మార్కు 8:27-38

మార్కు 8:27-38 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

యేసు, ఆయన శిష్యులు కైసరయ ఫిలిప్పు చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లారు. మార్గం మధ్యలో ఆయన వారిని “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని అడిగారు. అందుకు వారు, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అంటున్నారు; ఇతరులు ఏలీయా అంటున్నారు; మరికొందరు ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకొంటున్నారు” అన్నారు. ఆయన వారిని, “అయితే నేనెవరినని మీరనుకొంటున్నారు?” అని అడిగారు. పేతురు, “నీవు క్రీస్తువు” అని చెప్పాడు. అప్పుడు యేసు తన గురించి ఎవరితో చెప్పవద్దని వారిని హెచ్చరించారు. ఆ తర్వాత యేసు, మనుష్యకుమారుడు యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే, ధర్మశాస్త్ర ఉపదేశకులచే తిరస్కరించబడి, అనేక హింసలు పొంది, చంపబడి, మూడు రోజుల తర్వాత తిరిగి లేస్తాడు అని తన శిష్యులకు బోధించడం మొదలుపెట్టారు. ఆయన ఈ మాటను స్పష్టంగా చెప్పారు, గనుక పేతురు ఆయనను ప్రక్కకు తీసుకువెళ్లి గద్దింపసాగాడు. కాని యేసు తన శిష్యులవైపు తిరిగి వారిని చూసి, పేతురును, “సాతానా, నా వెనుకకు పో! నీ మనస్సులో దేవుని విషయాలు లేవు, కేవలం మనుష్యుల విషయాలు వున్నాయి” అని గద్దించారు. ఆ తర్వాత యేసు జనసమూహంతో పాటు తన శిష్యులను తన దగ్గరకు పిలిచి వారితో ఈ విధంగా చెప్పారు: “ఎవరైనా నా శిష్యునిగా ఉండాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొనేవారు దానిని పోగొట్టుకొంటారు, కానీ నా కొరకు, సువార్త కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని కాపాడుకొంటారు. ఎవరైనా లోకమంతా సంపాదించుకొని, తమ ప్రాణాన్ని పోగొట్టుకొంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు? ఈ వ్యభిచార, పాపపు తరం మధ్యలో నా గురించి గాని, నా మాటల గురించి గాని ఎవరైనా సిగ్గుపడితే, మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో పరిశుద్ధ దూతలతో పాటు వచ్చినప్పుడు ఆయన వారి గురించి సిగ్గుపడతాడు.”

షేర్ చేయి
Read మార్కు 8

మార్కు 8:27-38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు ఆయన శిష్యులతో కలిసి ఫిలిప్పు కైసరయ పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళాడు. దారిలో ఆయన, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? అని తన శిష్యులను అడిగాడు. అందుకు వారు, “బాప్తిసం ఇచ్చే యోహానని కొందరూ, ఏలీయా అని కొందరూ, ప్రవక్తల్లో ఒకడు అని కొందరూ అంటున్నారు” అని చెప్పారు. “అయితే మీరు నేనెవరినని అనుకుంటున్నారు?” అని ఆయన వారిని అడిగాడు. దానికి జవాబుగా పేతురు, “నీవు అభిషిక్తుడివి!” అన్నాడు. అప్పుడు ఆయన తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వారిని హెచ్చరించాడు. ఆ తరువాత యేసు వారితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు భరిస్తాడు. పెద్దలు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులచే ఆయన తృణీకారానికి గురై మరణమౌతాడు. ఆయన మూడు రోజుల తరువాత సజీవంగా బ్రతికి వస్తాడు.” యేసు ఈ విషయం చాలా స్పష్టంగానే చెప్పాడు. అయితే పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, పక్కకు తీసుకు వెళ్ళి ఆయనను మందలించ సాగాడు. కాని యేసు వెనక్కి తిరిగి తన శిష్యులను చూసి పేతురుతో, “సైతానూ! నా వెనక్కి పో! మనుషుల సంగతుల పైనే గాని దేవుని సంగతుల మీద నీకు మనసు లేదు” అని గద్దించాడు. తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. “ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తనను తాను కాదనుకుని, తన సిలువను మోసుకుంటూ నాతో నడవాలి. ఎందుకంటే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం? ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏమి ఇవ్వగలడు? వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.”

