సంఖ్యాకాండము 11:1-15

సంఖ్యాకాండము 11:1-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి– మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచి తముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొతిమెరగింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను. జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనముమీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను. రాత్రియందు మంచు పాళెముమీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమతమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్దవారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను. కాగా మోషే యెహోవాతో యిట్లనెను–నీవేల నీ సేవకుని బాధించితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జనులందరి భారమును నామీద పెట్టనేల? నేనే యీ సర్వ జనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నా కెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు –తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచినయెడల నన్ను చంపుము. నామీద నీ కటాక్షము వచ్చినయెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము.

సంఖ్యాకాండము 11:1-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ప్రజలు యెహోవా వింటుండగా తమ సమస్యల గురించి ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. వారి మాటలు విని యెహోవా ఆగ్రహించాడు. దాంతో వారి మధ్యలో మంటలు రేగి శిబిరం ఒక వైపున అంచుల్లో కాలిపోవడం మొదలయింది. అప్పుడు ప్రజలు గట్టిగా కేకలు పెట్టి మోషేను బతిమాలారు. కాబట్టి మోషే యెహోవాకు ప్రార్ధించాడు. అప్పుడు ఆ మంటలు చల్లారాయి. యెహోవా అగ్ని వారి మధ్యలో రగిలింది కాబట్టి ఆ స్థలానికి “తబేరా” అనే పేరు వచ్చింది. కొంతమంది విదేశీయులు ఇశ్రాయేలు ప్రజల మధ్య వారితో కలసి నివసిస్తున్నారు. వారు తినడానికి ఇంకా మంచి ఆహారం కోరుకున్నారు. దాంతో ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తూ “తినడానికి మాకు మాంసం ఎవరిస్తారు? ఐగుప్తులో మేము స్వేచ్ఛగా ఆరగించిన చేపలూ, కీర దోస కాయలూ, కర్బూజాలూ, ఆకు కూరలూ, ఉల్లి పాయలూ, వెల్లుల్లీ మాకు గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు మేము బలహీనులమయ్యాం. తినడానికి ఈ మన్నా తప్పించి మాకేం కన్పించడం లేదు” అని చెప్పుకున్నారు. ఆ మన్నా కొత్తిమీర గింజల్లా ఉంటుంది. చూడ్డానికి గుగ్గిలంలా ఉంటుంది. ప్రజలు శిబిరం మైదానంలో నడుస్తూ మన్నాని సేకరించేవారు. తిరగలిలో విసిరి గానీ రోట్లో దంచి గానీ దాన్ని పిండి చేసి పెనం పైన కాల్చి రొట్టెలు చేసే వారు. దాని రుచి తాజా ఒలీవ నూనె రుచిలా ఉండేది. రాత్రి వేళల్లో శిబిరం పైన మంచు కురిసినప్పుడు దాంతో పాటే మన్నా కూడా ఆ మంచు పైన పడేది. ప్రజలు వారి కుటుంబాలతో కలసి ఎవరి గుమ్మం ఎదుట వారు కూర్చుని ఏడుస్తుండగా మోషే విన్నాడు. యెహోవా భీకర కోపం రగిలి పోయింది. వారు ఏడవడం, ఫిర్యాదు చేయడం మోషే దృష్టిలో తప్పుగా ఉంది. అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు. “నేను నీ సేవకుణ్ణి. నాపై ఇంత నిర్దయగా వ్యవహరించావెందుకు? నాపై ఇంత కోపంగా ఉన్నావెందుకు? ఈ ప్రజల భారాన్ని నాపై మోపావు. ఈ జనాన్నంతా నేను కన్నానా? ‘తండ్రి తన బిడ్డని గుండెకి హత్తుకున్నట్టుగా వీరిని హత్తుకో’ అని నువ్వు నాతో చెప్పడానికి నేనేమన్నా వారిని నా గర్భంలో మోసానా? వారి పూర్వీకులకి నువ్వు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వారిని మోసుకు వెళ్ళాలా? ఇంతమంది ప్రజలకి మాంసం నేను ఎక్కడ నుండి తేవాలి? వారు నన్ను చూసి ఏడుస్తున్నారు. ‘మేము తినడానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు. ఈ ప్రజలందరి భారం మోయడం నా ఒక్కడి వల్ల కాదు. వీళ్ళ భారం నా శక్తికి మించింది. నువ్వు నాతో ఇలా వ్యవహరించదలిస్తే నన్ను ఇప్పుడే చంపెయ్యి. నా మీద నీకు దయ కలిగితే నన్ను చంపి నా బాధ తీసెయ్యి.”

సంఖ్యాకాండము 11:1-15 పవిత్ర బైబిల్ (TERV)

ఈ సారి ప్రజలు వారి కష్టాలనుగూర్చి ఫిర్యాదు చేసారు. వారి ఫిర్యాదులను యెహోవా విన్నాడు. యెహోవా వీటిని విన్నప్పుడు ఆయనకు కోపం వచ్చింది. యెహోవా దగ్గరనుండి అగ్ని వచ్చి ప్రజల మధ్య రగులుకొంది. వారున్న స్థలంలో ఒక చివర కొన్ని ప్రాంతాలను అగ్ని కాల్చివేసింది. కనుక ప్రజలు మోషేకు మొరపెట్టుకొన్నారు. మోషే యెహోవాను ప్రార్థించగా అగ్ని కాల్చివేయటం ఆగిపోయింది. అందుచేత ఆ చోటు తబేరా అని పిలువబడింది. ఆ ప్రజల మధ్య యెహోవా అగ్నిని దహింపజేసాడు గనుక ఆ స్థలానికి వారు ఆ పేరు పెట్టారు. ఇశ్రాయేలీయులతో చేరిన విదేశీయులు తినేందుకు ఇంకా ఏవేవో కావాలనికోరటం మొదలు పెట్టారు. త్వరలోనే మొత్తం ఇశ్రాయేలీయులంతా మళ్లీ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. ప్రజలు ఇలా అన్నారు, “తినటానికి మాకు మాంసం కావాలి! ఈజిప్టులో మేము తిన్న చేపలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. చేపలు మాకు ఉచితంగా దొరికేవి. మంచి కూరగాయలు – దోసకాయలు, పుచ్చకాయలు, ఆకు కూరలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు మాకు దొరికేవి. కానీ ఇప్పుడు మాకు బలంలేదు. మేము, ఈ మన్నా తప్ప ఇంకేమి తినటంలేదు!” ఆ మన్నా కొతిమెర గింజల్లా ఉండి, చూపునకు చెట్టుమీద జిగురు (బంక)లా ఉంది. ప్రజలు దీనిని పోగుచేసి, నూరి, పిండి చేస్తారు. లేక బండలను ఉపయోగించి దాన్ని పొడుం చేస్తారు. తర్వాత ఒక కుండలో దాన్ని వంట చేసేవారు, లేదా తియ్యటి అప్పాలు చేసేవారు. అప్పాలు ఒలీవ నూనెతో చేసిన రొట్టెల్లా రుచిగా ఉండేవి. ప్రతి రాత్రీ నేల అంతా మంచుతో తడిసినప్పుడు మన్నా నేలమీద కురిసేది. ప్రతి కుటుంబం వాళ్లు ఫిర్యాదు చేయటం మోషే విన్నాడు. ప్రజలంతా వారివారి గుడారాల్లో గొణుగుతున్నారు. యెహోవాకు చాల కోపం వచ్చింది. దానితో మోషేకు చాలా చికాకు కలిగింది. మోషే యెహోవాను అడిగాడు, “యెహోవా, నీ సేవకుడనైన నాకు ఇంత కష్టం ఎందుకు కలిగించావు? నేనేమి పొరబాటు చేసాను? నీకు సంతోషం లేకుండేటట్టు నేను చేసింది ఏమిటి? ఈ ప్రజలందరి బాధ్యత నీవు నాకెందుకు ఇచ్చావు? ఈ ప్రజలందరికీ నేను తండ్రిని కానని నీకు తెలుసు. నేను వీరికి జన్మ ఇవ్వలేదనీ నీకు తెలుసు. కానీ పాలిచ్చి పెంచే దాదిలా నేనే వీరిని నా చేతుల్లో ఎత్తుకొని పోవాల్సినట్టు కనబడుతుంది. నేను ఇలా చేసేటట్టుగా నీవెందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? నీవు మా పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశానికి నేను వారిని మోసుకొని వెళ్లాలని నీవెందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? ఈ ప్రజలందరికీ మాంసం నాదగ్గర లేదు. కానీ వారు నాకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ‘తినటానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు వారు. ఈ ప్రజలందరినీ గూర్చి నేను ఒక్కడినే బాధ్యత వహించలేను. ఈ భారం నాకు చాల బరువుగా ఉంది. వారి కష్టాలన్నీ నీవు నా మీదే పెట్టాలనుకొంటే, ఇప్పుడే నన్ను చంపేయి. నన్ను నీ సేవకునిగా నీవు అంగీకరిస్తే, నన్ను ఇప్పుడే చావనివ్వు. అప్పుడు నా కష్టాలన్నీ తీరిపోతాయి.”

సంఖ్యాకాండము 11:1-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

దాని తర్వాత యెహోవా వినేలా ప్రజలు తమ కష్టాల గురించి ఫిర్యాదు చేసినప్పుడు, ఆయన అవి వినగానే ఆయన కోపం రగులుకుంది. అప్పుడు యెహోవా నుండి అగ్ని వారి మధ్యకు వచ్చి శిబిరం శివార్లలో కొంత భాగాన్ని దహించివేసింది. ప్రజలు మోషేకు మొరపెట్టగా, అతడు యెహోవాకు ప్రార్థించాడు, ఆ అగ్ని ఆరిపోయింది. అందుకు ఆ స్థలానికి తబేరా అని పేరు పెట్టారు, ఎందుకంటే యెహోవా నుండి వచ్చిన అగ్ని వారి మధ్యలో వచ్చింది కాబట్టి. వారితో ఉన్న అల్లరి గుంపు వేరే ఆహారం ఆశించడం ప్రారంభించారు, అప్పుడు మళ్ళీ ఇశ్రాయేలీయులు ఏడ్వడం మొదలుపెట్టి, “మనకు తినడానికి మాంసం మాత్రం ఉంటే ఎంత బాగుండేది! ఈజిప్టులో చేపలు, దోసకాయలు, పుచ్చకాయలు, ఒక రకమైన ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు ఉచితంగా తిన్నాము. కానీ ఇప్పుడు మాకు తిండి మీద ఇష్టం లేకుండ పోయింది; ఈ మన్నా తప్ప మాకేమి కనిపించడం లేదు!” అని అన్నారు. మన్నా కొత్తిమెర గింజల్లా ఉండి గుగ్గిలంలా కనబడుతుంది. ప్రజలు బయటకు వెళ్లి, తిరుగుతూ దానిని సేకరించుకొని, దానిని తిరగలితో విసరేవారు లేదా రోటిలో దంచేవారు. కుండలో దానిని ఉడకబెట్టి దానితో రొట్టెలు చేసుకునేవారు. దాని రుచి నూనెతో చేసిన అప్పడంలా ఉంటుంది. రాత్రివేళ శిబిరంలో మంచు కురిసినప్పుడు మన్నా దాని వెంటనే పడేది. మోషే ప్రతి కుటుంబంలోని ప్రజలు వారి డేరాల దగ్గర ఏడుస్తూ ఉండడం విన్నాడు. యెహోవా చాలా కోప్పడ్డారు మోషే బాధపడ్డాడు. మోషే యెహోవాతో, “మీ సేవకునిపై ఈ కష్టం ఎందుకు తెచ్చారు? వీరందరి భారం నా మీద వేయకుండ మీ దృష్టిలో నేనెందుకు దయను పొందలేకపోయాను? వీరందరిని నేను గర్భందాల్చానా? నేను వీరిని కన్నానా? దాది శిశువును ఎత్తుకున్నట్లు, మీ పూర్వికులకు మీరు ప్రమాణం వాగ్దానం చేసిన స్థలానికి నడిపించడానికి వీరిని నా చేతిలో ఎందుకు మోయమన్నారు? వీరందరి కోసం మాంసం ఎక్కడ నుండి తేవాలి? నన్ను చూసి, ‘మాకు తినడానికి మాంసం ఇవ్వు!’ అంటూ ఏడుస్తున్నారు. నా అంతట నేను ఈ ప్రజలందరినీ మోయలేను; భారం నాకు చాల భారీగా ఉంది. ఒకవేళ నాతో మీరు ఇలా వ్యవహరించ తలిస్తే దయచేసి నన్ను చంపేయండి; నా మీద మీకు దయ కలిగితే నా దురవస్థను నేను చూడకుండ నన్ను చంపేయండి” అని చెప్పాడు.