నెహెమ్యా 9
9
ఎజ్రా ప్రార్థన
1అదే నెల 24 వ తేదీన ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకుని తలల మీద దుమ్ము పోసుకుని సమావేశమయ్యారు. 2ఇశ్రాయేలీయులు వేరే జాతి ప్రజల్లో నుండి వేరైపోయి నిలబడి, తమ పాపాలు, తమ పూర్వీకుల పాపాలు ఒప్పుకున్నారు. 3వారు ఒక పూటంతా అక్కడే నిలబడి దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చదివించుకున్నారు. మరో పూట తమ పాపాలు ఒప్పుకొంటూ దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లిస్తూ వచ్చారు.
4లేవీయులైన యేషూవ, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ అనేవాళ్ళు మెట్ల మీద నిలబడి, తమ తలలు పైకెత్తి దేవుడైన యెహోవాను వేడుకున్నారు. 5అప్పుడు లేవీయులైన యేషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయా, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహయా, అనే వాళ్ళు నిలబడి “సదాకాలం మీకు దేవుడుగా ఉన్న యెహోవాను స్తుతించండి” అని కేకలు వేసి, ఈ విధంగా స్తుతులు చెల్లించారు. “సకల ఆశీర్వాదాలకు, ఘనతలకు మించిన నీ పవిత్రమైన నామానికి స్తుతులు. 6ఆకాశ మహాకాశాలను, అందులో ఉండే సైన్యాలను, భూమిని, భూమిపై ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉండే వాటిని సృష్టించి వాటినన్నిటినీ కాపాడుతున్న అద్వితీయ దేవుడైన యెహోవావు నువ్వే. ఆకాశ సైన్యమంతా నీకు లోబడుతుంది.
7దేవా, యెహోవా, అబ్రామును ఎన్నిక చేసుకుని, కల్దీయుల ఊరు అనే ప్రాంతం నుండి అతణ్ణి బయటకు రప్పించి అతనికి అబ్రాహాము అనే పేరు పెట్టినవాడివి నువ్వే. 8అతడు నమ్మకమైన మనస్సు గలవాడు గనక కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అనే వాళ్ళ దేశాన్ని అతని సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశావు. 9నీవు నీతిమంతుడివి గనక నువ్విచ్చిన మాట ప్రకారం జరిగించావు. ఐగుప్తులో మా పూర్వికులు అనుభవించిన కష్టాలు నువ్వు చూశావు. ఎర్ర సముద్రం దగ్గర వారి మొర విని కాపాడావు. 10ఫరో, అతని పరివారం, అతని దేశ ప్రజలు మా పూర్వీకుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందువల్ల నువ్వు వారి ఎదుట సూచక క్రియలు, మహత్కార్యాలు కనపరిచావు. ఇప్పుడు నీవు ఘనత పొందుతున్నట్టు అప్పుడు కూడా ఘనత పొందావు.
11నువ్వు ఎన్నుకున్న నీ ప్రజలు చూస్తుండగా సముద్రాన్ని రెండు పాయలుగా చేసినందున వారు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచారు. లోతైన నీళ్ళలో రాయి వేసినట్టు వారిని వెంటాడిన వాళ్ళను లోతైన సముద్రంలో ముంచివేశావు. 12అంతే కాక, పగటివేళ మేఘ స్తంభంలా ఉండి, రాత్రివేళ వాళ్ళు నడిచే మార్గంలో వెలుగు ఇవ్వడానికి అగ్నిస్తంభంలా ఉండి వాళ్ళను తీసుకువెళ్లావు. 13సీనాయి కొండ పైకి దిగి వచ్చి ఆకాశం నుండి వాళ్ళతో మాట్లాడి, వాళ్లకు నీతి విధులనూ సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను ధర్మాలను దయచేశావు. 14నీ సేవకుడు మోషే ద్వారా వాళ్లకు ఆజ్ఞలు, కట్టడలు, ధర్మశాస్త్రం నియమించి, నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినం ఆచరించాలని ఆజ్ఞ ఇచ్చావు. 15వారి ఆకలి తీరేలా ఆకాశం నుండి ఆహారం, దాహం తీర్చడానికి బండ నుండి నీళ్ళు రప్పించావు. వాళ్లకు నువ్వు వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆజ్ఞ ఇచ్చావు.
