నెహెమ్యా 9:26-38

నెహెమ్యా 9:26-38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వారు నీకు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేశారు. నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నిర్ల్యక్షం చేశారు. తమ ప్రవర్తన మార్చుకుని నీ వైపు తిరగాలని వారికి ప్రకటించిన నీ ప్రవక్తలను చంపి నీకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించారు. అందువల్ల నువ్వు వాళ్ళను వారి శత్రువుల వశం చేశావు. ఆ శత్రువులు వారిని బాధించినప్పుడు వారు కష్టాల పాలై నీకు మొర పెట్టినప్పుడు పరలోకంలో ఉన్న నువ్వు వారి మొర ఆలకించి, వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించడానికి నీ కృపా బాహుళ్యాన్ని బట్టి వారిని విడిపించే రక్షకులను పంపించావు. వారికి శాంతి సమాధానాలు లభించిన తరువాత నీ దృష్టికి విరోధంగా ద్రోహం చేసినప్పుడు వారిపై అధికారం చేసేలా తిరిగి వారి శత్రువుల చేతికి అప్పగించావు. వారు తిరిగి నీకు మొర పెట్టినప్పుడు పరలోకంలో ఉన్న నువ్వు వారి మొర ఆలకించి, నీ కృపను కనుపరచి పలుమార్లు వారిని విడిపించావు. నీ ఆజ్ఞలను, కట్టడలను ఎవరైనా ఆచరిస్తే వాడు చనిపోకుండా జీవిస్తాడు. కానీ వారు వాటిని మీరి పాపాలు చేశారు. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలని నువ్వు హెచ్చరించినప్పటికీ వారు గర్వంతో నీ ఆజ్ఞలకు లోబడక, నీ కట్టడలను నిర్ల్యక్షం చేసి పాపం చేసి, నిన్ను తిరస్కరించారు. తమ మనస్సులను కఠినం చేసుకున్నారు. నీ మాట వినలేదు. నువ్వు అనేక సంవత్సరాలు వారిని సహించి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారిని హెచ్చరించినా వారు లక్ష్యపెట్ట లేదు. అందువల్ల నువ్వు వాళ్ళని పొరుగు ప్రాంతాల ప్రజలకు అప్పగించేశావు. నువ్వు నిజంగా కృపా కనికరాలు ఉన్న దేవుడవు. నీ కనికరాన్నిబట్టి వారిని పూర్తిగా నాశనం కాకుండా కాపాడావు. మా దేవా, ఘనుడా, మహా పరాక్రమశాలీ, ఆశ్చర్య కరుడా, నువ్వు చేసిన వాగ్దానం నిలబెడుతూ, కృప చూపుతున్నావు. అష్షూరు రాజుల కాలం నుండి ఈనాటి వరకూ మా మీదికి, మా రాజుల, ప్రధానుల, మా పితరుల మీదికి, నీ ప్రజలందరి మీదికి వచ్చిన బాధలను నీ దృష్టిలో స్వల్పంగా ఎంచవద్దు. మా మీదికి వచ్చిన బాధలన్నిటినీ చూసినప్పుడు నువ్వు మా పట్ల అన్యాయంగా ప్రవర్తించ లేదు. నువ్వు యథార్ధంగానే ఉన్నావు, మేమే దుర్మార్గులమయ్యాం. మా రాజులు, ప్రధానులు, యాజకులు, మా పూర్వీకులు నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోలేదు. నువ్వు వారికి ఇచ్చిన హెచ్చరికలను, నీ ఆజ్ఞలను వారు పెడచెవిన పెట్టారు. వారు తమ రాజ్య పరిపాలన కాలంలో కూడా నువ్వు వారికి ఇచ్చిన ఫలవంతమైన విశాల దేశంలో నువ్వు చూపించిన కృపను అనుభవిస్తూ నిన్ను సేవించలేదు, మనస్సు మార్చుకోకుండా, తమ దుష్ట ప్రవర్తన విడిచి పెట్టకుండా ఉన్నారు. దేవా, ఆలకించు, మేము బానిసత్వంలో ఉన్నాం. భూమి ఫలాలను, దాని సమృద్దిని అనుభవించమని నువ్వు మా పూర్వీకులకు అనుగ్రహించిన భూమి మీద మేము బానిసలుగా బతుకుతున్నాం. మా పాపాలను బట్టి నువ్వు మా మీద నియమించిన రాజులకు మా భూముల్లో పండిన పంటలు సమృద్ధిగా దొరుకుతున్నాయి. వారు తమ ఇష్టం వచ్చినట్టు మా శరీరాల మీదా, మా పశువుల మీదా పెత్తనం చెలాయిస్తున్నారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం.” ఇందువల్ల మేమంతా అంగీకరించి నిర్ణయించుకొన్న దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని రాయించుకొన్నాం. ముద్రలు వేసిన నిబంధన పత్రాలపై మా ప్రధానుల, లేవీయుల, యాజకుల పేర్లు ఉన్నాయి.

షేర్ చేయి
Read నెహెమ్యా 9

నెహెమ్యా 9:26-38 పవిత్ర బైబిల్ (TERV)

మరి తర్వాత వాళ్లు నీకు ఎదురు తిరిగారు! వాళ్లు నీ బోధనలను త్రోసిపుచ్చారు! వాళ్లు నీ ప్రవక్తల్ని హతమార్చారు. ఆ ప్రవక్తలు చేసిన తప్పిదం జనాన్ని హెచ్చరించడం, వాళ్లని తిరిగి నీ వైపుకి తిప్ప ప్రయత్నించడం కొరకే కాని మా పూర్వీకులు నీకు ప్రతికూలంగా దారుణాలెన్నో చేశారు! వాళ్ల శత్రువులు వాళ్లని చెరపట్టడానికి అందుకనే నీవు అనుమతించావు. శత్రువులు వాళ్లని నానా ఇబ్బంది పెట్టారు. కష్టాలు ఎదురైనప్పుడు మా పూర్వీకులు సహాయంకోసం నీకు మొర పెట్టుకున్నారు. పరలోకంలో వున్న నీవు వాళ్ల మొర విన్నావు. నీవు చాలా దయాశీలివి. అందుకని నీవు వాళ్లని కాపాడేందుకు మనుషుల్ని పంపావు. ఆ మనుష్యులు వాళ్లని వాళ్ల శత్రువుల నుంచి విడిపించారు. సరే, పరిస్థితులు మెరుగవగానే మా పూర్వీకులు తిరిగి ఎన్నెన్నో దారుణాలు చేయనారంభించారు! నీవు మరలా శత్రువులు వారిని ఓడించి, శిక్షించేటట్టు చేశావు. వాళ్లు మళ్లీ నీకు మొర పెట్టుకున్నారు. పరలోకంలో ఉన్న నీవు ఆ మొర విని వాళ్లకి తోడ్డడావు. నీవెంతో దయామయుడివి! ఇలా జరిగింది ఎన్నెన్నోసార్లు! నీవు వాళ్లని హెచ్చరించావు. మంచి మార్గానికి తిరిగి రమ్మన్నావు. అయితే, వాళ్లు మరీ గర్వపడి, నీ ఆదేశాలను, ఆజ్ఞలను మీరారు. జనం నీ ఆజ్ఞలను పాటిస్తే వాళ్లు నిజంగా బ్రతుకుతారు. కాని మా పూర్వీకులు నీ ఆజ్ఞలు ఉల్లంఘించారు వాళ్లు మొండివారై, నీకు పెడ ముఖమయ్యారు, నీ ఆజ్ఞలు పెడచెవిన పెట్టారు. “నీవు మా పూర్వీకుల పట్ల చాలా ఓర్పు వహించావు. వాళ్లు నీతో సరిగా వ్యవహరించక పోయినా చాలా సంవత్సరాలు వాళ్లని సహించావు. నీ ఆత్మతో వాళ్లని హెచ్చరించావు. వాళ్లని హెచ్చరించేందుకు ప్రవక్తల్ని పంపావు. కాని మా పూర్వీకులు వాళ్ల మాటలు వినలేదు. అందుకే నీవు వాళ్లని విదేశాల్లోని మనుష్యులకు అప్పగించావు. “అయితే, నీవెంతో దయామయుడివి! వాళ్లని నీవు సర్వనాశనం చేయలేదు. నీవు వాళ్లని విడువలేదు. నీవెంతో దయామయుడివి, దేవా, నీవెంతో కరుణామయుడివి! మా దేవా, నీవు మహా దేవుడివి, భయంకరుడివి, శక్తిశాలియైన యోధుడివి! నీవు దయామయుడివి, విశ్వాసనీయుడివి! ఒడంబడికను తప్పని వాడివి! మాకెన్నో కష్టాలు, కడగళ్లు వచ్చాయి. మా కష్టాలు నీవు పట్టించుకుంటావు! మా ప్రజలందరికీ, మా రాజులకీ, మా పెద్దలకీ, మా యాజకులకీ, మా ప్రవక్తలకీ ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి. అష్షూరు రాజు పాలన కాలం నుంచి నేటిదాకా అవి వున్నాయి! కష్టాలు మమ్మల్ని వెన్నాడుతూనే వున్నాయి! అందుకని దేవా మాకు సంభవించే ప్రతి దాన్నిగురించీ నీదే ఒప్పు, మాదే తప్పు. మా రాజులు, నాయకులు, యాజకులు, మరి మా పూర్వీకులు నీ ధర్మనిబంధనలు పాటించలేదు. వాళ్లు నీ ధర్మశాస్త్రాన్ని మీరారు, నీ హెచ్చరికను ఖాతరు చేయలేదు. తమ స్వదేశంలో నివసించినప్పుడు సైతం మా పూర్వీకులు నీకు సేవ చేయలేదు. వాళ్లు దుష్టకార్యాలు చేయడం మానలేదు. నీవు వాళ్లకిచ్చిన అద్భుతమైన వాటన్నిటినీ హాయిగా అనుభవించారు. వాళ్లు సారవంతమైన భూమిని అనుభవించారు సువిశాల దేశాన్ని ఏలుకున్నారు, అయినా, తమ దుర్మార్గాలు వీడలేదు. మరి ఇప్పుడు, మేము బానిసలము. మేమీ భూమిలో ఏ భూమినీ, దేని ఫలసాయాలనూ, ఇక్కడ పెరిగే మంచివాటన్నిటినీ అనుభవించమని మా పూర్వీకులకు నీవిచ్చావో, ఆ భూమిలో మేము ఈనాడు దాసులము. ఈ భూమిలో పంట పుష్కలమైనదే కాని మేము పాపాలు చేశాము కదా, అందుకని ఆ పంట నీవు మా నెత్తిన పెట్టిన రాజులకు పోతుంది. ఆ రాజులు మామీదా, మా పశువుల పైనా పెత్తనం చలాయిస్తారు. తమకిష్టము వచ్చినట్లు వ్యవహరిస్తారు. దేవా, మేము చాలా కష్టాల్లోవున్నాము. వీటన్నింటి మూలంగా, మార్చరాని స్థిరమైన ఒడంబడిక ఒకటి మేము చేసుకుంటున్నాము. మేమీ ఒడంబడికను రాత పూర్వకంగా చేసుకొంటున్నాము. మా నాయకులూ, లేవీయులూ, యాజకులూ ఈ ఒడంబడిక మీద సంతకాలు చేసి, ఒక ముద్రతో దానికి ముద్ర వేస్తున్నారు.”

