సంఖ్యాకాండము 11:16-35
సంఖ్యాకాండము 11:16-35 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను నాయొద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతోకూడ నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లువారు దానిలో నొక పాలు నీతోకూడ భరింపవలెను. నీవు జనులను చూచి యిట్లనుము–మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచు కొనుడి; మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి–మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు. ఒక నెలదినములవరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలోనుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దానిని తిందురు; ఏలయనగా మీరు మీ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి–ఐగుప్తులోనుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి. అందుకు మోషే–నేను ఈ జనులమధ్య ఉన్నాను; వారు ఆరు లక్షల పాదచారులు–వారు నెలదినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితివి. వారు తృప్తిగా తినునట్లు వారినిమిత్తము గొఱ్ఱెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నియు వారినిమిత్తము కూర్చవలెనా? అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను– యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ యెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను పోగుచేసి గుడారముచుట్టు వారిని నిలువబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతనిమీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరిగాని మరల ప్రవచింపలేదు. ఆ మనుష్యులలో నిద్దరు పాళెములో నిలిచియుండిరి; వారిలో ఒకనిపేరు ఎల్దాదు, రెండవ వానిపేరు మేదాదు; వారి మీదను ఆత్మ నిలిచియుండెను; వారు వ్రాయబడినవారిలోను ఉండియు వారు గుడారమునకు వెళ్లక తమ పాళెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యౌవనుడు మోషే యొద్దకు పరుగెత్తివచ్చి–ఎల్దాదు మేదాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకొనినవారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ–మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను. అందుకు మోషే–నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును పాళెములోనికి వెళ్లిరి. తరువాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్లను రప్పించి పాళెముచుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరమువరకు భూమిమీద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటినిపరచిరి. ఆ మాంసము ఇంక వారి పండ్ల సందున నుండగానే, అది నమలకమునుపే, యెహోవా కోపము జనులమీద రగులుకొనెను; యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. జనులు కిబ్రోతు హత్తావానుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి.
సంఖ్యాకాండము 11:16-35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలు 70 మందిని నాదగ్గరికి తీసుకురా. వారు ప్రజల్లో పెద్దలనీ అధిపతులనీ స్పష్టంగా గుర్తించి తీసుకురా. వారిని సన్నిధి గుడారం దగ్గరికి తీసుకుని రా. వారిని నీతో కూడా నిలబెట్టు. అక్కడ నేను దిగి నీతో మాట్లాడతాను. తరువాత నీ మీద ఉన్న ఆత్మలో కొంత వారి పైన ఉంచుతాను. వారు నీతో కలసి ప్రజల భారాన్ని మోస్తారు. నువ్వు ఒంటరిగా ఈ భారం మోయాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రజలకుఇలా చెప్పు. రేపటికి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. యెహోవా రాకకై సిద్ధపడండి. యెహోవా వింటుండగా మీరు ఏడ్చారు కాబట్టి మీరు కచ్చితంగా మాంసం తింటారు. ‘మాకు మాంసం ఎవరు పెడతారు? మాకు ఐగుప్తులోనే బాగుంది’ అన్నారు గదా. అందుకని యెహోవా మీకు మాంసం ఇస్తాడు. మీరు దాన్ని తింటారు. ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, ఐదు రోజులు కాదు, పది రోజులు కాదు, ఇరవై రోజులు కాదు. ఒక నెల రోజులు మీరు మాంసం తింటారు. అది మీ ముక్కు పుటాల్లోంచి బయటకు వచ్చి మీకు అసహ్యం పుట్టే వరకూ తింటారు. మీరు మీ మధ్య ఉన్న యెహోవాను తిరస్కరించారు కాబట్టి అది మీకు వెగటు పుట్టిస్తుంది. ఆయన ముందు మీరు ఏడ్చారు. ‘ఐగుప్తు నుండి ఎందుకు వచ్చాం?’ అన్నారు.” దానికి మోషే “నేను ఆరు లక్షలమంది జనంతో ఉన్నాను. నువ్వేమో ‘ఒక నెల అంతా వాళ్లకి మాంసం ఇస్తాను’ అంటున్నావు. ఇప్పుడు వారిని తృప్తి పరచడానికి గొర్రెలను, పశువులను చంపాలా? సముద్రంలో ఉన్న చేపలన్నిటినీ వారి కోసం పట్టాలా?” అన్నాడు. అప్పుడు యెహోవా మోషేతో “నా బాహుబలానికి శక్తి తగ్గిందా? నా మాట నిజమో కాదో నువ్వు ఇప్పుడే చూస్తావు” అన్నాడు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలు ప్రజలకు చెప్పాడు. ప్రజల్లోనుండి 70 మంది పెద్దలను గుడారం చుట్టూ నిలబెట్టాడు. అప్పుడు యెహోవా మేఘంలో దిగాడు. అతనితో మాట్లాడాడు. అతని పైన ఉన్న ఆత్మలో ఒక భాగాన్ని పెద్దల పైన ఉంచాడు. ఆత్మ వారిపై ఉన్నప్పుడు వారు ప్రవచనం చెప్పారు. వారంతా ఆ సందర్భంలోనే ప్రవచించారు, ఆ తరువాత ఎప్పుడూ ప్రవచనం చెప్పలేదు. ఆ మనుషుల్లో ఇద్దరు శిబిరంలో ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. ఆత్మ వారిపై కూడా నిలిచాడు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి కానీ వారు గుడారం దగ్గరకి వెళ్ళలేదు. అయినా వారి శిబిరంలోనే వారు ప్రవచించారు. అప్పుడు శిబిరంలో ఒక యువకుడు మోషే దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి “ఎల్దాదు, మేదాదులు శిబిరంలో ప్రవచిస్తున్నారు” అని చెప్పాడు. మోషే సహాయకుడూ, తాను ఎన్నుకున్న వారిలో ఒకడూ, నూను కొడుకూ అయిన యెహోషువ “మోషే, నా యజమానీ, వారిని ఆపు” అన్నాడు. దానికి మోషే “నా కోసం నీకు రోషం వచ్చిందా? అసలు యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలని కోరుకుంటున్నాను. దాని కోసం యెహోవా తన ఆత్మని అందరి పైనా ఉంచుతాడు గాక” అని అతనితో చెప్పాడు. అప్పుడు మోషే, ఇశ్రాయేలు పెద్దలంతా శిబిరంలోకి వెళ్ళారు. అప్పుడు యెహోవా దగ్గరనుండి వాయువు బయల్దేరింది. అది సముద్రం నుండి పూరేడు పిట్టలను తీసుకు వచ్చి శిబిరంలో అంతటా పడవేసింది. ఈ వైపునుండి ఆ వైపుకీ, ఆ వైపునుండి ఈ వైపుకీ ఒక రోజు ప్రయాణమంత దూరం వరకూ అవి వచ్చి పడ్డాయి. అవి భూమికి రెండు మూరల ఎత్తున పడ్డాయి. కాబట్టి ప్రజలు ఉదయాన్నే లేచి ఆ రోజంతా వాటిని సేకరించారు. ఆ రాత్రీ మరుసటి రోజు అంతా వాటిని సేకరించారు. నూరు తూముల పిట్టల కంటే తక్కువ సేకరించినవాడు లేడు. తరువాత వారు వాటిని శిబిరం చుట్టూ తమ కోసం పరచి ఉంచారు. ఆ మాంసం వారి పళ్ళ మధ్య ఉండగానే, వారు దాన్ని నములుతూ ఉన్నప్పుడే యెహోవా వారిపై ఆగ్రహించాడు. పెద్ద రోగంతో ఆయన వారిని బాధించాడు. మాంసం కోసం అతిగా ఆశ పడిన వారిని ప్రజలు ఒక స్థలంలో పాతిపెట్టారు. అందుకే ఆ స్థలానికి “కిబ్రోతు హత్తావా” అనే పేరు కలిగింది. ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకి ప్రయాణమై వెళ్ళారు. అక్కడ నివసించారు.
