సంఖ్యా 9

9
పస్కా పండుగ నియమాలు
1ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం మొదటి నెలలో సీనాయి అరణ్యంలో యెహోవా మోషేతో మాట్లాడారు. ఆయన ఇలా చెప్పారు, 2“ఇశ్రాయేలీయులు నిర్ణీత సమయంలో పస్కా పండుగ జరుపుకోవాలి. 3దాని నిర్ణీత సమయంలో అనగా, ఈ నెల పద్నాలుగవ రోజు సాయంకాల సమయంలో, నియమ నిబంధనలతో ఈ పండుగ జరుపుకోవాలి.”
4కాబట్టి మోషే పస్కాను జరుపుకోమని ఇశ్రాయేలీయులకు చెప్పాడు, 5వారంతా అదే విధంగా మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంకాలం సీనాయి అరణ్యంలో పస్కాను జరుపుకుంటారు. ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశారు.
6అయితే కొందరు మనుష్యులు మృతదేహాన్ని బట్టి ఆచారరీత్య అపవిత్రులైనందుకు ఆ రోజున పస్కాను జరుపుకోలేకపోయారు. కాబట్టి అదే రోజు వారు మోషే అహరోనుల దగ్గరకు వచ్చి, 7వారు మోషేతో, “ఒక మనుష్యుని మృతదేహాన్ని బట్టి మేము అపవిత్రులం అయ్యాము, అయితే యెహోవా అర్పణను ఇతర ఇశ్రాయేలీయులతో పాటు నిర్ణీత సమయంలో మేము ఎందుకు సమర్పించకూడదు?” అని అడిగారు.
8అందుకు మోషే వారితో, “మీ గురించి యెహోవా ఏమి ఆజ్ఞాపిస్తారో తెలుసుకునే వరకు ఆగండి” అని జవాబిచ్చాడు.
9అప్పుడు యెహోవా మోషేతో, 10“ఇశ్రాయేలీయులతో చెప్పు: ‘ఇప్పుడున్న మీలో ఎవరైనా లేదా రాబోయే తరాల వారైనా మృతదేహాన్ని బట్టి గాని దూర ప్రయాణాన్ని బట్టి గాని అపవిత్రులైతే, వారు యెహోవా పస్కాను జరుపుకోవచ్చు, 11అయితే వారు రెండవ నెల పద్నాలుగవ రోజు సాయంకాలం జరుపుకోవాలి. వారు పులియని రొట్టెలతో, చేదు కూరలతో పాటు గొర్రెపిల్లను తినాలి. 12తెల్లవారేటప్పడికి దానిలో ఏది మిగులకూడదు లేదా దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరువకూడదు. పస్కాను జరుపుకున్నప్పుడు వారు నియమాలన్నీ పాటించాలి. 13అయితే ఎవరైనా ఆచార ప్రకారం పవిత్రంగా ఉంటూ ప్రయాణంలో లేదా ఉన్న చోటే ఉంటూ, పస్కాను జరుపుకోకుండా ఉంటే, నిర్ణీత సమయంలో యెహోవాకు అర్పణను అర్పించనందుకు వారిని ప్రజల నుండి తొలగించాలి. వారి పాపానికి వారే పాపశిక్షను భరిస్తారు.
14“ ‘మీ మధ్యలో ఉంటున్న విదేశీయులు కూడా యెహోవా పస్కాను నియమ నిబంధనలతో జరుపుకోవాలి. విదేశీయులకు స్వదేశీయులకు ఒకే నియమాలు ఉండాలి.’ ”
సమావేశ గుడారంపై మేఘం
15నిబంధన గుడారమైన సమావేశ గుడారం సిద్ధపరచబడిన రోజున దాన్ని మేఘం కమ్మింది. సాయంత్రం నుండి ఉదయం వరకు సమావేశ గుడారం మీద మేఘం అగ్నిలా కనిపించింది. 16అది నిత్యం అలాగే ఉంది; మేఘం దాన్ని కమ్మింది, రాత్రివేళ ఆ మేఘం అగ్నిలా కనిపించేది. 17గుడారం మీద నుండి మేఘం పైకి వెళ్లినప్పుడు, ఇశ్రాయేలీయులు బయలుదేరేవారు; ఎక్కడ మేఘం ఆగితే వారు అక్కడ గుడారాలు వేసుకునేవారు. 18యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేవారు, ఆయన ఆజ్ఞ ప్రకారం అక్కడ ఉండేవారు. మేఘం సమావేశ గుడారం మీద నిలిచి ఉన్నంత వరకు వారు శిబిరంలో ఉండేవారు. 19మేఘం ఎక్కువకాలం సమావేశ గుడారం మీద ఆగితే యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులు బయలుదేరేవారు కారు. 20కొన్నిసార్లు మేఘం సమావేశ గుడారానికి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది; యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు శిబిరం చేస్తారు, ఆయన ఆజ్ఞ ప్రకారం వారు ప్రయాణం చేస్తారు. 21కొన్నిసార్లు మేఘం సాయంత్రం నుండి ఉదయం వరకు మాత్రమే ఉండేది, ఉదయం ఎత్తినప్పుడు, వారు ప్రయాణించేవారు. పగలైన, రాత్రైనా, మేఘం ఎత్తినప్పుడల్లా వారు ప్రయాణించేవారు. 22మేఘం సమావేశ గుడారంలో రెండు రోజులు లేదా ఒక నెల లేదా ఒక సంవత్సరం పాటు ఉండిపోతే, ఇశ్రాయేలీయులు శిబిరంలోనే ఉండేవారు; కానీ అది ఎత్తినప్పుడు, వారు బయలుదేరేవారు. 23యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు గుడారాలు వేసుకునేవారు, యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు బయలుదేరేవారు. మోషే ద్వారా ఇవ్వబడిన యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు లోబడ్డారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యా 9: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి