మార్కు 9:2-24
మార్కు 9:2-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆరు రోజుల తర్వాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకుని ఒంటరిగా ఎత్తైన కొండ మీదికి వెళ్లారు, అక్కడ వారి ముందు ఆయన రూపాంతరం చెందారు. ఆయన వస్త్రాలు మిరుమిట్లుగొలిపేంత తెల్లగా మారాయి, లోకంలో ఎవ్వరూ ఉతకలేనంత తెల్లగా. అప్పుడు మోషే, ఏలీయా ప్రత్యక్షమై యేసుతో మాట్లాడుతూ వారికి కనబడ్డారు. పేతురు యేసుతో, “బోధకుడా, మనం ఇక్కడే ఉండడం మంచిది, మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని చెప్పాడు. అతనికి ఏమి చెప్పాలో తెలియలేదు, వారు చాలా భయపడ్డారు. అప్పుడు మేఘం వారిని కమ్ముకుంది, ఆ మేఘంలో నుండి ఒక స్వరం ఇలా చెప్పింది: “ఇదిగో ఈయన నేను ప్రేమించే నా ప్రియ కుమారుడు. ఈయన మాటలను వినండి!” అకస్మాత్తుగా, వారు చుట్టూ చూసినప్పుడు, తమతో యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వస్తున్నప్పుడు, మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచేవరకు మీరు చూసినవాటిని ఎవరితో చెప్పవద్దు అని యేసు శిష్యులను ఖచ్చితంగా ఆదేశించారు. “చనిపోయి తిరిగి బ్రతకడం” అనే మాట మీద వారు ఒకరితో ఒకరు చర్చించుకొంటూ, ఆ విషయాన్ని తమ మధ్యలోనే ఉంచుకున్నారు. వారు, “ఏలీయా ముందుగా రావాలని ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందుకు చెప్తున్నారు?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “ఏలీయా ముందుగా వచ్చి అన్నిటిని చక్కపెడతాడన్న మాట నిజమే. అలాంటప్పుడు మనుష్యకుమారుడు అధికంగా హింసను అనుభవించి తృణీకరించబడతాడని ఎందుకు వ్రాయబడింది? అయితే నేను మీతో చెప్తున్న, ఏలీయా ముందే వచ్చాడు, అతని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం, ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టుగా అతనికి చేశారు” అని అన్నారు. వారు ఇతర శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు, వారి చుట్టూ గొప్ప జనసమూహం ఉండడం ధర్మశాస్త్ర ఉపదేశకులు వారితో వాదిస్తుండడం చూశారు ప్రజలందరు యేసును చూసిన వెంటనే, వారు ఆశ్చర్యంతో మునిగిపోయి ఆయనను పలకరించడానికి పరుగెత్తారు. యేసు, “మీరు దేని గురించి వారితో వాదిస్తున్నారు?” అని వారిని అడిగారు. ఆ జనసమూహంలో నుండి ఒకడు, “బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని తీసుకువచ్చాను. అది వాన్ని పట్టినప్పుడెల్లా, వాన్ని నేల మీద పడవేస్తుంది. అప్పుడు వాడు నోటి నుండి నురుగు కారుస్తాడు, పండ్లు కొరుకుతూ, బిగుసుకుపోతాడు. ఈ దయ్యాన్ని వెళ్లగొట్టమని మీ శిష్యులను అడిగాను కాని వారిచేత కాలేదు” అన్నాడు. అందుకు యేసు, “విశ్వాసంలేని తరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహించగలను? ఆ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకురండి” అన్నారు. కాబట్టి వారు వాన్ని తీసుకువచ్చారు. ఆ దయ్యం యేసుని చూసిన వెంటనే ఆ పిల్లవాన్ని విలవిలలాడించింది. వాడు నేల మీద పడి నురుగు కార్చుకొంటు పొర్లాడుతున్నాడు. యేసు ఆ పిల్లవాని తండ్రితో, “వీడు ఎంతకాలం నుండి ఇలా ఉన్నాడు?” అని అడిగారు. అతడు, “వాని చిన్నతనం నుండే. అది వాన్ని చంపాలని చాలాసార్లు నిప్పుల్లో, నీళ్లలో పడవేసింది. ఒకవేళ నీ వలనైతే, మమ్మల్ని కనికరించి మాకు సహాయం చేయి” అన్నాడు. అందుకు యేసు, “ ‘నీ వలనైతే?’ అని అడిగి, ఒక వ్యక్తి నమ్మితే సమస్తం సాధ్యమే” అని అతనితో చెప్పారు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, “నేను నమ్ముతున్నాను; నా అపనమ్మకాన్ని జయించడానికి నాకు సహాయం చేయండి!” అని అరిచాడు.