సంఖ్యాకాండము 11:16-35 పవిత్ర బైబిల్ (TERV)
మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల పెద్దలను (నాయకులను) 70 మందిని నాదగ్గరకు తీసుకొనిరా. వీరు ప్రజలలో నాయకులు. సన్నిధి గుడారం దగ్గరకు వారిని తీసుకొనిరా. అక్కడ నీతోబాటు వారిని నిలబెట్టు. అప్పుడు నేను దిగివచ్చి, అక్కడ నీతో మాట్లాడతాను. ఇప్పుడు నీ మీదికి వచ్చిన ఆత్మను వారికికూడ నేను కొంత ఇస్తాను. అప్పుడు నీవు ప్రజల బాధ్యత వహించటంలో వారు కూడ నీకు సహాయం చేస్తారు. ఈ విధంగా ఈ ప్రజల బాధ్యత నీవు ఒంటరిగా భరించాల్సిన అవసరం ఉండదు. “ప్రజలతో ఇలా చెప్పు: రేపటికోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. రేపు మీరు మాంసం తింటారు. మీ ఏడ్పు యెహోవా విన్నాడు. ‘తినటానికి మాకు మాంసం కావాలి. ఈజిప్టులోనే బాగుంది మాకు’ అని మీరు చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. కనుక యెహోవా ఇప్పుడు మీకు మాంసం ఇస్తాడు. మీరు అది తింటారు. ఒకటి, రెండు, అయిదు, పది, ఇరవై రోజులకంటె ఎక్కువగానే మీరు అది తింటారు. ఒక నెల అంతా మీరు ఆ మాంసం తింటారు. మొఖం మొత్తేటంతవరకు మీరు ఆ మాంసం తింటారు. యెహోవాకు వ్యతిరేకంగా మీరు ఫిర్యాదు చేసారు కనుక మీకు ఇలా జరుగుతుంది. యెహోవా మీ మధ్య సంచరిస్తూ, మీ అవసరాలను గ్రహిస్తాడు. కానీ మీరు ఆయన ఎదుట ఏడ్చి, ఫిర్యాదు చేసారు! అసలు ‘మేము ఈజిప్టు ఎందుకు విడిచిపెట్టాము’ అన్నారు మీరు.” మోషే ఇలా అన్నాడు: “యెహోవా, ఇక్కడ 6,00,000 మంది పురుషులు సంచరిస్తున్నారు. ‘నీవేమో వారు ఒక నెలంతా తినటానికి సరిపోయే మాంసం ఇస్తాను అంటున్నావు!’ మొత్తం గొర్రెలు, పశువులు అన్నింటినీ వధించినా, ఇంత మంది ప్రజలకు ఒక నెల అంతా భోజనంగా పెట్టాలంటే అది చాలదు. అలానే సముద్రంలో ఉన్న మొత్తం చేపలన్నీ మేము పట్టినా, అవీ వారికి చాలవు.” అయితే, “యెహోవా శక్తిని పరిమితం చేయకు. నేను చేస్తానని చెప్పినవాటిని చేస్తానో లేదో నీవు చూస్తావు” అని మోషేతో యెహోవా చెప్పాడు. కనుక మోషే ప్రజలతో మాట్లాడటానికి బయటకు వెళ్లాడు. యెహోవా చెప్పినది మోషే వారితో చెప్పాడు. అప్పుడు మోషే 70 మంది పెద్దలను సమావేశ పరచాడు. గుడారం చుట్టూ నిలబడమని మోషే వారితో చెప్పాడు. అప్పుడు యెహోవా ఒక మేఘంలో దిగివచ్చి, మోషేతో మాట్లాడాడు. మోషే మీద ఉన్న దేవుని ఆత్మను ఆ 70 మంది పెద్దల మీద ఉంచాడు యెహోవా. ఆత్మ వారిమీదికి దిగిరాగానే వారు ప్రవచించటం మొదలు పెట్టారు. అయితే ఈ ఒక్కసారి మాత్రమే ఆ మనుష్యులు ఇలా చేసారు. ఎల్దాదు, మేదాదు అనే అద్దరు పెద్దలు బయట గుడారం దగ్గరకు వెళ్లలేదు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి గాని వారు వారి గుడారంలోనే ఉండిపోయారు. కానీ దేవుని ఆత్మ వారిమీదకి కూడ వచ్చినందుచేత, వారుకూడ వారి గుడారంలోనే ప్రవచించటం మొదలుపెట్టారు. ఒక యువకుడు పరుగెత్తి వెళ్లి మోషేతో చెప్పాడు. “ఎల్దాదు, మేదాదు గుడారంలోనే ప్రవచిస్తున్నారు” అని అతడు చెప్పాడు. అయితే నూను కుమారుడైన యెహోషువ “అయ్యా మోషే, నీవు వారిని ఆపివేయాలి” అని మోషేతో చెప్పాడు. (యెహోషువ చిన్నతనం నుండి మోషేకు సహాయకుడుగా ఉన్నాడు.) కాని మోషే, “ఇప్పుడు నేను నాయకుడ్ని కానని ప్రజలు తలుస్తారేమోనని నీవు భయపడుతున్నావా? యెహోవా ప్రజలు అందరూ ప్రవచిస్తే బాగుటుందని నా ఆశ. వారందరి మీద యెహోవా తన ఆత్మను ఉంచితే బాగుండునని నా ఆశ” అని బదులు చెప్పాడు. అప్పుడు మోషే, ఇశ్రాయేలు నాయకులు అంతా తిరిగి గుడారాలకు వెళ్లిపోయారు. అప్పుడు యెహోవా సముద్రం నుండి గొప్పగాలి వీచేటట్టుగా చేసాడు. ఆ గాలి పూరేళ్లను ఆ ప్రాంతంలోకి విసిరాయి. వారి నివాసాల చుట్టూరా పూరేళ్లు ఎగిరాయి. నేల అంతా పూరేళ్లతో నిండి పోయేటన్ని ఉన్నాయి అవి. నేలమీద మూడు అడుగుల ఎత్తుగా పూరేళ్లు నిండిపోయాయి. ఒక మనిషి ఒక రోజున నడువగలిగినంత దూరం అన్ని దిశల్లో పూరేళ్లు ఉన్నాయి. ప్రజలు బయటకు వెళ్లి ఆ రాత్రి పగలు అంతా పూరేళ్లను ఏరుకొన్నారు. ఆ మర్నాడు అంతా వారు పూరేళ్లు పోగుచేసుకొన్నారు. తక్కువ కూర్చుకొన్నవాడు నూరు తూములుకన్నా ఎక్కువ పూరేళ్లను పోగుచేసుకున్నాడు. తర్వాత ప్రజలు ఆ పూరేళ్లను వారి గుడారాల చుట్టూ ఎండటానికి ఎండలో పరిచారు. ప్రజలు మాంసం తినటం మొదలుపెట్టారు కాని యెహోవాకు చాల కోపం వచ్చింది. ఆ మాంసం ఇంకా వారి నోటిలో ఉండగానే, ప్రజలు దానిని తినటంముగించక ముందే ఆ ప్రజలకు భయంకరమైన రోగం వచ్చేటట్టు చేసాడు యెహోవా. అనేకులు అక్కడే మరణించినందువల్ల అక్కడే పాతిపెట్టబడ్డారు. కనుక ప్రజలు ఆ చోటుకు కిబ్రోత్ హత్తావా అని పేరు పెట్టారు. గొప్ప భోజనం కోసం బలీయమైన కోరికగల వారందరినీ అక్కడ పాతిపెట్టినందువల్ల వారు ఆ చోటుకు ఆ పేరు పెట్టారు. కిబ్రోత్ హత్తావా నుండి ప్రయాణం చేసి ప్రజలు హజేరోతు చేరి అక్కడ నివసించారు.
సంఖ్యాకాండము 11:16-35 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా మోషేతో: “ఇశ్రాయేలు గోత్ర పెద్దలను డెబ్బై మందిని నాయకులుగా, ఎవరైతే పెద్దలుగా ఉన్నవారు నీకు తెలిసినవారిని తీసుకురా. నీతో వారు నిలబడేలా వారు సమావేశ గుడారం దగ్గరకు రావాలి. నేను దిగివచ్చి నీతో మాట్లాడతాను. నీ మీద ఉన్న ఆత్మ యొక్క శక్తిలో కొద్ది భాగం వారి మీద పెడతాను. వారు నీతో కలిసి ప్రజల భారం పంచుకుంటారు అప్పుడు నీవు ఒంటరిగా మోయనవసరం ఉండదు. “నీవు ప్రజలకు ఇలా చెప్పు: ‘రేపటి కోసం మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి, రేపు మీరు మాంసం తినబోతున్నారు. మీరు, “మాకు మాంసం మాత్రం ఉంటే బాగుండేది! ఈజిప్టులో మాకు బాగుండేది!” అని ఏడ్వడం యెహోవా విన్నారు కాబట్టి యెహోవా మీకు మాంసం ఇస్తారు, మీరు తింటారు. దానిని మీరు తినడం ఒక రోజు కాదు, రెండు రోజులు, అయిదు రోజులు, పది రోజులు, యిరవై రోజులు కాదు, ఒక నెలంతా మీ నాసికా రంధ్రాల నుండి బయటకు వచ్చి మీరు అసహ్యించుకునే వరకు తింటారు; ఎందుకంటే మీరు మీ మధ్య ఉన్న యెహోవాను నిరాకరించి, “మేము అసలు ఈజిప్టును ఎందుకు విడిచిపెట్టామో?” అంటూ ఆయన ఎదుట ఏడ్చారు.’ ” అయితే మోషే, “నేను ఆరు లక్షలమంది పాదాచారుల మధ్య ఉన్నాను, మీరేమో, ‘నేను వారికి నెలరోజులు తినడానికి సరిపడే మాంసం ఇస్తాను!’ అని అన్నారు. ఉన్న పశువులు, మందలు అన్నిటిని వధించినా వీరికి సరిపోతుందా? సముద్రంలో చేపలన్నీ పట్టినా వీరికి సరిపోతాయా?” యెహోవా మోషేకు జవాబిస్తూ, “యెహోవా బాహుబలం తక్కువయ్యిందా? నేను చెప్పింది జరుగుతుందో లేదో నీవు చూస్తావు” అని అన్నారు. మోషే బయటకు వెళ్లి యెహోవా చెప్పిందంతా ప్రజలకు తెలియజేశాడు. డెబ్బైమంది గోత్ర పెద్దలను తెచ్చి మందిరం చుట్టూ నిలబెట్టాడు. అప్పుడు యెహోవా మేఘంలో దిగివచ్చి అతనితో మాట్లాడారు. అతనిపై ఉన్న ఆత్మ శక్తిలో కొంత ఆ డెబ్బై గోత్ర పెద్దలపై ఉంచినప్పుడు ఆత్మ వారిమీద నిలిచి వారు ప్రవచించారు అయితే, తర్వాత ఎన్నడు ప్రవచించలేదు. అయితే, ఇద్దరు, శిబిరంలోనే ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. వారు గోత్ర పెద్దలలో ఉన్నవారే, కానీ గుడారం బయటకు వెళ్లలేదు. అయినప్పటికీ ఆత్మ వారి మీద ఉంది, వారు శిబిరంలో ప్రవచించారు. ఒక యువకుడు మోషే దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, “ఎల్దాదు, మేదాదు శిబిరంలో ప్రవచిస్తున్నారు” అని చెప్పాడు. నూను కుమారుడైన యెహోషువ, యవ్వనకాలం నుండి మోషే దగ్గరే ఉన్నవాడు, అతడు మాట్లాడుతూ, “మోషే, నా ప్రభువా, వారిని ఆపండి!” అని అన్నాడు. కానీ మోషే అతనితో, “నా పక్షంగా నీవు అసూయపడుతున్నావా? నేనైతే యెహోవా ప్రజలంతా ప్రవక్తలు కావాలని, యెహోవా తన ఆత్మ వారందరి మీద ఉంచాలని కోరతాను!” అని జవాబిచ్చాడు. తర్వాత మోషే, ఇశ్రాయేలు గోత్ర పెద్దలు, శిబిరానికి తిరిగి వెళ్లారు. తర్వాత యెహోవా దగ్గరి నుండి గాలి వెళ్లి సముద్రం దిక్కునుండి పూరేళ్ళను తీసుకువచ్చింది. అది వాటిని రెండు మూరల ఎత్తుగా, ఏ దిశలోనైనా ఒక రోజు నడకంత దూరంగా శిబిరం చుట్టూరా చెదరగొట్టింది. ఆ దినమంతా, రాత్రంతా, మరుసటి రోజంతా, ప్రజలు బయటకు వెళ్లి పూరేళ్ళను సమకూర్చుకున్నారు. ఏ ఒక్కరు కూడా పది హోమెర్ల కంటే తక్కువ పోగు చేసుకోలేదు. వాటిని శిబిరం చుట్టూ పరిచారు. అయితే, మాంసం పళ్ళ సందుల్లో ఉండగానే దానిని నమిలి మ్రింగకముందే, యెహోవా కోపం వారిపై రగులుకుంది, ఆయన వారిని భయంకరమైన తెగులుతో మొత్తారు. ఆ స్థలంలో ఇతర ఆహారం కోసం ఆశపడిన వారిని పాతిపెట్టినందుకు ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా అనే పేరు పెట్టారు. ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణం చేసి అక్కడే ఉండిపోయారు.