మార్కు సువార్త 7:14-30

మార్కు సువార్త 7:14-30 TSA

యేసు జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కరు, నా మాట విని, గ్రహించండి. బయట నుండి లోపలికి వెళ్లేవీ ఒకరిని అపవిత్రపరచవు. కాని లోపలి నుండి బయటకు వచ్చేవి మాత్రమే వారిని అపవిత్రులుగా చేస్తాయి. వినడానికి చెవులు కలవారు విందురు గాక!” అని అన్నారు. ఆయన ఆ జనసమూహాన్ని విడిచి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, ఆయన శిష్యులు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు. ఆయన, “మీరు ఇంత బుద్ధిహీనులా? బయట నుండి లోపలికి వెళ్లేది ఏది ఒకరిని అపవిత్రపరచదని మీరు చూడలేదా? అని అడిగారు. ఎందుకంటే అది వాని హృదయంలోకి వెళ్లదు, కాని కడుపులోనికి వెళ్లి, తర్వాత శరీరం నుండి బయటకు విసర్జింపబడుతుంది.” (ఈ విషయాన్ని చెప్తూ, భోజనపదార్ధాలన్ని పవిత్రమైనవే అని యేసు ప్రకటించారు.) ఆయన ఇంకా మాట్లాడుతూ, “ఓ వ్యక్తి లోపలినుండి ఏవైతే బయటకు వస్తాయో అవే వారిని అపవిత్రపరుస్తాయి. ఎందుకంటే, అంతరంగంలో నుండి లైంగిక అనైతికత, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, దురాశ, పగ, మోసం, అశ్లీలత, అసూయ, దూషణ, అహంకారం, అవివేకం లాంటి దుష్ట ఆలోచనలు వస్తాయి. ఈ దుష్టమైనవన్ని లోపలినుండే బయటకు వచ్చి వ్యక్తిని అపవిత్రపరుస్తాయి” అన్నారు. యేసు అక్కడినుండి లేచి తూరు ప్రాంతానికి వెళ్లారు. ఆయన ఒక ఇంట్లో ప్రవేశించి తాను అక్కడ ఉన్నట్లు ఎవరికి తెలియకూడదని కోరుకున్నారు; కాని, తాను అక్కడ ఉన్నాననే సంగతిని ఆయన రహస్యంగా ఉంచలేకపోయారు. ఒక స్త్రీ ఆయన గురించి విన్న వెంటనే, వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఆమె చిన్నకుమార్తెకు అపవిత్రాత్మ పట్టింది. ఆ స్త్రీ, సిరియా ఫెనికయాలో పుట్టిన గ్రీసుదేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యాన్ని వెళ్లగొట్టమని యేసును వేడుకొంది. ఆయన ఆమెతో, “మొదట పిల్లలను వారు కోరుకున్నంతా తిననివ్వాలి, ఎందుకంటే పిల్లల రొట్టెలను తీసుకుని కుక్కలకు వేయడం సరికాదు” అన్నారు. అందుకు ఆమె, “ప్రభువా, బల్లక్రింద ఉండే కుక్కలు కూడా పిల్లలు పడవేసే రొట్టె ముక్కలను తింటాయి” అని జవాబిచ్చింది. అందుకు ఆయన, “జవాబు బాగుంది! నీవు వెళ్లు; నీ కుమార్తెను దయ్యం వదిలిపోయింది” అని చెప్పారు. ఆమె ఇంటికి వెళ్లి, తన కుమార్తె మంచం మీద పడుకుని ఉండడం, దయ్యం ఆమెను వదిలిపోయింది.

మార్కు సువార్త 7:14-30 కోసం వీడియో