మార్కు 9:2-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆరు రోజుల తరవాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని ఏకాంతంగా ఒక ఎతైన కొండ మీదికి వెళ్ళాడు. అక్కడ వారి ముందు యేసు రూపాంతరం చెందాడు. ఆయన వస్త్రాలు ధగధగా మెరవసాగాయి. ప్రపంచంలో ఏ చాకలీ ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి. అప్పుడు ఏలీయా, మోషేలు అక్కడ ప్రత్యక్షమై యేసుతో మాటలాడడం శిష్యులు చూశారు. పేతురు యేసుతో, “రబ్బీ! మనం ఇక్కడే ఉండడం మంచిది. మేము మూడు పాకలు వేస్తాం, ఒకటి నీకు, ఒకటి మోషేకి, ఒకటి ఏలీయాకి” అన్నాడు. తానేమి అంటున్నాడో అతనికి తెలియలేదు. ఆ శిష్యులంతా తీవ్రమైన భయానికి లోనయ్యారు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది. “ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి.” వెంటనే వారు తమ చుట్టూ చూశారు, యేసు తప్ప మరెవ్వరూ వారికి కనిపించలేదు. వారు కొండ దిగి వస్తూ ఉండగా యేసు, “మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి బతికే వరకూ మీరు చూసిన ఈ దృశ్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు. అందువల్ల వారు ఆ విషయం తమలోనే దాచుకుని, “చనిపోయి తిరిగి బ్రతకడం” గురించి తమలో తాము చర్చించుకున్నారు. అప్పుడు వారు, “ఏలీయా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు అంటున్నారు?” అని ఆయనను అడిగారు. యేసు జవాబు చెబుతూ, “ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే. కాని, మనుష్య కుమారుడు అనేక బాధలు అనుభవిస్తాడనీ తిరస్కారానికి గురి అవుతాడనీ లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది? నేను మీతో చెప్పేదేమంటే, ఏలీయా వచ్చాడు, అతని గురించి రాసి ఉన్న ప్రకారం ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు అతనికి చేశారు” అన్నాడు. మిగిలిన శిష్యుల దగ్గరికి ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జనసమూహం ఉండడం, కొందరు ధర్మశాస్త్ర పండితులు వారితో వాదిస్తుండడం చూశాడు. ఆ ప్రజలు యేసును చూసిన వెంటనే ఆశ్చర్యానందానికి లోనయ్యారు. వారంతా ఆయన దగ్గరికి పరుగెత్తి వచ్చి ఆయనకు నమస్కరించారు. యేసు, “దేనిని గురించి వారితో వాదిస్తున్నారు?” అని వారిని అడిగాడు. ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, “బోధకుడా! దయ్యం పట్టి మూగవాడైన నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకు వచ్చాను. ఆ దయ్యం వాడి మీదికి వచ్చినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది. అతని నోటి వెంట నురగ కారుతుంది, పళ్ళు కొరుకుతాడు, శరీరమంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వదిలించమని మీ శిష్యులను అడిగాను. కాని, వారు చేయలేకపోయారు” అన్నాడు. అందుకు యేసు, “విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎంత కాలం మిమ్మల్ని భరించాలి? ఆ పిల్లవాడిని నా దగ్గరికి తీసుకుని రండి” అన్నాడు. వారు తీసుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిల లాడించింది. వాడు నేల మీద పడి గిల గిలా కొట్టుకుంటూ నురగ కక్కుతున్నాడు. యేసు వాడి తండ్రితో, “ఇతనికి ఇది ఎంత కాలం నుండి ఉంది?” అని అడిగాడు. ఆ తండ్రి, “వాడి బాల్యం నుండి. ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో, నీళ్ళలో పడేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి” అని వేడుకున్నాడు. యేసు అతనితో, “నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే” అన్నాడు. వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, “నేను నమ్ముతున్నాను. నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి” అన్నాడు.
మార్కు 9:2-24 పవిత్ర బైబిల్ (TERV)
ఆరురోజుల తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును ఒక ఎత్తైన కొండ మీదికి తనవెంట పిలుచుకు వెళ్ళాడు. వాళ్ళు అక్కడ ఏకాంతంగా ఉన్నారు. అక్కడ యేసు వాళ్ళ సమక్షంలో దివ్యరూపం పొందాడు. ఆయన దుస్తులు మెరువ సాగాయి. ప్రపంచంలో ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లగా మారిపొయ్యాయి. ఏలీయా, మోషేలు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూసారు. పేతురు యేసుతో, “రబ్బీ! మనిమిక్కడే ఉండటం మంచిది. మేము మూడు పర్ణశాలలు వేస్తాము. మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి” అన్నాడు. శిష్యులు భయపడుతూ ఉండటం వల్ల పేతురుకు ఏమనాలో తోచలేదు. అప్పుడు ఒక మేఘం కనిపించి వాళ్ళను కప్పి వేసింది. ఆ మేఘం నుండి, “ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయన మాట వినండి” అని అనటం వినిపించింది. వెంటనే వాళ్ళు తమ చుట్టూ చూశారు. మిగతా యిద్దరూ వాళ్ళకు కనిపించలేదు. యేసు మాత్రమే కనిపించాడు. వాళ్ళు కొండదిగి క్రిందికి వస్తుండగా యేసు, “మనుష్య కుమారుడు చనిపోయి బ్రతికి వచ్చేవరకు మీరు చూసిన దృశ్యాన్ని ఎవ్వరికి చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు. అందువల్ల వాళ్ళావిషయాన్ని తమలోనే దాచుకొని, చనిపోయి బ్రతికి రావటాన్ని గురించి చర్చించుకొన్నారు. వాళ్ళాయనతో, “ఏలీయా మొదట రావాలని శాస్త్రులు ఎందుకంటున్నారు?” అని అడిగారు. యేసు సమాధానం చెబుతూ, “ఏలీయా మొదట వచ్చినప్పుడు సరి చేస్తాడన్నమాట నిజం. కాని, మనుష్యకుమారుడు కష్టాలను అనుభవించాలని, తృణీకరింపబడాలని ధర్మశాస్త్రంలో ఎందుకు వ్రాసారు? ఏలీయా వచ్చాడు. లేఖనాల్లో వ్రాసిన విధంగా ప్రజలు చేయలానుకొన్నవన్నీ ఇతనికి చేసారు” అని అన్నాడు. యేసు, పేతురు, యోహాను మరియు యాకోబు మిగతా శిష్యుల దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక పెద్ద ప్రజల గుంపు శిష్యుల చుట్టూ ఉండటం, వాళ్ళతో ఏమో వాదిస్తూ ఉండటం చూసారు. యేసును చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి స్వాగతం చెప్పటానికి ఆయన దగ్గరకు పరుగెత్తారు. యేసు శిష్యులను, “వాళ్ళతో మీరేమి వాదిస్తున్నారు” అని అడిగాడు. ఆ గుంపులో నుండి ఒకడు, “అయ్యా! నేను నా కుమారుణ్ణి మీదగ్గరకు పిలుచుకు వచ్చాను. దయ్యం పట్టి అతనికి మాట పడిపోయింది. ఆ దయ్యం అతని మీదికి వచ్చినప్పుడల్లా అది అతణ్ణి నేలపై పడవేస్తుంది. అప్పుడు నా కుమారుని నోటినుండి నురుగు వస్తుంది. పండ్లు కొరుకుతాడు. అతని శరీరం కట్టెబారిపోతుంది. ఆ దయ్యాల్ని వదిలించమని మీ శిష్యుల్ని అడిగాను. కాని వాళ్ళు ఆ పని చేయలేక పోయారు” అని అన్నాడు. యేసు, “ఈనాటి వాళ్ళలో విశ్వాసం లేదు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మిమ్మల్ని భరించాలి? ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకురండి” అని అన్నాడు. వాళ్ళు ఆ బాలుణ్ణి పిలుచుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే, ఆ బాలుణ్ణి వణికేటట్లు చేసింది. ఆ బాలుడు క్రింద పడ్డాడు. నురుగు కక్కుతూ పొర్లాడటం మొదలు పెట్టాడు. యేసు ఆ బాలుని తండ్రితో, “ఎంత కాలం నుండి యితడీవిధంగా ఉన్నాడు?” అని అడిగాడు. “చిన్ననాటి నుండి” అని అతడు సమాధానం చెప్పాడు. “ఆ దయ్యం అతణ్ణి చంపాలని ఎన్నో సార్లు అతణ్ణి నిప్పుల్లో, నీళ్ళలో పడవేసింది. మీరేదైనా చేయగల్గితే మా మీద దయవుంచి మాకు సహాయం చెయ్యండి” అని ఆ బాలుని తండ్రి అన్నాడు. యేసు, “నీవు విశ్వసించగలిగితే, విశ్వాసమున్న వానికి ఏదైనా సాధ్యమౌతుంది” అని అన్నాడు. వెంటనే ఆ బాలుని తండ్రి, “నేను విశ్వసిస్తున్నాను. నాలో ఉన్న అపనమ్మకం తొలిగిపోవటానికి సహాయపడండి చెయ్యండి” అన్నాడు.
మార్కు 9:2-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆరుదినములైన తరువాత, యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువచేయలేడు. మరియు మోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు–బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది; మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను; వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా –ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా–మనుష్య కుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. వారు–ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి. అందుకాయన–ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి? ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పు చున్నానని వారితో అనెను. వారు శిష్యులయొద్దకు వచ్చి, వారి చుట్టు బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి, మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తి కొనివచ్చి ఆయనకు వందనముచేసిరి. అప్పుడాయన–మీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారి నడుగగా జనసమూహములో ఒకడు– బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని; అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పగా వారాయనయొద్దకు వానిని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే, వాని విలవిల లాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడాయన –ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు–బాల్యమునుండియే; అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు–(నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి–నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను.
మార్కు 9:2-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)