నెహెమ్యా 8:6-17

నెహెమ్యా 8:6-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తి– ఆమేన్ ఆమేన్ అని పలుకుచు, నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఈలాగు నిలువబడియుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాయును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియ జెప్పిరి. ఇటువలెనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులును–మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో నిట్లనెను–పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి,యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు. ఆలాగున లేవీయులు జనులందరిని ఓదార్చి –మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధదినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి. రెండవదినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైనవారును యాజకులును లేవీయులును ధర్మశాస్త్రగ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రియైన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుట కనుగొనెను మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియ జేయవలసినదేమనగా–మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆప్రకారమే జనులుపోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమతమ యిండ్లమీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. మరియు చెరలోనుండి తిరిగి వచ్చినవారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అదివరకు ఇశ్రాయేలీయులు ఆలాగున చేసియుండలేదు; అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను.

షేర్ చేయి
Read నెహెమ్యా 8

నెహెమ్యా 8:6-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించినప్పుడు ప్రజలంతా తమ చేతులు పైకెత్తి ఆమేన్‌, ఆమేన్‌ అని కేకలు వేస్తూ, క్రిందికి నేల వైపుకు తమ తలలు వంచుకుని యెహోవాకు నమస్కరించారు. ప్రజలు ఇలా నిలబడి ఉన్న సమయంలో యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా, లేవీయులు ధర్మశాస్త్రం అర్థాన్ని, భావాలను వారికి తెలియజేశారు. ఆ విధంగా ప్రజలు మరింత స్పష్టంగా అర్థం చేసుకుని గ్రహించగలిగేలా గ్రంథాన్ని చదివి వినిపించి వాటి సారాంశం తెలియజేసారు. ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు గ్రహించిన ప్రజలు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. అధికారి నెహెమ్యా, యాజకుడు, శాస్త్రి అయిన ఎజ్రా, ప్రజలకు వివరించే లేవీయులు వారితో “మీరు ఏడవ్వద్దు. ఈ రోజు మీ దేవుడైన యెహోవాకు కేటాయించిన రోజు” అని చెప్పారు. అప్పుడు నెహెమ్యా “బయలు దేరండి. కొవ్విన మాంసం తినండి. ఏదైనా తియ్యటిది తాగండి. ఇప్పటి దాకా తమ కోసం ఏమీ సిద్ధం చేసుకోని వాళ్లకు వాటాలు పంపించండి. ఎందుకంటే ఈ రోజు పరిశుద్ధమైనది. మీరు దుఃఖపడొద్దు. యెహోవాలో ఆనందమే మీ బలం” అని చెప్పాడు. ఈ విధంగా లేవీయులు ప్రజలందరినీ ఓదార్చారు. “మీరు దుఃఖించడం ఆపండి. చింతించకండి. ఇది పవిత్రమైన రోజు” అన్నారు. ఆ తరువాత ప్రజలు తాము విన్న మాటలన్నీ గ్రహించి, తినడానికీ, తాగడానికీ, లేని వారికి వాటాలు పంపించడానికీ, సంతోషంగా గడపడానికీ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లారు. రెండవ రోజు ప్రజల పెద్దల్లో ప్రముఖులు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు తెలుసుకోవాలని ఆచార్యుడు ఎజ్రా దగ్గర సమకూడారు. యెహోవా మోషేకు అనుగ్రహించిన గ్రంథం పరిశీలించినప్పుడు ఏడవ నెలలో జరిగే పండగ సమయంలో పర్ణశాలల్లో గడపాలని రాసి ఉన్నట్టు వారు కనుగొన్నారు. వాళ్ళు యెరూషలేంలో, తమ పట్టణాల్లో ఈ విధంగా చాటింపు వేయించారు. “గ్రంథంలో రాసి ఉన్నట్టు, మీరు కొండలకు వెళ్లి ఒలీవచెట్ల కొమ్మలు, అడవి ఒలీవచెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఈతచెట్ల కొమ్మలు, గుబురుగా ఉండే రకరకాల చెట్ల కొమ్మలు తీసుకువచ్చి పర్ణశాలలు కట్టాలి.” కాబట్టి ప్రజలు వెళ్లి కొమ్మలు తెచ్చి అందరూ తమ తమ ఇళ్ళ మీద, వాకిళ్ళలో, మందిరం పరిసరాల్లో, నీటి ద్వారం వీధిలో, ఎఫ్రాయీం ద్వారం వీధిలో పర్ణశాలలు కట్టారు. చెర నుండి తిరిగి వచ్చినవాళ్ళంతా పర్ణశాలలు కట్టుకుని వాటిలో ఉన్నారు. అందరూ ఆనందించారు. నూను కొడుకు యెహోషువ జీవిత కాలం తరువాత నుండి ఇప్పటి వరకూ ఇశ్రాయేలీయులు ఈ విధంగా చేయలేదు.

షేర్ చేయి
Read నెహెమ్యా 8

నెహెమ్యా 8:6-17 పవిత్ర బైబిల్ (TERV)

ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతించాడు. జనులందరూ తమ చేతులు పైకెత్తి బిగ్గరగా, “ఆమేన్! ఆమేన్!” అన్నారు. తర్వాత జనులందరూ నేలమీదవంగి నమస్కరించి యెహోవాను ఆరాధించారు. జనం అక్కడ నిలబడి వుండగా లేవీయులు ధర్మశాస్త్ర నియమాలను జనానికి బోధించారు. అలా బోధించిన లేవీయులు: యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హూదీయా, మయశాయా, కెలీటా, అజర్యా, యెజాబాదు, హానాను, పెలాయా. ఆ లేవీయులు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. వాళ్లు జనానికి అర్థం వివరించి దాన్ని సులభం చేశారు. చదివినదాన్ని జనం తేలిగ్గా అర్థం చేసుకోగలిగేందుకు గాను వాళ్లు తాత్పర్యాలను వివరించి చెప్పారు. తర్వాత పాలనాధికారి నెహెమ్యా, యాజకుడును, ఉపదేశకుడునైన ఎజ్రా, జనానికి బోధిస్తున్న లేవీయులు మాట్లాడారు. వాళ్లు, “ఈ రోజు మీ దేవుడైన యెహోవాకి ప్రత్యేక దినం మీరు విచారంగా వుండకండి, ఏడ్వకండి!” అని చెప్పారు. ధర్మశాస్త్రంలోని సందేశాలను వింటూ జనం అందరూ రోదించనారంభించిన మూలంగా వాళ్లీ మాటలు చెప్పారు. నెహెమ్యా ఇలా చెప్పాడు: “పోయి కొవ్విన మాంసంతో భోజనం చేయండి, మధుర ద్రాక్షారసం సేవించండి. ఏ ఆహారమూ తయారు చేసుకోని వాళ్లకికొంత ఆహారమూ పానీయాలూ ఇవ్వండి. ఈ రోజు యెహోవాకి ప్రత్యేకమైన రోజు. విచారాన్ని విడనాడండి! ఎందుకంటే, యెహోవా ఆనందం మీకు పుష్టిని చేకూరుస్తుంది.” జనం శాంతచిత్తులయ్యేందుకు లేవీయులు తోడ్పడ్డారు. “శాంతించండి, మౌనంగా వుండండి. ఇదొక ప్రత్యేక దినం, దుఃఖించకండి.” అప్పుడిక అందరూ విందు భోజనం చేసేందుకు వెళ్లారు. వాళ్లు తమ ఆహార పదార్థాలనీ, పానీయాలనీ పరస్పరం పంచుకున్నారు. ఆ ప్రత్యేక దినాన్ని వాళ్లెంతో సంతోషంగా జరుపుకున్నారు. వాళ్లు చివరికి బోధకులు తమకి బోధించ ప్రయత్నిస్తున్న ధర్మశాస్త్ర గుణపాఠాలను అర్థం చేసుకున్నారు. అటు తర్వాత, నెల రెండవ రోజున అన్ని కుటుంబాల పెద్దలూ ఎజ్రానూ, యాజకులనూ, లేవీయులనూ కలుసుకునేందుకు వెళ్లారు. వాళ్లందరూ ధర్మశాస్త్రంలోని ప్రవచనాలను అధ్యయనం చేసేందుకు ఉపదేశకుడైన ఎజ్రాచుట్టూ చేరారు. వాళ్లు ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయగా దానిలో ఈ దిగువ ఆజ్ఞలు వాళ్లకి కనిపించాయి యెహోవా మోషే ద్వారా ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ఏడాది ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు యెరూషలేముకు ప్రత్యేకమైన పండుగ జరుపుకునేందుకు విధిగా పోవాలి. వాళ్లు తాత్కాలిక పర్ణశాలల్లో ఉండాలి. తమ పట్టణాలన్నింటికీ, యెరూషలేముకీ పోయి, ఈ క్రింది మాటలు ప్రకటించాలి. “పర్వత ప్రాంతానికి పోయి రకరకాల ఒలీవ చెట్ల కొమ్మలు తీసుకురావాలి. కదంబ, తాటి, ఈత ఆకులను, అలాగే నీడనిచ్చే ఇతర మొక్కలను తీసుకురావాలి. ఆ కొమ్మలతో తాత్కాలికమైన పర్ణశాలలు వెయ్యాలి. ధర్మశాస్త్ర గ్రంథం చెప్పినట్లు చెయ్యండి.” సరే, జనం పోయి, ఆ చెట్ల కొమ్మలు తెచ్చారు. తర్వాత వాటితో వాళ్లు తమకి తాత్కాలిక పర్ణశాలలు నిర్మించుకున్నారు. వాళ్లు పర్ణశాలలను తమ ఇళ్ల కప్పులపైనా, తమ ఆవరణల్లోనూ వేసుకున్నారు. వాళ్లు ఆలయ ప్రాంగణంలో, నీటి గుమ్మం దగ్గరి ఖాళీ స్థలంలో, ఎఫ్రాయిము ద్వారం దగ్గర పర్ణశాలలు నిర్మించారు. చెరనుంచి బంధవిముక్తులై తిరిగివచ్చిన ఇశ్రాయేలీయుల బృందమంతా పర్ణశాలలు కట్టు కున్నారు. వాళ్లు తాము కట్టుకున్న పర్ణశాలల్లో నివసించారు. నూను కుమారుడైన యెహోషువా కాలంనుంచి ఆనాటిదాకా ఇశ్రాయేలీయులు పర్ణశాలల పండుగను ఇంత చక్కగా జరుపుకోలేదు. అందరూ ఎంతో సంతోషించారు!

