మార్కు సువార్త 6:6-20

మార్కు సువార్త 6:6-20 OTSA

ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. తర్వాత యేసు బోధిస్తూ చుట్టూ ఉన్న గ్రామ గ్రామానికి వెళ్లారు. ఆయన పన్నెండుమందిని దగ్గరకు పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికి వారికి అధికారం ఇచ్చి, వారిని ఇద్దరిద్దరిగా పంపించడం మొదలుపెట్టారు. ఆయన వారికిచ్చిన సూచనలు ఇవే: “ప్రయాణానికి చేతికర్ర తప్ప వేరే ఏది తీసుకెళ్లకూడదు. ఆహారం కాని, చేతిలో సంచి కానీ, నడికట్టులో డబ్బు కాని తీసుకుని వెళ్లకూడదు. చెప్పులు వేసుకోండి కాని ఒక అంగీ ఎక్కువ తీసుకెళ్లకూడదు. మీరు ఒక ఇంట్లో ప్రవేశించినప్పుడు, అక్కడినుండి వెళ్లేవరకు ఆ ఇంట్లోనే బసచేయండి. ఏ స్థలంలోనైనా ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీ మాటలు వినకపోతే, మీరు అక్కడినుండి బయలుదేరే ముందు వారికి సాక్ష్యంగా ఉండడానికి మీ పాదాల దుమ్మును అక్కడ దులిపి వెళ్లండి.” శిష్యులు వెళ్లి, ప్రజలు పశ్చాత్తాపపడాలని ప్రకటించారు. వారు అనేక దయ్యాలను వెళ్లగొట్టారు అనేక రోగులను నూనెతో ముట్టి వారిని బాగుచేశారు. యేసు పేరు ప్రసిద్ధిచెందడం గురించి రాజైన హేరోదుకు తెలిసింది. కొందరు, “బాప్తిస్మమిచ్చే యోహాను చనిపోయి మళ్ళీ బ్రతికాడు, అందుకే ఇతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని చెప్తున్నారు. మరికొందరు, “ఈయన ఏలీయా” అన్నారు. ఇంకొందరు, “ఈయన పూర్వకాల ప్రవక్తల్లో ఒక ప్రవక్తలాంటివాడు” అని చెప్పుకొన్నారు. అయితే హేరోదు ఇదంతా విని, “నేను తల నరికించిన యోహాను ఇతడేనా, ఇతడు చావు నుండి లేచాడా!” అనుకున్నాడు. ఎందుకంటే, హేరోదు తన సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను పెళ్ళి చేసుకున్నప్పుడు, “నీ సహోదరుని భార్యను నీవు ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను హేరోదుతో అంటూ ఉండేవాడు. హేరోదు ఆమె కోసం యోహానును బంధించి చెరసాలలో వేయమని ఆదేశాన్ని జారీ చేశాడు. హేరోదియ యోహానును చంపాలని చూసింది. కాని అలా చెయ్యలేకపోయింది. ఎందుకనగా యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని హేరోదు తెలుసుకొని అతనికి భయపడి అతని కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలను విన్నప్పుడు ఎంతో కలవరపడే వాడు; అయినా అతని మాటలను వినడానికి ఇష్టపడేవాడు.