతోషకరం కాని చెడు చేసేవారికి అది భయంకరము. వివేకమైన మార్గం నుండి తొలగిపోయే వ్యక్తి మృతుల గుంపులో అంతమవుతాడు. సుఖభోగాలపై ప్రేమ గలవానికి లేమి కలుగుతుంది; ద్రాక్షారసాన్ని, సుగంధ తైలాన్ని కోరుకునేవానికి ఐశ్వర్యం కలుగుతుంది. నీతిమంతుల కోసం భక్తిలేనివారు, అలాగే యథార్థవంతులకు నమ్మకద్రోహులు క్రయధనమవుతారు. ప్రాణం విసిగించే గయ్యాళి భార్యతో కాపురం చేయడం కంటే అడవిలో నివసించడం మంచిది. జ్ఞానుల నివాసంలో కోరదగిన నిధి ఒలీవనూనె ఉంటాయి, కానీ బుద్ధిలేని మనుష్యులు తాము పొందుకున్నదంతా ఖర్చు చేస్తారు. నీతిని శాశ్వత ప్రేమను వెంటాడేవాడు ప్రాణాన్ని, వృద్ధిని, ఘనతను పొందుతాడు. జ్ఞానియైనవాడు బలవంతుల పట్టణం మీదికి వెళ్లి వారు నమ్ముకున్న బలమైన కోటను కూల్చివేయగలడు. నోటిని నాలుకను భద్రం చేసుకునేవారు కష్టాల నుండి తమ ప్రాణాన్ని కాపాడుకుంటారు, అహంకారం, గర్వం గలవారికి అపహాసకులని పేరు వారు మిక్కిలి గర్వంతో నడుచుకుంటారు. సోమరుల కోరికలు వారిని చంపుతాయి, ఎందుకంటే వారి చేతులు పని చేయడానికి నిరాకరిస్తాయి. పగలంతా వారు మరింత కావాలని కోరుకుంటారు, కాని నీతిమంతులు మిగుల్చుకోకుండ ఇస్తారు. దుష్టుల బలులు అసహ్యం, చెడు ఉద్దేశంతో అర్పిస్తే ఇంకెంత అసహ్యమో! అబద్ధ సాక్షులు నశిస్తారు, కాని జాగ్రత్తగా వినేవారు నిరాటంకంగా సాక్ష్యమిస్తారు. దుష్టులు తమ ముఖంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు, కాని యథార్థవంతులు తమ మార్గాల గురించి ఆలోచిస్తారు. యెహోవాకు వ్యతిరేకంగా సఫలం కాగల జ్ఞానం గాని, అంతరార్థం గాని, ప్రణాళిక గాని లేదు. యుద్ధ దినానికి గుర్రాలు సిద్ధపరచబడతాయి, కాని విజయం యెహోవా దగ్గర ఉంది.