మార్కు 8:27-38

మార్కు 8:27-38 TCV

యేసు, ఆయన శిష్యులు కైసరయ ఫిలిప్పు చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లారు. మార్గం మధ్యలో ఆయన వారిని “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని అడిగారు. అందుకు వారు, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అంటున్నారు; ఇతరులు ఏలీయా అంటున్నారు; మరికొందరు ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకొంటున్నారు” అన్నారు. ఆయన వారిని, “అయితే నేనెవరినని మీరనుకొంటున్నారు?” అని అడిగారు. పేతురు, “నీవు క్రీస్తువు” అని చెప్పాడు. అప్పుడు యేసు తన గురించి ఎవరితో చెప్పవద్దని వారిని హెచ్చరించారు. ఆ తర్వాత యేసు, మనుష్యకుమారుడు యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే, ధర్మశాస్త్ర ఉపదేశకులచే తిరస్కరించబడి, అనేక హింసలు పొంది, చంపబడి, మూడు రోజుల తర్వాత తిరిగి లేస్తాడు అని తన శిష్యులకు బోధించడం మొదలుపెట్టారు. ఆయన ఈ మాటను స్పష్టంగా చెప్పారు, గనుక పేతురు ఆయనను ప్రక్కకు తీసుకువెళ్లి గద్దింపసాగాడు. కాని యేసు తన శిష్యులవైపు తిరిగి వారిని చూసి, పేతురును, “సాతానా, నా వెనుకకు పో! నీ మనస్సులో దేవుని విషయాలు లేవు, కేవలం మనుష్యుల విషయాలు వున్నాయి” అని గద్దించారు. ఆ తర్వాత యేసు జనసమూహంతో పాటు తన శిష్యులను తన దగ్గరకు పిలిచి వారితో ఈ విధంగా చెప్పారు: “ఎవరైనా నా శిష్యునిగా ఉండాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొనేవారు దానిని పోగొట్టుకొంటారు, కానీ నా కొరకు, సువార్త కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని కాపాడుకొంటారు. ఎవరైనా లోకమంతా సంపాదించుకొని, తమ ప్రాణాన్ని పోగొట్టుకొంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు? ఈ వ్యభిచార, పాపపు తరం మధ్యలో నా గురించి గాని, నా మాటల గురించి గాని ఎవరైనా సిగ్గుపడితే, మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో పరిశుద్ధ దూతలతో పాటు వచ్చినప్పుడు ఆయన వారి గురించి సిగ్గుపడతాడు.”