సామెతలు 21:15-31

సామెతలు 21:15-31 OTSA

న్యాయమైన పనులు చేయడం నీతిమంతులకు సంతోషకరం కాని చెడు చేసేవారికి అది భయంకరము. వివేకమైన మార్గం నుండి తొలగిపోయే వ్యక్తి మృతుల గుంపులో అంతమవుతాడు. సుఖభోగాలపై ప్రేమ గలవానికి లేమి కలుగుతుంది; ద్రాక్షారసాన్ని, సుగంధ తైలాన్ని కోరుకునేవానికి ఐశ్వర్యం కలుగుతుంది. నీతిమంతుల కోసం భక్తిలేనివారు, అలాగే యథార్థవంతులకు నమ్మకద్రోహులు క్రయధనమవుతారు. ప్రాణం విసిగించే గయ్యాళి భార్యతో కాపురం చేయడం కంటే అడవిలో నివసించడం మంచిది. జ్ఞానుల నివాసంలో కోరదగిన నిధి ఒలీవనూనె ఉంటాయి, కానీ బుద్ధిలేని మనుష్యులు తాము పొందుకున్నదంతా ఖర్చు చేస్తారు. నీతిని శాశ్వత ప్రేమను వెంటాడేవాడు ప్రాణాన్ని, వృద్ధిని, ఘనతను పొందుతాడు. జ్ఞానియైనవాడు బలవంతుల పట్టణం మీదికి వెళ్లి వారు నమ్ముకున్న బలమైన కోటను కూల్చివేయగలడు. నోటిని నాలుకను భద్రం చేసుకునేవారు కష్టాల నుండి తమ ప్రాణాన్ని కాపాడుకుంటారు, అహంకారం, గర్వం గలవారికి అపహాసకులని పేరు వారు మిక్కిలి గర్వంతో నడుచుకుంటారు. సోమరుల కోరికలు వారిని చంపుతాయి, ఎందుకంటే వారి చేతులు పని చేయడానికి నిరాకరిస్తాయి. పగలంతా వారు మరింత కావాలని కోరుకుంటారు, కాని నీతిమంతులు మిగుల్చుకోకుండ ఇస్తారు. దుష్టుల బలులు అసహ్యం, చెడు ఉద్దేశంతో అర్పిస్తే ఇంకెంత అసహ్యమో! అబద్ధ సాక్షులు నశిస్తారు, కాని జాగ్రత్తగా వినేవారు నిరాటంకంగా సాక్ష్యమిస్తారు. దుష్టులు తమ ముఖంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు, కాని యథార్థవంతులు తమ మార్గాల గురించి ఆలోచిస్తారు. యెహోవాకు వ్యతిరేకంగా సఫలం కాగల జ్ఞానం గాని, అంతరార్థం గాని, ప్రణాళిక గాని లేదు. యుద్ధ దినానికి గుర్రాలు సిద్ధపరచబడతాయి, కాని విజయం యెహోవా దగ్గర ఉంది.

Read సామెతలు 21