ఫిలేమోను పత్రిక 1:1-25

ఫిలేమోను పత్రిక 1:1-25 OTSA

క్రీస్తు యేసును బట్టి ఖైదీనైన, పౌలు అనే నేను, మన సహోదరుడైన తిమోతి కలిసి, మన ప్రియ స్నేహితుడు, తోటిపనివాడైన ఫిలేమోనుకు, మన సహోదరి అప్ఫియకు, తోటి సైనికుడైన అర్ఖిప్పుకు, మీ ఇంట్లో కూడుకొనే సంఘానికి వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక. ప్రభువైన యేసులో నీకున్న విశ్వాసం, దేవుని ప్రజల పట్ల నీవు చూపే ప్రేమ గురించి నేను విన్నప్పటి నుండి నా ప్రార్థనలలో నిన్ను జ్ఞాపకం చేసికొని, నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. క్రీస్తు కోసం మనం పంచుకున్న ప్రతి మంచి విషయం పట్ల నీ విశ్వాసం మరింత జ్ఞానంలో వృద్ధిపొంది ఉపయోగకరంగా, మాతో పాలివానిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. సహోదరుడా, నీవు పరిశుద్ధుల హృదయాలను సేదదీర్చినందుకు, నీ ప్రేమ నాకెంతో సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించింది. అందువల్ల, నీవేమి చేయాలనే దాని గురించి, క్రీస్తులో నేను ధైర్యంగా నిన్ను ఆజ్ఞాపించగలిగినా, ముసలివాన్ని ఇప్పుడు యేసు క్రీస్తు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను నిన్ను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను. నేను సంకెళ్ళతో బంధించబడి ఉన్నప్పుడు నాకు కుమారునిగా మారిన ఒనేసిము కోసం నిన్ను వేడుకుంటున్నాను. గతంలో అతడు నీకు నిష్ప్రయోజకుడే కావచ్చు, కాని ఇప్పుడు అతడు నీకు నాకు, ఇద్దరికి ఉపయోగపడే వానిగా అయ్యాడు. నా ప్రాణంతో సమానమైన ఇతన్ని, తిరిగి నీ దగ్గరకు పంపిస్తున్నాను. నేను సువార్త కోసం సంకెళ్ళతో బంధింపబడి ఉన్న సమయంలో నాకు సహాయం చేయడానికి నీ బదులుగా అతన్ని నాతో పాటు ఉంచుకుని ఉండేవాన్ని. కానీ, నీకు తెలియజేయకుండా నేను ఏమి చేయాలనుకోలేదు, ఎందుకంటే నీవు చేసే ఏ సహాయమైనా నీ ఇష్టపూర్వకంగానే చేయాలి కాని, బలవంతంగా కాదని నా అభిప్రాయం. ఇతడు కొంతకాలం నీ నుండి వేరుకావడానికి కారణం, అతడు ఒక బానిసగా కాకుండా, బానిస కంటే ప్రియమైన సహోదరునిగా ఎల్లప్పుడు నీతో పాటు ఉండడానికే కావచ్చును. ఇతడు నాకు చాలా ప్రియమైన వాడు, కాని, సాటి మనిషిగా ప్రభువులో ఒక సహోదరునిగా నీకు కూడా మరింత ప్రియమైన వాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నన్ను ఒక జతపనివానిగా భావిస్తే, నన్ను ఆహ్వానించినట్లే అతన్ని కూడా ఆహ్వానించు. ఒకవేళ అతడు ఏదైనా తప్పు చేసినా లేదా నీకు ఏదైనా బాకీ ఉన్నా, వాటిని నా లెక్కలో వేయి. పౌలు అనే నేను, నా స్వహస్తంతో దీనిని వ్రాస్తున్నాను. నేను ఆ లెక్క చెల్లిస్తాను. నిజానికి, స్వయాన నీవే నాకు బాకీగా ఉన్నావని చెప్పనవసరం లేదు. అవును సహోదరుడా, ప్రభువులో నీ నుండి నేను కొంత లాభం పొందాలని ఆశిస్తున్నాను; క్రీస్తులో నా హృదయాన్ని ఉత్తేజపరచు. నేను అడిగిన దానికంటే ఎక్కువగా నీవు చేస్తావని తెలిసే, నీ విధేయత మీద నమ్మకంతో నేను నీకు వ్రాస్తున్నాను. మరొక విషయం: మీ ప్రార్థనలను బట్టి మీ దగ్గరకు తిరిగి రావాలని నేను నిరీక్షిస్తున్నాను, కాబట్టి నా కోసం ఒక వసతిగదిని ఏర్పాటు చేయండి. యేసు క్రీస్తు నిమిత్తం నాతో పాటు ఖైదీగా ఉన్న, ఎపఫ్రా మీకు వందనాలు తెలియజేస్తున్నాడు. అదే విధంగా మార్కు, అరిస్తర్కు, దేమా, లూకా అనే నా జతపనివారు కూడా వందనాలు తెలియజేస్తున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక.