మార్కు 7:14-30
మార్కు 7:14-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచి–మీరందరు నా మాట విని గ్రహించుడి. వెలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని, లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. ఆయన జనసమూహమును విడిచి యింటిలోనికి వచ్చినప్పుడు, ఆయన శిష్యులు ఈ ఉపమానమునుగూర్చి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెను– మీరును ఇంత అవివేకులై యున్నారా? వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థములన్నిటిని పవిత్రపరచును. మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఆయన అక్కడనుండి లేచి, తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లి, యొక ఇంట ప్రవేశించి, ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై యుండ లేక పోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్నకుమార్తెగల యొక స్త్రీ ఆయననుగూర్చి విని, వెంటనే వచ్చి ఆయన పాదములమీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలోనుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి–పిల్లలు మొదట తృప్తి పొందవలెను; పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె–నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడ బల్లక్రింద ఉండి, పిల్లలు పడ వేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకాయన–ఈ మాట చెప్పినందున వెళ్లుము; దయ్యము నీ కుమార్తెను వదలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె యింటికి వచ్చి, తన కుమార్తె మంచముమీద పండుకొని యుండుటయు దయ్యము వదలిపోయి యుండుటయు చూచెను.
మార్కు 7:14-30 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కరు, నా మాట విని, గ్రహించండి. బయటనుండి లోపలికి వెళ్లేవి ఒకరిని అపవిత్రపరచవు. కాని లోపలి నుండి బయటకు వచ్చేవి మాత్రమే వారిని అపవిత్రులుగా చేస్తాయి. [వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు.] ఆయన ఆ జనసమూహాన్ని విడిచి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, ఆయన శిష్యులు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు. ఆయన, “మీరు ఇంత బుద్ధిహీనులా? బయటనుండి లోపలికి వెళ్లేది ఏది ఒకరిని అపవిత్రపరచవని మీరు చూడలేదా? అని అడిగారు. ఎందుకంటే అది వాని హృదయంలోనికి వెళ్లదు, కాని కడుపులోనికి వెళ్లి, తర్వాత శరీరం నుండి బయటకు విసర్జింపబడుతుంది.” (ఈ విషయాన్ని చెప్తూ, భోజనపదార్ధాలన్ని పవిత్రమైనవే అని యేసు ప్రకటించారు.) ఆయన ఇంకా మాట్లాడుతూ, “ఓ వ్యక్తి లోపలి నుండి ఏదైతే బయటకు వస్తుందో అదే వారిని అపవిత్రపరుస్తుంది. ఎందుకంటే, అంతరంగంలో నుండి లైంగిక అనైతికత, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, దురాశ, పగ, మోసం, అశ్లీలత, అసూయ, దూషణ, అహంకారం, అవివేకం లాంటి దుష్ట ఆలోచనలు వస్తాయి. ఈ దుష్టమైనవన్ని లోపలినుండే బయటికి వచ్చి వ్యక్తిని అపవిత్రపరుస్తాయి” అన్నారు. యేసు అక్కడి నుండి లేచి తూరు, సీదోను పట్టణ ప్రాంతాలకు వెళ్లారు. ఆయన ఒక ఇంట్లో ప్రవేశించి తాను అక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదని కోరుకొన్నారు; కాని, తాను అక్కడ ఉన్నాననే సంగతిని ఆయన రహస్యంగా ఉంచలేకపోయారు. ఒక స్త్రీ ఆయన గురించి విన్న వెంటనే, వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఆమె చిన్నకుమార్తెకు అపవిత్రాత్మ పట్టింది. ఆ స్త్రీ, సిరియా ఫెనికయాలో పుట్టిన గ్రీసుదేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యాన్ని వెళ్లగొట్టమని యేసును వేడుకొంది. ఆయన ఆమెతో, “మొదట పిల్లలను వారు కోరుకున్నంతా తిననివ్వాలి, ఎందుకంటే పిల్లల రొట్టెలను తీసికొని కుక్కలకు వేయడం సరికాదు” అన్నారు. అందుకు ఆమె, “ప్రభువా, పిల్లలు పడవేసే రొట్టె ముక్కలను బల్ల క్రింద వుండే కుక్కలు తింటాయి” అని జవాబిచ్చింది. అందుకు ఆయన, “జవాబు బాగుంది! నీవు వెళ్లు; నీ కుమార్తెను దయ్యం వదలిపోయింది” అని చెప్పారు. ఆమె ఇంటికి వెళ్లి, తన కుమార్తె మంచం మీద పడుకొని ఉండడం, దయ్యం ఆమెను వదలిపోయింది.
