యెహోవా మోషేతో: “ఇశ్రాయేలు గోత్ర పెద్దలను డెబ్బై మందిని నాయకులుగా, ఎవరైతే పెద్దలుగా ఉన్నవారు నీకు తెలిసినవారిని తీసుకురా. నీతో వారు నిలబడేలా వారు సమావేశ గుడారం దగ్గరకు రావాలి. నేను దిగివచ్చి నీతో మాట్లాడతాను. నీ మీద ఉన్న ఆత్మ యొక్క శక్తిలో కొద్ది భాగం వారి మీద పెడతాను. వారు నీతో కలిసి ప్రజల భారం పంచుకుంటారు అప్పుడు నీవు ఒంటరిగా మోయనవసరం ఉండదు.
“నీవు ప్రజలకు ఇలా చెప్పు: ‘రేపటి కోసం మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి, రేపు మీరు మాంసం తినబోతున్నారు. మీరు, “మాకు మాంసం మాత్రం ఉంటే బాగుండేది! ఈజిప్టులో మాకు బాగుండేది!” అని ఏడ్వడం యెహోవా విన్నారు కాబట్టి యెహోవా మీకు మాంసం ఇస్తారు, మీరు తింటారు. దానిని మీరు తినడం ఒక రోజు కాదు, రెండు రోజులు, అయిదు రోజులు, పది రోజులు, యిరవై రోజులు కాదు, ఒక నెలంతా మీ నాసికా రంధ్రాల నుండి బయటకు వచ్చి మీరు అసహ్యించుకునే వరకు తింటారు; ఎందుకంటే మీరు మీ మధ్య ఉన్న యెహోవాను నిరాకరించి, “మేము అసలు ఈజిప్టును ఎందుకు విడిచిపెట్టామో?” అంటూ ఆయన ఎదుట ఏడ్చారు.’ ”
అయితే మోషే, “నేను ఆరు లక్షలమంది పాదాచారుల మధ్య ఉన్నాను, మీరేమో, ‘నేను వారికి నెలరోజులు తినడానికి సరిపడే మాంసం ఇస్తాను!’ అని అన్నారు. ఉన్న పశువులు, మందలు అన్నిటిని వధించినా వీరికి సరిపోతుందా? సముద్రంలో చేపలన్నీ పట్టినా వీరికి సరిపోతాయా?”
యెహోవా మోషేకు జవాబిస్తూ, “యెహోవా బాహుబలం తక్కువయ్యిందా? నేను చెప్పింది జరుగుతుందో లేదో నీవు చూస్తావు” అని అన్నారు.
మోషే బయటకు వెళ్లి యెహోవా చెప్పిందంతా ప్రజలకు తెలియజేశాడు. డెబ్బైమంది గోత్ర పెద్దలను తెచ్చి మందిరం చుట్టూ నిలబెట్టాడు. అప్పుడు యెహోవా మేఘంలో దిగివచ్చి అతనితో మాట్లాడారు. అతనిపై ఉన్న ఆత్మ శక్తిలో కొంత ఆ డెబ్బై గోత్ర పెద్దలపై ఉంచినప్పుడు ఆత్మ వారిమీద నిలిచి వారు ప్రవచించారు అయితే, తర్వాత ఎన్నడు ప్రవచించలేదు.
అయితే, ఇద్దరు, శిబిరంలోనే ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. వారు గోత్ర పెద్దలలో ఉన్నవారే, కానీ గుడారం బయటకు వెళ్లలేదు. అయినప్పటికీ ఆత్మ వారి మీద ఉంది, వారు శిబిరంలో ప్రవచించారు. ఒక యువకుడు మోషే దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, “ఎల్దాదు, మేదాదు శిబిరంలో ప్రవచిస్తున్నారు” అని చెప్పాడు.
నూను కుమారుడైన యెహోషువ, యవ్వనకాలం నుండి మోషే దగ్గరే ఉన్నవాడు, అతడు మాట్లాడుతూ, “మోషే, నా ప్రభువా, వారిని ఆపండి!” అని అన్నాడు.
కానీ మోషే అతనితో, “నా పక్షంగా నీవు అసూయపడుతున్నావా? నేనైతే యెహోవా ప్రజలంతా ప్రవక్తలు కావాలని, యెహోవా తన ఆత్మ వారందరి మీద ఉంచాలని కోరతాను!” అని జవాబిచ్చాడు. తర్వాత మోషే, ఇశ్రాయేలు గోత్ర పెద్దలు, శిబిరానికి తిరిగి వెళ్లారు.
తర్వాత యెహోవా దగ్గరి నుండి గాలి వెళ్లి సముద్రం దిక్కునుండి పూరేళ్ళను తీసుకువచ్చింది. అది వాటిని రెండు మూరల ఎత్తుగా, ఏ దిశలోనైనా ఒక రోజు నడకంత దూరంగా శిబిరం చుట్టూరా చెదరగొట్టింది. ఆ దినమంతా, రాత్రంతా, మరుసటి రోజంతా, ప్రజలు బయటకు వెళ్లి పూరేళ్ళను సమకూర్చుకున్నారు. ఏ ఒక్కరు కూడా పది హోమెర్ల కంటే తక్కువ పోగు చేసుకోలేదు. వాటిని శిబిరం చుట్టూ పరిచారు. అయితే, మాంసం పళ్ళ సందుల్లో ఉండగానే దానిని నమిలి మ్రింగకముందే, యెహోవా కోపం వారిపై రగులుకుంది, ఆయన వారిని భయంకరమైన తెగులుతో మొత్తారు. ఆ స్థలంలో ఇతర ఆహారం కోసం ఆశపడిన వారిని పాతిపెట్టినందుకు ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా అనే పేరు పెట్టారు.
ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణం చేసి అక్కడే ఉండిపోయారు.