షేర్ చేయి
Read నెహెమ్యా 8

నెహెమ్యా 8:6-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించగా ప్రజలందరు చేతులెత్తి, “ఆమేన్! ఆమేన్!” అని అంటూ తమ తలలు నేలకు వంచి యెహోవాను ఆరాధించారు. ప్రజలందరు నిలబడి ఉండగా లేవీయులైన యెషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలిథా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా మొదలగు వారందరు కలిసి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించారు. వారు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించి ప్రజలు దానిని గ్రహించేలా దాని అర్థాన్ని వివరించారు. ప్రజలందరు ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు వినగానే ఏడ్వడం మొదలుపెట్టారు. అప్పుడు అధిపతియైన నెహెమ్యా, యాజకుడూ ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రా, ప్రజలు గ్రహించేలా బోధించి లేవీయులు వారందరితో, “ఈ రోజు మన దేవుడైన యెహోవాకు పరిశుద్ధ దినం కాబట్టి మీరు దుఃఖపడకండి ఏడవకండి” అని చెప్పారు. నెహెమ్యా వారితో, “వెళ్లి, రుచికరమైన ఆహారాన్ని తిని మధురమైన వాటిని త్రాగి ఆనందించండి. తమ కోసం ఏమి సిద్ధం చేసుకోని వారికి కొంత భాగాన్ని పంపించండి. ఈ రోజు యెహోవాకు పరిశుద్ధ దినము. యెహోవాలో ఆనందించడమే మీ బలం కాబట్టి మీరు దుఃఖపడకండి” అన్నాడు. లేవీయులు ప్రజలందరినీ ఓదార్చుతూ, “మీరు నిశ్శబ్దంగా ఉండండి. ఇది పరిశుద్ధమైన రోజు కాబట్టి దుఃఖపడకండి” అన్నారు. ఆ తర్వాత ప్రజలందరు తమకు తెలియజేసిన మాటలన్నీ గ్రహించారు కాబట్టి తినడానికి త్రాగడానికి లేనివారికి పంపించడానికి, గొప్ప సంతోషాన్ని అనుభవించడానికి ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు. నెలలో రెండవ రోజున కుటుంబ పెద్దలు యాజకులు లేవీయులతో కలిసి ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రా దగ్గరకు ధర్మశాస్త్రంలోని మాటల నుండి జ్ఞానం పొందాలని వచ్చారు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రంలో ఏడవ నెల పండుగ సమయంలో ఇశ్రాయేలీయులు తాత్కాలిక నివాసాల్లో నివసించాలని వ్రాయబడి ఉండడం చూసి, వెంటనే వారు తమ పట్టణాల్లో యెరూషలేములో ఈ విధంగా ప్రకటించారు: “మీరు పర్వత ప్రాంతానికి వెళ్లి ఒలీవ చెట్ల కొమ్మలు, అడవి ఒలీవ చెట్ల కొమ్మలు, గొంజి చెట్టు కొమ్మలు, ఈత చెట్టు కొమ్మలు, గుబురుగా ఉండే చెట్టు కొమ్మలు తీసుకువచ్చి వ్రాయబడిన విధంగా తాత్కాలిక నివాసాలు నిర్మించాలి.” అలాగే ప్రజలందరు వెళ్లి కొమ్మలు తెచ్చి తమ ఇళ్ళ కప్పుల మీద, తమ వాకిటిలో, దేవుని ఆలయ ఆవరణంలో, నీటి గుమ్మపు వీధిలో, ఎఫ్రాయిం గుమ్మపు వీధిలో తాత్కాలిక నివాసాలు కట్టుకున్నారు. చెర నుండి తిరిగి వచ్చినవారి సమూహం తాత్కాలిక నివాసాలు కట్టుకుని వాటిలో నివసించారు. నూను కుమారుడైన యెహోషువ కాలం నుండి ఆ రోజు వరకు ఇశ్రాయేలీయులు ఎప్పుడు అలా చేయలేదు. వారు గొప్ప సంతోషాన్ని అనుభవించారు.

షేర్ చేయి
Read నెహెమ్యా 8