మార్కు 6:6-20

మార్కు 6:6-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. తర్వాత యేసు బోధిస్తూ చుట్టూ ఉన్న గ్రామ గ్రామానికి వెళ్లారు. ఆయన పన్నెండుమందిని దగ్గరకు పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికి వారికి అధికారం ఇచ్చి, వారిని ఇద్దరిద్దరిగా పంపించడం మొదలుపెట్టారు. ఆయన వారికిచ్చిన సూచనలు ఇవే: “ప్రయాణానికి చేతికర్ర తప్ప వేరే ఏది తీసుకెళ్లకూడదు. ఆహారం కాని, చేతిలో సంచి కానీ, నడికట్టులో డబ్బు కాని తీసుకుని వెళ్లకూడదు. చెప్పులు వేసుకోండి కాని ఒక అంగీ ఎక్కువ తీసుకెళ్లకూడదు. మీరు ఒక ఇంట్లో ప్రవేశించినప్పుడు, అక్కడినుండి వెళ్లేవరకు ఆ ఇంట్లోనే బసచేయండి. ఏ స్థలంలోనైనా ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీ మాటలు వినకపోతే, మీరు అక్కడినుండి బయలుదేరే ముందు వారికి సాక్ష్యంగా ఉండడానికి మీ పాదాల దుమ్మును అక్కడ దులిపి వెళ్లండి.” శిష్యులు వెళ్లి, ప్రజలు పశ్చాత్తాపపడాలని ప్రకటించారు. వారు అనేక దయ్యాలను వెళ్లగొట్టారు అనేక రోగులను నూనెతో ముట్టి వారిని బాగుచేశారు. యేసు పేరు ప్రసిద్ధిచెందడం గురించి రాజైన హేరోదుకు తెలిసింది. కొందరు, “బాప్తిస్మమిచ్చే యోహాను చనిపోయి మళ్ళీ బ్రతికాడు, అందుకే ఇతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని చెప్తున్నారు. మరికొందరు, “ఈయన ఏలీయా” అన్నారు. ఇంకొందరు, “ఈయన పూర్వకాల ప్రవక్తల్లో ఒక ప్రవక్తలాంటివాడు” అని చెప్పుకొన్నారు. అయితే హేరోదు ఇదంతా విని, “నేను తల నరికించిన యోహాను ఇతడేనా, ఇతడు చావు నుండి లేచాడా!” అనుకున్నాడు. ఎందుకంటే, హేరోదు తన సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను పెళ్ళి చేసుకున్నప్పుడు, “నీ సహోదరుని భార్యను నీవు ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను హేరోదుతో అంటూ ఉండేవాడు. హేరోదు ఆమె కోసం యోహానును బంధించి చెరసాలలో వేయమని ఆదేశాన్ని జారీ చేశాడు. హేరోదియ యోహానును చంపాలని చూసింది. కాని అలా చెయ్యలేకపోయింది. ఎందుకనగా యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని హేరోదు తెలుసుకొని అతనికి భయపడి అతని కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలను విన్నప్పుడు ఎంతో కలవరపడే వాడు; అయినా అతని మాటలను వినడానికి ఇష్టపడేవాడు.

మార్కు 6:6-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉపదేశం చేశాడు. యేసు తన పన్నెండుమంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని, వారికి దయ్యాల మీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. “ప్రయాణం కోసం చేతికర్ర తప్ప ఇంకేదీ తీసుకు వెళ్ళకండి. ఆహారం గాని, చేతి సంచిగాని, నడికట్టులో డబ్బుగాని, తీసుకు వెళ్ళకండి. చెప్పులు వేసుకోండి గాని, మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి. ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం విడిచే వరకూ ఆ ఇంట్లోనే ఉండండి. ఏ గ్రామం వారైనా మిమ్మల్ని స్వీకరించకపోతే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ గ్రామం వదిలే ముందు వారి వ్యతిరేక సాక్షంగా మీ పాద ధూళిని దులిపి వేయండి.” శిష్యులు వెళ్ళి ‘పశ్చాత్తాప పడండి’ అంటూ ప్రకటించారు. ఎన్నో దయ్యాలను వదిలించారు. శిష్యులు అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేశారు. యేసు పేరు ప్రసిద్ధి కావడం వల్ల ఆ సంగతి హేరోదు రాజుకు తెలిసింది. బాప్తిసం ఇచ్చే యోహాను బతికి వచ్చాడని, అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఉన్నదని కొందరు అన్నారు. ఇతరులు, “ఈయన ఏలీయా” అన్నారు. ఇంకొందరు, “పూర్వకాలపు ప్రవక్తల వంటి ప్రవక్త” అన్నారు. కాని, హేరోదైతే, “నేను తల నరికించిన యోహాను మళ్ళీ బతికి వచ్చాడు” అన్నాడు. ఇంతకు ముందు హేరోదు స్వయంగా యోహానును బంధించి, ఖైదులో వేయించాడు. తాను వివాహం చేసుకున్న హేరోదియ కారణంగా అతడు ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య. ఎందుకంటే యోహాను హేరోదుతో, “నీ సోదరుని భార్యను తెచ్చుకోవడం అన్యాయం” అని హెచ్చరించాడు. అందుచేత హేరోదియ యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది కానీ అలా చెయ్యలేకపోయింది. ఎందుకంటే హేరోదు యోహానుకు భయపడేవాడు. యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు తెలుసు కనుక అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవర పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు.