షేర్ చేయి
Read నెహెమ్యా 9

నెహెమ్యా 9:26-38 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

“అయినా వారు మీ పట్ల అవిధేయత చూపించి మీపై తిరుగుబాటు చేశారు; మీ ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు. మీ వైపు తిరగాలని వారిని హెచ్చరించిన ప్రవక్తలను చంపారు; ఘోరమైన దేవదూషణ చేశారు. కాబట్టి మీరు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించారు. వారు బాధించబడిన సమయంలో మీకు మొరపెట్టినప్పుడు పరలోకంలో నుండి మీరు వారి మొర విన్నారు. మీ గొప్ప కృపను బట్టి వారిని శత్రువు చేతిలో నుండి విడిపించడానికి వారికి విమోచకులను ఇచ్చారు. “వారికి విశ్రాంతి లభించిన వెంటనే మీ ఎదుట చెడు చేశారు కాబట్టి శత్రువులు వారి మీద ప్రభుత్వం చేసేలా వారిని తిరిగి శత్రువు చేతికే అప్పగించారు. వారు తిరిగి మీకు మొరపెట్టినప్పుడు పరలోకంలో నుండి మీరు వారి మొర విన్నారు. కరుణ చూపించి అనేకసార్లు వారిని విడిపించారు. “వారిని మీ ధర్మశాస్త్రం వైపు మరలించడానికి మీరు వారిని హెచ్చరించారు, అయితే వారు గర్వించి మీ ఆజ్ఞలకు లోబడక ‘వాటిని పాటించే మనుష్యులు వాటి ద్వారా జీవిస్తాడు’ అని మీరు చెప్పిన మీ శాసనాలకు వ్యతిరేకంగా వారు పాపం చేశారు. మీరు వారిని ఎన్నో సంవత్సరాలు ఓర్పుతో సహించారు. మీ ఆత్మ చేత ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించారు. అయినా వారు మీ మాట వినలేదు, కాబట్టి మీరు వారిని వారి పొరుగు దేశాలకు అప్పగించారు. అయితే మీ గొప్ప కనికరాన్ని బట్టి మీరు వారిని పూర్తిగా నాశనం చేయలేదు, విడిచిపెట్టలేదు. మీరు దయా కనికరంగల దేవుడవు. “మా దేవా! గొప్ప దేవా! మహా బలవంతుడా! పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు చేసిన మీ ప్రేమ నిబంధన నెరవేరుస్తున్నారు. అష్షూరు రాజుల కాలం నుండి ఈ రోజు వరకు మా మీదికి, మా రాజులు నాయకుల మీదికి, మా యాజకులు ప్రవక్తల మీదికి, మా పూర్వికుల మీదికి మీ ప్రజలందరి మీదికి వచ్చిన శ్రమలు మీ దృష్టికి చిన్న విషయంగా ఉండకూడదు. మాకు జరిగినదాని అంతటిలో మీరు నీతిమంతులుగానే ఉన్నారు; మేము దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు మీరు నమ్మకంగా ప్రవర్తించారు. మా రాజులు, మా నాయకులు, మా యాజకులు, మా పూర్వికులు మీ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు; మీరు పాటించమని హెచ్చరించిన మీ ఆజ్ఞలు శాసనాలను లక్ష్యపెట్టలేదు. వారు తమ రాజ్య పరిపాలనలోను మీరు వారికిచ్చిన విశాలమైన సారవంతమైన దేశంలో మీరు వారిపట్ల చేసిన గొప్ప మేలులు అనుభవిస్తూ కూడా వారు మిమ్మల్ని సేవించలేదు, తమ దుష్టత్వాన్ని విడిచి మీ వైపు తిరగలేదు. “ఇదిగో ఈ రోజు మేము బానిసలుగా ఉన్నాము, దాని ఫలాలను తిని దానిలో ఉన్న మంచి వాటన్నిటిని అనుభవించమని మా పూర్వికులకు మీరిచ్చిన దేశంలో మేము బానిసలుగా ఉన్నాము. మా పాపాల కారణంగా దాని అపారమైన పంటంతా మీరు మామీద నియమించిన రాజులు అనుభవిస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు మా శరీరాల మీద మా పశువులమీద అధికారం చెలాయిస్తున్నారు. మేము చాలా శ్రమ అనుభవిస్తున్నాము. “వీటన్నిటిని బట్టి మేము వ్రాతపూర్వకంగా ఒక్క ఖచ్చితమైన ఒప్పందాన్ని చేసుకున్నాము; మా నాయకులు మా లేవీయులు మా యాజకులు దానిపై తమ ముద్రలు వేసి ఆమోదించారు.”

షేర్ చేయి
Read నెహెమ్యా 9