షేర్ చేయి
Read మార్కు 8

మార్కు 8:27-38 పవిత్ర బైబిల్ (TERV)

యేసు తన శిష్యులతో కలిసి, కైసరయ ఫిలిప్పి పట్టణానికి చుట్టూవున్న పల్లెలకు వెళ్ళాడు. దారిలో యేసు వాళ్ళతో, “ప్రజలు నేనెవరని అనుకొంటున్నారు?” అని అడిగాడు. వాళ్ళు, “బాప్తిస్మము నిచ్చే యోహాను అని కొందరు, ఏలీయా అని కొందరు, ప్రవక్తలలో ఒకడై ఉండవచ్చని మరికొందరు అంటున్నారు” అని సమాధానం చెప్పారు. “మరి మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని అడిగాడు. పేతురు, “మీరే క్రీస్తు” అని సమాధానం చెప్పాడు. తనను గురించి ఎవ్వరికి చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు. ఆ తదుపరి యేసు వాళ్ళకు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు: “మనుష్య కుమారుడు కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధానయాజకులు, శాస్త్రులు, ఆయన్ని తృణీకరిస్తారు. ఆయన చంపబడి మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికివస్తాడు.” యేసు ఈ విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లాడాడు. పేతురు ఆయన చేయిపట్టుకొని వారించటం మొదలు పెట్టాడు. కాని యేసు వెనక్కు తిరిగి తన శిష్యుల వైపు ఒకసారి చూసి, పేతురుతో “సైతానా! నాముందు నుండి వెళ్ళిపో! నీవు మానవరీతిగా ఆలోచిస్తున్నావు కాని, దేవుని రీతిగా కాదు” అని అన్నాడు. ఆ తర్వాత తన శిష్యుల్ని, ప్రజల్ని దగ్గరకు పిలిచి, “మీరు నన్ను అనుసరింపదలిస్తే, తనను తాను విసర్జించుకొని తన సిలువను మోస్తూ అనుసరించాలి. ఎందుకంటే, తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నాకోసం, సువార్త కోసం ప్రాణాన్ని పోగొట్టుకొన్నవాడు దాన్ని కాపాడుకొంటాడు. ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని వదులుకొన్న మనిషికి ఏంలాభం కలుగుతుంది? తన ప్రాణాన్ని తిరిగి పొందటానికి మనిషి ఏంయివ్వగలడు? ఈ తరం వ్యభిచారంతో, పాపంతో నిండివుంది. నా విషయంలో కాని, నా బోధనల విషయంలో కాని ఎవ్వడు సిగ్గుపడతాడో, మనుష్య కుమారుడు తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతలతో కలసి వచ్చినప్పుడు వాని విషయంలో సిగ్గుపడతాడు.”

షేర్ చేయి
Read మార్కు 8

మార్కు 8:27-38 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములోనుండగా– నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యుల నడిగెను. అందుకు వారు–కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన–మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారినడుగగా పేతురు–నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్నుగూర్చిన యీ సంగతి ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడుదినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయిపట్టుకొని ఆయనను గద్దింపసాగెను అందుకాయన తన శిష్యులవైపు తిరిగి, వారిని చూచి–సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్క రింపకున్నావని పేతురును గద్దించెను. అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి–నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబ డింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించు కొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్య గలుగును? వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్నుగూర్చియు నామాటలనుగూర్చియు సిగ్గుపడు వాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధదూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను.

షేర్ చేయి
Read మార్కు 8