నెహెమ్యా 9:32-37
నెహెమ్యా 9:32-37 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మా దేవా, ఘనుడా, మహా పరాక్రమశాలీ, ఆశ్చర్య కరుడా, నువ్వు చేసిన వాగ్దానం నిలబెడుతూ, కృప చూపుతున్నావు. అష్షూరు రాజుల కాలం నుండి ఈనాటి వరకూ మా మీదికి, మా రాజుల, ప్రధానుల, మా పితరుల మీదికి, నీ ప్రజలందరి మీదికి వచ్చిన బాధలను నీ దృష్టిలో స్వల్పంగా ఎంచవద్దు. మా మీదికి వచ్చిన బాధలన్నిటినీ చూసినప్పుడు నువ్వు మా పట్ల అన్యాయంగా ప్రవర్తించ లేదు. నువ్వు యథార్ధంగానే ఉన్నావు, మేమే దుర్మార్గులమయ్యాం. మా రాజులు, ప్రధానులు, యాజకులు, మా పూర్వీకులు నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోలేదు. నువ్వు వారికి ఇచ్చిన హెచ్చరికలను, నీ ఆజ్ఞలను వారు పెడచెవిన పెట్టారు. వారు తమ రాజ్య పరిపాలన కాలంలో కూడా నువ్వు వారికి ఇచ్చిన ఫలవంతమైన విశాల దేశంలో నువ్వు చూపించిన కృపను అనుభవిస్తూ నిన్ను సేవించలేదు, మనస్సు మార్చుకోకుండా, తమ దుష్ట ప్రవర్తన విడిచి పెట్టకుండా ఉన్నారు. దేవా, ఆలకించు, మేము బానిసత్వంలో ఉన్నాం. భూమి ఫలాలను, దాని సమృద్దిని అనుభవించమని నువ్వు మా పూర్వీకులకు అనుగ్రహించిన భూమి మీద మేము బానిసలుగా బతుకుతున్నాం. మా పాపాలను బట్టి నువ్వు మా మీద నియమించిన రాజులకు మా భూముల్లో పండిన పంటలు సమృద్ధిగా దొరుకుతున్నాయి. వారు తమ ఇష్టం వచ్చినట్టు మా శరీరాల మీదా, మా పశువుల మీదా పెత్తనం చెలాయిస్తున్నారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం.”
నెహెమ్యా 9:32-37 పవిత్ర బైబిల్ (TERV)
మా దేవా, నీవు మహా దేవుడివి, భయంకరుడివి, శక్తిశాలియైన యోధుడివి! నీవు దయామయుడివి, విశ్వాసనీయుడివి! ఒడంబడికను తప్పని వాడివి! మాకెన్నో కష్టాలు, కడగళ్లు వచ్చాయి. మా కష్టాలు నీవు పట్టించుకుంటావు! మా ప్రజలందరికీ, మా రాజులకీ, మా పెద్దలకీ, మా యాజకులకీ, మా ప్రవక్తలకీ ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి. అష్షూరు రాజు పాలన కాలం నుంచి నేటిదాకా అవి వున్నాయి! కష్టాలు మమ్మల్ని వెన్నాడుతూనే వున్నాయి! అందుకని దేవా మాకు సంభవించే ప్రతి దాన్నిగురించీ నీదే ఒప్పు, మాదే తప్పు. మా రాజులు, నాయకులు, యాజకులు, మరి మా పూర్వీకులు నీ ధర్మనిబంధనలు పాటించలేదు. వాళ్లు నీ ధర్మశాస్త్రాన్ని మీరారు, నీ హెచ్చరికను ఖాతరు చేయలేదు. తమ స్వదేశంలో నివసించినప్పుడు సైతం మా పూర్వీకులు నీకు సేవ చేయలేదు. వాళ్లు దుష్టకార్యాలు చేయడం మానలేదు. నీవు వాళ్లకిచ్చిన అద్భుతమైన వాటన్నిటినీ హాయిగా అనుభవించారు. వాళ్లు సారవంతమైన భూమిని అనుభవించారు సువిశాల దేశాన్ని ఏలుకున్నారు, అయినా, తమ దుర్మార్గాలు వీడలేదు. మరి ఇప్పుడు, మేము బానిసలము. మేమీ భూమిలో ఏ భూమినీ, దేని ఫలసాయాలనూ, ఇక్కడ పెరిగే మంచివాటన్నిటినీ అనుభవించమని మా పూర్వీకులకు నీవిచ్చావో, ఆ భూమిలో మేము ఈనాడు దాసులము. ఈ భూమిలో పంట పుష్కలమైనదే కాని మేము పాపాలు చేశాము కదా, అందుకని ఆ పంట నీవు మా నెత్తిన పెట్టిన రాజులకు పోతుంది. ఆ రాజులు మామీదా, మా పశువుల పైనా పెత్తనం చలాయిస్తారు. తమకిష్టము వచ్చినట్లు వ్యవహరిస్తారు. దేవా, మేము చాలా కష్టాల్లోవున్నాము.
నెహెమ్యా 9:32-37 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
చేసిన నిబంధనను నిలు పుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడవునగు మా దేవా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని యీ దినములవరకు మా మీదికిని మా రాజులమీదికిని ప్రధానులమీదికిని మా పితరులమీదికిని నీ జనులందరిమీదికిని వచ్చినశ్రమయంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక. మా మీదికి వచ్చినశ్రమ లన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే; నీవు సత్యము గానే ప్రవర్తించితివి కాని మేము దుర్మార్గులమైతిమి. మా రాజులుగాని మా ప్రధానులుగాని మా యాజకులుగాని మా పితరులుగాని నీ ధర్మశాస్త్రము ననుసరించి నడువలేదు. నీవు వారిమీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి. వారు తమ రాజ్య పరిపాలనకాలమందు నీవు తమ యెడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలువిడిచి మారుమనస్సు పొందరైరి. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించునట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమియందు మేము దాసులమై యున్నాము. మా పాపములనుబట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతివిస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరములమీదను మా పశువులమీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాల శ్రమలు కలుగుచున్నవి.
నెహెమ్యా 9:32-37 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“మా దేవా! గొప్ప దేవా! మహా బలవంతుడా! పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు చేసిన మీ ప్రేమ నిబంధన నెరవేరుస్తున్నారు. అష్షూరు రాజుల కాలం నుండి ఈ రోజు వరకు మా మీదికి, మా రాజులు నాయకుల మీదికి, మా యాజకులు ప్రవక్తల మీదికి, మా పూర్వికుల మీదికి మీ ప్రజలందరి మీదికి వచ్చిన శ్రమలు మీ దృష్టికి చిన్న విషయంగా ఉండకూడదు. మాకు జరిగినదాని అంతటిలో మీరు నీతిమంతులుగానే ఉన్నారు; మేము దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు మీరు నమ్మకంగా ప్రవర్తించారు. మా రాజులు, మా నాయకులు, మా యాజకులు, మా పూర్వికులు మీ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు; మీరు పాటించమని హెచ్చరించిన మీ ఆజ్ఞలు శాసనాలను లక్ష్యపెట్టలేదు. వారు తమ రాజ్య పరిపాలనలోను మీరు వారికిచ్చిన విశాలమైన సారవంతమైన దేశంలో మీరు వారిపట్ల చేసిన గొప్ప మేలులు అనుభవిస్తూ కూడా వారు మిమ్మల్ని సేవించలేదు, తమ దుష్టత్వాన్ని విడిచి మీ వైపు తిరగలేదు. “ఇదిగో ఈ రోజు మేము బానిసలుగా ఉన్నాము, దాని ఫలాలను తిని దానిలో ఉన్న మంచి వాటన్నిటిని అనుభవించమని మా పూర్వికులకు మీరిచ్చిన దేశంలో మేము బానిసలుగా ఉన్నాము. మా పాపాల కారణంగా దాని అపారమైన పంటంతా మీరు మామీద నియమించిన రాజులు అనుభవిస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు మా శరీరాల మీద మా పశువులమీద అధికారం చెలాయిస్తున్నారు. మేము చాలా శ్రమ అనుభవిస్తున్నాము.