నెహెమ్యా 8:6-17

నెహెమ్యా 8:6-17 OTSA

ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించగా ప్రజలందరు చేతులెత్తి, “ఆమేన్! ఆమేన్!” అని అంటూ తమ తలలు నేలకు వంచి యెహోవాను ఆరాధించారు. ప్రజలందరు నిలబడి ఉండగా లేవీయులైన యెషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలిథా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా మొదలగు వారందరు కలిసి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించారు. వారు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించి ప్రజలు దానిని గ్రహించేలా దాని అర్థాన్ని వివరించారు. ప్రజలందరు ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు వినగానే ఏడ్వడం మొదలుపెట్టారు. అప్పుడు అధిపతియైన నెహెమ్యా, యాజకుడూ ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రా, ప్రజలు గ్రహించేలా బోధించి లేవీయులు వారందరితో, “ఈ రోజు మన దేవుడైన యెహోవాకు పరిశుద్ధ దినం కాబట్టి మీరు దుఃఖపడకండి ఏడవకండి” అని చెప్పారు. నెహెమ్యా వారితో, “వెళ్లి, రుచికరమైన ఆహారాన్ని తిని మధురమైన వాటిని త్రాగి ఆనందించండి. తమ కోసం ఏమి సిద్ధం చేసుకోని వారికి కొంత భాగాన్ని పంపించండి. ఈ రోజు యెహోవాకు పరిశుద్ధ దినము. యెహోవాలో ఆనందించడమే మీ బలం కాబట్టి మీరు దుఃఖపడకండి” అన్నాడు. లేవీయులు ప్రజలందరినీ ఓదార్చుతూ, “మీరు నిశ్శబ్దంగా ఉండండి. ఇది పరిశుద్ధమైన రోజు కాబట్టి దుఃఖపడకండి” అన్నారు. ఆ తర్వాత ప్రజలందరు తమకు తెలియజేసిన మాటలన్నీ గ్రహించారు కాబట్టి తినడానికి త్రాగడానికి లేనివారికి పంపించడానికి, గొప్ప సంతోషాన్ని అనుభవించడానికి ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు. నెలలో రెండవ రోజున కుటుంబ పెద్దలు యాజకులు లేవీయులతో కలిసి ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రా దగ్గరకు ధర్మశాస్త్రంలోని మాటల నుండి జ్ఞానం పొందాలని వచ్చారు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రంలో ఏడవ నెల పండుగ సమయంలో ఇశ్రాయేలీయులు తాత్కాలిక నివాసాల్లో నివసించాలని వ్రాయబడి ఉండడం చూసి, వెంటనే వారు తమ పట్టణాల్లో యెరూషలేములో ఈ విధంగా ప్రకటించారు: “మీరు పర్వత ప్రాంతానికి వెళ్లి ఒలీవ చెట్ల కొమ్మలు, అడవి ఒలీవ చెట్ల కొమ్మలు, గొంజి చెట్టు కొమ్మలు, ఈత చెట్టు కొమ్మలు, గుబురుగా ఉండే చెట్టు కొమ్మలు తీసుకువచ్చి వ్రాయబడిన విధంగా తాత్కాలిక నివాసాలు నిర్మించాలి.” అలాగే ప్రజలందరు వెళ్లి కొమ్మలు తెచ్చి తమ ఇళ్ళ కప్పుల మీద, తమ వాకిటిలో, దేవుని ఆలయ ఆవరణంలో, నీటి గుమ్మపు వీధిలో, ఎఫ్రాయిం గుమ్మపు వీధిలో తాత్కాలిక నివాసాలు కట్టుకున్నారు. చెర నుండి తిరిగి వచ్చినవారి సమూహం తాత్కాలిక నివాసాలు కట్టుకుని వాటిలో నివసించారు. నూను కుమారుడైన యెహోషువ కాలం నుండి ఆ రోజు వరకు ఇశ్రాయేలీయులు ఎప్పుడు అలా చేయలేదు. వారు గొప్ప సంతోషాన్ని అనుభవించారు.

Read నెహెమ్యా 8