మార్కు 9:17-29
మార్కు 9:17-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
జనసమూహములో ఒకడు– బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని; అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పగా వారాయనయొద్దకు వానిని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే, వాని విలవిల లాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడాయన –ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు–బాల్యమునుండియే; అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు–(నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి–నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుకూడి తనయొద్దకు పరుగెత్తికొనివచ్చుట యేసు చూచి–మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులు–వాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చెయ్యి పెట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు–మే మెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి. అందుకాయన–ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.
మార్కు 9:17-29 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ జనసమూహంలో నుండి ఒకడు, “బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని తీసుకువచ్చాను. అది వాన్ని పట్టినప్పుడెల్లా, వాన్ని నేల మీద పడవేస్తుంది. అప్పుడు వాని నోటిలో నుండి నురుగు కారుతుంది, పండ్లు కొరుకుతూ, బిగుసుకుపోతాడు. ఈ దయ్యాన్ని వెళ్లగొట్టమని నీ శిష్యులను అడిగాను కాని వారు వెళ్లగొట్టలేకపోయారు” అన్నాడు. అందుకు యేసు, “విశ్వాసంలేని తరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహించగలను? ఆ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకొనిరండి” అన్నారు. కనుక వారు వాన్ని తీసుకువచ్చారు. ఆ దయ్యం యేసుని చూసిన వెంటనే ఆ పిల్లవాన్ని విలవిలలాడించింది. వాడు నేల మీద పడి నురుగు కార్చుకొంటు పొర్లాడుతున్నాడు. యేసు ఆ పిల్లవాని తండ్రితో, “వీడు ఎంతకాలం నుండి ఇలా ఉన్నాడు?” అని అడిగారు. అతడు, “వాని చిన్నతనం నుండే. అది వాన్ని చంపాలని చాలాసార్లు నిప్పుల్లో, నీళ్లలో పడవేసింది. ఒకవేళ నీ వలనైతే, మమ్మల్ని కనికరించి మాకు సహాయం చెయ్యి” అన్నాడు. అందుకు యేసు, “ ‘నీ వలనైతే?’ అని అడిగి, ఒక వ్యక్తి నమ్మితే సమస్తం సాధ్యమే” అని అతనితో చెప్పారు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, “నేను నమ్ముతున్నాను; నా అపనమ్మకాన్ని జయించడానికి నాకు సహాయం చేయండి!” అని అరిచాడు. ప్రజలు గుంపుగా తన దగ్గరకు పరుగెత్తికొని వస్తున్నారని యేసు చూసి, “మూగ, చెవిటి దయ్యమా, ఇతనిలో నుండి బయటకు రా, ఇంకెప్పుడు వానిలో ప్రవేశింపకూడదని నీకు ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ అపవిత్రాత్మను గద్దించారు. అప్పుడు ఆ అపవిత్రాత్మ పెద్ద కేక వేసి, వాన్ని విలవిలలాడించి వదిలిపోయింది. ఆ పిల్లవాడు చచ్చిన వానిలా పడి ఉండటం చూసి చాలామంది, “వాడు చనిపోయాడు” అనుకున్నారు. కానీ యేసు వాని చెయ్యి పట్టుకొని లేవనెత్తారు, అప్పుడు వాడు లేచి నిలబడ్డాడు. యేసు ఇంట్లోకి వెళ్లిన తర్వాత, శిష్యులు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, “మేము ఎందుకు దానిని వెళ్లగొట్టలేకపోయాం” అని అడిగారు. అందుకు ఆయన, “ఇలాంటివి ప్రార్థన ద్వారా మాత్రమే బయటకు వస్తాయి” అని చెప్పారు.
మార్కు 9:17-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, “బోధకుడా! దయ్యం పట్టి మూగవాడైన నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకు వచ్చాను. ఆ దయ్యం వాడి మీదికి వచ్చినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది. అతని నోటి వెంట నురగ కారుతుంది, పళ్ళు కొరుకుతాడు, శరీరమంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వదిలించమని మీ శిష్యులను అడిగాను. కాని, వారు చేయలేకపోయారు” అన్నాడు. అందుకు యేసు, “విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎంత కాలం మిమ్మల్ని భరించాలి? ఆ పిల్లవాడిని నా దగ్గరికి తీసుకుని రండి” అన్నాడు. వారు తీసుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిల లాడించింది. వాడు నేల మీద పడి గిల గిలా కొట్టుకుంటూ నురగ కక్కుతున్నాడు. యేసు వాడి తండ్రితో, “ఇతనికి ఇది ఎంత కాలం నుండి ఉంది?” అని అడిగాడు. ఆ తండ్రి, “వాడి బాల్యం నుండి. ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో, నీళ్ళలో పడేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి” అని వేడుకున్నాడు. యేసు అతనితో, “నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే” అన్నాడు. వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, “నేను నమ్ముతున్నాను. నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి” అన్నాడు. యేసు జనసమూహం తన దగ్గరికి పరుగెత్తుకుంటూ రావడం చూసి ఆ దయ్యాన్ని గద్దించి, “మూగ చెవిటి దయ్యమా! ఇతనిలో నుండి బయటకు రా! ఇంకెప్పుడూ ఇతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు. ఆ దయ్యం పెద్ద కేకలు పెట్టి, ఆ పిల్లవాణ్ణి విలవిలలాడించి అతనిలో నుండి బయటకు వచ్చింది. ఆ పిల్లవాడు శవంలా పడి ఉండడం వల్ల చాలా మంది అతడు చనిపోయాడనుకున్నారు. కాని, యేసు అతని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు. యేసు ఇంట్లోకి వచ్చిన తరవాత ఇతరులెవ్వరూ లేనప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం?” అని అడిగారు. ఆయన వారితో, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థన వల్ల మాత్రమే వెళ్ళగొట్టగలం” అని జవాబు చెప్పాడు.
మార్కు 9:17-29 పవిత్ర బైబిల్ (TERV)
ఆ గుంపులో నుండి ఒకడు, “అయ్యా! నేను నా కుమారుణ్ణి మీదగ్గరకు పిలుచుకు వచ్చాను. దయ్యం పట్టి అతనికి మాట పడిపోయింది. ఆ దయ్యం అతని మీదికి వచ్చినప్పుడల్లా అది అతణ్ణి నేలపై పడవేస్తుంది. అప్పుడు నా కుమారుని నోటినుండి నురుగు వస్తుంది. పండ్లు కొరుకుతాడు. అతని శరీరం కట్టెబారిపోతుంది. ఆ దయ్యాల్ని వదిలించమని మీ శిష్యుల్ని అడిగాను. కాని వాళ్ళు ఆ పని చేయలేక పోయారు” అని అన్నాడు. యేసు, “ఈనాటి వాళ్ళలో విశ్వాసం లేదు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మిమ్మల్ని భరించాలి? ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకురండి” అని అన్నాడు. వాళ్ళు ఆ బాలుణ్ణి పిలుచుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే, ఆ బాలుణ్ణి వణికేటట్లు చేసింది. ఆ బాలుడు క్రింద పడ్డాడు. నురుగు కక్కుతూ పొర్లాడటం మొదలు పెట్టాడు. యేసు ఆ బాలుని తండ్రితో, “ఎంత కాలం నుండి యితడీవిధంగా ఉన్నాడు?” అని అడిగాడు. “చిన్ననాటి నుండి” అని అతడు సమాధానం చెప్పాడు. “ఆ దయ్యం అతణ్ణి చంపాలని ఎన్నో సార్లు అతణ్ణి నిప్పుల్లో, నీళ్ళలో పడవేసింది. మీరేదైనా చేయగల్గితే మా మీద దయవుంచి మాకు సహాయం చెయ్యండి” అని ఆ బాలుని తండ్రి అన్నాడు. యేసు, “నీవు విశ్వసించగలిగితే, విశ్వాసమున్న వానికి ఏదైనా సాధ్యమౌతుంది” అని అన్నాడు. వెంటనే ఆ బాలుని తండ్రి, “నేను విశ్వసిస్తున్నాను. నాలో ఉన్న అపనమ్మకం తొలిగిపోవటానికి సహాయపడండి చెయ్యండి” అన్నాడు. యేసు ప్రజల గుంపు తన దగ్గరకు పరుగెత్తుకుంటూ రావటం చూసి ఆ దయ్యంతో, “ఓ చెవిటి, మూగ దయ్యమా! అతని నుండి బయటకు రమ్మని, మళ్ళీ అతనిలో ప్రవేశించవద్దని నేను ఆజ్ఞాపిస్తున్నాను” అని అన్నాడు. ఆ దయ్యం కేకపెట్టి అతణ్ణి తీవ్రంగా వణికించి బయటకు వచ్చింది. ఆ బాలుడు శవంలా పడివుండుట వల్ల చాలా మంది అతడు చనిపొయ్యాడనుకొన్నారు. కాని, యేసు అతని చేతులు పట్టుకొని లేపి నిలుచోబెట్టాడు. ఇంట్లోకి వెళ్ళాక శిష్యులు రహస్యంగా, “మేమెందుకు వెళ్ళగొట్టలేక పొయ్యాము?” అని అడిగారు. యేసు, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థనతో మాత్రమే వెళ్ళగొట్టగలము” అని సమాధానం చెప్పాడు.
మార్కు 9:17-29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఆ జనసమూహంలో నుండి ఒకడు, “బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని తీసుకువచ్చాను. అది వాన్ని పట్టినప్పుడెల్లా, వాన్ని నేల మీద పడవేస్తుంది. అప్పుడు వాడు నోటి నుండి నురుగు కారుస్తాడు, పండ్లు కొరుకుతూ, బిగుసుకుపోతాడు. ఈ దయ్యాన్ని వెళ్లగొట్టమని మీ శిష్యులను అడిగాను కాని వారిచేత కాలేదు” అన్నాడు. అందుకు యేసు, “విశ్వాసంలేని తరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహించగలను? ఆ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకురండి” అన్నారు. కాబట్టి వారు వాన్ని తీసుకువచ్చారు. ఆ దయ్యం యేసుని చూసిన వెంటనే ఆ పిల్లవాన్ని విలవిలలాడించింది. వాడు నేల మీద పడి నురుగు కార్చుకొంటు పొర్లాడుతున్నాడు. యేసు ఆ పిల్లవాని తండ్రితో, “వీడు ఎంతకాలం నుండి ఇలా ఉన్నాడు?” అని అడిగారు. అతడు, “వాని చిన్నతనం నుండే. అది వాన్ని చంపాలని చాలాసార్లు నిప్పుల్లో, నీళ్లలో పడవేసింది. ఒకవేళ నీ వలనైతే, మమ్మల్ని కనికరించి మాకు సహాయం చేయి” అన్నాడు. అందుకు యేసు, “ ‘నీ వలనైతే?’ అని అడిగి, ఒక వ్యక్తి నమ్మితే సమస్తం సాధ్యమే” అని అతనితో చెప్పారు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, “నేను నమ్ముతున్నాను; నా అపనమ్మకాన్ని జయించడానికి నాకు సహాయం చేయండి!” అని అరిచాడు. ప్రజలు గుంపుగా తన దగ్గరకు పరుగెత్తికొని వస్తున్నారని యేసు చూసి, “మూగ, చెవిటి దయ్యమా, ఇతనిలో నుండి బయటకు రా, ఇంకెప్పుడు వానిలో ప్రవేశింపకూడదని నీకు ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ అపవిత్రాత్మను గద్దించారు. అప్పుడు ఆ అపవిత్రాత్మ పెద్ద కేక వేసి, వాన్ని విలవిలలాడించి వదిలిపోయింది. ఆ పిల్లవాడు చచ్చిన వానిలా పడి ఉండడం చూసి చాలామంది, “వాడు చనిపోయాడు” అనుకున్నారు. కానీ యేసు వాని చేయి పట్టుకుని లేవనెత్తారు, అప్పుడు వాడు లేచి నిలబడ్డాడు. యేసు ఇంట్లోకి వెళ్లిన తర్వాత, శిష్యులు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, “మేము ఎందుకు దానిని వెళ్లగొట్టలేకపోయాం” అని అడిగారు. అందుకు ఆయన, “ఇలాంటివి ప్రార్థన ద్వారా మాత్రమే బయటకు వస్తాయి” అని చెప్పారు.