మార్కు 7:14-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యేసు ప్రజలందరినీ తన దగ్గరికి పిలిచి, “నేను చెప్పేది ప్రతి ఒక్కరూ విని అర్థం చేసుకోండి! బయట నుండి మనిషి లోపలికి వెళ్ళేవి ఏవీ అతన్ని అపవిత్రం చేయవు. మనిషి లోనుండి బయటకు వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది” అని అన్నాడు. ఆయన జనసమూహన్ని విడిచి ఇంట్లో ప్రవేశించిన తరువాత ఆయన శిష్యులు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు. ఆయన వారితో, “మీకు ఇంకా అర్థం కాలేదా? బయట నుండి మనిషిలోకి వచ్చేది అతన్ని అపవిత్రం చేయదని మీరు గ్రహించలేరా? అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది” అని చెప్పాడు. (ఈ విధంగా చెప్పడం ద్వారా అన్ని ఆహార పదార్ధాలూ తినడానికి పవిత్రమైనవే అని యేసు సూచించాడు). ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.” యేసు ఆ ప్రాంతం విడిచి తూరు, సీదోను ప్రాంతంలోని ఒక ఇంటికి వెళ్ళాడు. తాను అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదని ఆయన ఉద్దేశం. కాని, ఆయన వారికి కనిపించకుండా ఉండలేకపోయాడు. ఒక స్త్రీ యేసు గురించి విని వచ్చి ఆయన కాళ్ళపై పడింది. ఆమె కూతురుకు దయ్యం పట్టి ఉంది. ఈ స్త్రీ సిరియాకు చెందిన ఫెనికయా ప్రాంతంలో పుట్టిన గ్రీసు దేశస్తురాలు. తన కూతురులో నుండి ఆ దయ్యాన్ని వదిలించమని యేసును బతిమలాడింది. అందుకు యేసు ఆమెతో, “మొదట పిల్లలు తృప్తిగా తినాలి. చిన్నపిల్లల ఆహారం తీసి కుక్కలకు వేయడం తగదు” అని అన్నాడు. అందుకామె, “ఔను ప్రభూ! అది నిజమే గాని, బల్లకింద ఉన్న కుక్కలు కూడా పిల్లలు పడేసిన ముక్కలు తింటాయి కదా!” అని జవాబు ఇచ్చింది. అప్పుడాయన ఆమెతో, “ఈ మాట చెప్పినందువల్ల ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు. దయ్యం నీ కూతురిని వదలిపోయింది” అన్నాడు. ఆమె ఇంటికి వెళ్ళి తన కూతురు తన మంచంపై పడుకుని ఉండడం చూసింది. దయ్యం ఆమెను వదలిపోయింది.
మార్కు 7:14-30 పవిత్ర బైబిల్ (TERV)
యేసు మళ్ళీ, ప్రజల్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి. అర్థం చేసుకోండి. బయట ఉన్నవేవీ మనిషి కడుపులోకి వెళ్ళి అతణ్ణి అపవిత్రం చేయవు. మనిషినుండి బయటకు వచ్చేది. అతణ్ణి అపవిత్రం చేస్తొంది” అని అన్నాడు. యేసు ప్రజల్ని వదిలి యింట్లోకి వెళ్ళాక ఆయన శిష్యులు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు. యేసు, “మీరింత అజ్ఞానులా! బయట ఉన్నది లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రం చెయ్యటం లేదని మీరు గమనించటం లేదా! అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది” అని అన్నాడు. (యేసు ఈ విధంగా చెప్పి అన్ని ఆహార పదార్థాలు తినడానికి పవిత్రమైనవి అని సూచించాడు.) ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “మనిషి నుండి బయటకు వచ్చేవి అతణ్ణి అపవిత్రం చేస్తాయి. ఎందుకంటే, మానవుల హృదయాల నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం బయటకు వస్తాయి. ఇవే లోపలనుండి బయటకు వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి.” యేసు ఆ ప్రాంతం వదిలి తూరు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒకరి యింటికి వెళ్ళాడు. తనక్కడ ఉన్నట్లు ఎవ్వరికి తెలియరాదని ఆయన ఉద్దేశ్యం. కాని దాన్ని రహస్యంగా ఉంచలేకపోయాడు. ఒక స్త్రీ వెంటనే యేసును గురించి విన్నది. ఆమె కూతురుకు దయ్యం పట్టివుంది. ఆమె అక్కడికి వచ్చి యేసు కాళ్ళపై పడింది. ఆమె గ్రీసు దేశస్తురాలు. జన్మస్థానం సిరియ దేశంలోని ఫొనీషియా. తన కూతురు నుండి ఆ దయ్యాన్ని వదిలించమని ఆమె యేసును వేడుకొంది. ఆయన ఆమెతో, “మొదట చిన్నపిల్లల్ని వాళ్ళకు కావలసినవి తిననివ్వాలి. ఎందుకంటే చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకొని కుక్కలకు వేయటం సమంజసం కాదు” అని అన్నాడు. “ఔను! ప్రభూ! కాని, బల్లక్రిందవున్న కుక్కలు కూడా చిన్నపిల్లలు వదిలివేసిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె సమాధానం చెప్పింది. అప్పుడు యేసు ఆమెతో, “అలాంటి సమాధానం చెప్పావు కనుక వెళ్ళు. దయ్యం నీ కూతుర్ని వదిలి వెళ్ళింది” అని అన్నాడు. ఆమె యింటికి వెళ్ళి తన కూతురు పడకపై పడుకొని ఉండటం చూసింది. దయ్యం నిజంగా ఆమె నుండి వెళ్ళిపోయింది.
మార్కు 7:14-30 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యేసు జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కరు, నా మాట విని, గ్రహించండి. బయట నుండి లోపలికి వెళ్లేవీ ఒకరిని అపవిత్రపరచవు. కాని లోపలి నుండి బయటకు వచ్చేవి మాత్రమే వారిని అపవిత్రులుగా చేస్తాయి. వినడానికి చెవులు కలవారు విందురు గాక!” అని అన్నారు. ఆయన ఆ జనసమూహాన్ని విడిచి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, ఆయన శిష్యులు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు. ఆయన, “మీరు ఇంత బుద్ధిహీనులా? బయట నుండి లోపలికి వెళ్లేది ఏది ఒకరిని అపవిత్రపరచదని మీరు చూడలేదా? అని అడిగారు. ఎందుకంటే అది వాని హృదయంలోకి వెళ్లదు, కాని కడుపులోనికి వెళ్లి, తర్వాత శరీరం నుండి బయటకు విసర్జింపబడుతుంది.” (ఈ విషయాన్ని చెప్తూ, భోజనపదార్ధాలన్ని పవిత్రమైనవే అని యేసు ప్రకటించారు.) ఆయన ఇంకా మాట్లాడుతూ, “ఓ వ్యక్తి లోపలినుండి ఏవైతే బయటకు వస్తాయో అవే వారిని అపవిత్రపరుస్తాయి. ఎందుకంటే, అంతరంగంలో నుండి లైంగిక అనైతికత, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, దురాశ, పగ, మోసం, అశ్లీలత, అసూయ, దూషణ, అహంకారం, అవివేకం లాంటి దుష్ట ఆలోచనలు వస్తాయి. ఈ దుష్టమైనవన్ని లోపలినుండే బయటకు వచ్చి వ్యక్తిని అపవిత్రపరుస్తాయి” అన్నారు. యేసు అక్కడినుండి లేచి తూరు ప్రాంతానికి వెళ్లారు. ఆయన ఒక ఇంట్లో ప్రవేశించి తాను అక్కడ ఉన్నట్లు ఎవరికి తెలియకూడదని కోరుకున్నారు; కాని, తాను అక్కడ ఉన్నాననే సంగతిని ఆయన రహస్యంగా ఉంచలేకపోయారు. ఒక స్త్రీ ఆయన గురించి విన్న వెంటనే, వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఆమె చిన్నకుమార్తెకు అపవిత్రాత్మ పట్టింది. ఆ స్త్రీ, సిరియా ఫెనికయాలో పుట్టిన గ్రీసుదేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యాన్ని వెళ్లగొట్టమని యేసును వేడుకొంది. ఆయన ఆమెతో, “మొదట పిల్లలను వారు కోరుకున్నంతా తిననివ్వాలి, ఎందుకంటే పిల్లల రొట్టెలను తీసుకుని కుక్కలకు వేయడం సరికాదు” అన్నారు. అందుకు ఆమె, “ప్రభువా, బల్లక్రింద ఉండే కుక్కలు కూడా పిల్లలు పడవేసే రొట్టె ముక్కలను తింటాయి” అని జవాబిచ్చింది. అందుకు ఆయన, “జవాబు బాగుంది! నీవు వెళ్లు; నీ కుమార్తెను దయ్యం వదిలిపోయింది” అని చెప్పారు. ఆమె ఇంటికి వెళ్లి, తన కుమార్తె మంచం మీద పడుకుని ఉండడం, దయ్యం ఆమెను వదిలిపోయింది.