మార్కు 6:6-20 పవిత్ర బైబిల్ (TERV)

వాళ్ళలో విశ్వాసం లేక పోవటం చూసి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత యేసు, గ్రామ గ్రామానికి వెళ్ళి బోధించాడు. ఆయన పన్నెండుగురిని పిలిచి వాళ్ళకు దయ్యాలపై అధికారమిచ్చాడు. ఇద్దరిద్దరి చొప్పున పంపుతూ, వాళ్ళకు ఈ విధంగా ఉపదేశించాడు: “ప్రయాణం చేసేటప్పుడు చేతి కర్రను తప్ప మరేది తీసుకు వెళ్ళకండి. ఆహారము, సంచీ, దట్టీలో డబ్బు, తీసుకువెళ్ళకండి. చెప్పులు వేసుకోండి. కాని మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి. ఒకరి యింటికి వెళ్ళాక ఆ గ్రామం వదిలి వెళ్ళేదాకా ఆ యింట్లోనే ఉండండి. ఒక గ్రామం వాళ్ళు మీకు స్వాగతమివ్వక పోతే, లేక మీ బోధనల్ని వినకపోతే మీరా గ్రామం వదిలేముందు వాళ్ళ వ్యతిరేకతకు గుర్తుగా మీ కాలికంటిన వాళ్ళ ధూళిని దులపండి.” వాళ్ళు వెళ్ళి ప్రజలకు మారుమనస్సు పొందమని బోధించారు. ఎన్నో దయ్యాలను వదిలించారు. చాలామంది వ్యాధిగ్రస్తులకు నూనెరాచి నయం చేసారు. యేసుకు పేరు ప్రఖ్యాతులు రావడంతో హేరోదు రాజుకు వీటిని గురించి తెలిసింది. బాప్తిస్మము నిచ్చే యోహాను బ్రతికివచ్చాడని, కనుకనే మహత్వపూర్వకమైన కార్యాలు చేసేశక్తి అతనిలో ఉన్నదని అన్నాడు. “ఆయన ఏలియా” అని కొందరన్నారు. “ఆయన ప్రవక్త, పూర్వకాలపు ప్రవక్తల్లాంటివాడు” అని మరికొందరన్నారు. కాని హేరోదు వీటిని గురించి విని, “నేను తల నరికించిన యోహాను బ్రతికి వచ్చాడు” అని అన్నాడు. క్రితంలో హేరోదు, స్వయంగా యోహానును బంధించి కారాగారంలో వేయమని ఆజ్ఞాపించాడు. తాను వివాహం చేసుకొన్న హేరోదియ కారణంగా ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య. పైగా యోహాను హేరోదుతో, “నీ సహోదరుని భార్యను చేసుకోవటం అన్యాయం” అంటూ ఉండేవాడు. అందువల్ల హేరోదియకు యోహాను అంటే యిష్టం వుండేదికాదు. అంతేకాక, ఆమె అతణ్ణి చంపి వేయాలని ఆశించింది. కాని యోహాను అంటే హేరోదు భయపడేవాడు. కనుక అలాచెయ్య లేక పొయ్యాడు. పైగా యోహాను నీతిమంతుడని, పవిత్రమైనవాడని హేరోదుకు తెలుసు. కనుక అతణ్ణి కాపాడుతూ వుండేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవరం చెందేవాడు, అయినా అతని మాటలు వినటానికి యిష్టపడేవాడు.

మార్కు 6:6-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆయన చుట్టుపెట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. ఆయన పండ్రెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మలమీద వారి కధికారమిచ్చి –ప్రయాణముకొరకు చేతికఱ్ఱను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసికొనక చెప్పులు తొడగుకొనుడనియు, రెండంగీలు వేసికొన వద్దనియు వారికాజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను – మీరెక్కడ ఒక యింట ప్రవేశించెదరో అక్కడనుండి మీరు బయలుదేరువరకు ఆ యింటనే బసచేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి, మారుమనస్సు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనెరాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచునుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి విని–బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడుగనుక అతనియందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు –ఈయన ఏలీయా అనియు, మరికొందరు–ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని–నేను తల గొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచియున్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహాను–నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడామె నిమిత్తము యోహానును పెట్టి తెప్పించి, చెరసాలలో బంధించియుండెను. హేరోదియ అతని మీద పగపెట్టి అతని చంపింప గోరెను గాని ఆమెచేత గాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు, ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను.

మార్కు 6:6-20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)