సంఖ్యాకాండము 16

16
1లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని 2ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబదిమందితో మోషేకు ఎదురుగా లేచి 3మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి–మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవావారి మధ్యనున్నాడు; యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా, 4మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను 5–తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చు కొనును. 6ఈలాగు చేయుడి; కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి. 7అప్పుడు యెహోవా యే మనుష్యుని యేర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు. 8మరియు మోషే కోరహుతో ఇట్లనెను–లేవి కుమారులారా వినుడి. 9తన మందిరసేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడునా? 10ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారినందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వము కూడ కోరుచున్నారు. 11ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగ నేల అనెను. 12అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. 13అయితే వారు–మేము రాము; ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములోనుండి మమ్మును తీసికొనివచ్చుట చాలనట్టు, మామీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా? 14అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసికొని రాలేదు; పొలములు ద్రాక్షతోటలుగల స్వాస్థ్యము మాకియ్యలేదు; ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి. 15అందుకు మోషే మిక్కిలి కోపించి–నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొనలేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవిచేసెను. 16మరియు మోషే కోరహుతో– నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. 17మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటిమీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను. 18కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసికొని వాటిలో అగ్నియుంచి వాటిమీద ధూప ద్రవ్యము వేసినప్పుడు, వారును మోషే అహరోనులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచిరి. 19కోరహు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను. 20అప్పుడు యెహోవా–మీరు ఈ సమాజములోనుండి అవతలికి వెళ్లుడి. 21క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా 22వారు సాగిలపడి–సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీయొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజముమీద నీవు కోపపడుదువా? అని వేడు కొనిరి. 23-24అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–కోరహు దాతాను అబీరాములయొక్క నివాసముల చుట్టుపెట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము. 25అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి. 26అతడు–ఈ దుష్టుల గుడారములయొద్దనుండి తొలగిపోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. 27కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసములయొద్దనుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి. 28మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలిసికొందురు. 29మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందినయెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్ను పంపలేదు. 30అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలనవారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మ్రింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను. 31అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించ గానే వారి క్రింది నేల నెరవిడిచెను. 32భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మ్రింగివేసెను. 33వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; భూమి వారిని మ్రింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి. 34వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష విని–భూమి మనలను మ్రింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. 35మరియు యెహోవాయొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చి వేసెను. 36అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము–ఆ అగ్నిమధ్యనుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. 37ఆ అగ్నిని దూరముగా చల్లుము. 38పాపముచేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసికొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి; అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. 39-40అహరోను సంతాన సంబంధికాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి, కోరహువలెను అతని సమాజమువలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకసూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడినవారు అర్పించిన యిత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులు చేయించెను.
41మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు–మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి 42సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారమువైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను; యెహోవా మహిమయు కనబడెను. 43మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా 44యెహోవా–మీరు ఈ సమాజము మధ్యనుండి తొలగి పోవుడి, 45క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి. 46అప్పుడు మోషే–నీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా 47మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. 48అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికినిమధ్యను నిలువబడగా తెగులు ఆగెను. 49కోరహు తిరుగుబాటున చనిపోయినవారు గాక పదునాలుగువేల ఏడువందలమంది ఆ తెగులుచేత చచ్చిరి. 50ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరనున్న మోషేయొద్దకు తిరిగి వచ్చెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 16: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి