సంఖ్యా 11:1-15

సంఖ్యా 11:1-15 IRVTEL

ప్రజలు యెహోవా వింటుండగా తమ సమస్యల గురించి ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. వారి మాటలు విని యెహోవా ఆగ్రహించాడు. దాంతో వారి మధ్యలో మంటలు రేగి శిబిరం ఒక వైపున అంచుల్లో కాలిపోవడం మొదలయింది. అప్పుడు ప్రజలు గట్టిగా కేకలు పెట్టి మోషేను బతిమాలారు. కాబట్టి మోషే యెహోవాకు ప్రార్ధించాడు. అప్పుడు ఆ మంటలు చల్లారాయి. యెహోవా అగ్ని వారి మధ్యలో రగిలింది కాబట్టి ఆ స్థలానికి “తబేరా” అనే పేరు వచ్చింది. కొంతమంది విదేశీయులు ఇశ్రాయేలు ప్రజల మధ్య వారితో కలసి నివసిస్తున్నారు. వారు తినడానికి ఇంకా మంచి ఆహారం కోరుకున్నారు. దాంతో ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తూ “తినడానికి మాకు మాంసం ఎవరిస్తారు? ఐగుప్తులో మేము స్వేచ్ఛగా ఆరగించిన చేపలూ, కీర దోస కాయలూ, కర్బూజాలూ, ఆకు కూరలూ, ఉల్లి పాయలూ, వెల్లుల్లీ మాకు గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు మేము బలహీనులమయ్యాం. తినడానికి ఈ మన్నా తప్పించి మాకేం కన్పించడం లేదు” అని చెప్పుకున్నారు. ఆ మన్నా కొత్తిమీర గింజల్లా ఉంటుంది. చూడ్డానికి గుగ్గిలంలా ఉంటుంది. ప్రజలు శిబిరం మైదానంలో నడుస్తూ మన్నాని సేకరించేవారు. తిరగలిలో విసిరి గానీ రోట్లో దంచి గానీ దాన్ని పిండి చేసి పెనం పైన కాల్చి రొట్టెలు చేసే వారు. దాని రుచి తాజా ఒలీవ నూనె రుచిలా ఉండేది. రాత్రి వేళల్లో శిబిరం పైన మంచు కురిసినప్పుడు దాంతో పాటే మన్నా కూడా ఆ మంచు పైన పడేది. ప్రజలు వారి కుటుంబాలతో కలసి ఎవరి గుమ్మం ఎదుట వారు కూర్చుని ఏడుస్తుండగా మోషే విన్నాడు. యెహోవా భీకర కోపం రగిలి పోయింది. వారు ఏడవడం, ఫిర్యాదు చేయడం మోషే దృష్టిలో తప్పుగా ఉంది. అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు. “నేను నీ సేవకుణ్ణి. నాపై ఇంత నిర్దయగా వ్యవహరించావెందుకు? నాపై ఇంత కోపంగా ఉన్నావెందుకు? ఈ ప్రజల భారాన్ని నాపై మోపావు. ఈ జనాన్నంతా నేను కన్నానా? ‘తండ్రి తన బిడ్డని గుండెకి హత్తుకున్నట్టుగా వీరిని హత్తుకో’ అని నువ్వు నాతో చెప్పడానికి నేనేమన్నా వారిని నా గర్భంలో మోసానా? వారి పూర్వీకులకి నువ్వు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వారిని మోసుకు వెళ్ళాలా? ఇంతమంది ప్రజలకి మాంసం నేను ఎక్కడ నుండి తేవాలి? వారు నన్ను చూసి ఏడుస్తున్నారు. ‘మేము తినడానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు. ఈ ప్రజలందరి భారం మోయడం నా ఒక్కడి వల్ల కాదు. వీళ్ళ భారం నా శక్తికి మించింది. నువ్వు నాతో ఇలా వ్యవహరించదలిస్తే నన్ను ఇప్పుడే చంపెయ్యి. నా మీద నీకు దయ కలిగితే నన్ను చంపి నా బాధ తీసెయ్యి.”