సంఖ్యాకాండము 16:1-40
సంఖ్యాకాండము 16:1-40 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబదిమందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి–మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవావారి మధ్యనున్నాడు; యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను –తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చు కొనును. ఈలాగు చేయుడి; కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా యే మనుష్యుని యేర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను–లేవి కుమారులారా వినుడి. తన మందిరసేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారినందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వము కూడ కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగ నేల అనెను. అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు–మేము రాము; ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములోనుండి మమ్మును తీసికొనివచ్చుట చాలనట్టు, మామీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసికొని రాలేదు; పొలములు ద్రాక్షతోటలుగల స్వాస్థ్యము మాకియ్యలేదు; ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి–నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొనలేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవిచేసెను. మరియు మోషే కోరహుతో– నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటిమీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసికొని వాటిలో అగ్నియుంచి వాటిమీద ధూప ద్రవ్యము వేసినప్పుడు, వారును మోషే అహరోనులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా–మీరు ఈ సమాజములోనుండి అవతలికి వెళ్లుడి. క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి–సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీయొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజముమీద నీవు కోపపడుదువా? అని వేడు కొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–కోరహు దాతాను అబీరాములయొక్క నివాసముల చుట్టుపెట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి. అతడు–ఈ దుష్టుల గుడారములయొద్దనుండి తొలగిపోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసములయొద్దనుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలిసికొందురు. మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందినయెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలనవారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మ్రింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను. అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించ గానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మ్రింగివేసెను. వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; భూమి వారిని మ్రింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి. వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష విని–భూమి మనలను మ్రింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవాయొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చి వేసెను. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము–ఆ అగ్నిమధ్యనుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపముచేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసికొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి; అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధికాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి, కోరహువలెను అతని సమాజమువలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకసూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడినవారు అర్పించిన యిత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులు చేయించెను.
సంఖ్యాకాండము 16:1-40 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
లేవీ మునిమనవడు, కహాతు మనవడు, ఇస్హారు కొడుకు కోరహు, రూబేనీయుల్లో ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాము, పేలెతు కొడుకు ఓనుతో కలిసి ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన 250 మంది నాయకులతో సహా మోషే మీద తిరుగుబాటుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. “మీరు చాలా ఎక్కువ అధికారం చలాయిస్తున్నారు. ఈ సమాజంలో ఉన్న వారిందరూ పవిత్రులే. అందరూ యెహోవా కోసం ప్రత్యేకించిన వారే. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు గొప్ప చేసుకుంటున్నారు?” అన్నారు. మోషే ఆ మాట విన్నప్పుడు, సాగిలపడ్డాడు. ఆ తరువాత అతడు కోరహుతో, అతని గుంపుతో, “ఆయన వారు ఎవరో యెహోవా కోసం ప్రత్యేకించిన వారెవరో రేపు యెహోవా తెలియజేసి అతన్ని తన సన్నిధికి రానిస్తాడు. ఆయన తాను ఏర్పరచుకున్నవాణ్ణి తన దగ్గరికి చేర్చుకుంటాడు. కోరహు, నువ్వూ నీ గుంపూ ఇలా చెయ్యండి, మీరు ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పు ఉంచి రేపు యెహోవా సన్నిధిలో వాటి మీద ధూపసాంబ్రాణి వెయ్యండి. అప్పుడు యెహోవా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో అతనే పవిత్రుడు. లేవీ కొడుకులారా, మీరు చాలా దూరం వెళ్ళారు” అన్నాడు. ఇంకా మోషే కోరహుతో “లేవీ కొడుకులారా వినండి, తన మందిరసేవ చెయ్యడానికి యెహోవా మిమ్మల్ని తన దగ్గరికి చేర్చుకోవడం చిన్న విషయమా? మీరు సమాజం ఎదుట నిలబడి వారు చెయ్యవలసిన సేవ చేసేలా ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలోనుంచి మిమ్మల్ని ప్రత్యేక పరచుకోవడం మీకు తక్కువగా కనిపిస్తున్నదా? ఆయన నిన్నూ, నీతో లేవీయులైన నీ గోత్రం వారిందర్నీ చేర్చుకున్నాడు గదా. ఇప్పుడు మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు. దీని కోసం నువ్వూ, నీ గుంపూ యెహోవాకు విరోధంగా పోగయ్యారు. మీరు అహరోనును ఎందుకు విమర్శిస్తున్నారు? అతడు కేవలం యెహోవాకు లోబడినవాడు” అన్నాడు. మోషే అప్పుడు ఏలీయాబు కొడుకులు దాతాను అబీరాములను పిలిపించాడు. కాని వారు “మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపాలని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి మమ్మల్ని తీసుకు రావడం చాలదనట్టు, మామీద