సంఖ్యాకాండము 9:1-14
సంఖ్యాకాండము 9:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఐగుప్తుదేశములోనుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయులు పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవదినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను. కాబట్టి మోషే –పస్కాపండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదునాలుగవదినమున సాయంకాలమందు పస్కాపండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పస్కాపండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో – నరశవమును ముట్టుటవలన అపవిత్రులమైతిమి; యెహోవా అర్పణమును దాని నియామకకాలమున ఇశ్రాయేలీయులమధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడితిమని అడుగగా మోషే–నిలువుడి; మీ విషయములో యెహోవా యేమి సెలవిచ్చునో నేను తెలిసి కొందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము –మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుటవలన అప విత్రుడైనను, దూరప్రయాణము చేయుచుండినను, అతడు యెహోవా పస్కాపండుగను ఆచరింపవలెను. వారు రెండవనెల పదునాలుగవదినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను. వారు మరునాటివరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు; దానిలోనిది ఒక్క యెముకనైనను విరువవలదు; పస్కాపండుగ విషయమైన కట్టడ లన్నిటినిబట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానినయెడల ఆ మనుష్యుడు తన జనులలోనుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను.
సంఖ్యాకాండము 9:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా సీనాయి అరణ్యంలో మోషేతో మాట్లాడాడు. ఇది వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం మొదటి నెలలో జరిగింది. ఆయన ఇలా చెప్పాడు. “ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండగను దానికి నిర్ధారించిన తేదీల్లో ఆచరించాలి. దాన్ని నిర్ధారించిన కాలం ఈ నెల పద్నాలుగో రోజు. ఆ రోజు సాయంత్రం మీరు పస్కా జరుపుకోవాలి. దాన్ని ఆచరించాలి. దానికి సంబంధించిన నియమాలను, ఆదేశాలను తప్పక పాటించాలి.” కాబట్టి మోషే పస్కా పండగను ఆచరించాలని ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు. దాంతో సీనాయి అరణ్యంలో ఆ మొదటి నెలలో పద్నాలుగో రోజు సాయంత్రం వారు పస్కా ఆచరించారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన వాటికి ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు. కొంతమంది చనిపోయిన వ్యక్తి శరీరాన్ని తాకి అపవిత్రులయ్యారు. కాబట్టి ఆ రోజు వారు పస్కా ఆచరించలేక పోయారు. ఆ వ్యక్తులు మోషే దగ్గరకి వచ్చి “మేము చనిపోయిన వ్యక్తి కారణంగానే కదా అపవిత్రులమయ్యాం. ఈ సంవత్సరంలో నిర్ధారించిన రోజున యెహోవాకు బలి అర్పించకుండా మమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నారు?” అని అడిగారు. దానికి మోషే “కాస్త ఆగండి. మీ గురించి యెహోవా ఏం చెబుతాడో విందాం.” అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు. ‘మీలో ఎవరైనా లేదా మీ సంతానంలో ఎవరైనా శవాన్ని తాకి అపవిత్రుడైనా, లేదా దూర ప్రయాణంలో ఉన్నా ఆ వ్యక్తి పస్కాను ఆచరించ వచ్చు.’ వారు రెండో నెల పద్నాలుగో రోజున సాయంత్రం పస్కా ఆచరించాలి. పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెలు, చేదు ఆకు కూరలతో తినాలి. మర్నాటి ఉదయానికి దానిలో దేన్నీ మిగల్చకూడదు. దాని ఎముకల్లో దేన్నీ విరగ్గొట్టకూడదు. పస్కాకి సంబంధించిన నియమాలన్నిటినీ వారు పాటించాలి. అయితే పవిత్రంగా ఉండీ, ప్రయాణమేదీ చేయని వాడు ఒకవేళ పస్కాను ఆచరించకపోతే ఆ వ్యక్తిని సమాజంలో లేకుండా చేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి సంవత్సరంలో నిర్ధారించిన రోజున యెహోవాకు అవసరమైన బలి అర్పణ అర్పించలేదు. ఆ వ్యక్తి తన పాపాన్ని భరించాల్సిందే. మీ మధ్య నివసించే విదేశీయుడు ఎవరైనా యెహోవా గౌరవం కోసం పస్కాని ఆచరించాలనుకుంటే అతడు ఆయన ఆదేశాలను అనుసరించాలి. నియమాలను అనుసరించే పస్కా ఆచరించాలి. పస్కా అనుసరించే విషయంలో మీ దేశంలో పుట్టిన వాడికీ మీ మధ్య నివసించే విదేశీయుడికీ ఒకే విధానం ఉండాలి.”
సంఖ్యాకాండము 9:1-14 పవిత్ర బైబిల్ (TERV)
సీనాయి అరణ్యంలో మోషేతో యెహోవా మాట్లాడాడు: ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం, ఒక నెల నాటి మాట ఇది. మోషేతో యెహోవా అన్నాడు: “నిర్ణీత సమయంలో పస్కా భోజనం చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. ఈ నెల పద్నాల్గవ రోజు ఆ నిర్ణీత సమయం. మసక చీకటి వేళ వారు ఆ భోజనం చేయాలి. మరియు భోజనంనుగూర్చి నేను ఇచ్చిన నియమాలన్నింటినీ వారు జ్ఞాపకం ఉంచుకోవాలి.” కనుక పస్కా భోజనం చేయటం జ్ఞాపకం ఉంచుకోమని ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్పాడు. పద్నాల్గవ రోజున మసక చీకటివేళ సీనాయి అరణ్యంలో ప్రజలు ఇది చేసారు. ఇది మొదటి నెలలో. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం ఇశ్రాయేలీయులు జరిగించారు. అయితే ఆ రోజున కొందరు ప్రజలు పస్కా భోజనం చేయలేకపోయారు. ఒక శవంమూలంగా వారు అపవిత్రులయ్యారు. కనుక ఆ రోజున మోషే అహరోనుల దగ్గరకు వారు వెళ్లారు. “ఒక శవం మూలంగా మేము ‘అపవిత్రులమయ్యాము’. అయితే ఇశ్రాయేలీయుల్లోని ఇతరులతో కలిసి మేము కూడ యెహోవాకు ఈ నిర్ణీత సమయంలో కానుకలు అర్పించటంలోను పస్కా ఆచరించుటలోను యాజకులు అడ్డుకొన్నారు” అని ఆ ప్రజలు మోషేతో చెప్పారు. “దీన్ని గూర్చి యెహోవా ఏమంటాడో నేను అడుగుతాను” అన్నాడు మోషే వారితో. అప్పుడు మోషేతో యెహోవా: “ఇశ్రాయేలీయులతో ఈ విషయాలు చెప్పు, ఒకవేళ సరైన సమయంలో మీరు పస్కాను ఆచరించలేకపోతున్నారేమో. మీరో లేక మీ సంతానంలోవారెవరైనా ఒక శవాన్ని ముట్టినందువల్ల అపవిత్రంగా ఉన్నారేమో. లేదా మీరు ప్రయాణంలో ఉన్నారేమో. అయితే మీరు కూడ పస్కాను ఆచరించగలరు గాని నిర్ణీత సమయంలో కాదు. రెండవ నెల పద్నాలుగో రోజు సందెవేళ మీరు పస్కాను ఆచరించాలి. ఆ సమయంలో మీరు గొర్రెపిల్లను, పులియని రొట్టెలను, చేదు ఆకుకూరలను తినాలి. ఆ భోజనంలో ఏమీ మర్నాటి ఉదయానికి మీరు మిగల్చకూడదు. మరియు ఎముకలు ఏవీ మీరు విరుగగొట్టకూడదు. మీరు పస్కావిందు భోజనం చేసేటప్పుడు నియమాలన్నింటినీ మీరు పాటించాలి. అయితే ఆచరించగల ప్రతి మనిషి పస్కావిందును నిర్ణీత సమయంలో తినాలి. అతడు పవిత్రుడై, ప్రయాణంలో లేకుండా ఉండి పస్కాను ఆచరించకపోతే, అతనికి క్షమాపణ లేదు. అతుడు నిర్ణీత సమయంలో పస్కా విందుభోజనం చేయకపోతే, అప్పుడు అతడ్ని తన ప్రజల్లోనుంచి వెళ్లగొట్టి వేయాలి. ఎందుచేతనంటే నిర్ణీత సమయంలో అతడు తన అర్పణను యెహోవాకు అర్పించలేదు గనుక అతడు దోషి. “ఇశ్రాయేలీయులకు చెందని ఒకడు మీతో నివసిస్తుంటే, అతడు మీతో కలిసి యెహోవా పస్కాలో పాలు పుచ్చుకోవాలనుకోవచ్చు. ఇది అంగీకారమే గాని మీకు ఇవ్వబడిన నియమాలన్నిటినీ అతడు పాటించాలి. మీకోసం ఉన్న నియమాలే మీరు ఇతరులకోసం కూడ పెట్టాలి.”
సంఖ్యాకాండము 9:1-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం మొదటి నెలలో సీనాయి అరణ్యంలో యెహోవా మోషేతో మాట్లాడారు. ఆయన ఇలా చెప్పారు, “ఇశ్రాయేలీయులు నిర్ణీత సమయంలో పస్కా పండుగ జరుపుకోవాలి. దాని నిర్ణీత సమయంలో అనగా, ఈ నెల పద్నాలుగవ రోజు సాయంకాల సమయంలో, నియమ నిబంధనలతో ఈ పండుగ జరుపుకోవాలి.” కాబట్టి మోషే పస్కాను జరుపుకోమని ఇశ్రాయేలీయులకు చెప్పాడు, వారంతా అదే విధంగా మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంకాలం సీనాయి అరణ్యంలో పస్కాను జరుపుకుంటారు. ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశారు. అయితే కొందరు మనుష్యులు మృతదేహాన్ని బట్టి ఆచారరీత్య అపవిత్రులైనందుకు ఆ రోజున పస్కాను జరుపుకోలేకపోయారు. కాబట్టి అదే రోజు వారు మోషే అహరోనుల దగ్గరకు వచ్చి, వారు మోషేతో, “ఒక మనుష్యుని మృతదేహాన్ని బట్టి మేము అపవిత్రులం అయ్యాము, అయితే యెహోవా అర్పణను ఇతర ఇశ్రాయేలీయులతో పాటు నిర్ణీత సమయంలో మేము ఎందుకు సమర్పించకూడదు?” అని అడిగారు. అందుకు మోషే వారితో, “మీ గురించి యెహోవా ఏమి ఆజ్ఞాపిస్తారో తెలుసుకునే వరకు ఆగండి” అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోవా మోషేతో, “ఇశ్రాయేలీయులతో చెప్పు: ‘ఇప్పుడున్న మీలో ఎవరైనా లేదా రాబోయే తరాల వారైనా మృతదేహాన్ని బట్టి గాని దూర ప్రయాణాన్ని బట్టి గాని అపవిత్రులైతే, వారు యెహోవా పస్కాను జరుపుకోవచ్చు, అయితే వారు రెండవ నెల పద్నాలుగవ రోజు సాయంకాలం జరుపుకోవాలి. వారు పులియని రొట్టెలతో, చేదు కూరలతో పాటు గొర్రెపిల్లను తినాలి. తెల్లవారేటప్పడికి దానిలో ఏది మిగులకూడదు లేదా దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరువకూడదు. పస్కాను జరుపుకున్నప్పుడు వారు నియమాలన్నీ పాటించాలి. అయితే ఎవరైనా ఆచార ప్రకారం పవిత్రంగా ఉంటూ ప్రయాణంలో లేదా ఉన్న చోటే ఉంటూ, పస్కాను జరుపుకోకుండా ఉంటే, నిర్ణీత సమయంలో యెహోవాకు అర్పణను అర్పించనందుకు వారిని ప్రజల నుండి తొలగించాలి. వారి పాపానికి వారే పాపశిక్షను భరిస్తారు. “ ‘మీ మధ్యలో ఉంటున్న విదేశీయులు కూడా యెహోవా పస్కాను నియమ నిబంధనలతో జరుపుకోవాలి. విదేశీయులకు స్వదేశీయులకు ఒకే నియమాలు ఉండాలి.’ ”