మార్కు 8:1-21
మార్కు 8:1-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ రోజుల్లో మరొక పెద్ద గుంపు గుమికూడింది. అయితే వారు ఏమి తినలేదు, కాబట్టి యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “ఈ ప్రజలు మూడు రోజులుగా ఏమి తినకుండా నా దగ్గరే ఉండిపోయారు; వారి మీద నాకు జాలి కలుగుతుంది. నేను వీరిని ఆకలితో ఇళ్ళకు పంపితే, వారు దారిలో సొమ్మసిల్లిపోతారు ఎందుకంటే కొందరు దూరం నుండి వచ్చారు” అని చెప్పారు. అందుకు ఆయన శిష్యులు, “కాని ఇంత మందికి భోజనం పెట్టి తృప్తిపరచడానికి కావలసినంత ఆహారం ఈ మారుమూల ప్రాంతంలో మనకు ఎక్కడ దొరుకుతుంది?” అన్నారు. యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారిని అడిగారు. వారు, “ఏడు” అని జవాబిచ్చారు. యేసు ఆ జనసమూహాన్ని నేల మీద కూర్చోమని ఆదేశించారు. ఆ ఏడు రొట్టెలను పట్టుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాటిని విరిచి జనసమూహానికి పంచిపెట్టుమని తన శిష్యులకు ఇచ్చారు, వారు పంచిపెట్టారు. వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడ ఉన్నాయి; ఆయన వాటిని కూడ ఆశీర్వదించి, పంచిపెట్టుమని తన శిష్యులకు చెప్పారు. ప్రజలు తిని తృప్తి పొందారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండా నింపారు. తిన్న వారందరు ఇంచుమించు నాలుగు వేలమంది. యేసు వారిని పంపించిన వెంటనే, ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి దల్మనూతా అనే ప్రాంతానికి వెళ్లారు. పరిసయ్యులు వచ్చి యేసును ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడానికి, ఆకాశం నుండి ఒక సూచన చూపించుమని వారు ఆయనను అడిగారు. అందుకు ఆయన ఆత్మలో దీర్ఘ నిట్టూర్పు విడిచి, “ఈ తరం వారు నన్ను ఎందుకు సూచన అడుగుతున్నారు? వారికి ఏ సూచన ఇవ్వబడదని నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను” అని వారితో అన్నారు. తర్వాత ఆయన వారిని విడిచిపెట్టి మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డున చేరుకొన్నారు. శిష్యులు తమతో రొట్టెలను తెచ్చుకోవడం మరచిపోయారు, పడవలో వారి దగ్గర ఒక్క రొట్టె తప్ప ఏమి లేదు. యేసు వారితో, “పరిసయ్యుల హేరోదు వెంబడించేవారి పులిసిన పిండి మీలో ఉండకుండా చూసుకోండి” అని వారిని హెచ్చరించారు. వారు, “మన దగ్గర రొట్టెలు లేవని ఇలా అన్నారు” అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. వారు ఏమి చర్చించుకుంటున్నారో తెలిసినవాడై యేసు, “రొట్టెలు లేవని మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇప్పటికీ మీరు చూడలేకపోతున్నారా లేదా గ్రహించలేదా పోతున్నారా? మీ హృదయాలు కఠినమైపోయాయా? మీరు కళ్లు ఉండి చూడలేకపోతున్నారా? చెవులు ఉండి వినలేకపోతున్నారా? మీకు జ్ఞాపకం లేదా? నేను అయిదు రొట్టెలను విరిచి అయిదు వేలమందికి పంచినప్పుడు, మీరు ఎన్ని గంపలు ఎత్తారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు, “పన్నెండు” అని చెప్పారు. “నేను ఏడు రొట్టెలను విరిచి నాలుగు వేలమందికి పంచినప్పుడు, ఎన్ని గంపల నిండా ముక్కలను ఎత్తారు?” అని ఆయన వారిని అడిగారు. అందుకు వారు, “ఏడు” అని జవాబిచ్చారు. అప్పుడు ఆయన వారితో, “మీకు ఇంకా అర్థం కాలేదా?” అన్నారు.
మార్కు 8:1-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ రోజుల్లో ఒకసారి పెద్ద జనసమూహం గుమిగూడారు. వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోయింది. యేసు తన శిష్యులను పిలిచి, “ఈ ప్రజల మీద నాకు జాలి కలుగుతున్నది. వారు ఇప్పటికే మూడు రోజుల నుండి నా దగ్గర ఉన్నారు. తినడానికి వారి దగ్గర ఏమీ లేదు. వారిని ఇప్పుడు పంపివేస్తే వారిలో కొందరు చాలా దూరం నుండి వచ్చారుగనక దారిలో సొమ్మసిల్లి పోవచ్చు” అని అన్నాడు. ఆయన శిష్యులు, “ఈ నిర్జన ప్రాంతంలో ఇంతమందికి సరిపడినంత ఆహారం ఎక్కడ నుండి తేగలం?” అన్నారు. “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” అని ఆయన వారిని అడిగాడు. వారు, “ఏడు” అన్నారు. యేసు ఆ ప్రజలందరినీ నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆ ఏడు రొట్టెలను చేతపట్టుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని విరిచి శిష్యులకిచ్చి వారికి పంచమన్నాడు. శిష్యులు అలాగే చేశారు. వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. యేసు వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని కూడా పంచమని శిష్యులకు ఇచ్చాడు. ఆ ప్రజలంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను ఏడు పెద్ద గంపల నిండా నింపారు. తిన్నవారు సుమారు నాలుగు వేలమంది పురుషులు. యేసు వారిని పంపివేసి, వెంటనే తన శిష్యులతో కలసి, పడవ ఎక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు. పరిసయ్యులు వచ్చి యేసుతో వాదించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడం కోసం తమకు ఆకాశం నుండి ఒక సూచన చూపమని అడిగారు. దానికి ఆయన ఆత్మలో పెద్దగా నిట్టూర్చి, “ఈ తరం వారు ఎందుకు సూచక క్రియలను చూపమని అడుగుతున్నారు? మీతో కచ్చితంగా చెప్తున్నాను, ఈ తరానికి ఏ సూచనా చూపడం జరగదు” అని వారితో చెప్పాడు. తరువాత ఆయన వారిని విడిచిపెట్టి, మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డు చేరుకున్నాడు. శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. వారి దగ్గర పడవలో ఒక రొట్టె తప్ప ఏమీ లేదు. యేసు వారితో, “పరిసయ్యులకు, హేరోదుకు సంబంధించిన పొంగజేసే పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి!” అన్నాడు. శిష్యులు, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా?” అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. అది కనిపెట్టి యేసు, “రొట్టెలు లేవనే విషయం ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు గ్రహించలేదా? మీ బుద్ధి మందగించిందా? మీరు కళ్ళుండి కూడా చూడరా? చెవులుండి కూడా వినరా? మీకు గుర్తు లేదా? ఐదు రొట్టెలు విరిచి ఐదు వేల మందికి నేను పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగాడు. వారు, “పన్నెండు” అని జవాబు చెప్పారు. “మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలను ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగినప్పుడు వారు, “ఏడు” అని జవాబు చెప్పారు. ఆయన వారితో, “ఇంకా మీకు అర్థం కాలేదా?” అన్నాడు.
మార్కు 8:1-21 పవిత్ర బైబిల్ (TERV)
ఆ రోజుల్లో మళ్ళీ ఒకసారి పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. వాళ్ళ దగ్గర తినటానికి ఏమీ ఉండనందువల్ల యేసు శిష్యుల్ని పిలిచి, “నాకు జాలివేస్తోంది. వాళ్ళిప్పటికే మూడు రోజులనుండి నా దగ్గరున్నారు. తినటానికి వాళ్ళ దగ్గర ఏమీలేదు. నేను వాళ్ళను ఆకలితో యింటికి పంపివేస్తే వాళ్ళలో కొందరు చాలా దూరం నుండి వచ్చారు. కనుక వాళ్ళు దారిలో మూర్ఛపోవచ్చు” అని అన్నాడు. ఆయన శిష్యులు, “ఈ ఎడారి ప్రాంతంలో వాళ్ళు తినటానికి చాలినంత ఆహారం ఎక్కడనుండి తెమ్మంటారు?” అని అన్నారు. “ఎన్ని రొట్టెలున్నాయి” అని యేసు అడిగాడు. “ఏడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు ప్రజల్ని కూర్చోమని చెప్పాడు. ఆ ఏడు రొట్టెలు తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచాడు. ఆ రొట్టెముక్కల్ని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు. వాళ్ళు అలాగే చేసారు. వాళ్ళ దగ్గర కొన్ని చేపలుకూడా ఉన్నాయి. వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని కూడా పంచమని తన శిష్యులకు యిచ్చాడు. ప్రజలు వాటిని తిని సంతృప్తి చెందారు. ఆ తర్వాత ప్రజలు తినగా మిగిలిన ముక్కల్ని ఏడు గంపలనిండా నింపారు. నాలుగు వేలమంది ప్రజలు అక్కడవున్నారు. వాళ్ళను పంపివేసి వెంటనే యేసు తన శిష్యులతో కలిసి పడవనెక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు. పరిసయ్యులు వచ్చి యేసును ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఆయన్ని పరీక్షించే ఉద్దేశ్యంతోనే ఆకాశంనుండి ఒక రుజువు చూపమన్నారు. ఆయన పెద్దగా నిట్టూర్చి, “ఈ కాలపు వాళ్ళు అద్భుతాల్ని రుజువులుగా చూపమని ఎందుకు అడుగుతారు? ఇది నిజం. మీకు ఏ రుజువూ చూపబడదు” అని అన్నాడు. ఆ తర్వాత ఆయన వాళ్ళను వదిలి పడవనెక్కి అవతలి ఒడ్డు చేరుకొన్నాడు. శిష్యులు రొట్టెలు తేవటం మరిచిపోయారు. వాళ్ళ దగ్గర ఒక రొట్టె మాత్రమే ఉంది. యేసు, “జాగ్రత్తగా ఉండండి. పరిసయ్యుల పులుపును హేరోదు పులుపును గమనిస్తూ ఉండండి” అని వాళ్ళను హెచ్చరించాడు. ఇది వాళ్ళు పరస్పరం చర్చించుకొంటూ, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా!” అని అనుకొన్నారు. వాళ్ళు ఏమి చర్చించుకొంటున్నారో యేసు కనిపెట్టి, “రొట్టెలులేవని ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు యింకా అర్థంకాలేదా? మీరు చూడలేదా? మీ బుద్ధి మందగించిందా? మీకు కళ్ళున్నాయి కాని చూడలేరు. చెవులున్నాయి కాని వినలేరు. మీకు జ్ఞాకపం లేదా? నేను ఐదు రొట్టెల్ని విరిచి ఐదువేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపలనిండా నింపారు?” అని అడిగాడు. “పన్నెండు” అని వాళ్ళు సమాధానం చెప్పారు. “మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేలమందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని ఎన్ని గంపలనిండా నింపారు?” అని యేసు అన్నాడు. “ఏడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు. “యింకా మీకు అర్థం కాలేదా?” అని ఆయన వాళ్ళతో అన్నాడు.
మార్కు 8:1-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ దినములలో మరియొక సారి బహుజనులు కూడి రాగా, వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తనయొద్దకు పిలిచి –జనులు నేటికి మూడుదినముల నుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను; నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినయెడల మార్గములో మూర్ఛపోవుదురు; వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారని వారితో చెప్పెను. అందు కాయన శిష్యులు–ఈ అరణ్యప్రదేశములో ఒక డెక్కడ నుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి. ఆయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారు – ఏడనిరి. అప్పుడాయన – నేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి ఆ యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్నచేపలు కూడ వారియొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడ వడ్డించుడని చెప్పెను. వారు భోజనముచేసి తృప్తిపొందినమీదట, మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి. భోజనముచేసినవారు ఇంచు మించు నాలుగు వేలమంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతోకూడ దోనె యెక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చెను. అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశమునుండి యొక సూచకక్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి–ఈ తరమువారు ఎందుకు సూచక క్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరల దోనె యెక్కి అద్దరికి పోయెను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి; దోనెలో వారియొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియు లేకపోయెను. ఆయన–చూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు–తమయొద్ద రొట్టెలు లేవేయని తమలోతాము ఆలోచించుకొనిరి. యేసు అది యెరిగి మనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారై యున్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసికొనరా? నేను ఆ అయిదువేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టి నప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడిగెను. వారు–పండ్రెండని ఆయనతో చెప్పిరి. ఆ నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి, పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని ఆయన అడుగగా వారు – ఏడనిరి. అందుకాయన – మీరింకను గ్రహింపకున్నారా? అని అనెను.
మార్కు 8:1-21 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)