సంఖ్యాకాండము 7

7
పవిత్ర గుడారపు ప్రతిష్ఠ
1పవిత్ర గుడారాన్ని నిలబెట్టడం మోషే ముగించిన రోజే దానిని అతడు యెహోవాకు ప్రతిష్ఠించాడు. గుడారం మీద, దానిలో ప్రయోగించే పరికరాలన్నింటి మీద ప్రత్యేక తైలం పోసాడు. బలిపీఠం మీద, దానితో ఉపయోగించే వాటన్నింటి మీద మోషే ఆ తైలంపోసాడు. ఇది వీటన్నింటినీ పవిత్రం చేసింది.
2అప్పుడు ఇశ్రాయేలీయుల నాయకులు అర్పణలు అర్పించారు. వీరు ఒక్కో కుటుంబానికి నాయకులు, వారి వంశాల పెద్దలు. ఈ నాయకులు ప్రజలను లెక్కబెట్టారు. 3ఈ నాయకులు యెహోవాకు అర్పణలు తెచ్చారు. ఆరు గూడు బండ్లను, వాటిని లాగటానికి పన్నెండు ఎద్దులను వీరు తెచ్చారు. (ఒక్కో ఎద్దును ఒక్కో నాయకుడు ఇచ్చాడు. ఒక్కో నాయకుడు మరో నాయకునితో కలిసి ఒక బండిని ఇచ్చాడు.) పవిత్ర గుడారం దగ్గర నాయకులు వీటిని యెహోవాకు ఇచ్చారు.
4మోషేతో యెహోవా ఇలా అన్నాడు: 5“నాయకుల దగ్గర నుండి ఈ కానుకలు స్వీకరించు. సన్నిధి గుడారపు పనిలో ఈ కానుకలను ఉపయోగించవచ్చు. లేవీవాళ్లకు వీటిని ఇవ్వు. వాళ్లు వారి పని చేసుకొనేందుకు ఇవి సహాయపడ్తాయి.”
6కనుక ఆ బండ్లను, ఎద్దులను మోషే స్వీకరించాడు. వీటిని లేవీ మనుష్యులకు అతడు ఇచ్చాడు. 7గెర్షోను మనుష్యులకు రెండు బండ్లు, నాలుగు ఎడ్లు అతడు ఇచ్చాడు. వారి పనికోసం ఎడ్లు, బండ్లు వారికి అవసరం. 8తర్వాత మెరారి మనుష్యులకు నాలుగు బండ్లు, ఎనిమిది ఎడ్లు మోషే ఇచ్చాడు. వారి పనికోసం ఎడ్లు, బండ్లు వారికి అవసరం. ఆ మనుష్యులందరి పనికి యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు బాధ్యుడు. 9కహాతీ మనుష్యులకు బండ్లుగాని, ఎడ్లుగాని ఏమీ మోషే ఇవ్వలేదు. వీళ్లు పవిత్ర వస్తువులన్నింటినీ వారి భుజాలమీదే మోయాలి. ఇది వారు చేసేందుకు ఇవ్వబడిన పని.
10బలిపీఠం ప్రతిష్ఠించబడిన తర్వాత నాయకులు వారి అర్పణలు అక్కడకు తీసుకునివచ్చారు. ఆ బలిపీఠం ఎదుట వారు వారి అర్పణలను యెహోవాకు అర్పించారు. 11“ఒక్కో నాయకుడు ఒక్కో రోజున బలిపీఠం ప్రతిష్ఠలో తన వంతుగా తన అర్పణలు తీసుకుని రావాలి” అని యెహోవా అంతకు ముందే మోషేతో చెప్పాడు.
12-83 # 7:12-83 హేబ్రీ మూల భాషలో ఒక్కొక్క నాయకుని అర్పణ వేర్వేరుగా వ్రాయబడింది. అయితే ప్రతి అర్పణకు ఒకే వివరం ఉండటంవల్ల సులభంగా చదువుకొనేందుకు వీలుగా వీటన్నింటినీ మొదట వ్రాసి తర్వాత ప్రతిదిన అర్పణను అర్పించిన వారి పేర్లు వ్రాశారు. పన్నెండుమంది నాయకుల్లో ప్రతి ఒక్కరూ పవిత్ర గుడారపు ప్రతిష్ఠకోసం తమ అర్పణలను తెచ్చారు. ఆ కానుకలు ఏవనగా:
ఒక్కొక్క నాయకుడు 130 తులముల బరువుగల ఒక వెండి పళ్లెం తెచ్చాడు. ఒక్కొక్క నాయకుడు 70 తులాల బరువుగల వెండి గిన్నె తెచ్చాడు. నూనెతో కలిపిన మంచి గోధుమ పిండితో ఆ పళ్లెం, గిన్నె నింపాడు. ఇది ధాన్యార్పణ కోసం ఉపయోగించేది. 10 తులాల బరువుగల బంగారు ధూపార్తిని ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి తెచ్చాడు. ధూపార్తి ధూపంతో నింపబడింది.
ఒక్కొక్క నాయకుడు ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఒక సంవత్సరపు మగ గొర్రెపిల్లను తీసుకునివచ్చాడు. ఈ జంతువులు దహనబలికోసం. పాపపరిహారార్థ బలిగా ఉపయోగించటంకోసం, ప్రతి నాయకుడూ ఒక మగ మేకను తెచ్చాడు. ప్రతి నాయకుడూ రెండు కోడెదూడలను, ఐదు పొట్టేళ్లను, ఐదు మగ మేకలను, ఒక సంవత్సరపు మగ గొర్రెపిల్లలు ఐదింటిని తీసుకొని వచ్చాడు. ఇవన్నీ సమాధాన బలిగా ఇవ్వబడ్డాయి.
మొదటి రోజున యూదా కుటుంబ నాయకుడు, అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
రెండో రోజున ఇశ్శాఖారు ప్రజల నాయకుడు, సూయారు కుమారుడైన నెతనేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
మూడో రోజున జెబూలూను ప్రజల నాయకుడు, హెలోను కుమారుడైన ఎలియాబు తన అర్పణలు తీసుకొనివచ్చాడు. నాలుగో రోజున రూబేను ప్రజల నాయకుడు, షెదేయూరు కుమారుడైన ఏలీసూరు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
ఐదో రోజున షిమ్యోను ప్రజల నాయకుడు, సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
ఆరో రోజున గాదు ప్రజల నాయకుడు, దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపా తన అర్పణలు తీసుకొని వచ్చాడు. ఏడో రోజున ఎఫ్రాయిము ప్రజల నాయకుడు, అమీహోదు కుమారుడైన ఎలీషామా తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
ఎనిమిదో రోజున మనష్షే ప్రజల నాయకుడు, పెదాసూరు కుమారుడైన గమలీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
తొమ్మిదో రోజున బెన్యామీను ప్రజల నాయకుడు, గిద్యోనీ కుమారుడైన అబీదాని తన అర్పణలు తీసుకొని వచ్చాడు. పదో రోజున దాను ప్రజల నాయకుడు, అమీషదాయి కుమారుడైన అహీయెజెరు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
పదకొండవ రోజున ఆషేరు ప్రజల నాయకుడు, ఒక్రాను కుమారుడైన పగీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. పన్నెండో రోజున నఫ్తాలీ ప్రజల నాయకుడు, ఏనాను కుమారుడైన అహీర తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
84కనుక ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజల నాయకులనుండి వచ్చిన కానుకలు. మోషే ప్రత్యేక తైలము పోసి బలిపీఠాన్ని ప్రతిష్ఠించిన సందర్భంలో వారు ఈ వస్తువులను తెచ్చారు. వెండి పళ్లెములు పన్నెండు, వెండిగిన్నెలు పన్నెండు, బంగారు ధూపార్తులు పన్నెండు వారు తీసుకుని వచ్చారు. 85ఒక్కో వెండి పళ్లెం బరువు 130 తులాలు. ఒక్కో గిన్నె బరువు 70 తులాలు. వెండిపళ్లాలు, వెండిగిన్నెలు అన్నీ కలిసి 2,400 తులాల బరువు. 86ధూపద్రవ్యంతో నిండిన పన్నెండు బంగారు ధూపార్తులలో ఒక్కొక్కటి పది తులాల బరువు. మొత్తం పన్నెండు బంగారు ధూపార్తులు కలిసి 120 తులాల బరువు కలవి.
87దహనబలి అర్పణకు మొత్తం జంతువులు పన్నెండు కోడెదూడలు, పన్నెండు పొట్టేళ్లు, ఒక్కో సంవత్సరపు మగ గొర్రెపిల్లలు పన్నెండు. ధాన్యార్పణ కూడా ఉంది. పాపపరిహారార్థ బలిగా యెహోవాకు అర్పించేందుకు పన్నెండు మగ మేకలు కూడా ఉన్నాయి. 88సమాధాన బలిగా వధించి ఉపయోగించేందుకు కూడ నాయకులు జంతువులను ఇచ్చారు. ఈ జంతువులు మొత్తం 24 కోడెదూడలు, 60 పొట్టేళ్లు, 60 మగ మేకలు, ఒక్క సంవత్సరపు మగ గొర్రెపిల్లలు 60 బలిపీఠం ప్రతిష్ఠ సమయంలో ఇవన్నీ అర్పణలుగా ఇవ్వబడ్డాయి. ఈ విధంగా బలిపీఠం మీద ప్రత్యేక తైలాన్ని మోషే పోసిన తర్వాత వారు ప్రతిష్ఠించారు.
89యెహోవాతో మాట్లాడేందుకు మోషే సన్నిధి గుడారంలోకి వెళ్లాడు. ఆ సమయంలో అతనితో మాట్లాడుతున్న యెహోవా స్వరం అతడు విన్నాడు. ఒడంబడిక పెట్టెపైనున్న కరుణాపీఠంమీది రెండు కెరూబుదూతల మధ్య భాగంనుండి ఆ స్వరం వస్తోంది. ఇలా దేవుడు మోషేతో మాటలాడాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 7: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి