యేసు పేరు ప్రసిద్ధిచెందడం గురించి రాజైన హేరోదుకు తెలిసింది. కొందరు, “బాప్తిస్మమిచ్చు యోహాను చనిపోయినవారిలో నుండి సజీవంగా లేచాడు, అందుకే ఇతనిలో అద్బుతాలు చేసే శక్తి పని చేస్తుంది” అని చెప్తున్నారు.
మరికొందరు, “ఈయన ఏలీయా” అని,
ఇంకా కొందరు, “ఈయన పూర్వకాల ప్రవక్తలలో ఒక ప్రవక్తలాంటివాడు” అని చెప్పుకొన్నారు.
అయితే హేరోదు ఇదంతా విని, “నేను తల నరికించిన యోహాను ఇతడేనా, ఇతడు చావు నుండి లేచాడా!” అనుకున్నాడు.
ఎందుకంటే, హేరోదు తన సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను పెళ్ళి చేసుకున్నప్పుడు, “నీ సహోదరుని భార్యను నీవు ఉంచుకోడం న్యాయం కాదు” అని యోహాను హేరోదుతో అంటూ ఉండేవాడు. హేరోదు ఆమె కొరకు యోహానును బంధించి చెరసాలలో వేయమని ఆదేశాన్ని జారీ చేశాడు. హేరోదియ యోహాను మీద పగ పెంచుకొని అతన్ని చంపాలని చూసింది. కాని అలా చెయ్యలేకపోయింది. ఎందుకనగా యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని హేరోదు తెలుసుకొని అతనికి భయపడి అతని కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలను విన్నప్పుడు ఎంతో కలవరపడే వాడు; అయినా అతని మాటలను వినడానికి ఇష్టపడేవాడు.
చివరికి సరియైన సమయం రానే వచ్చింది. హేరోదు తన జన్మదినం సందర్భంగా తన ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయ ప్రాంత ప్రముఖులకు విందు ఇచ్చాడు. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యంచేసి హేరోదును అతని అతిథులను సంతోషపరిచింది.
అందుకు రాజు ఆమెతో, “నీకు ఏమి కావాలో అడుగు, నేను ఇస్తాను” అని అన్నాడు. మరియు అతడు “నీవు ఏది అడిగినా నేను ఇస్తాను, నా రాజ్యంలో సగం అడిగినా ఇచ్చేస్తాను!” అని ఆమెతో ఒట్టుపెట్టుకొని ప్రమాణం చేశాడు.
కనుక ఆమె బయటకు వెళ్లి తన తల్లిని, “నేనేమి అడగాలి?” అని అడిగింది.
అందుకు ఆమె తల్లి, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను అడుగు” అని చెప్పింది.
వెంటనే ఆమె రాజు దగ్గరకు త్వరగా వెళ్లి, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను పళ్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించాలని కోరుకొంటున్నాను” అని చెప్పింది.
రాజు ఎంతో దుఃఖించాడు, కాని తనతో కూడ భోజనానికి కూర్చున్న అతిథులు మరియు తాను చేసిన ప్రమాణం కొరకు ఆమె అడిగిన దానిని కాదనలేకపోయాడు. అందువల్ల రాజు వెంటనే ఒక సైనికుడిని పిలిచి, యోహాను తలను తెమ్మని ఆదేశించి పంపించాడు. వాడు వెళ్లి, చెరసాలలో యోహాను తలను నరికి, ఆ తలను పళ్లెంలో పెట్టి తీసుకువచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాడు, ఆమె దానిని తన తల్లికి ఇచ్చింది. ఈ సంగతి విన్న యోహాను శిష్యులు వచ్చి, అతని శవాన్ని తీసుకువెళ్లి సమాధి చేశారు.
అపొస్తలులు యేసు చుట్టూ గుమికూడి తాము బోధించినవి, తాము చేసినవి ఆయనకు తెలియజేసారు. అనేకమంది వస్తూ పోతూ ఉండడంతో వారికి భోజనం చేయడానికి కూడా అవకాశం దొరకలేదు. కనుక ఆయన, “మీరు నాతో కూడా ఏకాంత స్థలానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొండి” అని చెప్పారు.
కనుక వారు పడవ ఎక్కి ఏకాంత స్థలానికి వెళ్లారు. అయితే వారు వెళ్తున్నారని చూసిన అనేకమంది వారిని గుర్తుపట్టి, అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి వారి కంటే ముందే ఆ స్థలానికి చేరుకొన్నారు. యేసు పడవ దిగి, గొప్ప జనసమూహాన్ని చూసినప్పుడు, వారు కాపరిలేని గొర్రెలవలె ఉన్నారని వారి మీద కనికరపడ్డారు. వారికి అనేక సంగతులను బోధించడం మొదలుపెట్టారు.
అప్పటికి ప్రొద్దుపోయే సమయం అయ్యింది, కనుక శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం, పైగా ఆలస్యం కూడా అవుతుంది. కనుక జనాన్ని పంపివేయండి, వారే చుట్టు ప్రక్కన ఉన్న గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు” అన్నారు.
అందుకు యేసు, “మీరే వారికి భోజనం పెట్టండి” అన్నారు.
అందుకు వారు, “రెండువందల దేనారాల కంటే ఎక్కువవుతుంది. మేము వెళ్లి, అంత డబ్బు ఖర్చుపెట్టి రొట్టెలను కొని, వారికి పెట్టాలా?” అని ఆయనను అడిగారు.
అందుకు ఆయన, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్లి చూడండి” అని అడిగారు.
వారు వెళ్లి చూసి, “ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అన్నారు.
అప్పుడు ఆయన వారందరిని పచ్చగడ్డి మీద గుంపులుగా కూర్చోపెట్టమని శిష్యులతో చెప్పారు. వారు వంద యాభైల చొప్పున గుంపులుగా కూర్చున్నారు. అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి, కృతజ్ఞత చెల్లించి ఆ రొట్టెలను విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. ఆయన ఆ రెండు చేపలను కూడా వారందరికి విభజించారు. వారందరు తిని తృప్తి పొందారు. తర్వాత శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. తిన్న వారి సంఖ్య ఐదు వేలమంది పురుషులు.