ప్రభుత్వం చెయ్యడానికి నీకు అధికారం కావాలా? అంతేకాదు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశం లోకి మమ్మల్ని తీసుకు రాలేదు. పొలాలు, ద్రాక్షతోటలు ఉన్న స్వాస్థ్యం మాకివ్వలేదు. మమ్మల్ని శుష్క ప్రియాలతో గుడ్డివారుగా చేస్తావా? మేము రాము” అన్నారు. అందుకు మోషే పట్టరాని కోపంతో, యెహోవాకు చెప్తూ “నువ్వు వారి నైవేద్యాన్ని గుర్తించ వద్దు. ఒక్క గాడిదనైనా నేను వారి దగ్గర తీసుకోలేదు. వారిలో ఎవరికీ నేను హాని చెయ్యలేదు” అన్నాడు. అప్పుడు మోషే కోరహుతో “నువ్వూ, నీ గుంపూ, అంటే నువ్వూ, నీ వారూ, అహరోను, రేపు యెహోవా సన్నిధిలో నిలబడాలి. మీలో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూప సాంబ్రాణి వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవాలి. నువ్వూ, అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలి” అని చెప్పాడు. కాబట్టి వారిల్లో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటిలో నిప్పు ఉంచి వాటి మీద ధూప సాంబ్రాణి వేసినప్పుడు, వారూ, మోషే అహరోనులూ సన్నిధి గుడారం ద్వారం దగ్గర నిలబడ్డారు. కోరహు సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి తన సమాజాన్ని వాళ్లకు విరోధంగా పోగు చేసినప్పుడు, యెహోవా మహిమ సమాజమంతటికీ కనిపించింది. అప్పుడు యెహోవా “మీరు ఈ సమాజంలోనుంచి అవతలికి వెళ్ళండి. తక్షణమే నేను వారిని కాల్చేస్తాను” అని మోషే అహరోనులతో చెప్పినప్పుడు, వారు సాగిలపడి “దేవా, సమస్త మానవాళి ఆత్మలకు దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమాజం అంతటి మీద నువ్వు కోపం చూపిస్తావా?” అని యెహోవాను వేడుకున్నారు. అప్పుడు యెహోవా మోషేకు జవాబిస్తూ, “సమాజమంతటితో చెప్పు, కోరహు, దాతాను, అబీరాముల గుడారాల చుట్టుపట్ల నుంచి వెళ్ళి పొండి” అన్నాడు. అప్పుడు మోషే లేచి, దాతాను అబీరాముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళారు. అతడు “ఈ దుష్టుల గుడారాల దగ్గర నుంచి వెళ్ళి పొండి. మీరు వారి పాపాలన్నిట్లో పాలివారై నాశనం కాకుండా ఉండేలా వాళ్లకు కలిగినది ఏదీ ముట్టుకోకండి” అని ఆ సమాజంతో అన్నాడు. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల గుడారాల దగ్గర నుంచి ఇటు అటు లేచి వెళ్ళిపోయారు. దాతాను, అబీరాము, వారి భార్యలు, వారి కొడుకులు, వారి పసిపిల్లలు తమ గుడారాల ద్వారం దగ్గర నిలబడ్డారు. అప్పుడు మోషే “ఈ కార్యాలన్నీ చెయ్యడానికి యెహోవా నన్ను పంపాడనీ, నా అంతట నేనే వాటిని చెయ్యలేదనీ దీనివల్ల మీరు తెలుసుకుంటారు. మనుషులందరికీ వచ్చే చావు లాంటి చావు వీళ్ళకు వస్తే ప్రతి మనిషికీ కలిగేదే వీళ్ళకూ కలిగితే, యెహోవా నన్ను పంపలేదు. కాని, యెహోవా ఒక అద్భుతం చేసి, వారు ప్రాణాలతోనే పాతాళంలోకి కుంగిపోయేలా భూమి తన నోరు తెరచి వారిని, వాళ్లకు కలిగిన సమస్తాన్నీ మింగేస్తే, వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది” అన్నాడు. మోషే ఆ మాటలన్నీ చెప్పిన వెంటనే వారి కింద ఉన్న నేల తెరుచుకుంది. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందర్నీ, వాళ్లకు చెందిన వాటన్నిటినీ మింగేసింది. వారూ, వారి సంబంధులందరూ ప్రాణాలతో పాతాళంలోకి కుంగిపోయారు. భూమి వారిని మింగేసింది. వారు సమాజంలో ఉండకుండాా నాశనం అయ్యారు. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి కేకలు విని “భూమి మనలను కూడా మింగేస్తుందేమో” అనుకుంటూ పారిపోయారు. అప్పుడు యెహోవా దగ్గర నుంచి అగ్ని బయలుదేరి, ధూపార్పణ తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసింది. అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో చెప్పు, ఆ అగ్ని మధ్యలోనుంచి ఆ ధూపార్తులను ఎత్తు, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ నిప్పుని దూరంగా చల్లు. పాపం చేసి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వీళ్ళ ధూపార్తులను తీసుకుని బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యాలి. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చిన కారణంగా అవి ప్రతిష్ఠితం అయ్యాయి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తుగా ఉంటాయి.” అహరోను సంతాన సంబంధి కాని అన్యుడు ఎవరూ యెహోవా సన్నిధిలో ధూపం అర్పించడానికి వచ్చి, కోరహులా, అతని గుంపులా అయపోకుండా ఇశ్రాయేలీయులకు జ్ఞాపికగా ఉండడానికి కాలిపోయినవారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను యాజకుడైన ఎలియాజరు తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వాటితో బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యించాడు.
సంఖ్యాకాండము 16:1-40 పవిత్ర బైబిల్ (TERV)
కోరహు, దాతాను, అబీరాము, ఓను అనువారు మోషేకు ఎదురు తిరిగారు. (కోరహు ఇస్హారు కుమారుడు. ఇస్హారు కహాతు కుమారుడు, కహాతు లేవీ కుమారుడు. దాతాను, అబీరాములు సోదరులు, ఎలీయాబు కుమారులు. ఓను పెలెతు కుమారుడు). దాతాను, అబీరాము, ఓను రూబేను వంశస్థులు. ఈ నలుగురు ఇశ్రాయేలీయులలో మరో 250 మందిని పోగుజేసి మోషే మీదికి వచ్చారు. ఈ 250 మంది ఇశ్రాయేలీయులలో పేరున్న పెద్ద మనుష్యులు. వారు సభా సభ్యులుగా ఎన్నుకోబడినవారు. వారు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడటానికి గుంపుగా వచ్చి. “మీరు చేసింది మేము ఒప్పుకోవటం లేదు. ఇశ్రాయేలీయుల నివాసంలో ఉన్న వాళ్లంతా పవిత్రులు. వారిలో ప్రతి ఒక్కరూ మంచివారు. పైగా యెహోవా వారితో ఉన్నాడు. అలాంటప్పుడు మేము ఆ దేశంలో ప్రవేశించం అని చెబుతావేమి? నిన్ను నీవే అందరికంటె గొప్ప చేసుకొంటున్నావు” అని వాళ్లు మోషే, అహరోనులతో అన్నారు. మోషే ఈ సంగతులు వినగానే, వినయంతో సాష్టాంగపడ్డాడు (తాను గర్విష్ఠిని కానని చూపించటానికి). అప్పుడు కోరహుతో, అతనితో ఉన్న వాళ్లందరితో మోషే ఇలా అన్నాడు: “వాస్తవానికి ఎవరు యెహోవాకు చెందినవారో రేపు ఉదయం ఆయన తెలియజేస్తాడు. అలాంటివాడిని ఆయన తన దగ్గరకు రానిస్తాడు. ఆ మనిషిని యెహోవా ఎన్నిక చేసి, యెహోవాయే అతడ్ని తన దగ్గరకు తీసుకొస్తాడు. అందుచేత కోరహు, నీవూ, నీ అనుచరులంతా ఇలా చేయాలి. రేపు ధూపార్తుల్లో నిప్పు, సాంబ్రాణి వెయ్యండి. అప్పుడు వాటిని యెహోవా సన్నిధికి తీసుకొనిరండి. నిజంగా పవిత్రుడ్ని యెహోవా ఎంచుకొంటాడు. కానీ, నీవూ, నీ లేవీ సోదరులు తప్పుచేసి మితిమీరిపోయారు.” కోరహుతో మోషే ఇంకా ఇలా అన్నాడు: “లేవీయులారా, నా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని వేరు చేసి, ప్రత్యేకంగా ఉంచినందుకు మీరు సంతోషించాలి. మిగతా ఇశ్రాయేలు ప్రజలందరి కంటె మీరు ప్రత్యేకం. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఆరాధించేందుకు సహాయకరంగా యెహోవా పవిత్ర గుడారంలో ప్రత్యేక పని చేయటానికి యెహోవా మిమ్మల్ని తనకు దగ్గరగా తెచ్చుకొన్నాడు. అది చాలదా? యెహోవా తానే నిన్ను, లేవీ ప్రజలందర్నీ తన దగ్గరకు చేర్చుకొన్నాడు. కానీ ఇప్పుడు మీరే యాజకులు అయ్యేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. నీవూ, నీ అనుచరులూ యెహోవా మీదికి రావటానికి ఏకమయ్యారు. మీరు అహరోను మీదికివచ్చి, అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం తప్పు.” అప్పుడు ఎలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను మోషే పిల్చాడు. కానీ వాళ్లిద్దరు ఇలా చెప్పారు: “మేము రాము. పాలు తేనెలు ప్రవహించే మంచి ధనిక దేశంనుండి నీవు మమ్మల్ని బయటకు తీసుకుచ్చావు. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపటానికి నీవు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చావు. పైగా నీకు మామీద చాల అధికారం ఉన్నట్టు చూపించాలనుకొంటున్నావు. మేము నిన్నెందుకు వెంబండించాలి? పాలు తేనెలు ప్రవహించే ఒక కొత్త ధనిక దేశానికి మమ్మల్ని నీవు తీసుకొని రాలేదు. దేవుడు వాగ్దానం చేసిన దేశం నీవు మాకు ఇవ్వలేదు. పొలాలు, ద్రాక్షాతోటలు ఏవి నీవు మాకు ఇవ్వలేదు. ఈ మనుష్యుల్ని నీ బానిసలుగా చేస్తావా? లేదు, మేము రాము.” అందుచేత మోషేకు చాల కోపం వచ్చింది. అతడు యెహోవాతో “వారి కానుకలు స్వీకరించకు. వారి దగ్గరనుండి నేనేమి తీసుకోలేదు, కనీసం ఒక గాడిదను కూడా తీసుకోలేదు. పైగా వారిలో ఎవ్వరికీ నేనేమి కీడు చేయలేదు” అని చెప్పాడు. అప్పుడు మోషే కోరహుతో అన్నాడు: “నీవూ, నీ అనుచరులంతా రేపు యెహోవా ఎదుట నిలబడాలి. మీతోబాటు అహరోనుకూడ యెహోవా ఎదుట నిలబడతాడు. మీలో ప్రతి ఒక్కరూ ఒక ధూపార్తి తీసుకుని, అందులో సాంబ్రాణి వేసి దానిని యెహోవాకు అర్పించాలి. నాయకులకు 250 ధూపార్తులు, నీకు ఒక ధూపార్తి, అహరోనుకు ఒక ధూపార్తి ఉండాలి.” కనుక ప్రతి ఒక్కరూ ఒక్కో ధూపార్తిని సాంబ్రాణితో నింపారు. అప్పుడు వారు సన్నిధి గుడారపు ప్రవేశం దగ్గర నిలబడ్డారు. మోషే, అహరోను కూడ అక్కడ నిలబడ్డారు. కోరహు తన అనుచరులందరినీ సమావేశపర్చాడు (వీళ్లే మోషే, అహరోనులను ఎదిరించినవారు). సన్నిధి గుడార ప్రవేశం దగ్గర వీళ్లందర్నీ కోరహు సమావేశ పర్చాడు. అప్పుడు అక్కడ ప్రతి ఒక్కరికీ యెహోవా మహిమ ప్రత్యక్షం అయింది. మోషే, అహరోనులతో యెహోవా “ఈ మనుష్యులకు దూరంగా వెళ్లిపోండి, నేను వాళ్లను ఇప్పుడే నాశనం చేసేస్తాను” అన్నాడు. అయితే మోషే, అహరోనూ సాష్టాంగపడిపోయి “ఓ దేవా, మనుష్యులందరి ఆత్మలను ఎరిగిన యెహోవా నీవు. మొత్తం ఈ గుంపు అంతటి మీద కోపగించకు. నిజానికి పాపం చేసింది ఒక్కడే” అంటూ మొరపెట్టారు. అప్పుడు యెహోవా మోషేతో “కోరహు, దాతాను, అబీరాము గుడారాల దగ్గరనుండి అందర్నీ దూరంగా వెళ్లిపొమ్మని చెప్పు” అన్నాడు. మోషే లేచి దాతాను, అబీరాము దగ్గరకు వెళ్లాడు. ఇశ్రాయేలు పెద్దలంతా అతన్ని వెంబడించారు. మోషే ప్రజలను ఈ రీతిగా హెచ్చరించాడు: “ఈ దుర్మార్గుల గుడారాల నుండి దూరంగా వెళ్లిపొండి. వారి వాటిని ఏవీ తాకకండి. మీరు తాకితే వారి పాపాలవల్ల మీరుకూడ నాశనం చేయబడతారు.” కనుక వాళ్లంతా కోరహు, దాతాను, అబీరాము గుడారాలనుండి దూరంగా వెళ్లిపోయారు. దాతాను, అబీరాము వారి భార్యలు, పిల్లలు, శిశువులతోబాటు వారి గుడారాల బయట నిలబడి ఉన్నారు. అప్పుడు మోషే చెప్పాడు: “నేను మీతో చెప్పిన విషయాలన్నీ చేసేందుకు యెహోవా నన్ను పంపించాడని నేను మీకు రుజువు చూపిస్తాను. అవన్నీ నా స్వంత తలంపులు కావని నేను మీకు చూపిస్తాను. ఈ మనుష్యులు ఇక్కడే చస్తారు. కానీ సాధారణంగా మనుష్యులు చనిపోయే సామాన్య విధానంలోనే గనుక వీరు మరణిస్తే, నన్ను నిజంగా యెహోవా పంపించలేదని అర్థం. కానీ ఈ మనుష్యులు వేరే విధంగా, మరో క్రొత్తరకంగా మరణించేటట్టు యెహోవా గనుక చేస్తే అప్పుడు వీళ్లు నిజంగా యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసారని మీకు తెలుస్తుంది. భూమి తెరచుకొని వీళ్లను మింగేస్తుంది. వారు సజీవ సమాధి అయిపోతారు. వీరికి చెందినది అంతా వీరితోబాటే లోపలికి వెళ్లిపోతుంది.” మోషే ఈ మాటలు చెబుతూ ఉండగానే ఆ మనుష్యుల కాళ్ల క్రింద భూమి తెరచుకొంది. అది భూమి తన నోరు తెరచి వారిని మింగివేసినట్టుగా ఉంది. వారి కుటుంబాలన్నీ, కోరహు మనుష్యులంతా, వారికి ఉన్నదంతా భూమిలోకి వెళ్లిపోయింది. వారు సజీవంగానే సమాధిలోనికి వెళ్లిపోయారు. వారికి ఉన్నదంతా వారితో బాటే లోపలికి వెళ్లిపోయింది. అప్పుడు వారిమీద భూమి కప్పివేసింది. వారు నాశనమైపోయి, పాళెములో లేకుండా పోయారు. నాశనం చేయబడుతోన్న మనుష్యుల అరుపులు ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. అందుచేత వాళ్లంతా “భూమి మనల్నికూడ మ్రింగివేస్తుంది” అంటూ అటు ఇటు పరుగులెత్తారు. తర్వాత యెహోవా దగ్గర్నుండి అగ్ని దిగి వచ్చి, ధూపం వేస్తున్న ఆ 250 మందిని నాశనం చేసింది. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “చచ్చిన ఆ మనుష్యుల మధ్య ఉన్న ధూపార్తులన్నింటినీ వెదకమని యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుతో చెప్పు. ఆ నిప్పుకణికలను నివాసానికి దూరంగా చల్లండి. ధూపార్తులు ఇంకా పవిత్రమైనవే. ఇవి నాకు వ్యతిరేకంగా పాపం చేసిన మనుష్యులు ఉపయోగించిన ధూపార్తులు. వారి పాపం వారి ప్రాణాలు తీసింది. ధూపార్తులను రేకులుగా కొట్టండి. బలిపీఠం కప్పటానికి ఈ రేకులు వాడండి. అవి యెహోవా ఎదుట అర్పించబడినవి గనుక అవి పవిత్రం. రేకులు చేయబడ్డ ఆ ధూపార్తులు ఇశ్రాయేలు ప్రజలందరకు హెచ్చరికగా ఉండుగాక!” కనుక ఆ మనుష్యుల ఇత్తడి ధూపార్తులను అన్నింటినీ ఎలియాజరు పోగుచేసాడు. వాళ్లంతా కాల్చివేయబడ్డారు గాని ధూపార్తులు మాత్రం అక్కడ ఉన్నాయి. ఆ ధూపార్తులను వెడల్పు రేకులుగా కొట్టమని కొందరితో చెప్పాడు ఎలియాజరు. అప్పుడు ఆ వెడల్పు రేకులను అతడు బలిపీఠం చుట్టూ పెట్టాడు. మోషే ద్వారా యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఇలా చేసాడు. అహరోను కుటుంబానికి చెందిన వ్యక్తి మాత్రమే యెహోవా ఎదుట ధూపం వేయాలని ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఇది సహాయకరమైన సూచన. ఇంకొక వ్యక్తి గనుక యెహోవా ఎదుట ధూపం వేస్తే, అతడు కోరహు, అతని అనుచరుల్లా అవుతాడు.
సంఖ్యాకాండము 16:1-40 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
లేవీ మునిమనమడు, కహాతు మనుమడు, ఇస్హారు కుమారుడగు కోరహు, కొంతమంది రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములు, పేలెతు కుమారుడైన ఓనులు కొంతమందిని పోగు చేసి, మోషేకు ఎదురు తిరిగారు. వారితో 250 మంది ఇశ్రాయేలు నాయకులు, సమాజ నాయకులుగా ఏర్పరచబడిన ప్రముఖులు చేరారు. వారంతా మోషే, అహరోనులకు విరోధంగా పోగై, “మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు! సర్వసమాజంలో ప్రతిఒక్కరు పరిశుద్ధంగానే ఉన్నారు, యెహోవా వారితో ఉన్నారు. అలాంటప్పుడు యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు?” అని అడిగారు. మోషే ఇది విని సాగిలపడ్డాడు. తర్వాత కోరహుతో, అతని సహచరులందరితో ఇలా అన్నాడు: “రేపు ప్రొద్దున యెహోవా తన వారు ఎవరో పవిత్రులెవరో బయలుపరచి తన దగ్గరకు రానిస్తారు. తాను ఎన్నుకున్న మనిషిని ఆయన తన దగ్గరకు రానిస్తారు. కోరహూ! నీవూ, నీ వెంట ఉన్న సమస్త సమూహం ఇలా చేయండి: ధూపార్తులు తీసుకోండి రేపు యెహోవా ఎదుట వాటిలో నిప్పు తెచ్చి ధూపం వేయండి. యెహోవా ఎవరిని ఎన్నుకుంటారో అతడు పవిత్రుడు. లేవీయులారా! మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు!” మోషే కోరహుతో మాట్లాడుతూ, “ఇప్పుడు వినండి లేవీయులారా! ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని మిగిలిన ఇశ్రాయేలీయుల సమాజం నుండి వేరుచేసి, యెహోవా గుడారంలో పని చేయడానికి, సమాజం ముందు నిలబడి వారికి సేవ చేయడానికి మిమ్మల్ని దగ్గరకు తీసుకువచ్చినందుకు ఇది మీకు సరిపోదా? నిన్ను, నీ తోటి లేవీయులను ఆయన చేర్చుకున్నారు, కానీ ఇప్పుడు యాజకత్వం కూడా కావాలని మీరు ప్రయత్నిస్తున్నారు. యెహోవాకు విరోధంగా నీవు నీ పక్షంవారు గుమికూడారు. మీరు అహరోను మీద సణగడానికి అతనెవరు?” అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను పిలిపించాడు. కానీ వారు, “మేము రాము! మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే భూమి నుండి ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకువచ్చారు, అది చాలదా? ఇప్పుడు నీవు మాపై ప్రభువుగా కూడా ఉండాలనుకుంటున్నావు! అంతేకాక, మీరు మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురాలేదు లేదా పొలాలు ద్రాక్షతోటల వారసత్వాన్ని మాకు ఇవ్వలేదు. మీరు ఈ మనుష్యులను బానిసలుగా చూడాలనుకుంటున్నారా? మేము రాము!” అని అన్నారు. మోషేకు చాలా కోపం వచ్చి యెహోవాతో, “వారి అర్పణలు స్వీకరించకండి. వారి దగ్గర నుండి కనీసం ఒక గాడిదను కూడా నేను తీసుకోలేదు, వారిలో ఎవరి పట్ల ఏ తప్పు చేయలేదు” అని అన్నాడు. మోషే కోరహుతో అన్నాడు, “రేపు నీవూ నీ అనుచరులు అనగా నీవు, వారు, అహరోను యెహోవా ఎదుట నిలబడాలి. మీలో ప్రతి ఒక్కరు తమ ధూపార్తి చేతపట్టుకుని ధూపం వేయాలి. అన్నీ కలిపి 250 ధూపార్తులు యెహోవా ఎదుట దానిని సమర్పించాలి. నీవు అహరోను కూడా మీ ధూపార్తులు సమర్పించాలి.” కాబట్టి ప్రతి ఒక్కరు తమ ధూపార్తిలో నిప్పువేసి దాని మీద ధూపం వేసి సమావేశ గుడార ద్వారం దగ్గర, మోషే అహరోనులతో నిలిచారు. కోరహు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా తన పక్షం వారినందరిని సమావేశ గుడార ప్రవేశం దగ్గర పోగు చేశాడు. అప్పుడు యెహోవా మహిమ సమాజమంతటికి కనిపించింది. యెహోవా మోషే అహరోనులతో అన్నారు, “ఒక్కసారిగా నేను వారిని నాశనం చేయడానికి అనుకూలంగా ఉండేలా మీరు ఈ సమాజం నుండి వేరుగా నిలబడండి.” కానీ మోషే అహరోనులు సాగిలపడి, “ఓ దేవా! సర్వ ప్రాణులకు ఊపిరి ఇచ్చే దేవా, ఒక్క మనిషి పాపం చేస్తే సమాజమంతటి మీద కోప్పడతారా?” అని వేడుకున్నారు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పారు. “సమాజంతో చెప్పు, ‘కోరహు, దాతాను, అబీరాముల డేరాల నుండి దూరంగా వెళ్లండి.’ ” మోషే లేచి దాతాను, అబీరాముల దగ్గరకు వెళ్లాడు. ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్లారు. అతడు సమాజాన్ని హెచ్చరించాడు, “ఈ దుష్టుల డేరాల నుండి దూరంగా వెళ్లండి! వారికి చెందిన దేన్ని తాకకండి, లేదా వారి పాపాలన్నిటిని బట్టి మీరు తుడిచివేయబడతారు.” కాబట్టి కోరహు, దాతాను, అబీరాములు డేరాల దగ్గర నుండి వారు కదిలి దూరంగా వెళ్లారు. దాతాను, అబీరాములు వారి భార్యాపిల్లలు చిన్న పిల్లలు తమ డేరాల ద్వారాలలో నిలబడి ఉన్నారు. అప్పుడు మోషే అన్నాడు, “యెహోవా ఇవన్నీ చేయడానికి నన్ను పంపించారని, నా అంతట నేనే ఏమీ చేయలేదని ఇలా మీరు తెలుసుకుంటారు: ఈ మనుష్యులు, సహజ మరణం పొందితే, మనుష్యులు అనుభవించు విధిని వీరు అనుభవిస్తే, అప్పుడు యెహోవా నన్ను పంపలేదు. కానీ ఒకవేళ యెహోవా పూర్తిగా క్రొత్తదాన్ని తెస్తే, భూమి తన నోరు తెరిచి, వారికి సంబంధించిన ప్రతి దానితో పాటు వారిని మ్రింగివేసి, వారు సజీవంగా పాతాళంలోకి వెళ్తే, వీరు యెహోవాతో ధిక్కారంతో వ్యవహరించారని మీకు తెలుస్తుంది.” మోషే ఈ మాటలు చెప్పి ముగించిన వెంటనే వారి పాదాల క్రింద నేల చీలిపోయింది, భూమి నోరు తెరిచి, ఆ మనుష్యులను వారి ఇంటివారిని, కోరహు పక్షంగా ఉన్నవారందరిని, వారి ఆస్తితో సహా మ్రింగివేసింది. వారంతా వారికి చెందిన సమస్తంతో పాటు ప్రాణంతోనే పాతాళంలోకి వెళ్లారు; భూమి వారిని కప్పేసింది. వారంతా సమాజంలో లేకుండా నాశనమయ్యారు. వారి కేకలు విని చుట్టూరా ఉన్న ఇశ్రాయేలీయులు, “మనలను కూడా భూమి మ్రింగివేస్తుంది!” అని అంటూ అరుస్తూ పారిపోయారు. యెహోవా దగ్గర నుండి మంటలు లేచి ధూపారాధన చేసే 250 మందిని కాల్చివేసింది. యెహోవా మోషేతో అన్నారు, “యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరుకు, బూడిదలో నుండి ఆ ధూపార్తులను తీసివేసి నిప్పు కణాలను దూరంగా చెదరగొట్టమని చెప్పు, ఎందుకంటే అవి పవిత్రమైన ధూపార్తులు. పాపం చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వారి ధూపార్తులు. వాటిని చెడగొట్టి, రేకులుగా చేసి, వాటిని బలిపీఠం కప్పుగా వాడాలి, అవి యెహోవా ఎదుట సమర్పించబడినవి కాబట్టి పవిత్రమైనవి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తులుగా ఉండును గాక.” కాబట్టి యాజకుడైన ఎలియాజరు కాల్చి చంపబడినవారు తీసుకువచ్చిన ఇత్తడి ధూపార్తులను సేకరించి, బలిపీఠం మీద కప్పి ఉండేలా వాటిని సుత్తెతో కొట్టించాడు, యెహోవా మోషే ద్వారా అతనికి సూచించిన ప్రకారం చేశాడు. అలా ఎందుకు చేయించారంటే, అహరోను వంశస్థుడు తప్ప ఇతరులెవ్వరు యెహోవా ఎదుట ధూపం వేయడానికి రాకూడదని, వస్తే కోరహు అతని అనుచరుల్లా అవుతారని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేయడానికి.