ఫిలేమోనుకు 1:1-25
ఫిలేమోనుకు 1:1-25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
క్రీస్తు యేసును బట్టి ఖైదీనైన, పౌలు అనే నేను, మన సహోదరుడైన తిమోతి కలిసి, మన ప్రియ స్నేహితుడు, తోటిపనివాడైన ఫిలేమోనుకు, మన సహోదరి అఫియకు, తోటి సైనికుడైన అర్ఖిప్పుకు, మీ ఇంట్లో కూడుకొనే సంఘానికి వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగును గాక! ప్రభువైన యేసులో నీకున్న విశ్వాసం, దేవుని ప్రజల పట్ల నీవు చూపే ప్రేమ గురించి నేను విన్నప్పటి నుండి నా ప్రార్థనలలో నిన్ను జ్ఞాపకం చేసికొని, నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. క్రీస్తు కొరకు మనం పంచుకున్న ప్రతి మంచి విషయం పట్ల నీ విశ్వాసం మరింత జ్ఞానంలో వృద్ధిపొంది ఉపయోగకరంగా, మాతో జతపనివానిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. సహోదరుడా, నీవు ప్రభువు యొక్క ప్రజల హృదయాలను సేదదీర్చినందుకు, నీ ప్రేమ నాకెంతో సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించింది. అందువల్ల, నీవేమి చేయాలనే దాని గురించి, క్రీస్తులో నేను ధైర్యంగా నిన్ను ఆజ్ఞాపించగలిగినా, ముసలివాడిని ఇప్పుడు యేసు క్రీస్తు కొరకు ఖైదీగా ఉన్న పౌలు అనే నేను నిన్ను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను. నేను సంకెళ్ళతో బంధించబడి ఉన్నప్పుడు నాకు కుమారునిగా మారిన ఒనేసిము కొరకు నిన్ను వేడుకుంటున్నాను. గతంలో అతడు నీకు నిష్ప్రయోజకుడే కావచ్చు, కాని ఇప్పుడు అతడు నీకు నాకు, ఇద్దరికి ఉపయోగపడే వానిగా అయ్యాడు. నా ప్రాణంతో సమానమైన ఇతన్ని, తిరిగి నీ దగ్గరకు పంపిస్తున్నాను. నేను సువార్త కొరకు సంకెళ్ళతో బంధింపబడి ఉన్న సమయంలో నాకు సహాయం చేయడానికి నీ బదులుగా అతన్ని నాతో పాటు ఉంచుకొని ఉండేవాడిని. కానీ, నీకు తెలియచేయకుండా నేను ఏమి చేయాలనుకోలేదు, ఎందుకంటే నీవు చేసే ఏ సహాయమైనా నీ ఇష్టపూర్వకంగానే చేయాలి కాని, బలవంతంగా కాదని నా అభిప్రాయం. ఇతడు కొంత కాలం నీ నుండి వేరుకావడానికి కారణం, అతడు ఒక బానిసగా కాకుండా, బానిస కంటే ప్రియమైన సహోదరునిగా ఎల్లప్పుడు నీతో పాటు ఉండడానికే కావచ్చును. ఇతడు నాకు చాలా ప్రియమైన వాడు, కాని, సాటి మనిషిగా ప్రభువులో ఒక సహోదరునిగా నీకు కూడా మరింత ప్రియమైన వాడుగా ఉన్నాడు. కనుక నీవు నన్ను ఒక జతపనివానిగా భావిస్తే, నన్ను ఆహ్వానించినట్లే అతన్ని కూడా ఆహ్వానించు. ఒకవేళ అతడు ఏదైనా తప్పు చేసినా లేదా నీకు ఏదైనా బాకీ ఉన్నా, వాటిని నా లెక్కలో వేయి. పౌలు అను నేను, నా స్వహస్తంతో దీనిని వ్రాస్తున్నాను. నేను ఆ లెక్క చెల్లిస్తాను. నిజానికి, స్వయాన నీవే నాకు బాకీగా ఉన్నావని చెప్పనవసరం లేదు. అవును సహోదరుడా, ప్రభువులో నీ నుండి నేను కొంత లాభం పొందాలని ఆశిస్తున్నాను; క్రీస్తులో నా హృదయాన్ని ఉత్తేజపరచు. నేను అడిగిన దానికంటే ఎక్కువగా నీవు చేస్తావని తెలిసే, నీ విధేయత మీద నమ్మకంతో నేను నీకు వ్రాస్తున్నాను. మరొక విషయం: మీ ప్రార్థనలను బట్టి మీ దగ్గరకు తిరిగి రావాలని నేను నిరీక్షిస్తున్నాను, కనుక నా కొరకు ఒక వసతిగదిని ఏర్పాటుచేయి. యేసు క్రీస్తు నిమిత్తం నాతో పాటు ఖైదీగా ఉన్న, ఎపఫ్రా మీకు వందనాలు తెలియచేస్తున్నాడు. అదే విధంగా మార్కు, అరిస్తర్కు, దేమా, లూకా అనే నా జతపనివారు కూడా వందనాలు తెలియచేస్తున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడుగా ఉండును గాక!
ఫిలేమోనుకు 1:1-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మా ప్రియ సోదరుడు, జతపనివాడు అయిన ఫిలేమోనుకు, మన సోదరి అప్ఫియకు, మన సాటి సైనికుడు అర్ఖిప్పుకు, నీ ఇంట్లో సమావేశమయ్యే సంఘానికీ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక. ప్రభువైన యేసు పట్ల, పరిశుద్ధులందరి పట్ల నీకున్న ప్రేమను గూర్చి, విశ్వాసం గూర్చి నేను విని, నా ప్రార్థనల్లో మీ గురించి విజ్ఞాపన చేస్తూ, ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను. విశ్వాసంలో నీవు పాల్గొనడం క్రీస్తులో మనకు ఉన్న ప్రతి మంచినీ నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం లో మరింత చురుకుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. సోదరా, పరిశుద్ధుల హృదయాలకు నీవు సేద దీర్చావు కాబట్టి నీ ప్రేమ నాకెంతో ఆనందాన్నీ ఆదరణనూ తెచ్చింది. అందుచేత తప్పకుండా చేయవలసి ఉన్న వాటిని గురించి నీకు ఆజ్ఞాపించే ధైర్యం క్రీస్తులో నాకున్నప్పటికీ, ముసలివాడినీ ఇప్పుడు క్రీస్తు యేసు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను ప్రేమను బట్టే నిన్ను వేడుకుంటున్నాను. నేను నా బిడ్డ ఒనేసిము గురించి నిన్ను అడుగుతున్నాను. నేను చెరలో ఉన్నపుడు అతడు నాకు కొడుకయ్యాడు. గతంలో అతడి వలన నీకు ప్రయోజనం ఏమీ లేకపోయింది. ఇప్పుడయితే అతడు నీకూ నాకూ ప్రయోజనకారి అయ్యాడు. నా ప్రాణంతో సమానమైన అతణ్ణి నీ దగ్గరికి తిరిగి పంపుతున్నాను. నేను సువార్త కోసం సంకెళ్ళలో ఉంటే నీ పక్షాన నాకు సాయం చేయడానికి నా దగ్గరే అతణ్ణి ఉంచుకోవాలనుకున్నాను అయితే నీ అనుమతి లేకుండా అలాటిది ఏదయినా చేయడం నాకిష్టం లేదు. నీ మంచితనాన్ని బలవంతంగా కాక నీకు ఇష్టపూర్వకంగా ఉపయోగించుకోవాలని నా అభిప్రాయం. బహుశా అతడు ఎప్పుడూ నీ దగ్గరే ఉండడానికి కొంతకాలం నీకు దూరమయ్యాడు కాబోలు. ముఖ్యంగా నాకూ, శరీర బంధాన్ని బట్టీ ప్రభువును బట్టీ మరి ముఖ్యంగా నీకూ అతడు ఇక ఎంత మాత్రం బానిసగా మాత్రమే కాక అంతకంటే ఎక్కువగా ప్రియమైన సోదరుడు. అందుచేత నీవు నన్ను నీ జత పనివానిగా ఎంచితే నన్ను చేర్చుకున్నట్టే అతణ్ణి కూడా చేర్చుకో. ఒకవేళ అతడు నీపట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేకపోతే నీకు బాకీ ఉంటే దాన్ని నా లెక్కలో వెయ్యి. పౌలు అనే నేను నా స్వదస్తూరీతో ఈ మాట రాస్తున్నాను. ఆ బాకీ నేనే తీరుస్తాను. అయినా అసలు నీ జీవం విషయంలో నువ్వే నాకు బాకీ పడి ఉన్నావని నేను ప్రస్తావించడం లేదు. ఔను, సోదరా, ప్రభువులో నాకు సంతోషం కలిగించు. క్రీస్తులో నా హృదయానికి సేద తీర్చు. నీవు నా మాట వింటావని నమ్మకంతో రాస్తున్నాను. నేను చెప్పినదాని కంటే నీవు ఎక్కువ చేస్తావని కూడా నాకు తెలుసు. సరే. నా కోసం వసతి సిద్ధం చెయ్యి. ఎందుకంటే మీ ప్రార్థనల ద్వారా దేవుడు నన్ను మీ దగ్గరికి పంపుతాడనే ఆశాభావంతో ఉన్నాను. క్రీస్తు యేసు కోసం నా సాటి ఖైదీ ఎపఫ్రా, అలానే నా జత పనివారు మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా నీకు అభివందనాలు చెబుతున్నారు. మన ప్రభు యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండు గాక. ఆమెన్.
ఫిలేమోనుకు 1:1-25 పవిత్ర బైబిల్ (TERV)
యేసు క్రీస్తు కోసం ఖైదీనైన పౌలును మరియు మన సోదరుడైన తిమోతియు, మా ప్రియ జతపనివాడైన ఫిలేమోనుకు, మరియు మన సోదరి అప్ఫియకు, మనతో సహా పోరాటం సాగిస్తున్న అర్ఖిప్పుకు, మీ యింట్లో సమావేశమయ్యే సంఘానికి వ్రాస్తున్న సంగతులు: మన తండ్రియైన దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని అనుగ్రహించి మీకు శాంతి ప్రసాదించు గాక! కాబట్టి నేను ప్రార్థనలను చేసినప్పుడెల్లా నిన్ను జ్ఞాపకం పెట్టుకొని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను. యేసు ప్రభువు పట్ల నీకున్న భక్తిని గురించి, భక్తులపట్ల నీకున్న ప్రేమను గురించి నేను విన్నాను. క్రీస్తు మనకు చేసిన మంచిని నీవు పూర్తిగా అర్థం చేసుకోవాలనీ, తద్వారా మన విశ్వాసాన్ని నీవు యితరులతో ఉత్సాహంగా పంచుకోగల్గాలనీ నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సోదరా! నీవు భక్తులకు సహాయం చేసి వాళ్ళను ఆనందపరిచావు. కనుక నీ ప్రేమ నాకు చాలా ఆనందమును, తృప్తిని కల్గించింది. క్రీస్తు పేరిట నీవు చేయవలసిన కర్తవ్యాలను ఆజ్ఞాపించగల అధికారం నాకున్నా, నేను ప్రేమతో నీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పౌలను నేను, వయస్సు మళ్ళిన వాణ్ణిగా, యేసు క్రీస్తు ఖైదీని. నా కుమారునితో సమానమైన ఒనేసిము విషయంలో నిన్ను ఒకటి వేడుకొంటున్నాను. నేను ఖైదీగా ఉన్నప్పుడు అతడు నా కుమారుడయ్యాడు. గతంలో అతనివలన నీకు ఉపయోగం లేదు. కాని యిప్పుడు అతనివలన నీకూ, నాకూ, యిద్దరికీ ఉపయోగం ఉంది. నా గుండెలాంటివాడైన అతణ్ణి తిరిగి నీ దగ్గరకు పంపుతున్నాను. నేను సువార్త కారణంగా ఖైదీగా ఉన్నాను. ఈ సమయంలో నీ స్థానంలో అతడు నాకు సహాయం చేయాలని నా అభిలాష, కనుక అతణ్ణి నా దగ్గరే ఉంచుకోవాలనుకొన్నాను. కాని నీ అనుమతి లేకుండా నేనిది చేయదలచుకోలేదు. నీవు చేసే ఈ సహాయం నా ఒత్తిడివల్ల కాకుండా నీ యిష్ట ప్రకారం చెయ్యాలని నా ఉద్దేశ్యం. ఒనేసిము నీ నుండి కొంతకాలం దూరం అయ్యాడు. చిరకాలం నీ దగ్గర ఉండాలని యిలా జరిగిందేమో. అతడు యిప్పుడు దాసుడు మాత్రమే కాదు. క్రీస్తును నమ్మిన మన ప్రియ సోదరుడు. అతడు నాకు చాలా దగ్గరి వాడు. తోటి మనిషిగా, ప్రభువువల్ల కలిగిన బంధంలో ఒక సోదరునిగా, అతన్ని నీవు యింకా దగ్గరివానిగా భావిస్తావు. నీవు నన్ను నీ భాగస్వామిగా భావిస్తూన్నట్లయితే నాకు స్వాగతం చెప్పినట్లే, అతనికి కూడా స్వాగతం చెప్పు. అతడు నీ పట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేక అతడు నీకు ఏదైనా అప్పు ఉంటే అది నా లెక్కలో వ్రాయి. నేను ఆ అప్పును తీరుస్తానని పౌలు అను నేను నా స్వహస్తంతో వ్రాస్తున్నాను. కాని నీవు నీ జీవితంతో సహా నాకు బాకీ ఉన్నావని చెప్పనవసరం లేదు. కనుక నా సోదరా! ప్రభువు కోసం దయచేసి నాకీ సహాయం చేయి. క్రీస్తు కారణంగా మనం సోదరులం కనుక నాకీ తృప్తి కలిగించు. నీ విధేయతపై నాకు నమ్మకం ఉంది. నేను అడిగిన దానికన్నా ఎక్కువే చేస్తావని నాకు తెలుసు. అందుకే నీకు వ్రాస్తున్నాను. మరొక విషయం. అతిథుల కోసం ఉంచిన గదిని నా కోసం సిద్ధంగా ఉంచు. నీ ప్రార్థలను విని దేవుడు నన్ను నీ దగ్గరకు పంపుతాడని ఆశిస్తున్నాను. యేసు క్రీస్తు నిమిత్తం నాతో సహా కారాగారంలో ఉన్న ఎపఫ్రా నీకు వందనాలు తెలుపమన్నాడు. నాతో పని చేస్తున్న మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా కూడా నీకు వందనాలు తెలుపుతున్నారు. యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం మీ ఆత్మకు తోడుగా ఉండుగాక!
ఫిలేమోనుకు 1:1-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
క్రీస్తుయేసు ఖైదీయైన పౌలును, సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలే మోనుకును మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక. నీ ప్రేమనుగూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమునుగూర్చియు నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనముచేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు, క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేప్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. కావున యుక్తమైనదానినిగూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమనుబట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడుమునుపు నీకు నిష్‌ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను. నా ప్రాణము వంటివాడైన అతనిని నీయొద్దకు తిరిగి పంపియున్నాను. నేను సువార్తకొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారముచేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొనవలెనని యుంటిని గాని నీ ఉపకారము బలవంతముచేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు. అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడు గాను, విశేషముగా నాకును, శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను, నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల నన్ను చేర్చు కొన్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసినయెడలను, నీకు ఏమైన ఋణమున్నయెడలను, అది నా లెక్కలో చేర్చుము; పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల? అవును సహోదరుడా, ప్రభువునందు నీవలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము. నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థ నల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధముచేయుము. క్రీస్తుయేసునందు నాతోడి ఖైదీయైన ఎపఫ్రా, నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక. అమేన్.
ఫిలేమోనుకు 1:1-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
క్రీస్తు యేసును బట్టి ఖైదీనైన, పౌలు అనే నేను, మన సహోదరుడైన తిమోతి కలిసి, మన ప్రియ స్నేహితుడు, తోటిపనివాడైన ఫిలేమోనుకు, మన సహోదరి అప్ఫియకు, తోటి సైనికుడైన అర్ఖిప్పుకు, మీ ఇంట్లో కూడుకొనే సంఘానికి వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక. ప్రభువైన యేసులో నీకున్న విశ్వాసం, దేవుని ప్రజల పట్ల నీవు చూపే ప్రేమ గురించి నేను విన్నప్పటి నుండి నా ప్రార్థనలలో నిన్ను జ్ఞాపకం చేసికొని, నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. క్రీస్తు కోసం మనం పంచుకున్న ప్రతి మంచి విషయం పట్ల నీ విశ్వాసం మరింత జ్ఞానంలో వృద్ధిపొంది ఉపయోగకరంగా, మాతో పాలివానిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. సహోదరుడా, నీవు పరిశుద్ధుల హృదయాలను సేదదీర్చినందుకు, నీ ప్రేమ నాకెంతో సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించింది. అందువల్ల, నీవేమి చేయాలనే దాని గురించి, క్రీస్తులో నేను ధైర్యంగా నిన్ను ఆజ్ఞాపించగలిగినా, ముసలివాన్ని ఇప్పుడు యేసు క్రీస్తు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను నిన్ను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను. నేను సంకెళ్ళతో బంధించబడి ఉన్నప్పుడు నాకు కుమారునిగా మారిన ఒనేసిము కోసం నిన్ను వేడుకుంటున్నాను. గతంలో అతడు నీకు నిష్ప్రయోజకుడే కావచ్చు, కాని ఇప్పుడు అతడు నీకు నాకు, ఇద్దరికి ఉపయోగపడే వానిగా అయ్యాడు. నా ప్రాణంతో సమానమైన ఇతన్ని, తిరిగి నీ దగ్గరకు పంపిస్తున్నాను. నేను సువార్త కోసం సంకెళ్ళతో బంధింపబడి ఉన్న సమయంలో నాకు సహాయం చేయడానికి నీ బదులుగా అతన్ని నాతో పాటు ఉంచుకుని ఉండేవాన్ని. కానీ, నీకు తెలియజేయకుండా నేను ఏమి చేయాలనుకోలేదు, ఎందుకంటే నీవు చేసే ఏ సహాయమైనా నీ ఇష్టపూర్వకంగానే చేయాలి కాని, బలవంతంగా కాదని నా అభిప్రాయం. ఇతడు కొంతకాలం నీ నుండి వేరుకావడానికి కారణం, అతడు ఒక బానిసగా కాకుండా, బానిస కంటే ప్రియమైన సహోదరునిగా ఎల్లప్పుడు నీతో పాటు ఉండడానికే కావచ్చును. ఇతడు నాకు చాలా ప్రియమైన వాడు, కాని, సాటి మనిషిగా ప్రభువులో ఒక సహోదరునిగా నీకు కూడా మరింత ప్రియమైన వాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నన్ను ఒక జతపనివానిగా భావిస్తే, నన్ను ఆహ్వానించినట్లే అతన్ని కూడా ఆహ్వానించు. ఒకవేళ అతడు ఏదైనా తప్పు చేసినా లేదా నీకు ఏదైనా బాకీ ఉన్నా, వాటిని నా లెక్కలో వేయి. పౌలు అనే నేను, నా స్వహస్తంతో దీనిని వ్రాస్తున్నాను. నేను ఆ లెక్క చెల్లిస్తాను. నిజానికి, స్వయాన నీవే నాకు బాకీగా ఉన్నావని చెప్పనవసరం లేదు. అవును సహోదరుడా, ప్రభువులో నీ నుండి నేను కొంత లాభం పొందాలని ఆశిస్తున్నాను; క్రీస్తులో నా హృదయాన్ని ఉత్తేజపరచు. నేను అడిగిన దానికంటే ఎక్కువగా నీవు చేస్తావని తెలిసే, నీ విధేయత మీద నమ్మకంతో నేను నీకు వ్రాస్తున్నాను. మరొక విషయం: మీ ప్రార్థనలను బట్టి మీ దగ్గరకు తిరిగి రావాలని నేను నిరీక్షిస్తున్నాను, కాబట్టి నా కోసం ఒక వసతిగదిని ఏర్పాటు చేయండి. యేసు క్రీస్తు నిమిత్తం నాతో పాటు ఖైదీగా ఉన్న, ఎపఫ్రా మీకు వందనాలు తెలియజేస్తున్నాడు. అదే విధంగా మార్కు, అరిస్తర్కు, దేమా, లూకా అనే నా జతపనివారు కూడా వందనాలు తెలియజేస్తున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక.