సంఖ్యాకాండము 7:11-18

సంఖ్యాకాండము 7:11-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడునైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. రెండవదినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడునైన నెతనేలు.

సంఖ్యాకాండము 7:11-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా మోషేకి “బలిపీఠం అభిషేకం కోసం అర్పణలు తీసుకు రావడానికి ప్రతి నాయకుడికీ ఒక్కో రోజు కేటాయించు” అని ఆదేశించాడు. మొదటి రోజు అర్పణం తెచ్చింది యూదా గోత్రం వాడూ, అమ్మీనాదాబు కొడుకు నయస్సోను. అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ, 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన మెత్తని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు. వీటితో పాటు పది తులాల బరువున్న పాత్రను సాంబ్రాణితో నింపి అర్పించాడు. ఇంకా అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక ఏడాది వయసున్న గొర్రె పిల్లనూ ఇచ్చాడు. పాపం కోసం బలిగా ఒక మేక పోతును ఇచ్చాడు. రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక ఏడాది వయసున్న ఐదు గొర్రె పిల్లలను శాంతిబలిగా సమర్పించాడు. ఇవి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను తెచ్చిన అర్పణం. రెండో రోజు అర్పణం తెచ్చింది ఇశ్శాఖారు వంశంలో నాయకుడూ, సూయారు కొడుకూ అయిన నెతనేలు.

సంఖ్యాకాండము 7:11-83 పవిత్ర బైబిల్ (TERV)

“ఒక్కో నాయకుడు ఒక్కో రోజున బలిపీఠం ప్రతిష్ఠలో తన వంతుగా తన అర్పణలు తీసుకుని రావాలి” అని యెహోవా అంతకు ముందే మోషేతో చెప్పాడు. పన్నెండుమంది నాయకుల్లో ప్రతి ఒక్కరూ పవిత్ర గుడారపు ప్రతిష్ఠకోసం తమ అర్పణలను తెచ్చారు. ఆ కానుకలు ఏవనగా: ఒక్కొక్క నాయకుడు 130 తులముల బరువుగల ఒక వెండి పళ్లెం తెచ్చాడు. ఒక్కొక్క నాయకుడు 70 తులాల బరువుగల వెండి గిన్నె తెచ్చాడు. నూనెతో కలిపిన మంచి గోధుమ పిండితో ఆ పళ్లెం, గిన్నె నింపాడు. ఇది ధాన్యార్పణ కోసం ఉపయోగించేది. 10 తులాల బరువుగల బంగారు ధూపార్తిని ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి తెచ్చాడు. ధూపార్తి ధూపంతో నింపబడింది. ఒక్కొక్క నాయకుడు ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఒక సంవత్సరపు మగ గొర్రెపిల్లను తీసుకునివచ్చాడు. ఈ జంతువులు దహనబలికోసం. పాపపరిహారార్థ బలిగా ఉపయోగించటంకోసం, ప్రతి నాయకుడూ ఒక మగ మేకను తెచ్చాడు. ప్రతి నాయకుడూ రెండు కోడెదూడలను, ఐదు పొట్టేళ్లను, ఐదు మగ మేకలను, ఒక సంవత్సరపు మగ గొర్రెపిల్లలు ఐదింటిని తీసుకొని వచ్చాడు. ఇవన్నీ సమాధాన బలిగా ఇవ్వబడ్డాయి. మొదటి రోజున యూదా కుటుంబ నాయకుడు, అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను తన అర్పణలు తీసుకొని వచ్చాడు. రెండో రోజున ఇశ్శాఖారు ప్రజల నాయకుడు, సూయారు కుమారుడైన నెతనేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. మూడో రోజున జెబూలూను ప్రజల నాయకుడు, హెలోను కుమారుడైన ఎలియాబు తన అర్పణలు తీసుకొనివచ్చాడు. నాలుగో రోజున రూబేను ప్రజల నాయకుడు, షెదేయూరు కుమారుడైన ఏలీసూరు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. ఐదో రోజున షిమ్యోను ప్రజల నాయకుడు, సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. ఆరో రోజున గాదు ప్రజల నాయకుడు, దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపా తన అర్పణలు తీసుకొని వచ్చాడు. ఏడో రోజున ఎఫ్రాయిము ప్రజల నాయకుడు, అమీహోదు కుమారుడైన ఎలీషామా తన అర్పణలు తీసుకొని వచ్చాడు. ఎనిమిదో రోజున మనష్షే ప్రజల నాయకుడు, పెదాసూరు కుమారుడైన గమలీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. తొమ్మిదో రోజున బెన్యామీను ప్రజల నాయకుడు, గిద్యోనీ కుమారుడైన అబీదాని తన అర్పణలు తీసుకొని వచ్చాడు. పదో రోజున దాను ప్రజల నాయకుడు, అమీషదాయి కుమారుడైన అహీయెజెరు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. పదకొండవ రోజున ఆషేరు ప్రజల నాయకుడు, ఒక్రాను కుమారుడైన పగీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. పన్నెండో రోజున నఫ్తాలీ ప్రజల నాయకుడు, ఏనాను కుమారుడైన అహీర తన అర్పణలు తీసుకొని వచ్చాడు.

సంఖ్యాకాండము 7:11-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యెహోవా మోషేతో, “బలిపీఠం ప్రతిష్ఠించడం కోసం ప్రతిరోజు ఒక్కొక్క నాయకుడు తమ అర్పణను తీసుకురావాలి.” మొదటి రోజు తన అర్పణను తెచ్చిన వారు యూదా గోత్రానికి చెందిన అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను. అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; పాపపరిహారబలి కోసం మేకపోతు; సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను తెచ్చిన అర్పణ. రెండవ రోజు అర్పణను తెచ్చిన వారు ఇశ్శాఖారు గోత్ర నాయకుడు, నెతనేలు కుమారుడైన సూయరు.