16అయితే వారూ మా పూర్వికులూ గర్వంతో, నీ ఆజ్ఞలకు లోబడకుండా వాటిని పెడచెవిన పెట్టారు. 17వారు విధేయత చూపకుండా తమ మనస్సులు కఠినపరచుకుని, వారి మధ్య నువ్వు చేసిన అద్భుతాలను మరచిపోయారు. వారు బానిసలుగా గడిపిన దేశానికి తిరిగి వెళ్ళడానికి ఒక అధికారిని నియమించమని కోరుకుని నీపై తిరుగుబాటు చేశారు. అయితే నీవు దయ, కనికరం ఉన్న దేవుడివి. సహనం, అమితమైన జాలి చూపించే వాడివి. వారి అపరాధాలు క్షమించి వారిని విడిచిపెట్టకుండా కాపాడుతూ వచ్చావు.
18వారు ఒక పోత పోసిన దూడను తయారు చేసి, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు తీవ్రమైన కోపం తెప్పించినప్పటికీ, 19వారు ఎడారిలో ప్రయాణిస్తుంటే పగటివేళ మేఘస్తంభం, రాత్రివేళ వారికి వెలుగు ఇచ్చేందుకు అగ్నిస్తంభం వారిపై నిలిచి ఉండేలా చేసి నీ అత్యంత కృప చూపించి వారిని కాపాడావు. 20వారికి ఉపదేశించడానికి దయ గల నీ ఆత్మను ఇచ్చావు. నువ్వు కురిపించే మన్నాను ఆపివేయ లేదు. వారి దాహం తీర్చడానికి నీళ్ళిచ్చావు. 21అరణ్యంలో వారికి ఏ లోటు లేకుండా 40 సంవత్సరాలు వాస్తవంగా వారిని పోషించావు. వారి బట్టలు చినిగిపోలేదు, వారి కాళ్ళు వాచిపోలేదు.
22అంతేకాక, రాజ్యాలను, అన్య దేశ ప్రజలను వారికి లోబరచి, వేరే ప్రదేశాలు వారి స్వాధీనంలోకి వచ్చేలా చేశావు. వారు హెష్బోను రాజు సీహోను దేశాన్నీ, బాషాను రాజు ఓగు దేశాన్నీ ఆక్రమించుకున్నారు. 23వారి సంతానాన్ని ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే విస్తరింపజేసి, వారి పూర్వికులూ వాగ్దానం చేసినట్టు వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకునేలా ఆ దేశం లోకి రప్పించావు. 24ఆ సంతానం వారు ప్రవేశించి ఆ దేశాన్ని స్వాధీన పరచుకున్నారు. కనాను దేశ నివాసులను, కనాను దేశాన్నీ వారికి స్వాధీనపరచి, తమకు ఇష్టం వచ్చినట్టు చేసుకొనేందుకు ఆ దేశాల రాజులను, ప్రజలను వారి వశం చేశావు.
25అప్పుడు వారు సరిహద్దు గోడలున్న పట్టణాలను, ఫలించే భూములను స్వాధీనం చేసుకున్నారు. అన్ని రకాల వస్తువులతో నిండి ఉన్న ఇళ్ళను, తవ్వి ఉన్న బావులను, ద్రాక్షతోటలను, ఒలీవ తోటలను, ఎంతో విస్తారంగా ఫలించే చెట్లను వశపరచుకున్నారు. ఆ విధంగా వారు తిని, తృప్తి పొందారు. నువ్వు చేసిన మహోపకారాన్ని బట్టి వారు ఎంతో సంతోషించి మంచి చెడ్డలు మరచిపోయారు. 26వారు నీకు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేశారు. నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నిర్ల్యక్షం చేశారు. తమ ప్రవర్తన మార్చుకుని నీ వైపు తిరగాలని వారికి ప్రకటించిన నీ ప్రవక్తలను చంపి నీకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించారు.
27అందువల్ల నువ్వు వాళ్ళను వారి శత్రువుల వశం చేశావు. ఆ శత్రువులు వారిని బాధించినప్పుడు వారు కష్టాల పాలై నీకు మొర పెట్టినప్పుడు పరలోకంలో ఉన్న నువ్వు వారి మొర ఆలకించి, వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించడానికి నీ కృపా బాహుళ్యాన్ని బట్టి వారిని విడిపించే రక్షకులను పంపించావు. 28వారికి శాంతి సమాధానాలు లభించిన తరువాత నీ దృష్టికి విరోధంగా ద్రోహం చేసినప్పుడు వారిపై అధికారం చేసేలా తిరిగి వారి శత్రువుల చేతికి అప్పగించావు. వారు తిరిగి నీకు మొర పెట్టినప్పుడు పరలోకంలో ఉన్న నువ్వు వారి మొర ఆలకించి, నీ కృపను కనుపరచి పలుమార్లు వారిని విడిపించావు.
29నీ ఆజ్ఞలను, కట్టడలను ఎవరైనా ఆచరిస్తే వాడు చనిపోకుండా జీవిస్తాడు. కానీ వారు వాటిని మీరి పాపాలు చేశారు. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలని నువ్వు హెచ్చరించినప్పటికీ వారు గర్వంతో నీ ఆజ్ఞలకు లోబడక, నీ కట్టడలను నిర్ల్యక్షం చేసి పాపం చేసి, నిన్ను తిరస్కరించారు. తమ మనస్సులను కఠినం చేసుకున్నారు. నీ మాట వినలేదు. 30నువ్వు అనేక సంవత్సరాలు వారిని సహించి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారిని హెచ్చరించినా వారు లక్ష్యపెట్ట లేదు. అందువల్ల నువ్వు వాళ్ళని పొరుగు ప్రాంతాల ప్రజలకు అప్పగించేశావు.
31నువ్వు నిజంగా కృపా కనికరాలు ఉన్న దేవుడవు. నీ కనికరాన్నిబట్టి వారిని పూర్తిగా నాశనం కాకుండా కాపాడావు. 32మా దేవా, ఘనుడా, మహా పరాక్రమశాలీ, ఆశ్చర్య కరుడా, నువ్వు చేసిన వాగ్దానం నిలబెడుతూ, కృప చూపుతున్నావు. అష్షూరు రాజుల కాలం నుండి ఈనాటి వరకూ మా మీదికి, మా రాజుల, ప్రధానుల, మా పితరుల మీదికి, నీ ప్రజలందరి మీదికి వచ్చిన బాధలను నీ దృష్టిలో స్వల్పంగా ఎంచవద్దు.
33మా మీదికి వచ్చిన బాధలన్నిటినీ చూసినప్పుడు నువ్వు మా పట్ల అన్యాయంగా ప్రవర్తించ లేదు. నువ్వు యథార్ధంగానే ఉన్నావు, మేమే దుర్మార్గులమయ్యాం. 34మా రాజులు, ప్రధానులు, యాజకులు, మా పూర్వీకులు నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోలేదు. నువ్వు వారికి ఇచ్చిన హెచ్చరికలను, నీ ఆజ్ఞలను వారు పెడచెవిన పెట్టారు.
35వారు తమ రాజ్య పరిపాలన కాలంలో కూడా నువ్వు వారికి ఇచ్చిన ఫలవంతమైన విశాల దేశంలో నువ్వు చూపించిన కృపను అనుభవిస్తూ నిన్ను సేవించలేదు, మనస్సు మార్చుకోకుండా, తమ దుష్ట ప్రవర్తన విడిచి పెట్టకుండా ఉన్నారు. 36దేవా, ఆలకించు, మేము బానిసత్వంలో ఉన్నాం. భూమి ఫలాలను, దాని సమృద్దిని అనుభవించమని నువ్వు మా పూర్వీకులకు అనుగ్రహించిన భూమి మీద మేము బానిసలుగా బతుకుతున్నాం. 37మా పాపాలను బట్టి నువ్వు మా మీద నియమించిన రాజులకు మా భూముల్లో పండిన పంటలు సమృద్ధిగా దొరుకుతున్నాయి. వారు తమ ఇష్టం వచ్చినట్టు మా శరీరాల మీదా, మా పశువుల మీదా పెత్తనం చెలాయిస్తున్నారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం.”
38ఇందువల్ల మేమంతా అంగీకరించి నిర్ణయించుకొన్న దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని రాయించుకొన్నాం. ముద్రలు వేసిన నిబంధన పత్రాలపై మా ప్రధానుల, లేవీయుల, యాజకుల పేర్లు ఉన్నాయి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నెహెమ్యా 9: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.