ఆ రోజుల్లో ఒకసారి పెద్ద జనసమూహం గుమిగూడారు. వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోయింది. యేసు తన శిష్యులను పిలిచి, “ఈ ప్రజల మీద నాకు జాలి కలుగుతున్నది. వారు ఇప్పటికే మూడు రోజుల నుండి నా దగ్గర ఉన్నారు. తినడానికి వారి దగ్గర ఏమీ లేదు. వారిని ఇప్పుడు పంపివేస్తే వారిలో కొందరు చాలా దూరం నుండి వచ్చారుగనక దారిలో సొమ్మసిల్లి పోవచ్చు” అని అన్నాడు. ఆయన శిష్యులు, “ఈ నిర్జన ప్రాంతంలో ఇంతమందికి సరిపడినంత ఆహారం ఎక్కడ నుండి తేగలం?” అన్నారు. “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” అని ఆయన వారిని అడిగాడు. వారు, “ఏడు” అన్నారు. యేసు ఆ ప్రజలందరినీ నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆ ఏడు రొట్టెలను చేతపట్టుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని విరిచి శిష్యులకిచ్చి వారికి పంచమన్నాడు. శిష్యులు అలాగే చేశారు. వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. యేసు వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని కూడా పంచమని శిష్యులకు ఇచ్చాడు. ఆ ప్రజలంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను ఏడు పెద్ద గంపల నిండా నింపారు. తిన్నవారు సుమారు నాలుగు వేలమంది పురుషులు. యేసు వారిని పంపివేసి, వెంటనే తన శిష్యులతో కలసి, పడవ ఎక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు. పరిసయ్యులు వచ్చి యేసుతో వాదించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడం కోసం తమకు ఆకాశం నుండి ఒక సూచన చూపమని అడిగారు. దానికి ఆయన ఆత్మలో పెద్దగా నిట్టూర్చి, “ఈ తరం వారు ఎందుకు సూచక క్రియలను చూపమని అడుగుతున్నారు? మీతో కచ్చితంగా చెప్తున్నాను, ఈ తరానికి ఏ సూచనా చూపడం జరగదు” అని వారితో చెప్పాడు. తరువాత ఆయన వారిని విడిచిపెట్టి, మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డు చేరుకున్నాడు. శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. వారి దగ్గర పడవలో ఒక రొట్టె తప్ప ఏమీ లేదు. యేసు వారితో, “పరిసయ్యులకు, హేరోదుకు సంబంధించిన పొంగజేసే పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి!” అన్నాడు. శిష్యులు, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా?” అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. అది కనిపెట్టి యేసు, “రొట్టెలు లేవనే విషయం ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు గ్రహించలేదా? మీ బుద్ధి మందగించిందా? మీరు కళ్ళుండి కూడా చూడరా? చెవులుండి కూడా వినరా? మీకు గుర్తు లేదా? ఐదు రొట్టెలు విరిచి ఐదు వేల మందికి నేను పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగాడు. వారు, “పన్నెండు” అని జవాబు చెప్పారు. “మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలను ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగినప్పుడు వారు, “ఏడు” అని జవాబు చెప్పారు. ఆయన వారితో, “ఇంకా మీకు అర్థం కాలేదా?” అన్నాడు.
చదువండి మార్కు 8
వినండి మార్కు 8
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 8:1-21
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు