మార్కు 6:14-44
మార్కు 6:14-44 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి విని–బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడుగనుక అతనియందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు –ఈయన ఏలీయా అనియు, మరికొందరు–ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని–నేను తల గొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచియున్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహాను–నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడామె నిమిత్తము యోహానును పెట్టి తెప్పించి, చెరసాలలో బంధించియుండెను. హేరోదియ అతని మీద పగపెట్టి అతని చంపింప గోరెను గాని ఆమెచేత గాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు, ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినమొకటి వచ్చెను; ఎట్లనగా, హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయదేశ ప్రముఖు లకును విందుచేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితోకూడ పంక్తిని కూర్చున్నవారిని సంతోషపరచెను గనుక రాజు–నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు–నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను గనుక ఆమె వెళ్లి –నేనేమి అడిగెదనని తన తల్లి నడుగగా ఆమె–బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి–బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములో పెట్టి యిప్పుడే నాకిప్పింప గోరుచున్నానని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లక పోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక బంట్రౌతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్న దాని కిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి. అంతట అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియ జేసిరి. అప్పుడాయన–మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున, భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. కాగా వారు దోనె యెక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి. వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకనుపరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింప సాగెను. చాల ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి–ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాల ప్రొద్దుపోయినది; చుట్టుపెట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్లి భోజనమున కేమైనను కొనుక్కొనుటకు వారిని పంపి వేయుమని చెప్పిరి. అందుకాయన – మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు–మేము వెళ్లి యీన్నూరు దేనారముల రొట్టెలుకొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి. అందుకాయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని –అయిదు రొట్టెలును రెండు చేపలు నున్నవనిరి. అప్పుడాయన – పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికాజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని, ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఆ రొట్టెలు విరిచి, వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి, ఆ రెండు చేపలను అందరికిని పంచిపెట్టెను. వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలును రొట్టె ముక్కలును పండ్రెండు గంపెళ్లు ఎత్తిరి. ఆ రొట్టెలు తినినవారు అయిదువేలమంది పురుషులు.
మార్కు 6:14-44 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు పేరు ప్రసిద్ధిచెందడం గురించి రాజైన హేరోదుకు తెలిసింది. కొందరు, “బాప్తిస్మమిచ్చు యోహాను చనిపోయినవారిలో నుండి సజీవంగా లేచాడు, అందుకే ఇతనిలో అద్బుతాలు చేసే శక్తి పని చేస్తుంది” అని చెప్తున్నారు. మరికొందరు, “ఈయన ఏలీయా” అని, ఇంకా కొందరు, “ఈయన పూర్వకాల ప్రవక్తలలో ఒక ప్రవక్తలాంటివాడు” అని చెప్పుకొన్నారు. అయితే హేరోదు ఇదంతా విని, “నేను తల నరికించిన యోహాను ఇతడేనా, ఇతడు చావు నుండి లేచాడా!” అనుకున్నాడు. ఎందుకంటే, హేరోదు తన సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను పెళ్ళి చేసుకున్నప్పుడు, “నీ సహోదరుని భార్యను నీవు ఉంచుకోడం న్యాయం కాదు” అని యోహాను హేరోదుతో అంటూ ఉండేవాడు. హేరోదు ఆమె కొరకు యోహానును బంధించి చెరసాలలో వేయమని ఆదేశాన్ని జారీ చేశాడు. హేరోదియ యోహాను మీద పగ పెంచుకొని అతన్ని చంపాలని చూసింది. కాని అలా చెయ్యలేకపోయింది. ఎందుకనగా యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని హేరోదు తెలుసుకొని అతనికి భయపడి అతని కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలను విన్నప్పుడు ఎంతో కలవరపడే వాడు; అయినా అతని మాటలను వినడానికి ఇష్టపడేవాడు. చివరికి సరియైన సమయం రానే వచ్చింది. హేరోదు తన జన్మదినం సందర్భంగా తన ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయ ప్రాంత ప్రముఖులకు విందు ఇచ్చాడు. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యంచేసి హేరోదును అతని అతిథులను సంతోషపరిచింది. అందుకు రాజు ఆమెతో, “నీకు ఏమి కావాలో అడుగు, నేను ఇస్తాను” అని అన్నాడు. మరియు అతడు “నీవు ఏది అడిగినా నేను ఇస్తాను, నా రాజ్యంలో సగం అడిగినా ఇచ్చేస్తాను!” అని ఆమెతో ఒట్టుపెట్టుకొని ప్రమాణం చేశాడు. కనుక ఆమె బయటకు వెళ్లి తన తల్లిని, “నేనేమి అడగాలి?” అని అడిగింది. అందుకు ఆమె తల్లి, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను అడుగు” అని చెప్పింది. వెంటనే ఆమె రాజు దగ్గరకు త్వరగా వెళ్లి, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను పళ్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించాలని కోరుకొంటున్నాను” అని చెప్పింది. రాజు ఎంతో దుఃఖించాడు, కాని తనతో కూడ భోజనానికి కూర్చున్న అతిథులు మరియు తాను చేసిన ప్రమాణం కొరకు ఆమె అడిగిన దానిని కాదనలేకపోయాడు. అందువల్ల రాజు వెంటనే ఒక సైనికుడిని పిలిచి, యోహాను తలను తెమ్మని ఆదేశించి పంపించాడు. వాడు వెళ్లి, చెరసాలలో యోహాను తలను నరికి, ఆ తలను పళ్లెంలో పెట్టి తీసుకువచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాడు, ఆమె దానిని తన తల్లికి ఇచ్చింది. ఈ సంగతి విన్న యోహాను శిష్యులు వచ్చి, అతని శవాన్ని తీసుకువెళ్లి సమాధి చేశారు. అపొస్తలులు యేసు చుట్టూ గుమికూడి తాము బోధించినవి, తాము చేసినవి ఆయనకు తెలియజేసారు. అనేకమంది వస్తూ పోతూ ఉండడంతో వారికి భోజనం చేయడానికి కూడా అవకాశం దొరకలేదు. కనుక ఆయన, “మీరు నాతో కూడా ఏకాంత స్థలానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొండి” అని చెప్పారు. కనుక వారు పడవ ఎక్కి ఏకాంత స్థలానికి వెళ్లారు. అయితే వారు వెళ్తున్నారని చూసిన అనేకమంది వారిని గుర్తుపట్టి, అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి వారి కంటే ముందే ఆ స్థలానికి చేరుకొన్నారు. యేసు పడవ దిగి, గొప్ప జనసమూహాన్ని చూసినప్పుడు, వారు కాపరిలేని గొర్రెలవలె ఉన్నారని వారి మీద కనికరపడ్డారు. వారికి అనేక సంగతులను బోధించడం మొదలుపెట్టారు. అప్పటికి ప్రొద్దుపోయే సమయం అయ్యింది, కనుక శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం, పైగా ఆలస్యం కూడా అవుతుంది. కనుక జనాన్ని పంపివేయండి, వారే చుట్టు ప్రక్కన ఉన్న గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు” అన్నారు. అందుకు యేసు, “మీరే వారికి భోజనం పెట్టండి” అన్నారు. అందుకు వారు, “రెండువందల దేనారాల కంటే ఎక్కువవుతుంది. మేము వెళ్లి, అంత డబ్బు ఖర్చుపెట్టి రొట్టెలను కొని, వారికి పెట్టాలా?” అని ఆయనను అడిగారు. అందుకు ఆయన, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్లి చూడండి” అని అడిగారు. వారు వెళ్లి చూసి, “ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అన్నారు. అప్పుడు ఆయన వారందరిని పచ్చగడ్డి మీద గుంపులుగా కూర్చోపెట్టమని శిష్యులతో చెప్పారు. వారు వంద యాభైల చొప్పున గుంపులుగా కూర్చున్నారు. అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి, కృతజ్ఞత చెల్లించి ఆ రొట్టెలను విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. ఆయన ఆ రెండు చేపలను కూడా వారందరికి విభజించారు. వారందరు తిని తృప్తి పొందారు. తర్వాత శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. తిన్న వారి సంఖ్య ఐదు వేలమంది పురుషులు.
మార్కు 6:14-44 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు పేరు ప్రసిద్ధి కావడం వల్ల ఆ సంగతి హేరోదు రాజుకు తెలిసింది. బాప్తిసం ఇచ్చే యోహాను బతికి వచ్చాడని, అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఉన్నదని కొందరు అన్నారు. ఇతరులు, “ఈయన ఏలీయా” అన్నారు. ఇంకొందరు, “పూర్వకాలపు ప్రవక్తల వంటి ప్రవక్త” అన్నారు. కాని, హేరోదైతే, “నేను తల నరికించిన యోహాను మళ్ళీ బతికి వచ్చాడు” అన్నాడు. ఇంతకు ముందు హేరోదు స్వయంగా యోహానును బంధించి, ఖైదులో వేయించాడు. తాను వివాహం చేసుకున్న హేరోదియ కారణంగా అతడు ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య. ఎందుకంటే యోహాను హేరోదుతో, “నీ సోదరుని భార్యను తెచ్చుకోవడం అన్యాయం” అని హెచ్చరించాడు. అందుచేత హేరోదియ యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది కానీ అలా చెయ్యలేకపోయింది. ఎందుకంటే హేరోదు యోహానుకు భయపడేవాడు. యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు తెలుసు కనుక అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవర పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు. ఒక రోజు హేరోదియకు అవకాశం దొరికింది. హేరోదు తన రాజ్యంలోని అధికారులను, సైన్యాధిపతులను, గలిలయలోని గొప్పవారిని పిలిచి తన పుట్టిన రోజు విందు చేశాడు. హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిధులను మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, “నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను!” అని అన్నాడు. “నువ్వు ఏది అడిగినా ఇస్తాను, నా రాజ్యంలో సగమైనా సరే!” అని ప్రమాణం చేశాడు. ఆమె బయటకి వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అని అడిగింది. ఆమె, “బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకో” అని చెప్పింది. వెంటనే ఆమె రాజు దగ్గరికి త్వరగా వెళ్ళి, “బాప్తిసం ఇచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి, నాకు కావలసింది అదే” అని అడిగింది. రాజుకు చాలా దుఃఖం కలిగింది గాని, తాను చేసిన ప్రమాణం కారణంగా తనతో కూర్చుని ఉన్నవారిని బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేక పోయాడు. అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకు రమ్మని ఆజ్ఞాపించి భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి ఖైదులోనే యోహాను తల నరికి దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి, తీసుకు వచ్చి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి అతని శవాన్ని తీసుకుపోయి సమాధి చేశారు. అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా ఆయనకు చెప్పారు. వారి దగ్గరికి అనేకమంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి భోజనం తినడానికి కూడా సమయం లేకపోయింది. యేసు వారితో, “నాతో మీరు మాత్రమే ఒక నిర్జన ప్రదేశానికి వచ్చి, కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు. అందువల్ల వారు మాత్రమే పడవలో ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. అయితే వారు వెళ్తూ ఉండగా జనసమూహాలు ఆయనను గుర్తుపట్టి వివిధ గ్రామాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికన్నా ముందే ఆ నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు. పడవలో యేసు అక్కడికి చేరినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజలను చూసి ఆయనకు జాలి కలిగింది. అందుచేత ఆయన వారికి అనేక విషయాలు ఉపదేశించ సాగాడు. చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది. ఈ ప్రజలకు తినడానికి ఏమీ లేదు కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివెయ్యి” అన్నారు. అయితే యేసు వారితో, “మీరే వారికి ఆహారం పెట్టండి!” అన్నాడు. అందుకు వారు ఆయనతో, “రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని, వారికి పంచి పెట్టమంటావా” అని ఆయనను అడిగారు. ఆయన వారితో “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి” అన్నాడు. వారు వెళ్ళి చూసి, “ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి” అని అన్నారు. అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. ప్రజలు గుంపుకు యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు. యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకుని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపలను కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు. అందరూ తిని సంతృప్తి చెందారు. శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను, చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. ఆ రోజు అక్కడ రొట్టెలు తిన్న పురుషులు ఐదు వేల మంది.
మార్కు 6:14-44 పవిత్ర బైబిల్ (TERV)
యేసుకు పేరు ప్రఖ్యాతులు రావడంతో హేరోదు రాజుకు వీటిని గురించి తెలిసింది. బాప్తిస్మము నిచ్చే యోహాను బ్రతికివచ్చాడని, కనుకనే మహత్వపూర్వకమైన కార్యాలు చేసేశక్తి అతనిలో ఉన్నదని అన్నాడు. “ఆయన ఏలియా” అని కొందరన్నారు. “ఆయన ప్రవక్త, పూర్వకాలపు ప్రవక్తల్లాంటివాడు” అని మరికొందరన్నారు. కాని హేరోదు వీటిని గురించి విని, “నేను తల నరికించిన యోహాను బ్రతికి వచ్చాడు” అని అన్నాడు. క్రితంలో హేరోదు, స్వయంగా యోహానును బంధించి కారాగారంలో వేయమని ఆజ్ఞాపించాడు. తాను వివాహం చేసుకొన్న హేరోదియ కారణంగా ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య. పైగా యోహాను హేరోదుతో, “నీ సహోదరుని భార్యను చేసుకోవటం అన్యాయం” అంటూ ఉండేవాడు. అందువల్ల హేరోదియకు యోహాను అంటే యిష్టం వుండేదికాదు. అంతేకాక, ఆమె అతణ్ణి చంపి వేయాలని ఆశించింది. కాని యోహాను అంటే హేరోదు భయపడేవాడు. కనుక అలాచెయ్య లేక పొయ్యాడు. పైగా యోహాను నీతిమంతుడని, పవిత్రమైనవాడని హేరోదుకు తెలుసు. కనుక అతణ్ణి కాపాడుతూ వుండేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవరం చెందేవాడు, అయినా అతని మాటలు వినటానికి యిష్టపడేవాడు. చివరకు హేరోదియకు అవకాశం లభించింది. హేరోదు తన రాజ్యంలోని ప్రముఖ అధికారులను, సైన్యాధిపతులను గలిలయలోని ప్రముఖులను పిలిచి తన పుట్టినరోజు పండుగ చేసాడు. హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసింది. ఆమె హేరోదును, అతని అతిథుల్ని మెప్పించింది. హేరోదు ఆమెతో, “నీకు కావలసింది ఏదైనా కోరుకో! యిస్తాను!” అని అన్నాడు. “నీవేదడిగినా యిస్తాను, అర్ధ రాజ్యాన్నైనా సరే!” అని ప్రమాణం చేసాడు. ఆమె వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అని అడిగింది. “బాప్తిస్మము నిచ్చే యోహాను తల కోరుకో!” అని ఆమె సమాధానం చెప్పింది. వెంటనే ఆమె రాజు దగ్గరకు పరుగెత్తి, “బాప్తిస్మము నిచ్చే యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి తక్షణమే యిప్పించమని మిమ్మల్ని వేడుకొంటున్నాను” అని అన్నది. రాజుకు చాలా దుఃఖం కలిగింది. కాని తాను ప్రమాణం చేసాడు. పైగా అతిథులక్కడే ఉన్నారు. కనుక ఆమె కోరికను నిరాకరించ దలచుకోలేదు. అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తూ ఒక భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి యోహాను తలను కారాగారంలోనే నరికి వేసి, దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి తీసుకు వచ్చి ఆమెకు బహూకరించాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది. యోహాను శిష్యులు ఇది విని అక్కడికి వెళ్ళి అతని దేహాన్ని తీసుకువెళ్ళి సమాధిచేసారు. అపొస్తలులు యేసు చుట్టూ చేరి తాము చేసిన వాటిని గురించి, బోధించిన వాటిని గురించి వివరంగా ఆయనకు చెప్పారు. వాళ్ళ దగ్గరకు చాలామంది వస్తూ పోతూ ఉండటంవల్ల వాళ్ళకు తినటానికి కూడా సమయం లేకపోయింది. అందుకు యేసు వాళ్ళతో, “నాతో మీరు మాత్రమే ఏకాంత ప్రదేశానికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు. అందువల్ల వాళ్ళు మాత్రమే ఒక పడవనెక్కి నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. కాని, వాళ్ళు వెళ్ళటం చాలా మంది చూసారు. వాళ్ళెవరో గుర్తించి అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళకన్నా ముందే ఆ ఎడారి ప్రాంతాన్ని చేరుకొన్నారు. యేసు పడవ దిగి ఆ ప్రజాసమూహాన్ని చూసాడు. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజల్ని చూసి ఆయనకు జాలివేసింది. అందువల్ల వాళ్ళకు ఎన్నో విషయాలు బోధించటం మొదలు పెట్టాడు. అప్పటికే మధ్యాహ్నం దాటి సాయంకాలమవుతూ వుంది. ఆయన శిష్యులు వచ్చి, “ఇది నిర్మానుష్య ప్రాంతం. ఇప్పటికే సాయంకాలమవుతూ వుంది. మీరి ప్రజల్ని పంపివేస్తే వాళ్ళు చుట్టూవున్న పల్లెలకో లేక గ్రామలకో వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని అన్నారు. కాని యేసు, “వాళ్ళు తినటానికి మీరే ఏదైనా ఇవ్వండి!” అని సమాధానం చెప్పాడు. “రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని వాళ్లకు పంచి పెట్టమంటావా?” అని ఆయన్ని అడిగారు. “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో వెళ్ళి చూడండి” అని యేసు అన్నాడు. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి, “ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అని అన్నారు. పచ్చిగడ్డి మీద అందరిని గుంపులు గుంపులుగా కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. ప్రజలు గుంపుకు యాబై, నూరుగురి చొప్పున కూర్చున్నారు. యేసు ఆ ఐదు రొట్టెల్ని రెండు చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞత చెప్పి రొట్టెల్ని తుంచాడు. అవి తన శిష్యులకిచ్చి ప్రజల ముందుంచమన్నాడు. అదే విధంగా ఆ రెండు చేపల్ని కూడా భాగాలు చేసి అందరికి పంచాడు. అందరూ సంతృప్తిగా తిన్నారు. శిష్యులు మిగిలిన రొట్టెముక్కల్ని, చేప ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు. ఆ రోజు అక్కడ ఐదు వేలమంది పురుషులు భోజనం చేసారు.
మార్కు 6:14-44 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యేసు పేరు ప్రసిద్ధిచెందడం గురించి రాజైన హేరోదుకు తెలిసింది. కొందరు, “బాప్తిస్మమిచ్చే యోహాను చనిపోయి మళ్ళీ బ్రతికాడు, అందుకే ఇతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని చెప్తున్నారు. మరికొందరు, “ఈయన ఏలీయా” అన్నారు. ఇంకొందరు, “ఈయన పూర్వకాల ప్రవక్తల్లో ఒక ప్రవక్తలాంటివాడు” అని చెప్పుకొన్నారు. అయితే హేరోదు ఇదంతా విని, “నేను తల నరికించిన యోహాను ఇతడేనా, ఇతడు చావు నుండి లేచాడా!” అనుకున్నాడు. ఎందుకంటే, హేరోదు తన సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను పెళ్ళి చేసుకున్నప్పుడు, “నీ సహోదరుని భార్యను నీవు ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను హేరోదుతో అంటూ ఉండేవాడు. హేరోదు ఆమె కోసం యోహానును బంధించి చెరసాలలో వేయమని ఆదేశాన్ని జారీ చేశాడు. హేరోదియ యోహానును చంపాలని చూసింది. కాని అలా చెయ్యలేకపోయింది. ఎందుకనగా యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని హేరోదు తెలుసుకొని అతనికి భయపడి అతని కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలను విన్నప్పుడు ఎంతో కలవరపడే వాడు; అయినా అతని మాటలను వినడానికి ఇష్టపడేవాడు. చివరికి సరియైన సమయం రానే వచ్చింది. హేరోదు తన జన్మదినం సందర్భంగా తన ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయ ప్రాంత ప్రముఖులకు విందు ఇచ్చాడు. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యంచేసి హేరోదును అతని అతిథులను సంతోషపరిచింది. అందుకు రాజు ఆమెతో, “నీకు ఏమి కావాలో అడుగు, నేను ఇస్తాను” అని అన్నాడు. అతడు, “నీవు ఏది అడిగినా నేను ఇస్తాను, నా రాజ్యంలో సగం అడిగినా ఇచ్చేస్తాను!” అని ఆమెతో ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశాడు. కాబట్టి ఆమె బయటకు వెళ్లి తన తల్లిని, “నేనేమి అడగాలి?” అని అడిగింది. అందుకు ఆమె తల్లి, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను అడుగు” అని చెప్పింది. వెంటనే ఆమె రాజు దగ్గరకు త్వరగా వెళ్లి, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించాలని కోరుకొంటున్నాను” అని చెప్పింది. రాజు ఎంతో దుఃఖించాడు, కాని తనతో కూడ భోజనానికి కూర్చున్న అతిథులు తాను చేసిన ప్రమాణం కోసం ఆమె అడిగిన దానిని కాదనలేకపోయాడు. అందువల్ల రాజు వెంటనే ఒక సైనికున్ని పిలిచి, యోహాను తలను తెమ్మని ఆదేశించి పంపించాడు. వాడు వెళ్లి, చెరసాలలో యోహాను తలను నరికి, ఆ తలను పళ్లెంలో పెట్టి తీసుకువచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాడు, ఆమె దానిని తన తల్లికి ఇచ్చింది. ఈ సంగతి విన్న యోహాను శిష్యులు వచ్చి, అతని శవాన్ని తీసుకెళ్లి సమాధి చేశారు. అపొస్తలులు యేసు చుట్టూ గుమికూడి తాము బోధించినవి, తాము చేసినవి ఆయనకు తెలియజేశారు. అనేకమంది వస్తూ పోతూ ఉండడంతో వారికి భోజనం చేయడానికి కూడా అవకాశం దొరకలేదు. కాబట్టి ఆయన, “మీరు నాతో కూడా ఏకాంత స్థలానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి” అని చెప్పారు. కాబట్టి వారు పడవ ఎక్కి ఏకాంత స్థలానికి వెళ్లారు. అయితే వారు వెళ్తున్నారని చూసిన అనేకమంది వారిని గుర్తుపట్టి, అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి వారికంటే ముందే ఆ స్థలానికి చేరుకొన్నారు. యేసు పడవ దిగి, గొప్ప జనసమూహం రావడం చూసినప్పుడు, వారు కాపరి లేని గొర్రెలవలె ఉన్నారని వారి మీద కనికరపడ్డారు. వారికి అనేక సంగతులను బోధించడం మొదలుపెట్టారు. అప్పటికి ప్రొద్దుపోయే సమయం అయ్యింది, కాబట్టి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం, పైగా ఆలస్యం కూడా అవుతుంది. కాబట్టి జనాన్ని పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు” అన్నారు. అందుకు యేసు, “మీరే వారికి భోజనం పెట్టండి” అన్నారు. అందుకు వారు, “రెండువందల దేనారాల కంటే ఎక్కువవుతుంది. మేము వెళ్లి, అంత డబ్బు ఖర్చుపెట్టి రొట్టెలను కొని, వారికి పెట్టాలా?” అని ఆయనను అడిగారు. అందుకు ఆయన, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్లి చూడండి” అని అడిగారు. వారు వెళ్లి చూసి, “అయిదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అన్నారు. అప్పుడు ఆయన వారందరిని గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోపెట్టమని శిష్యులతో చెప్పారు. వారు వంద యాభైల చొప్పున గుంపులుగా కూర్చున్నారు. అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి ఆ రొట్టెలను విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. ఆయన ఆ రెండు చేపలను కూడా వారందరికి విభజించారు. వారందరు తిని తృప్తి పొందారు. తర్వాత శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. తిన్న వారి సంఖ్య అయిదు వేలమంది పురుషులు.